రామ్లీ వయస్సు 17 సంవత్సరాలు. కానీ ఆసుపత్రిలో తన తల్లి వెనుక నిలబడిన ఆమెను చూసినప్పుడు 14 సంవత్సరాల కంటే పెద్దదానిలా అనిపించలేదు – లోతైన, సున్నితమైన కళ్ళలో తీక్ష్ణమైన చూపుతో నిటారుగా నిలబడి ఉంది. శాలువా కప్పుకుని ఉన్న ఆమె ఆందోళనతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తోంది. అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తోంది. ఛత్తీస్‌గఢ్, బస్తర్ ప్రాంతంలోని భైరామ్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇచ్చిన చీటీలో ఆమె వెన్నెముక దగ్గర ఒక ‘బయటి వస్తువు’ చిక్కుకున్నట్లు మాత్రమే ఉన్నది. ఏ వివరణా ఇవ్వని ఆ చీటీ మరొక ఆసుపత్రికి వెళ్ళమని సూచించింది.
రామ్లి తల్లిదండ్రులు రాజే, విజ్జాలతో పాటు పక్క గ్రామానికి చెందిన యువతి రీనా వచ్చింది. వారు ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి — భైరంఘడ్ నుండి దంతేవాడ, ఆ తరువాత జగదల్‌పూర్ ఆసుపత్రికి పరుగెత్తారు. ఏ ఆసుపత్రిలోనూ సమస్య ఏమిటి అనేది ఎవరూ స్పష్టంగా చెప్పకపోయినా, అందరూ అత్యవసర వైద్య చికిత్స అవసరమైన స్థితిలో ఉన్నదని భావించారు. ప్రతిసారీ, ఆసుపత్రి నుంచి వచ్చిన మెడికల్ చీటీలో ఒకే విధమైన సూచన ఉండేది: “మెరుగైన సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించండి.”
దాదాపు ఐదు రోజుల తర్వాత, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు వైద్యులు నిజాన్ని బయటపెట్టారు. అది ఏదో బయటి పదార్థం కాదు—ఒక తూటా! అని. ఆపరేషన్ థియేటర్ నోట్స్ ప్రకారం, 2.5 సెం.మీ పొడవు, 5 మి.మీ వెడల్పు ఉన్న తూటా. డిసెంబర్ 12న పోలీసులు రామ్లిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ మెడ వెనకనుంచి ప్రవేశించి, మాండిబుల్—అంటే దవడ ఎముక—క్రింద కొన్ని మిల్లీమీటర్ల దూరంలో ఇరుక్కుపోయింది.
“పోలీసులు మా పిల్లను ఎలా కాల్చగలిగారు?” అని రామ్లి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. 2024 డిసెంబర్ 14నాడు ఇంటి నుండి బయల్దేరినప్పుడు, అదే రోజు తిరిగి రాలేమని వారు అసలు ఊహించలేదు. చికిత్సకు, శస్త్రచికిత్స కోసం చాలా సమయం పడుతుంది అని అనుకోలేదు. అదనంగా దుస్తులు తెచ్చుకోలేదు, చలికి తట్టుకునేందుకు తగిన దుస్తులు లేవు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. రాయ్‌పూర్ ఆసుపత్రి అమ్మాయి వెన్నెముక దగ్గర ఉనది బుల్లెట్ అని నిర్ధారించే సమయానికి మూడు రోజులు గడిచిపోయింది. ముందు రోజంతా వాళ్ళు అన్నం కూడా తినలేదు.
ఆ తరువాతి రోజుల్లో వైద్య పరీక్షలు జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ చేయడానికి డాక్టర్ల బృందం సిద్ధమవుతుండగా, రామ్లి తల్లిదండ్రులు ఐసీయూ దగ్గర ఒకరు, ఆసుపత్రి డాబా పైన ఒకరు ఉన్నారు. రోగుల కుటుంబాలు డాబా పైన తాత్కాలిక వసతి ఏర్పరచుకున్నాయి. అక్కడి పబ్లిక్ మరుగుదొడ్లను ఉపయోగించి స్నానం చేసి, బట్టలు ఉతికి, వాటిని చలికాలపు ఎండలో ఆరబెట్టుకునేవారు. అట్టపెట్టెలు, చాపలను పరుచుకుని, వాటిపైనే అన్నం తినేవారు, పడుకునేవారు. తమ బంధువులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించేవారు. ఈ మౌన నిరీక్షణ మధ్య, విజ్జా హఠాత్తుగా రామ్లిపైన కాల్పులు జరిగిన ఘటనను వర్ణించడం మొదలు పెట్టేవాడు. అతను తన చేతులను తుపాకీలా చూపిస్తూ, “వారు మా పిల్లలను తరిమి, కాల్పులు జరిపారు,” అంటూ, “మేము అరికెల పంట పనుల్లో ఉన్నాం. వాళ్లు ఇలా ఎలా చేయగలిగారు?” అని బాధతో అడిగేవాడు.
మావోయిస్టు తిరుగుబాటుదారులపై పోరాటం చేస్తున్నామనే ముసుగులో, బస్తర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సైనికీకరణ జరిగిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది. 2019 నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో సుమారు 250 సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేసారు. 2024 ఆగస్టులో వచ్చిన ఒక పౌరసమాజ నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో ప్రతి తొమ్మిది మంది పౌరులకు ఒక భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెల్లడైంది. మీడియా నివేదికల ప్రకారం, రామ్లీ నివసించే అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో గత ఏడాదిలోనే పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ బలగాలు ఎనిమిది సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేశాయి. అంతేగాక, ఇటీవల మరిన్ని ఫార్వర్డ్ బేస్‌లను (వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి అవసరమయ్యే సాధనాల, వాయు సేన, ఆసుపత్రులు మొదలైన ఏర్పాట్లు ఉండే స్థావరం) ప్రారంభించాయి. ఇలాంటి విస్తృత స్థాయి సైనికీకరణ స్థానిక ప్రజల మానవ హక్కులకు తీవ్రమైన ముప్పుగా మారిందని వివరాలు రికార్డు అయ్యాయి.
ప్రభుత్వ విధానాల వల్ల ఎదురవుతున్న అనర్థాలను బస్తర్ ప్రజలు పదే పదే ఎత్తిచూపుతూ, పెద్ద రహదారులు, సైనికీకరణ-పరిశ్రమల అభివృద్ధి నమూనాల వంటి దూరాలను నిర్మూలించే సాంకేతిక పురోగతికి ప్రత్యామ్నాయాలను సూచించారు.
గతేడాది డిసెంబర్ 11, 12 తేదీల్లో, నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న అబుజ్‌మాడ్ కొండల్లో బస్తర్ జిల్లా రిజర్వ్ గార్డ్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రాదేశిక ఆధిపత్య కార్యకలాపాన్ని (ఏరియా డామినేషన్ యాక్టివిటీ) నిర్వహించాయి. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా పరిగణించే అబుజ్‌మాడ్ అడవి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో 4,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉంది.
మీడియా రిపోర్టు ప్రకారం, ఈ ఆపరేషన్‌లో పోలీసులు “ఎన్‌కౌంటర్” చేసి ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ప్రకటించారు. అయితే, గ్రామస్థులు మాత్రం తాము పొలాల్లో పని చేసుకుంటుంటే పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో మైనర్లు సహా ఆరుగురు గ్రామస్థులు మరణించారని, అనేక మందికి తీవ్ర గాయాలు అయాయని పేర్కొన్నారు. గాయపడినవారిలో రామ్లీ, మరికొంత మంది పిల్లలు కూడా ఉన్నారు.
2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 1 వరకు, నలుగురు సభ్యులుతో ఏర్పాటైన స్వతంత్ర నిజనిర్ధారణ బృందంతో నేను నారాయణ్‌పూర్ జిల్లాలోని కుమ్మాం గ్రామానికి, పరిసర అటవీప్రాంతాలకు వెళ్ళాను. గాయపడిన వారిని, మరణించిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను కలుసుకున్నాం. డ్రోన్‌ల సహాయంతో గుర్తించి, గ్రామస్థులను చుట్టుముట్టి దగ్గర నుండి కాల్చివేశారని మా పరిశోధనలో తెలిసింది. గాయపడిన వారిలో ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయస్సు గల చిన్నపిల్లలు ఉన్నారు. మరణించిన వారిలో ముగ్గురు మైనర్లుగా కనిపిస్తుండగా, మిగిలిన వారు కేవలం ఇరవై వసంతాల దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తోంది.
భారత ప్రభుత్వ మద్దతుతో కొనసాగుతున్న ఈ కౌంటర్-ఇన్సర్జెన్సీ ఆపరేషన్లు బస్తర్ అడవులను యుద్ధ భూములుగా మార్చేశాయి. ఈ ప్రాంతంలో ఆదివాసీ పిల్లలు, గ్రామస్థులు ప్రభుత్వ హింసకు గురవుతున్నారు. సైనికీకరణ కారణంగా “ఎన్‌కౌంటర్” పేరిట చిన్నపిల్లలను కాల్చివేస్తున్నారు; పౌరులను చంపుతున్నారు; మొత్తం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం చట్టాతీత హత్యల విషయంలో ఎప్పటికీ బాధ్యత వహించదు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. మావోయిస్టు వ్యతిరేక పోరాటం అనే సమర్థనతో జరుగుతున్న ఈ అమానవీయ హింస బస్తర్ యువతను వారి బాల్యం నుండి దూరం చేస్తున్నది; ప్రాణాంతకంగా మారుతోంది.
బస్తర్‌లో పిల్లల వేట
రామ్‌లీ, ఆమె తల్లిదండ్రులు, రీనాల వెంబడి జిల్లా రిజర్వ్ గార్డ్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు యువకులు రాయ్‌పూర్‌కు వచ్చారు. “సార్ నాకు కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చారు, అందరికీ భోజనం పెట్టాలని, కావాల్సినవన్నీ వీటితోనే కొనాలని చెప్పారు. నేను ఏం చేయాలి?” అని వారిలో ఒకరు అన్నారు. ఏ విభాగం బాధ్యత తీసుకోవాలి, ఖర్చు ఎవరు భరించాలి అనే విషయంలో పోలీసులు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నారు. అతని వయస్సు 20 ఏళ్లలోపే ఉండవచ్చు. అతనితోపాటు ఉన్న మరొకతను మరింత చిన్నవాడు; ఒక వారం క్రితం డిఆర్‌జిఎఫ్‌లో చేరాడు. ఇది అతని మొదటి డ్యూటీ. ఈ ఇద్దరూ ఒకే స్కూలులో చదివారు. ఇతర డిఆర్‌జిఎఫ్ సభ్యుల మాదిరిగానే, రామ్‌లీ, ఆమె తల్లిదండ్రుల మాదిరిగానే వీరు కూడా గోండి ఆదివాసులు. వీరందరి మాతృభాష ఒకటే అయినప్పటికీ విధుల్లో ఉన్నప్పుడు వేరొక భాష మాట్లాడాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.
తమ సీనియర్ పోలీస్ అధికారుల ఆదేశాల ప్రకారం, రీనా ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వారి అభద్రతా భావాన్ని బహిర్గతం చేస్తోంది. మా నిజ నిర్ధారణ కమిటీ రామ్‌లీ కుటుంబంతో ఒంటరిగా మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా, వారిద్దరూ వెంటనే మా దగ్గరికి వచ్చేసేవారు. వారి ఆదేశాలు స్పష్టంగా ఉండేవి; వారి భయం కూడా అర్థమయ్యేది. రామ్‌లీ తల్లిదండ్రులు, రీనా, ఆసుపత్రి బయటకు వెళ్లిన ప్రతిసారి, డిఆర్‌జిఎఫ్ సిబ్బంది వారి వెంట పడుతూ “మీరు ఎందుకు కార్యకర్తలను పిలిచారు? ఊరికి వెళ్ళాక మీ సంగతి చూస్తాం” అని బెదిరించేవారని చెప్పారు.
డిఆర్‌జిఎఫ్ అనేది ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పనిచేసే ఒక ప్రత్యేక పోలీసు బలగం. ఇందులో ప్రధానంగా దిగువ శ్రేణి నక్సలైట్లు, సల్వా జుడుం కాలంలో పునరావాసం పొందిన గ్రామస్తులు ఉంటారు. ఆదివాసీ యువతను తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని భారత సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపినా, గత రెండు దశాబ్దాలుగా డిఆర్‌జిఎఫ్, బస్తరియా బెటాలియన్ వంటి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసారు. ఇలా చేయడం 2011 సుప్రీంకోర్టు తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది.
ఆ తీర్పులో, “ఈ ఆదివాసీ యువత తాము ఎదుర్కొన్న హింస, తమ కుటుంబ సభ్యులు లేదా సమాజం ఎదుర్కొన్న హింస కారణంగా మానవత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు… ఇటువంటి భావాలను ప్రయోజనంగా మార్చి, వారికి ప్రమాదకరమైన విధులు అప్పగించడం, పోరాటానికి నెట్టడం పురోగమన సమాజ సిద్దాంతాలకు వ్యతిరేకం” అని పేర్కొంది. ఇంకా గట్టిగా, “ఇటువంటి అమానవీయ భావాలను మావోయిస్టులపై పోరాటంలో ఉపయోగించాలని కొందరు విధాన రూపకర్తలు ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, రాజ్యాంగపరమైన తీవ్రంగా విమర్శించదగినది” అని కోర్టు వ్యాఖ్యానించింది.
తద్విరుద్ధంగా, సీనియర్ పోలీసు అధికారులు, ముఖ్యంగా పూర్వ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బస్తర్ రేంజ్, ఎస్‌ఆర్‌పీ కల్లూరి, డిఆర్‌జిఎఫ్ సిబ్బందిని సగర్వంగా ఇలా వర్ణించాడు: “కింది శ్రేణిలో ఉండే నక్సలైట్లు, మావోయిస్టుల అనుచరులు, సల్వాజుడుం సమయంలో నివాసం కోల్పోయిన గ్రామస్తులు, వీరిని ప్రేమతో ‘భూమి పుత్రులు’ అని పిలుస్తారు; వీరు తిరుగుబాటుదారుల చేతిలో కోల్పోయిన తమ భూమిని తిరిగి పొందేందుకు తీవ్రంగా నిబద్ధులై ఉన్నారు.” ఇదే విధంగా, బస్తరియా బెటాలియన్ అనే ప్రత్యేక ఆదివాసీ ఉపబలగాన్ని సిఆర్‌పిఎఫ్‌లో ఏర్పాటు చేశారు; ఇందులో మాజీ మావోయిస్టులను పోలీసు ఇన్‌ఫార్మర్లుగా చేర్చారు. వీరికి ఉన్న “తమ సొంత భూభాగంలోని భౌగోళిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యం.”
రాయ్‌పూర్‌లో రామ్లికి శస్త్రచికిత్స చేయాలనుకున్న ఒక రోజు ముందు, దంతేవాడ జిల్లా ఆసుపత్రి నుండి ఒక పిల్లవాడు పారిపోయాడు. పదమూడు ఏళ్ల సిత్రామ్ ఇక మానసికంగా భరించలేకపోయాడు. అతడికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినప్పటికీ పోలీసులు అతనిని, మరో పిల్లవాడు సోను ఓయామ్‌ను ఆసుపత్రిలోనే ఉంచాలని పట్టుబట్టారు. మళ్లీ చేర్పించడానికి, ఆ పిల్లలు మలేరియాతో బాధపడుతున్నారని చెప్పేలా వైద్యులు అంగీకరించేట్లు చేశారు. దేశంమొత్తంలోనే బస్తర్‌లో అత్యధిక వార్షిక మలేరియా కారక శాతం ఉంది. కానీ సిత్రామ్ అక్కడ మలేరియాకు చికిత్స కోసం రాలేదు. అతడికి కూడా తుపాకీ తూటా గాయం అయ్యింది. పోలీసుల కాల్పుల్లో అతడి ఒక తొడ గుండా తూటా ప్రవేశించి, మరో తొడ నుంచి బయటకు వచ్చింది. రామ్లీకి ఎదురైన పరిస్థితిలాగే, అతడిని కూడా అదే కూంబింగ్ ఆపరేషన్‌లో పోలీసులు కాల్చారు. కానీ అతడు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావాలని ఆసుపత్రి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనూ రామ్లీలలాగా కాకుండా అతని తండ్రి మాసే ఓయామ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
దంతేవాడలోని డిఆర్‌జిఎఫ్ క్యాంప్‌లో నెలకొన్న “ఉత్సాహాన్ని” ప్రతిబింబిస్తూ సైనిక చర్య ప్రారంభించబోయే ముందు చేసిన తయారీనీ ఇండియా టుడేలో ప్రచురితమైన ఒక వ్యాసం విపులంగా వివరించింది. బలగంలోని “అబ్బాయిలు, అమ్మాయిలు” బ్రీఫింగ్‌కు సిద్ధంగా ఉండాలని స్థానిక కమాండర్ చెప్పాడు; ఈ సంబోధన తిరుగుబాటు వ్యతిరేక చర్యలలో ఉపయోగిస్తున్న వారి వయస్సును బహిర్గతం చేస్తుంది. కథనం ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షించే ఏజెన్సీ దక్షిణ బస్తర్‌లో ఒక అడవిలో ఉన్న కొండపై నుండి చేసిన ఒక కాల్‌ను గుర్తించింది. “ఒక సాధారణ పౌరుడు అక్కడ నుండి కాల్ చేసే అవకాశం తక్కువ.” ఈ సమాచారాన్ని ఉన్నత పోలీసు అధికారులకు అందించారు, “కాల్స్ విశ్లేషణ, క్షేత్ర స్థాయి ఇంటెలిజెన్స్, యుఎవిల (అన్‌మేన్న్డ్ ఏరియల్ వెహికిల్స్) ద్వారా లభించిన దృశ్యాల ఆధారంగా, ఆ ప్రాంతంలో మావోయిస్టుల క్యాంపు ఉండవచ్చని అనుమానించారు.” కమాండర్ చర్యకు సంబంధించిన ప్రణాళికను వివరించిన తర్వాత, వాళ్లు వాహనాలను నింపుకొని సిద్ధమయ్యారు. ఇక “వేట మొదలైంది” అని ఆ నివేదిక పేర్కొంది.
ఇక్కడ ఒక సాధారణ పౌరుడి ఫోన్ కాల్ మావోయిస్టు శిబిరం ఫలానా ప్రాంతంలో ఉన్నట్టుగా “సూచన” ఇస్తుంది, దాని తర్వాత ఒక “వేట” మొదలవుతుంది. ఈ వేటలో రామ్లీకి తుపాకీ తూటా గాయం అయింది; సిత్రం తండ్రి చనిపోయాడు. దీనిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ఒక గొప్ప విజయం అని పేర్కొన్నాడు. వార్తా కథనాల ప్రకారం, ఏడు మంది సాయుధులు, యూనిఫార్మ్ ధరించిన మావోయిస్టులు మరణించారు. అదే సమయంలో, మావోయిస్టులు కూడా ఒక ప్రకటన విడుదల చేసి, మృతులలో ఐదుగురు సాధారణ గ్రామస్తులేనని తెలిపారు.
మరోవైపు, పోలీసుల అధికారిక ప్రకటనలలో పరస్పర వైరుధ్యాలు కనిపించాయి. డిసెంబర్ 12న విడుదల చేసిన మొదటి ప్రకటన కాల్హాజా, డోండెర్బెడా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని పేర్కొంది. కానీ, డిసెంబర్ 18న విడుదల చేసిన మరో ప్రకటనలో రెకవాయ, లెకవాడ, కొండ్రకోటి, బ్రేహ్బెడా ప్రాంతాలను కూడా చేర్చారు. మొదటి ప్రకటనలో ఎదురుకాల్పులు ఉదయం 3 గంటలకు జరిగాయని చెబితే, తర్వాత విడుదల చేసిన ప్రకటనలో అదే ఘటన 8 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటన గురించి గ్రామస్థులు పత్రికా ప్రతినిధులను, కార్యకర్తలను సంప్రదించగానే, రామ్లీ, సోను, జయరాం, సిత్రం గాయపడినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీని వలన ఈ “ఎన్‌కౌంటర్” పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆపై పోలీసులు మరో ప్రకటన విడుదల చేశారు. గాయపడిన, ఈ పిల్లల శరీరాల్లో చిక్కుకున్న బుల్లెట్లు తమవి కాదని చెప్పలేక పోలీసులు మావోయిస్టులు ఆ పిల్లలను “మానవ కవచం”గా ఉపయోగించారని ఆరోపించారు.
ప్రస్తుత బస్తర్ పరిధి ఐజీపీ సుందర్రాజ్ పట్టిలింగం ఈ ఆరోపణల గురించి ది పొలిస్ ప్రాజెక్టు పంపిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అయితే, జనవరిలో, బస్తర్ ఐజీపీ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికతో మాట్లాడుతూ, గ్రామస్తులను కాల్చడం, పిల్లలను గాయపరచడం వంటి భద్రతా బలగాలపై వస్తున్న ఆరోపణలు “అబద్ధమని, కల్పితమైనవి” అని అన్నాడు. అంతేకాదు, పిల్లలను మావోయిస్టులు మానవ కవచంగా ఉపయోగించారని మరోసారి నొక్కి చెప్పాడు.
“ఎన్‌కౌంటర్”
రామ్లిని కలిసిన కొన్ని రోజుల తరువాత అసలు వాస్తవంలో ఏమి జరిగిందో తెలుసుకున్నాము. స్వతంత్ర నిజనిర్ధారణ బృందంలోని భాగంగా మేం ఒక రోజుకు పైగా ప్రయాణించి, అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలోని కొండల్లో ఉన్న 13 ఇళ్ల గ్రామమైన కుమ్మంకి చేరుకున్నాము.
ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు, అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో ఉండే గ్రామస్తులు తమ సామాను సర్దుకుని, చుట్టూ ఉన్న కొండల్లో తాము సిద్ధం చేసిన భూమికి వెళ్ళి, కోస్రా అనే అరికెలు, మినుములు, టమోటాలు, పెద్ద దోసకాయలు సాగు చేస్తారు. వారు తాత్కాలిక గుడిసెలు వేసుకొని, కోస్రా పంట కోత వరకు అక్కడే ఉంటారు. ఈ అందమైన కానీ కఠినమైన భూభాగంలో, పనులు క్రమబద్ధంగా ఉంటాయి—ఎవరికి ఏ పని చేయాలి అన్నదానికి ఒక అప్రకటిత నియమం ఉంటుంది.
11వ తేదీ ఉదయం, గ్రామంలోని పురుషులు, బాలురు కోస్రా కోయడంలో నిమగ్నమై ఉంటే, మహిళలు, అమ్మాయిలు కొందరు మినుము పంట కోస్తున్నారు; మరికొందరు వంట, ఇంటి పనులు, నీళ్లు తేవడం లాంటివి చేస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో, అకస్మాత్తుగా గాల్లో కాల్పుల శబ్దం అబూజ్‌మాడ్ కొండల అంతటా ప్రతిధ్వనించింది.
డిసెంబర్ 11వ తేదీ ఉదయాన్నే, పోలీసులు, పారామిలిటరీ దళాలు కుమ్మం పెండా (కొండ మీద పంట కోసం సిద్ధం చేసిన ప్రాంతం) కొండలను ఎక్కడం ప్రారంభించారు. పోలీసులు కుమ్మం పెండాలోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించినప్పుడు, తన తల్లి మాసే పని చేస్తున్న పొలానికి దగ్గరగా ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల సోను ఓయం తలని ఒక తూటా రాసుకుంటూ పోయిందని గ్రామస్తులు చెప్పారు. మాసే తన కుమారుని దగ్గరకు పరుగెత్తి, అతని గాయాన్ని శుభ్రం చేసి, గట్టిగా పట్టుకుని కొంత గంజి తాగించింది.
తరువాత, తన సాక్ష్యంలో, ఆమె సోను గురించి ఇలా చెప్పింది: ” ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే బిడ్డ; ఎక్కువగా మాట్లాడడు. కానీ ధైర్యవంతుడు, భయపడడు. కానీ నేను మాత్రం భయపడిపోతున్నాను. మళ్లీ పోలీసులు వస్తారని భయంగా ఉంది. మేము కేవలం అరికెలు సాగు చేసుకుని బతికేవాళ్లం. ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి విధ్వంసం సృష్టించడం న్యాయమా?” అని ప్రశ్నిస్తోంది.
మొదటి కొన్ని తూటాలు పేలిన వెంటనే తమను తాము రక్షించుకోవడానికి పెద్ద పిల్లలు, యువతీ యువకులు కొండపైన ఉన్న అడవిలోకి పరుగెత్తారు. గ్రామంలోని పెద్ద వయస్కులైన మహిళలు, తల్లులు, తుపాకులతో వారి వెంటపడుతున్న పోలీసులను “వారు మా పిల్లలు” కాల్చవద్దంటూ బ్రతిమిలాడుతూ పరుగెత్తడాన్ని చూశామని చెప్పారు. తుపాకులను మాపై ఎక్కుపెట్టి ‘ముందుకు వస్తే మిమ్మల్ని కాల్చేస్తాం’ అంటూ బెదిరించారు” అని 16 ఏళ్ల సోమరి తల్లి, అయితే ఓయామ్ చెప్పింది. “వారు కుక్కలను కూడా తీసుకొచ్చారు. మేమేమైనా జంతువులమా? కుక్కలతో వేటాడించడానికి?”
సోమారి సహా 16 మంది అడవిలో లోపల ఒక దాక్కోగలిగే ప్రదేశాన్ని చేరేంతవరకు పరుగెత్తారు. అలా పరుగెత్తుతూ అడవిలోకి అడుగుపెట్టినపుడు ఒక అడవి పందుల గుంపు కనబడింది. అవి భయంతో చెల్లాచెదురుగా పరుగెత్తడంతో వారు కాస్సేపు ఆగిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఎదురుగా తూటాలు పేలాయి. అప్పుడే వారికి అర్థమైంది—అన్ని వైపుల నుంచి పోలీసులు తమను చుట్టుముట్టారు అని. “ఆ పందుల వల్లే మేము బ్రతికాము,” అని 18 ఏళ్ల మణీష్ ఓయామ్ చెప్పాడు. “లేదంటే మేము నేరుగా పోలీసుల కాల్పుల వైపు వెళ్లి చచ్చిపోయేవాళ్లం.”
ఆ పదహారు మంది చలికాలపు చలిలో, ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన పొడవైన చీన్ గడ్డి పొదల్లో దాక్కొన్నారు. పోలీసులు తుపాకులు గురిపెట్టి అడ్డుకోవడం వల్ల వారి తల్లులు, మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది. ఆ రాత్రి కాల్పులు వినిపించలేదు. కానీ మరుసటి ఉదయం మాత్రం కాల్పుల శబ్దం చెవులను చీల్చింది. ఏదో ఘోరం జరిగిపోయిందని భయభీతులయ్యారు. ఆ పదహారు మందిలో పది మంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు. వారిలో రామ్లీ కూడా ఒకరు. డిసెంబర్ 12 ఉదయం డ్రోన్లు గాల్లో ఎగిరాయి. గడ్డి పొదల్లో భయంతో దాక్కున్న నిరాయుధంగా ఉన్న గ్రామస్తులను బహుశా పోలీసులు గుర్తించి ఉంటారు. అయినా కాల్పులు ప్రారంభించారు.
మణీష్, సుద్రి, సునీలా తమ ఆ విషమ స్థితిని గుర్తు చేసుకున్నారు. పొడవైన గడ్డి వెనుక మౌనంగా దాగి ఉన్నప్పుడు, వారు పోలీసుల మధ్య గోండీ భాషలో జరిగిన సంభాషణను విన్నారు: “వారిని బ్రతికిఉండగా పట్టుకుందామా, లేక నేరుగా చంపేద్దామా?” అని ఒకరు అడిగితే. “నేరుగా చంపేయాలి” అని మరొకరు సమాధానమిచ్చారు. వారు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్నారు. అప్పుడే 19 ఏళ్ల మోతు ఓయామ్ చిన్న చీలిక గుండా పరుగెత్తాడు. ఒక ఈల శబ్దంతో పాటు, కొన్ని తూటాలు పేలాయి. క్షణాల్లోనే మోతు అక్కడే కుప్పకూలిపోయాడు. భయంతో మిగతావారు కూడా పరుగెత్తారు. కానీ 18 ఏళ్ల నేవ్రు, 16 ఏళ్ల సోమరి మాత్రం ఇక కదల్లేదు.
” పరుగెత్తుతున్న నేను నేలపై పడుకున్నాను; నన్ను తాకబోయిన తూటా రామ్లీని తాకింది” అని 18 ఏళ్ల మనీష్ చెప్పాడు. మరో యువకుడు జయరాం పరుగెత్తుతున్నప్పుడు అతని ఎడమ చేతికి తూటా తగిలింది. సుద్రి, మున్నీ, సునీలాలు (15 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు) జయరాం, రమ్లీలని పైకి లేపి తమతో పాటు పరుగెత్తించారు. కుమ్మం నుంచి కనీసం నాలుగు గంటల దూరంలో ఉన్న ఎడ్వా గ్రామానికి వారు సాయంత్రానికి చేరుకున్నారు. “మేము ఆ సమయంలో కేవలం ఒకటే ఆలోచించాం—కనీసం ఈ ఇద్దరినైనా (కాల్పుల్లో గాయపడినవారిని) సురక్షితంగా తీసుకెళ్లాలి” అని సూద్రి అన్నాడు. అదే సాయంత్రం, మరో ఐదుగురు—మనీష్, శాంతి, కుమ్లీ, మాటే, తులసీ—సుమారు నాలుగు గంటల దూరంలోని కుమ్నార్ గ్రామానికి చేరుకున్నారు. అప్పటి నుంచి వారిలో ఒకరు 18-20 సంవత్సరాల మధ్య వయస్సు గల రామా ఒయం అదృశ్యమయ్యాడు. అతనిని కనుగొనడానికి పోలీసులు ఇప్పటివరకు ఏ డ్రోన్‌నూ ఉపయోగించలేదు.
భయంతో దాక్కొన్న ఇద్దరిలో, తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న నెవ్రును కాల్చిచంపేసి ఉండవచ్చు. గాయపడ్డాక బహుశా అతను కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్ళి ఉండవచ్చు. చివరకు ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత డిసెంబర్ 18 నాడు అక్కడకు వెళ్ళిన గ్రామస్తులు, జర్నలిస్టులకు అతని మృతదేహం కనపడింది.
సోమారి విషయానికి వస్తే, పరారైన వారిలో ఒకరు సమీపంలో దాక్కొని ఉండగా, ఆమె కేకలు వినిపించాయి. “దాడి చేసినప్పుడు అరచినట్లుగా ఆ కేకలు ఉన్నాయి” అని అతను అన్నాడు; అయితే పోలీసుల భయంతో అతను తన పేరును చెప్పలేదు. తరువాత సోమారిని కాల్చి చంపేశారు. కొన్ని రోజుల తర్వాత, అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్నప్పుడు తన కూతురి మృతదేహాన్ని చూసిన ఆమె తల్లి ఆయితేకు కూతురు అలా కేకలు వేయడానికి గల కారణం ఏమిటో అర్థమైంది. “ఆమె జననాంగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సామూహిక అత్యాచారం చేసినట్లుగా కనిపించింది” అని తల్లి అన్నది. అయితే ఇప్పటివరకు కుటుంబానికి పోస్ట్ మార్టం రిపోర్టును ఇవ్వలేదు.
23 సంవత్సరాల వయస్సు గల కోహ్లా ఒయం గడ్డి పొదల్లో దాక్కొన్నవారిలో ఒకరు. పారిపోతుండగా అతన్ని కాల్చేసారు. అతను ముగ్గురు చిన్నపిల్లల తండ్రి. డిసెంబర్ 11న భద్రతా బలగాలు పెండాలోకి ప్రవేశించినప్పుడు, అతని భార్య బుధ్రి నీళ్లు తేవడానికి వెళ్లింది; పిల్లలు అతని వద్దే ఉన్నారు. అప్పటికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్న రైనూ, కోహ్లా చేతిలోనే ఉన్నాడు. పోలీసులు కాల్పులు ప్రారంభించినప్పుడు, కోహ్లా రైనూను ఎక్కడో సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, తరువాత పరుగెత్తి ఉండవచ్చని బుధ్రి ఊహిస్తోంది. కాని, అతను వెంట తీసుకెళ్లాడా? లేక రైనూ దాక్కొన్న మిగతా వాళ్ళతో పాటు ఉన్నాడా? అనే విషయం ఆమెకు తెలియదు. కోహ్లా హత్య జరిగిన రెండు రోజుల తర్వాతే బుధ్రికి తన బిడ్డను కలిసింది.
పోలీసులు ఆ బిడ్డను, ఎక్కడి నుంచి తీసుకెళ్ళారో మనకు తెలియదు, లెకవాడ గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ వయసైన మాసా ఒయానికి అప్పగించారు. ఎవరి బిడ్డనో అతనికి తెలియదు. “వాళ్లు ఆ బిడ్డను నా చేతికి ఇచ్చి ‘ అతని తల్లికి తిరిగి ఇచ్చేయి’ అన్నారు. ” ఆ బిడ్డ ఎవరిదో, ఎవరికి ఇవ్వాలో నాకు తెలియదని చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. ‘మేం చెప్పినట్టు చెయ్యి’ అని చెప్పి వెళ్లిపోయారు అంతే” అని మాసా వివరించాడు.
చిన్ని రైనూ ఆ రాత్రిని ఎక్కడ గడిపాడో లేదా ఎలాంటి కష్టాలను అనుభవించాడో మనకు ఎన్నటికీ తెలియదు. కాల్పుల ఘటన జరిగి రెండు వారాల తర్వాత డిసెంబర్ 31నాడు కుంబంలో మేము అతణ్ని చూసినప్పుడు, వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడూ, ఊపిరి బిగబట్టిన ఛాతీ కేవలం అతనికి భయం తప్ప మరేమీ తెలియదని వ్యక్తం చేస్తున్నాయి. తన తల్లి ఛాతిని విడిచిపెట్టేందుకు నిరాకరించడం, అయినప్పటికీ మమ్మల్ని చూసి చిరునవ్వు చిందించడం ఇప్పుడు తాను ఇంట్లో ఉన్నాననే భద్రతా భావాన్ని కలిగించాయని, ఇక ఎంతమాత్రమూ మళ్ళీ వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేడనీ తెలియజేసాయి. అతని అన్నదమ్ములు బిమ్లా, శుక్లా కూడా ఆ రాత్రి అడవిలో ఒంటరిగా గడిపారు. “అవును, వారు ఎలుగుబంట్ల దాడికి గురయ్యి ఉంటే?” అని బుధ్రి ప్రేమ, భయం, కోపంతో కూడిన కళ్లతో ప్రశ్నించింది. శుక్లా కేవలం మూడేళ్ల పిల్లవాడు. మేము బుధ్రిని బిమ్లా వయసు ఎంత అని అడిగితే, “నాకు తెలియదు” అని చెప్పింది. “నాలుగేళ్లు?” ఉండచ్చు అని మేం ఊహిస్తే, పక్కనే ఉన్న ఒక వ్యక్తి, “కాదు, అంతకంటే ఎక్కువ. ఆమె చాలా కష్టం చేస్తుంది. కనుక అయిదు లేదా ఆరు ఉంటాయేమో” అని అన్నాడు.
ఆ సైనిక చర్య జరుపుతున్న సమయంలోనే బలగాలు లేకవాడ గ్రామంలోని పెండాలో ప్రవేశించాయి. ఆ గ్రామం కుంబం నుండి కొండల గుండా నాలుగు గంటల దూరంలో ఉంది. ఆ రోజు ఉదయం మాసా ఓయాం అనే వ్యక్తి ఊరి దగ్గర ఉన్న వాగులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అతను అక్కడికి వెళ్ళగానే, చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపాయి. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు ఊరికి తిరిగి వచ్చి అతని భార్య సుధ్నికి ఈ విషాద ఘటన గురించి చెప్పారు. సిత్రామ్‌కు తండ్రి మాసా. సిత్రామ్ కూడా అదే వాగుకు కొంతసేపటి తర్వాత నీరు తేవడానికి వెళ్లాడు. కానీ, అతను రక్తంతో తడిసిపోయి తిరిగివచ్చాడు; ఒక తూటా అతని రెండు తొడల గుండా వెళ్లింది.
బస్తర్‌లో దొంగిలించిన బాల్యాలు
కుమ్మం నుంచి బయల్దేరే ముందు, మేము పాక్లీని కలిశాం. ఆమె నెవ్రూకి చెల్లెలు, గుడ్సాకు కుమార్తె. గ్రామ పెద్ద అయిన గుడ్సా ఓయామ్, డిసెంబర్ 11న దాక్కుందామని పరుగెత్తుతుంటే కాల్చి చంపేసారు. పాక్లీ చాలా కోపంగా ఉంది. ఆమె మాటలు చాలా పదునుగా ఉన్నాయి; ఆమె చూపు మరింత తీక్షణంగా ఉంది.
“నాకు ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజుల కోసం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను. ఇక ఎప్పటికీ నేను బడికి తిరిగి వెళ్లలేను. పోలీసులు నా తండ్రిని, అన్నను చంపేశారు. నా ఇతర తమ్ముళ్లు, చెల్లెళ్లు చాలా చిన్నవారు. నా తల్లికి కొస్రా పండించేందుకు సహాయం చేయడానికి ఎవరూ లేరు; అందుకే నేను తిరిగి గ్రామానికి వెళ్లి నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు వ్యవసాయ పని నేర్పించాలి. ఈ ప్రభుత్వం అంటే నాకు చాలా కోపం. నాకు చదువుకునే అవకాశం లేకుండా చేసింది” అని కోపంగా అన్నది .
కుమ్మం, లేకవాడ పరిసరాల్లో మైళ్ల దూరం వరకు ప్రభుత్వ పాఠశాలలు లేవు. దగ్గరలో ఉన్న పాఠశాల రేకవాయలోని భూమ్కల్ ఛాత్రవాస్. పాక్లీ తన తండ్రి మరణించేవరకు అక్కడే చదివింది. ఇదే పాఠశాలలో సిత్రాం సోదరుడు జమీన్ కూడా చేరాడు.
2024 మేనెలలో వేసవి సెలవుల్లో హాస్టల్ ఖాళీగా ఉన్నప్పుడు, సిఆర్‌పిఎఫ్ బలగాలు అక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించాయి. వారు పాఠశాలలోని హాజరు రిజిస్టర్‌లను, ఇతర కాయితాలను కాల్చివేశారు. దాన్ని మావోయిస్టు శిక్షణా శిబిరంగా ప్రకటించారు.
కొండ దిగి వెళ్లేటప్పుడు అక్కడ ఆగాం. ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్, ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. “నేను పక్కనే ఉన్న గ్రామంలోనే ఉంటాను. వారు మమ్మల్ని ఇళ్లలోంచి బయటకు రానివ్వలేదు. బయటకు వస్తే కాల్చేస్తామని భయపెట్టారు. స్కూలు కాయితాలను కాపాడేందుకు నేను ఏం చేయలేకపోయాను” అని ఆయన చెప్పాడు.
ఆ సంవత్సరం చివర్లో, కార్యకర్తల సహాయంతో, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. ప్రైవేటు పాఠశాలలను ప్రతి మూలలో తెరవగలిగితే, 20 పంచాయతీలు నడుపుతున్న ఒక పాఠశాలకు ఎందుకు అధికారిక గుర్తింపు ఇవ్వకూడదు? అని వారు కలెక్టర్‌ను అడిగారు. చివరకు ఈ పాఠశాలకు జిల్లా సమాచార వ్యవస్థ విద్య (డిఐఎస్ఇ) కోడ్ జారీ ఆయిందని, ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలగా మారుతుందని ప్రదీప్‌కు ఇటీవల సమాచారం వచ్చింది.
ప్రస్తుతం ఈ పాఠశాలలో 115 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లు ఉన్నారు. క్రీడలు వారి దినా చర్యలో భాగంగా ఉంటాయి. మేము మాట్లాడిన పిల్లల్లో చాలా మంది ‘పర్యావరణం’ తమకు ఇష్టమైన విషయం అని చెప్పారు. మేము వచ్చేస్తుంటే, సిత్రం తమ్ముడు జమీన్ మమ్మల్ని పిలిచి, “దయచేసి మేము చదవడానికి హిందీ కథా పుస్తకాలు తెచ్చివ్వండి, మా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. అవి చదవడం మాకు మంచిగా అనిపిస్తుంది ” అని అన్నాడు. నిజాయితీతో ఉన్న అతని చిరునవ్వు, కొద్దిరోజుల క్రితం తన తండ్రిని కోల్పోయిన బాధను దాస్తోంది. అతని చొక్కా నా దృష్టిని ఆకర్షించింది—ఇంతవరకు నేను అలాంటి దాన్ని చూడలేదు. అతను దానిపై ప్రత్యేకంగా కలం పెట్టే జేబును కుట్టుకున్నాడు. అతని విద్య హక్కును ఎవరూ హరించలేకపోయారు.
మేము మరింత దూరం నడిచి ఇంద్రావతి నది తీరానికి చేరుకున్నప్పుడు, తమ భూమి, ప్రజలు, జీవనోపాధి వినాశనానికి, హింసకు బలికాకుండా కాపాడుకోవడానికి నిరసన చేపట్టిన యువత కనిపించారు. అక్కడ మాకు కొన్ని మార్టార్ షెల్స్ (పేలుడు పదార్థాలు) మిగిలిపోయిన అవశేషాలను చూపించారు. ఇవి రాజ్యం తన యుద్ధ వ్యూహంలో భాగంగా ఉపయోగించిన కొత్త వైమానిక బాంబుదాడులకు చెందినవి. రాజ్యం రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్‌ను వినియోగించడంపైన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఛత్తీస్‌గఢ్ యూనిట్ 2022లో విచారణ చేపట్టింది. పౌరులపై వైమానిక బాంబుదాడులు చేయడం గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు.
ఈ పేలుడు పదార్థాల ప్రభావం చిన్న పిల్లల ప్రాణాలను తీసింది. 2024 మే 12న, బోడ్గా గ్రామానికి చెందిన 9, 12 ఏళ్ల లక్ష్మణ్, బోటీ ఓయామ్ అనే ఇద్దరు పిల్లలు బీడీ వ్యాపారికి ఆకు కట్టలు ఎండబెట్టడంలో సహాయం చేస్తున్నప్పుడు కొన్ని బాంబులను కనబడ్డాయి. పేలుడు పదార్థాన్ని కలిగిన భాగం నేలలో కూరుకుపోయి ఉంది, ముందుభాగం భూమి పైన కనిపిస్తోంది. పిల్లలు ఆసక్తితో కర్రలు, రాళ్లతో తవ్వడం ప్రారంభించారు. వాటిలో ఒకటి పేలని స్థితిలో ఉండటంతో, దానిని తవ్వి తీసినప్పుడు అకస్మాత్తుగా పేలిపోయింది. వారి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, పాత్రికేయుడు వికాస్ తివారీ ఈ ప్రాంతం నుండి లైవ్ వీడియో ప్రసారం చేశారు. గ్రామంలో ఇంకా పేలని బాంబులు ఉన్నాయని స్పష్టంగా హెచ్చరించారు. వాటిని తొలగించేందుకు అధికారులను కోరారు. అయినప్పటికీ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమూ ఎటువంటి చర్యా తీసుకోలేదు. చట్టవ్యతిరేకంగా వైమానిక యుద్ధ పరికరాలను ఉపయోగించడం అనే సమస్య తలెత్తడమే కాక గాక, దృష్టికి తీసుకువచ్చాక కూడా వాటిని తొలగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని రాజ్యం ఎలా వివరిస్తుంది? ఇప్పుడు ఇద్దరు పిల్లలు చనిపోయారు.
ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పిల్లల కుటుంబాలకు “నక్సల్-పీడితుల” పథకం కింద పరిహారం అందించింది. ఇది మావోయిస్టు హింసకు బలైన వారికి పరిహారం అందించేందుకు ఉద్దేశించబడిన పథకం. కానీ, లక్ష్మణ్, బోటీ మరణానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒకరు పాఠశాల హెడ్‌మాస్టర్ కావాలని, మరొకరు నర్స్ కావాలని కలలు కనేవారు.
అయితే, బోటి, లచ్మన్‌లు ఒంటరిగా లేరు. వారి చిన్న సమాధులేకాక బస్తర్ అడవులలో యింక అనేక ఇతర సమాధులు కూడా వున్నాయి. 2024లో, అనేక మంది పిల్లలు పోలీస్ హింసకు బలయ్యారు; ఇది నక్సల్ వ్యతిరేక చర్యల ముసుగులో జరిగింది. 2024 మొదటి రోజునే, బీజాపూర్‌లోని ముత్వెండిలో ఆరునెలల మంగ్లీ తన తల్లిచేతిలోనే పోలీసు కాల్పులకు బలైంది. గ్రామంలో చెట్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మాసే సోడీ చేతిగుండా ఆమె బిడ్డను తాకిన ఒక పోలీసు తూటాతో మరణించింది.
బస్తర్‌లో 2024 సంవత్సరం అత్యధిక సంఖ్యలో “ఎన్‌కౌంటర్” మరణాలు, అత్యధిక “లొంగిపోవడాలులు”, అత్యధిక అరెస్టులను నమోదు చేసింది: 1000 మంది అరెస్ట్ అయ్యారు; 837 మంది లొంగిపోయారు; 287 మంది హత్యకు గురయ్యారు (2023లో 20 మంది హత్యకు గురైన వారితో పోల్చితే ఇది గణనీయంగా అధికం). ఈ సంఖ్యలను ఆనందంగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రత్యేకంగా ఎంచుకున్న తేదీ 2026 మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పూర్తిగా నశిస్తుందని చెప్పాడు.
కుమ్మం గ్రామస్తులు చెప్పిన కథనాల ప్రకారం, కొండల నుంచి ఏడు మృతదేహాలను కిందకు తెచ్చిన వార్త తెలియగానే, పల్లి గ్రామంలోని కొందరు డీఆర్‌జీఎఫ్, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు ఆ శవాల చుట్టూ సంబరంగా నృత్యం చేసినట్లు చూశారని అంటున్నారు. ప్రతి శవానికి ఒక ధర ఉంది. 2026 మార్చి 31 నాటికి కేటాయించిన బహుమతిద్రవ్యాన్ని పంపిణీ చేస్తారు; ఖాతాలను మూసివేస్తారు; మంగ్లీ, సోమరి, బోటి, లచ్మన్‌లాంటి హత్యకుగురైన పిల్లల రక్తంతో ముద్రపడిన లెడ్జర్‌ను మూసివేస్తారు.
బస్తర్‌లో పిల్లల జీవితాలకు ఏ మాత్రం విలువ లేనట్లుగా కనిపిస్తోంది. నెవ్రూని సమాధి చేసిన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దారిలో ఓ ఇంటి నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. ఓ మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది; ఆమె శిశువు ఆ రోజే అనారోగ్యంతో మరణించాడు, అది సాధారణంగా నయం చేయగలిగే వ్యాధి, ఉదాహరణకు విరోచనాలు లేదా మలేరియా లాంటిది.
కొన్ని రోజుల క్రితమే నెవ్రూను సమాధి చేసారు. అతని సమాధి మిగతా సమాధులకన్నా భిన్నంగా కనిపించింది—ఇంకా రాళ్లతో కప్పలేదు, కేవలం కట్టెలు, ఆకులతోనే కప్పి ఉంది. సమీపంలో ఒకతను, ఇద్దరు అబ్బాయిలు ఒక గొయ్యిని తవ్వుతున్నారు. శిశువు సమాధి కోసం ఆ గొయ్యి తవ్వుతున్నారని మాకు వెంటనే అర్థమైంది.
కులవ్యవస్థ ద్వారా మానవుల హోదా నిర్ణయమయ్యే ఈ దేశంలో హింస ఒక ప్రత్యేక రూపాన్ని దాలుస్తుంది. బస్తర్‌లో, తమ భూములను, సముదాయాన్ని రక్షించుకోవాలని కోరుకోవడం, తమ హక్కులను డిమాండ్ చేయడం ప్రజలను నేరస్థులుగా మార్చుతోంది. వ్యవసాయం చేస్తున్నప్పుడు లేదా ఆడుకుంటున్నప్పుడు తుపాకీతో వెంబడించి కాల్చినప్పుడు; బీడీ ఆకులను ఆరబెడుతున్నప్పుడు పేలని మోర్టార్ షెల్ వల్ల; లేదా, పోలీసుల కాల్పుల్లో తల్లికి తగిలిన తూటా ఆమె చేతిని తాకి పిల్లవాడి ఛాతిలోకి దూసుకుపోయినప్పుడు – వారి పిల్లలు చనిపోతున్నారు. కొన్నిసార్లు కేవలం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంవల్లనే వారు మరణిస్తారు. కానీ దాదాపు ప్రతిసారీ, వాళ్లు “తక్కువ స్థాయి” ప్రజల పిల్లలే కావడం వల్లనే మరణిస్తారు.
భారతదేశంలో, పిల్లలను హత్య చేయడం, నేరస్థులను చేయడం చాలా కాలంగా జరుగుతోంది; కొన్నిసార్లు వారి తల్లిదండ్రులకు అవసరమైన పత్రాలు లేకపోవడం వల్ల; కొన్నిసార్లు వారు వేరే కులానికి చెందిన వారితో ప్రేమలో పడినందుకు, మరికొన్నిసార్లు వారంతా జన్మించే ముందే, జెండర్ కారణంగా.
గతేడాది డిసెంబర్ 22న, దంతేవాడకు చెందిన ఓ ఉపాధ్యాయుడు జిల్లా శిశు సంక్షేమ కమిటీకి ఫోన్ చేసి, ఆసుపత్రిలో పోలీసులు సీతరాం, సోనులను నిర్బంధించి, విచారణ జరుపుతున్నారని తెలియజేశాడు. తన పేరు బయటికి చెప్పద్దని కోరుకున్న ఆ ఉపాధ్యాయుడు, ఈ పిల్లల సంక్షేమం కోసం ఆ కమిటీని జోక్యం చేసుకోవాలని కోరాడు. కానీ వారి నుండి వచ్చిన సమాధానం అమానుషమైనది మాత్రమే కాదు, అసంబద్ధమైనది కూడా. “ఈ పిల్లలు శిశు సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల పరిగణనలోకి రారు కాబట్టి మేం ఏమీ చేయలేం” అని కమిటీ వారు సమాధానమిచ్చారు.
ఈ సమాధానంలో ఉన్న క్రూరత్వాన్ని దాని అర్ధహీనత మాత్రమే మించగలదు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) చట్టం ప్రకారం, శిశు సంక్షేమ కమిటీకి పిల్లల సంరక్షణ, భద్రత, పునరావాసం, పునఃస్థాపన వంటి బాధ్యతలను అప్పగించారు. అయితే, పోలీసులు అనధికారికంగా నిర్బంధించిన, విచారణకు గురైన, తమ కుటుంబాలను కలవకుండా నిరోధానికి గురైన పిల్లలను, ఈ చట్టంలో “రక్షణ అవసరమైన పిల్లలు”గా పరిగణించలేదు. ఇలాంటి అస్పష్టమైన వివరణల్లోనే బస్తర్‌లోని భద్రతా బలగాలు వర్ధిల్లుతున్నాయి.
పెరుగుతున్న ఉగ్రవాద జాతియత, సాంస్కృతిక-మత సంబంధిత జాతీయతా కాలంలో, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరింత ఎక్కువ హింసకు గురవుతున్నారు. యునిసెఫ్ ప్రచురించిన గత సంవత్సరం నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు పిల్లలపై “2024లో విధ్వంసకర, రికార్డు స్థాయిలో ప్రభావాన్ని చూపించాయి.” ఈ నివేదిక ప్రకారం, మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ మంది పిల్లలు—సుమారు 47 కోట్ల 30 లక్షలకు పైగా, అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు—యుద్ధ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. తత్ఫలితంగా వీరు తమ హక్కులను కోల్పోవడమే కాకుండా, హత్యకు గురవడం, గాయపడటం, చదువు వదిలేయాల్సి రావడం లేదా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మొత్తం దృశ్యం మరింత ఆందోళన కలిగించేలా ఉంది. 2023 వరకు లభించిన డేటా ప్రకారం, ప్రపంచంలోని పిల్లలలో మూడింట రెండు వంతులు ఘర్షణతో నిండిన దేశాలలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ గణాంకం మరింత భయంకరంగా మారి ఉండొచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాలో జరుపుతున్న జననిర్మూలనను ఫోన్లలో, టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారంగా అందరూ నేరుగా చూస్తున్నారు. 2023 అక్టోబర్ నుండి ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం, వెస్ట్ బ్యాంక్‌లో ప్రతి రెండు రోజులకు ఒక పాలస్తీనా బిడ్డ హత్యకు గురవుతోంది.
అదే సమయంలో, ప్రస్తుత భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్ పట్ల ఉన్న మక్కువ, దాని సైనిక వ్యూహాలను అనుసరించాలని ఉన్న ఆకాంక్ష ఏవిధంగానూ రహస్యమైన విషయం కాదు. కొత్త గూఢచారి, రక్షణ సాంకేతికతల అభివృద్ధి, పరీక్షల విషయంలో ఇజ్రాయెల్ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఘర్షణలను మరింత పెంచే విధంగా వాటిని ఎగుమతి చేస్తోంది. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద రక్షణపరికరాల కొనుగోలుదారు భారతదేశం.
ఈ నేపథ్యంలో, తలఎత్తే ప్రశ్న—పిల్లల హత్యలను ఆపడానికి రాజ్యం చేయాల్సింది ఏమిటి? అని. వారి పట్ల శ్రద్ధ వహించాలని, సంరక్షణకు అర్హులనే విషయాన్ని రాజ్యం ఎప్పుడు అంగీకరిస్తుంది? చట్టపరమైన వర్గీకరణల ద్వారా, కొందరు పిల్లలు సంరక్షణకు అర్హులే కాదని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది అంతిమంగా , ఇవాళ బస్తర్‌లో చూస్తున్నట్లుగా రాజ్య హింసకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఒక్క పిల్లవాడికి సంరక్షణ హామీ ఇవ్వడం ప్రభుత్వం, సమాజాల బాధ్యత అనేది నిర్వివాదాంశం.
బస్తర్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో పిల్లల దుస్థితిపట్ల విస్తృత దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. 2024లో నక్సలైట్ వ్యతిరేక చర్యలు పెరిగి, అరెస్టులు, లొంగిపోవడం, మరణాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ నాడు అక్కడి పిల్లలు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవహేళన, రక్షణ విధానాలు విమర్శనాత్మక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. విపత్తుతో కూడిన ఈ ప్రాంతాల్లో అత్యధిక భారం మోస్తూన్న అమాయక పిల్లలు ఈ పరిస్థితికి తక్షణ పరిష్కారం అవసరం.
ఈ ప్రపంచంలో హింస నిరంతరంగా ఉన్నప్పటికీ, ఒక ఆశ మాత్రం నన్ను మొండిగా అంటిపెట్టుకునే ఉంటుంది. బహుశా అది నేను పిల్లలతో పని చేయడంవల్ల కావొచ్చు. ప్రతి రోజూ నాకు ఆశ్వాసనగా వారు ఏదో ఒకటి ఇస్తారు; ఒక మంచి ప్రపంచం సాధ్యమేనని గుర్తుచేస్తారు; చిరునవ్వులు, నిట్టూర్పులు, కలలను తమ హృదయ స్పందనలో మోస్తున్నట్లు అనిపించే ప్రపంచం; అలాగే వారి కోపం, నిరాశలలో కూడా. అలాగే,ఖచ్చితంగా తమ చొక్కాలపై పెన్నుల కోసం కుట్టిన జేబులలోనూ.
ఇక పాఠశాలకు వెళ్లలేకపోతున్నాననే పాక్లీ ఆగ్రహం, తన చొక్కాపై కలం పెట్టుకోడానికి జేబు కుట్టుకున్న జమీన్ – నా మనస్సులో చిరస్థాయిగా ముద్రితమైన ఈ రెండు దృశ్యాలతో నేను ఈ రచనను ముగిస్తున్నాను. ఈ దేశం వారిని పదే పదే విఫలం చేసినా, ఈ చిన్నారుల సంకల్పం, సున్నితత్వం, ధైర్యం మనకు మిగిలిన ఏకైక ఆశ.
(సోనీ సోరీ ఇచ్చిన వివరాలతో)
శ్రేయ ఖేమాని
ఛత్తీస్‌ఘడ్, రాయపూర్‌లో శ్రేయా ఖేమాని ఉపాధ్యాయురాలు, కార్యకర్త. ట్రేడ్ యూనియన్ నడుపుతున్న పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసిన తరువాత, ఆమె, యూనియన్‌కు చెందిన ఇతర మహిళా కార్యకర్తలు తమ విమర్శనాత్మక విద్యా శిక్షణని ప్రాథమిక పాఠశాల దాటి విస్తరించడానికి పాఠశాల వెలుపల బోధనను ప్రారంభించారు. ఆమె ఛత్తీస్ గఢ్ లోని వివిధ మహిళా, మానవ హక్కుల సమూహాలలో చురుకైన సభ్యురాలు.