ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి. విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త బస్తర్ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది?
పాలస్తీనాలాగే బస్తర్ కూడా ఇవాళ ఎంతో కొంత చర్చనీయాంశం అవుతున్నది.
ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా విదేశాల్లో అక్కడక్కడా నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. మన దేశంలోని విప్లవపార్టీలే గాక బైటి దేశాల్లోని విప్లవపార్టీలు కూడా కగార్‌కు వ్యతిరేకంగా ఖండన ప్రకటనలు ఇచ్చాయి. ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. ఫిలిప్పైన్స్ విప్లవపార్టీ జూన్ 20 నుంచి జులై 20 దాకా నిరసన మాసాన్ని ప్రకటించింది. జూన్ 13 నుంచి 15వ తేదీ దాకా ఇటలీలోని ఫాసనో సిటీలో జరిగిన జి`7 దేశాల సమావేశాల సందర్భంగా కగార్‌కు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. భారత ప్రభుత్వ ఫాసిస్టు యుద్ధం మీద యారప్ దేశాల్లో, అమెరికాలో నిరసనలు జరిగాయి. ఇలాంటి వాటన్నిటినీ సమన్వయం చేస్తూ ‘భారతదేశ ప్రజాయుద్ధ సంఫీుభావ అంతర్జాతీయ వేదిక’ జూలై 1ని ఆపరేషన్ కగార్ వ్యతిరేక దినంగా ప్రకటించింది. భారత విప్లవోద్యమానికి అండగా అంతర్జాతీయ పిలుపునిచ్చింది.
ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అంతిమ యుద్ధ సందర్భంలో ఈ పిలుపుకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న ప్రపంచ విప్లవోద్యమ స్థితుగతుల్లో భారత ప్రజా పోరాటాలకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ముఖ్యంగా దండకారణ్య ఆదివాసులు కార్మికవర్గ చైతన్యంతో ప్రత్యామ్నాయ నిర్మాణ ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోనే కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేకంగా వాళ్లు వీరోచితంగా పోరాడుతున్నారు. అనేక ఎదురుదెబ్బల మధ్యనే వెనకడుగు వేయకుండా దృఢంగా నిలబడ్డారు. దేశాన్నంతా ఆవరించిన కార్పొరేట్ హిందుత్వ శక్తులను ఎదుర్కోడానికి ఆదర్శప్రాయమైన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం హిందుత్వ ఫాసిస్టు నియంతృత్వంగా మారిన వేళ బస్తర్ నెత్తురోడుతూ కూడా విప్లవ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నది.
ఇవాళ మధ్య భారతదేశంలోని విప్లవోద్యమం ప్రపంచ కార్మికవర్గ సంఫీుభావాన్ని పొందడం వెనుక అనేక రాజకీయ అర్థాలు ఉన్నాయి. అది కేవలం ‘బాధితుల’ తరపున నిలబడం కాదు. యుద్ధంలో చిక్కుకున్న ప్రజలకు ఊరట అందించడం కాదు. మానవ హక్కుల ఉల్లంఘన తగదని చెప్పడానికే పరిమితమైంది కాదు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకిస్తున్న శక్తుల్లో ఇలాంటి నిరసన స్వరాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా విలువైనవి. మరింత బలపడవలసినవి.
వీటితోపాటు అంతర్జాతీయ విప్లవోద్యమం భారత ప్రజల వైపు చాలా విశ్వాసంతో చూస్తున్నది. గత విప్లవాల కంటే పూర్తి భిన్నమైన చారిత్రక, రాజకీయార్థిక పరిస్థితుల్లో ఈ శతాబ్దపు ప్రపంచ విప్లవోద్యమం నడుస్తున్నది. అందులో భారత ప్రజలు గణనీయమైన అనుభవాలు గడిరచారు. సుమారు అరవై ఏళ్లుగా తీవ్ర నిర్బంధం మధ్యనే అనేక ప్రయోగాలు చేస్తున్నారు. సువిశాలమైన, అనేక వైరుధ్యాలమయమైన, లెక్కలేనన్ని రాజకీయ, సామాజిక ప్రత్యేకతలు ఉన్న సంక్లిష్టమైన దేశానికి తగినట్లు వాళ్ల ఆచరణ కొనసాగుతున్నది. ఇందులో ఆటుపోట్లు ఎన్నయినా ఉండవచ్చు. కెరటాలు ముందుకు, వెనక్కి విసురుగా వెల్లువెత్తవచ్చు. కానీ భారత విప్లవోద్యమానికి వర్గపోరాటం మీద గురి పదునెక్కుతున్నది. ఈ చారిత్రక యుగానికి తగినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటున్నది. తన శక్తికి మించిన నిర్బంధం విరుచుకపడినా వెన్ను చూపని సాహసాన్ని ప్రదర్శిస్తున్నది. నెత్తురూ, కన్నీరూ కాల్వలై ప్రవహించినా తన సృజనాత్మకతను విస్తరింపజేసుకుంటున్నది. అత్యంత విధ్వంసపూరితమైన, అమానుషమైన ఫాసిస్టు కార్పొరేట్ శక్తులతో రాజీ లేకుండా తలపడ వలసిన ఉదాహరణగా ఉత్తేజాన్ని అందిస్తున్నది.
ఇదంతా ప్రపంచంలోని ప్రజాస్వామిక, విప్లవ శక్తుల ఆసక్తిని ఇనుమడిరపచేస్తున్నది. దేశదేశాల ప్రజలు చేస్తున్న పోరాటాల్లో విడదీయలేనంతగా కలిసిపోయింది. ఇవాళ భారత విప్లవోద్యమంలో ముందు భాగాన ఉన్న దండకారణ్య ఆదివాసులు భవిష్యత్ ప్రజా పోరాటాలకు సహితం కొన్ని నమూనాలను అందిస్తున్నారు.
పాలకవర్గాలు, హిందుత్వవాదులు, కార్పొరేట్ శక్తులు నేరుగా అధికారంలోకి వచ్చి ప్రకటించిన యుద్ధాన్ని ప్రజాయుద్ధం ఎదుర్కొంటున్నది. ఇప్పటికే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో, ఆపరేషన్ సమాధాన్‌లో భారత పాలకవర్గాలు రాజకీయంగా, నైతికంగా ఓడిపోయాయి. ఈ దారి పొడవునా భారత విప్లవోద్యమం నష్టపోయి ఉండవచ్చు. తాత్కాలికంగా బలహీనపడి ఉండవచ్చు. కానీ రాజకీయంగా, సైద్ధాంతికంగా గతం కంటే మరింత కొత్త శక్తిని కూడగట్టుకున్నది. అనేక విషాదభరిత అనుభవాల మధ్యనే కొత్త పోరాట రూపాలను అలవర్చుకున్నది. ఈ వ్యవస్థలోని సకల దుర్మార్గాలకు, అమానవీయ పీడన అణచివేతలకు విప్లవమే ఏకైక పరిష్కారమని ప్రత్యక్షంగా, పరోక్షంగా రుజువైంది.
ఈ పరిస్థితుల్లో పాలకవర్గం పంటి బిగువున కొత్త యుద్ధానికి సిద్ధమైంది. ఇక ఇది అంతిమ యుద్ధమని ప్రకటించింది. కానీ నిజంగానే ఇది అంతిమం అవుతుందా? బహుశా కేంద్రంలోని మోదీషా ప్రభుత్వానికి ఈ సంగతి తెలియకపోవచ్చు. వాళ్లను ఆడిస్తున్న కార్పొరేట్లకు అసలే తెలియపోవచ్చు. దేనికంటే చరిత్రలో పాలకులు ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసి ఎవరో ఒకరు పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ చరిత్రను మూలమలుపు తిప్పే యుద్ధం మాత్రం ప్రజలే చేశారు. ఆ రకంగా అంతిమ యుద్ధాలు ప్రజలు చేస్తారు. చరిత్ర గతిని మార్చేస్తారు.
కానీ శాశ్వత అధికారం కోరుకుంటున్న హిందుత్వ ఫాసిస్టులు తామే అంతిమ యుద్ధం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్‌ను చేయాలని కలగంటున్నారు. ప్రజా రహిత భారత్‌ను స్థాపించగలరా? అది ఎప్పటికైనా సాధ్యమేనా? కోటానుకోట్ల మంది కష్టజీవులు ఉన్న దేశంలో ప్రజలను, ఆదివాసులను, కార్మికులను, విప్లవకారులను తుడిచేయడం అయ్యేపనేనా? కానీ వాళ్లు ఆ పని చేయాలని అనుకుంటున్నారు.
అలాంటి కీలక ఘట్టానికి భారతదేశ సంక్షోభం చేరుకున్నది. ఇది రాజకీయార్థిక సంక్షోభం. ప్రజలు అనుభవిస్తున్న ఏ సమస్యకూ పాలకవర్గం దగ్గర పరిష్కారం లేదు. వాటిని భరించడానికి సిద్ధంగా లేమని ప్రజలు తోచిన పద్ధతిలో పోరాడుతున్నారు. వాళ్లను అణచివేయడానికి ప్రభుత్వాలు మరింత పాశవికంగా తయారవుతున్నాయి. ప్రజలకు నాయకత్వం లేకుండా చేయాలని నిర్బంధం తీవ్రం చేస్తున్నది. అది ఇవాళ అంతియ యుద్ధమని ప్రకటించే పాసిస్టు దశకు చేరుకున్నది. మనుషులకు, మానవతకు, విశ్వాసాలకు, త్యాగాలకు, విలువలకు`క్రూరమైన కార్పొరేట్ ఫాసిజానికి మధ్య ఘర్షణ ఇక్కడి దాకా చేరుకున్నది. బహుశా భారత విప్లవోద్యమ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో ఇంత గరిష్ట స్థాయి సంఘర్షణ ఇదే మొట్ట మొదటిది కావచ్చు. పరస్పర విరుద్ధ శక్తులు అంతగా మోహరించిన సన్నివేశంలో మనమంతా జీవిస్తున్నాం.
ఈ ఘర్షణలోంచి చలనం ఏ తీరానికి చేరుతుంది? కనీసం దిశగా సాగుతుంది? అనే ఆసక్తి ఇవాళ దేశంలోని ప్రజానుకూల శక్తులకే కాదు. ప్రపంచ ప్రజాస్వామిక, విప్లవ శక్తులకు కూడా ఉంది. ఈ ఘర్షణలో భారత ప్రజలే జయించాలి.. విప్లవోద్యమం తిరిగి ఒక పెద్ద అంగతో ముందుకు పురోగమించాలి..ఈ దారుణ నష్టాలను అధిగమించగల అనుభవ సంపదతో విస్తరించాలి..! ఇదీ ఇవాళ వాళ్లందరి ఆకాంక్ష. అది నిజమయ్యేది ప్రపంచ పీడిత ప్రజల ఆలంబనతోనే. వాళ్ల ఆకాంక్షలు ఆచరణాత్మకంగా ఎదిగినప్పుడే. అందుకే అనేక వైపుల నుంచి భారత విప్లవోద్యమానికి మద్దతు వినిపిస్తున్నది. కగార్‌కు వ్యతిరేకంగా సంఫీుభావం ప్రకటితమవుతున్నది. ఇది కేవలం భారత ప్రజల కోసమే కాదు. తమ కోసం కూడా అని ఎల్లలు లేని ఈ ఉమ్మడి స్వరం మారుమోగుతున్నది.