వేదాంత మైనింగ్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడం కోసం జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ, దళిత సముదాయాలు నిరసన తెలపడంతో  పోలీసులు వెనుదిరిగారు

  • నికితా జైన్
    తెలుగు : పద్మ కొండిపర్తి

2026 ఏప్రిల్ 10

ఇళ్లను, ప్రాణాలను, గౌరవాన్ని బలిపెట్టి అభివృద్ధి చేస్తామంటే ఏమవుతుంది?

ఒడిశాలోని రాయగడ జిల్లాలో, ఆదివాసీ,  దళిత సముదాయాలు  భారీ పోలీసు అణచివేతను ఎదుర్కోవడంతో కాంతమాల్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

2026 ఏప్రిల్ 7న, వందలాది మంది పోలీసులు కాంతమాల్ గ్రామంపై ఒక్కసారిగా దండెత్తారు.

గ్రామస్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నరేంద్ర అనే కార్యకర్త ‘మక్తూబ్’తో మాట్లాడుతూ, ఇళ్లపై దాడి చేయడానికి ముందే పోలీసులు గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసారని తెలిపారు.

“ఇది అణచివేతలో ఒక పచ్చి రూపం. విద్యుత్తు సరఫరాను నిలిపివేసిన తర్వాత, పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆపై వారు గ్రామస్తులపైన లాఠీచార్జి చేసి, వారిని బెదిరించారు”.

అల్యూమినియం దిగ్గజం వేదాంత లిమిటెడ్‌కు కేటాయించిన గనులు ఉన్న ప్రాంతానికి సులభంగా చేరుకోవడానికి వీలుగా, రాయగడ జిల్లా యంత్రాంగం ఇటీవల పోరోలాంగ్ నుండి సగబారి ఘాటి వరకు 3 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది.

2023 మార్చి 1న, రాయగడ,  కలహండి జిల్లాలలో విస్తరించి ఉన్న వేదాంత ప్రతిపాదిత సిజిమాలి బాక్సైట్ గనిని ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించి, 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా వేసిన సిజిమాలి బ్లాక్‌ను కేటాయించారు.

సిజిమాలిలో 1,548.786 హెక్టార్ల విస్తీర్ణంలో, ఏటా 9 మిలియన్ టన్నుల  బాక్సైట్‌ను వెలికితీయాలని వేదాంత ప్రతిపాదించింది. ఈ మైనింగ్ ప్రాజెక్టు కారణంగా 18 గ్రామాల నుండి వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది; అంతేకాకుండా, మరిన్ని కుటుంబాల జీవనోపాధి కూడా  ప్రభావితమవుతుంది.

ఈ ప్రాజెక్టు, అక్కడ నివసిస్తున్న వందలాది మంది ఆదివాసీ,  దళిత సముదాయాల వారిని తమ భవిష్యత్తు పట్ల ఆందోళనకు గురిచేసింది.

నిర్మాణ పనులు ప్రారంభించడానికి గ్రామస్తుల నుండి అనుమతి లభించిందని అధికారులు పేర్కొన్నప్పటికీ, స్థానికులు  ఖండించారు.

 నివాసితులు పగిలిన గాజు ముక్కలను ఏరడానికి ప్రయత్నించడం, నేలపై పడి ఉన్న ఇటుకలు ఘటనకు సంబంధించిన వివిధ దృశ్యాలు వీడియోలలో కనిపిస్తున్నాయి.  2023 నుండి సిజిమాలి, కాంతమాల్,  పొరుగు గ్రామాల నివాసితులు వేదాంత ప్రతిపాదిత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారనే విషయాన్ని మనం గమనించాల్సి ఉన్నది.

 వందలాది మంది ప్రజలు తమ మీద పెట్టిన అబద్ధపు కేసులను ఎదుర్కొన్నారు;  పదేపదే జైలుకు వెళ్లారు.

మక్తుబ్ మీడియా క్షేత్ర స్థాయికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించింది.

పోలీసులు ధ్వంసం చేసిన తన ఇంటి బయట నిలబడి ఉన్న కాంతమాల్ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు, ఏమి జరుగుతుందో తమకు అర్థం కావడం లేదని అన్నది.

”  బాష్ప వాయువును నిరంతరం  ప్రయోగించడం వల్ల నాకు ఏమీ కనిపించలేదు; ఇప్పటికీ చూపులో ఇబ్బంది కలుగుతోంది. నాకు సరిగా కనపడటం లేదు. తెల్లవారుజామున  నేను ఇంట్లో ఉండగానే  బయటి నుండి తలుపు తాళం వేసి, ఇంటి పైకప్పును పాక్షికంగానూ, ముఖ్యంగా వెనుక వంటగది వైపును ధ్వంసం చేశారు,” అని ఆమె చెప్పింది.

అయితే, ప్రజలు తమ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి నిరాకరించారు. స్థానికుల కథనం ప్రకారం, గ్రామంలోని వారికి భూమిపట్టాలు లేకపోవడంతో, రోడ్డు నిర్మాణం ఎలాగైనా సరే కొనసాగుతుందని చెబుతూ అధికారులు వారిని బెదిరించారు కూడా.

“వారిని ఏమైనా చెప్పుకోనివ్వండి; వారు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడినప్పటికీ, మేము మాత్రం ‘తిజిమాలి’ని విడిచిపెట్టి వెళ్ళేది లేదు” అని ఆ వృద్ధురాలు స్పష్టం చేసింది.

ప్రతిపాదిత ప్రాజెక్టు కారణంగా, సుమారు 18 గ్రామాల కుటుంబాలు నిర్వాసితులుగా మారే ముప్పును ఎదుర్కొంటున్నాయి; అంతేకాకుండా, ప్రధానంగా వ్యవసాయంపైన ఆధారపడి ఉన్న వారి జీవనోపాధి కూడా కనుమరుగు కానుంది.

ఈ ముప్పులను ఎదుర్కొన్న కాంతమాల్ నివాసులు పోలీసులతో ఘర్షణకు దిగారు; ఈ ఘటనలో పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, 50 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

బి ఎన్ ఎస్ సెక్షన్ 163 అమలులో ఉండటంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

అయితే, అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపేందుకు ముందుకు రావడంతో, పోలీసులు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారని క్షేత్రస్థాయి వర్గాలు ధృవీకరించాయి.

“ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వారు తలొగ్గడానికి పూర్తిగా నిరాకరించారు. ఇంతలో,  భారతీయ జనతా దళ్ నుండి కాంగ్రెస్ వరకు, అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులను పరామర్శిస్తున్నారు,” అని అక్కడి క్షేత్రస్థాయి కార్యకర్త ఒకరు తెలిపారు.

Leave a Reply