1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?
అక్షరాలు చదవడం నేర్చుకోక ముందే పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఇంట్లో తాత, అమ్మ, నాన్న మిగిలిన పెద్దవాళ్ళందరూ పుస్తక ప్రియులే. మామూలుగా పిల్లలకి పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉండటం కద్దు, మా ఇంట్లో పుస్తకాలు పట్టుకుని కథలు, పద్యాలు చదివి వినిపించేవాళ్ళు. తొండనాడు ప్రాంతంలో పుట్టడంవల్ల ఇంట్లోనూ, ఇంటి బయటా ద్విభాషా వాతావరణమే ఉండేది – మార్గళి (అంటే మార్గశిరము) నెలంతా తెల్లవారుజామున వైష్ణవ పద్యాలు, పాటలు పాడుతుండేవాళ్ళు. సాయంత్రం కాగానే భాగవత పఠనం ఉండేది – పెద్దవాళ్ళు ఎవరో ఒకరు భాగవతం పుస్తకం పట్టుకుని చుట్టూ కూర్చున్న జనాలకు పద్యాలు, తాత్పర్యం చదివి వినిపించేవారు. అవి లీలగా గుర్తుండటమే కాదు, ఆ పుస్తకం చదివే వాళ్ళంటే ఒక గౌరవ భావం కూడా – అలా పుస్తకాల మీద ప్రేమ కలిగింది. మా ఊరి బళ్ళో తమిళ మాధ్యమం మాత్రమే ఉండటంతో తమిళంతోనే నాకు అక్షర పరిచయం ఏర్పడింది. అక్షరాలు కూడుకుని చదవడం నేర్చుకున్నాక మా ఊరి స్థాయిలో దొరికే తమిళ పుస్తకాలు చదువుతుండేవాణ్ణి. బడి లైబ్రరీ పుస్తకాలు, పక్కనున్న పళ్ళిపట్టు టౌన్ లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని చదివేవాణ్ణి నాకు చిన్నతనంలోనే పుస్తకాలు ఇలా పరిచయం అయ్యాయి.
2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.
ఒక్కో వయసులో ఒక్కో దశలో ఒక్కో రకమైన పుస్తకాలను ఇష్టంగా చదివేవాణ్ణి. అలా ఇష్టంగా చదివిన కొన్నింటిని దాచుకునేవాణ్ణి, ఏళ్ళు గడిచేకొద్దీ, చదివినకొద్దీ మనం పొందిన తెలివివల్ల తులనాత్మక దృక్పథం అన్నది వచ్చేస్తుంది. అలా కొన్ని పుస్తకాలు మన సేకరణ నుండి తొలగించుకుంటూ పోతాము. కొన్నింటిని మాత్రం మళ్ళీ మళ్ళీ చదువుకుంటాము. అలా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకాలను నా పర్సనల్ లైబ్రరీలో జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎవరికైనా చదువుకోవడానికి వాటిని ఇవ్వాల్సి వస్తే వివరాలు రాసి పెట్టుకుని మరీ తిరిగి తీసుకుంటాను.
3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి.
కొన్ని పుస్తకాలున్నాయి. నా యవ్వన దశలో ఆచార్య ఆత్రేయ అంటే నాకు మహా ఇష్టం. ఆయన మరణానంతరం ఆయన సమగ్ర సాహిత్యాన్ని నటుడు జగ్గయ్య మనస్విని ట్రస్ట్ అనే ప్రచురణ సంస్థ ద్వారా ఏడు సంపుటాలుగా ప్రచురించారు. అయితే నాకు ఈ విషయం తెలిసొచ్చేప్పటికే ఆ పుస్తకాలు ఏ పుస్తకాల అంగళ్ళలోనూ స్టాక్ లేవు, ప్రచురణకర్తలు వాటిని ప్రింట్ చెయ్యడం మానేశారు. వాటిని ఎక్కడైనా సంపాదించి ఫోటోకాపీ అయినా చేయించుకోవాలనుకునేవాణ్ణి. ఆ ఆరాటంతో హైదరాబాదు లైబ్రరీల్లో అన్వేషించాను. ఏ లైబ్రరీలోనూ ఏడు సంపుటాలనూ ఒక్కసారిగా చూడలేకపోయాను. అయితే ఆ రోజుల్లో కంటబడిన ఒకటి రెండు సంపుటాలను చూశాక అన్ని పేజీలను ఫోటోకాపీ తీయించుకోవడం అసాధ్యం అని తెలిసి విరమించుకున్నాను.
ఇటీవల కరోనాకు ముందు ఒకసారి మదరాస్ కన్నిమరా లైబ్రరీకి వెళ్ళినప్పుడు తెలుగు సెక్షన్లో పుస్తకాలు చూస్తుంటే అక్కడ ఆ పుస్తకాల ఏడు వాల్యూములనూ ఒక్కచోట చూసే భాగ్యం కలిగింది. మరోసారి వాళ్ళు ప్రచురిస్తే మాత్రం తప్పక కొనుక్కుంటాను.
పానుగంటివారి సాక్షి వ్యాసాల సంపుటాలు, శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం సేకరించాలనుకుంటున్నాను.
4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.
చాలానే ఉన్నాయి – వడ్డెర చండీదాస్ నవలలు హిమజ్వాల, అనుక్షణికం; దువ్వూరి రామిరెడ్డి పద్య సాహిత్య సంపుటి; క్షేత్రయ్య పదాలు.
5. మీకు ప్రాణసమానమైన పుస్తకాల గురించి.
ఇలా ఒకే ఒక్క పుస్తకం చెప్పమంటే మాత్రం ఏ పుస్తక ప్రియులకైనా సరే అసలు ఊపిరాడదు. ఇలా షరతు పెట్టారు కాబట్టి నా ఎంపిక పద్య సాహిత్యమే – అయితే నేను ద్విభాషా సాహిత్యోపాసకుణ్ణి కాబట్టి నా ప్రాణసమానమైన పుస్తకాలుగా రెండు పుస్తకాలు ఎంచుకుంటాను – తమిళంలో కంబరామాయణం, తెలుగులో పోతన భాగవతం.
6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి.
మామూలుగా ప్రతిరోజూ పొద్దున పూట తప్పకుండా పుస్తకాలు చదివేవాణ్ణి, గత కొన్నేళ్ళుగా విపరీతమైన పని ఒత్తిడివల్ల పొద్దున పూట చదివే వెసులుబాటు కోల్పోయాను. త్వరగా ఆ అలవాటుని తిరిగి తెచ్చుకోవాలి. నా సంచిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉంటుంది. సమయం, అవకాశం దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటాను.
కొన్నేళ్ళుగా ఇంగ్లీషు, తమిళ పుస్తకాలు కిండిల్లో చదవడం మొదలుపెట్టాను – నాకు ఇలా ఈ-బుక్స్ కొనుక్కుని చదువుకోవడం సౌకర్యంగా ఉంది. కిండిల్లో తెలుగు పుస్తకాలు దొరకవుగానీ, ప్రాచీన తెలుగు పుస్తకాల పిడిఎఫ్లు కిండిల్లో పెట్టుకుని చదువుకుంటూ ఉంటాను. తమిళవాళ్ళు దాదాపుగా అన్ని కొత్త పుస్తకాలనూ కిండిల్లో కూడా అమ్మకానికి పెడుతుంటారు. తెలుగు ప్రచురణకర్తలు అంత విరివిగా కిండిల్ ఎడిషన్లోకి రావడంలేదు ఎందుకో.
7. మీలో, మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.
నేను పుస్తకాలు చదవని దశ నుండి చదివే దశకు వచ్చుంటే దీనికి సమాధానం ఇవ్వగలిగేవాణ్ణేమో. అయితే పుస్తకాలవల్లే నేను నాలా ఉన్నాను అని చెప్పగలను. పుస్తకాల విషయంలోనే కాదు, జీవితంలో కూడా మంచి అభిరుచిని అలవరుచుకున్నాను. పుస్తకాలవల్లే నేను అనువాదకుడిగా, సృజనకారుడిగా మారాను అని మాత్రం చెప్పగలను.
నిర్వహణ- పలమనేరు బాలాజీ
రచయిత: అవినేని భాస్కర్




