కార్యకర్తల‘ఎరుపు ముద్ర’పైఆగ్రహం
నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడం అతని సహచరుల, కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది; కార్యకర్తలపై ఎరుపు ముద్ర వేస్తున్నందుకు ప్రభుత్వ ఏజెన్సీలను విమర్శిస్తున్నారు.
బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 5న రాత్రి 10.30 గంటలకు చెన్నై వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్‌సిఆర్ ఆధారిత మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్, మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎంజిఎంఎస్) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు అనిరుద్ధ్ రాజన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది..
ఉత్తర భారతదేశంలో మావోయిస్టు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అనిరుద్ధ్ కొరియర్‌గా వ్యవహరించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్ పత్రిక ప్రకారం, సానుభూతిపరులతో రహస్య సమావేశాలు నిర్వహించడం, నిధులు సేకరించడం, పార్టీ కోసం రిక్రూట్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
అతని నుంచి డాక్యుమెంట్లు, మావోయిస్టు సాహిత్యంతో కూడిన పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద వికాస్ ఘట్గే పేరుతో ఆధార్ కార్డ్ దొరికినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
ఉపా చట్టం సెక్షన్ 10 U (చట్టవ్యతిరేక సంస్థలలో సభ్యత్వం), ఐటి చట్టంలోని సెక్షన్ 66 (సైబర్ నేరాలు), ఆధార్ చట్టంలోని సెక్షన్ 35 (ఆధార్ సమాచార అనధికారిక వినియోగం), భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్లు 147 (అల్లర్లు), 152 (ప్రభుత్వ సేవకులపై దాడి చేయడం), 336 (భద్రతకు హాని కలిగించడం), 340 (తప్పుతో కూడిన సంయమనం) కింద ఉప్పర్‌పేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసిందని అనిరుద్ధ్ కు న్యాయ సహాయం అందించిన బెంగళూరులోని ఒకరు తెలియచేసారు.
సెప్టెంబర్ 6న కోర్టులో హాజరుపరిస్తే, 14 రోజుల పోలీసు కస్టడీ విధించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 19న జరగనుంది.
అతని కేసును చేస్తే ఏజెన్సీలు తమపై ‘ఎరుపు ముద్ర’ వేస్తాయేమోనని కొందరు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పర్‌పేట స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ సులోచన విషయాలు పూర్తిగా తెలియని కారణంగా వ్యాఖ్యానించడానికి నిరాకరించి, రిపోర్టర్‌ను చిక్‌పేట్ ఎసిపి దగ్గరకు వెళ్లమంటే, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని, గోప్యత కారణంగా వివరాలు పంచుకోలేమని ఎసిపి తెలిపారు.
కార్పొరేట్ రంగంలో పనిచేసిన చార్టర్డ్ అకౌంటెంట్ అనిరుధ్, పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ అకౌంటబిలిటీ కలెక్టివ్ (పిఎఫ్‌పిఎసి) లో ఆర్థిక పరిశోధకుడిగా కూడా పనిచేశారు. ఇది ముఖ్యంగా అట్టడుగు, దుర్బల వర్గాలకు సంబంధించి పబ్లిక్ ఫైనాన్స్, జవాబుదారీతనం, పారదర్శకతపై దృష్టి సారించిన సంస్థ.
ఆ తరువాత లాక్డౌన్ కాలంలో ఎంజిఎంఎస్ స్థాపించడానికి ముందు అతను భారతదేశంలో స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్య అయిన న్యూ ట్రేడ్ యూనియన్ ఇనిషియేటివ్ (ఎన్‌టియుఐ)లో చేరాడు.
‘తప్పుడు కేసులో ఇరికించారు‘
దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఐఎంటి మనేసర్‌లోని కార్మికులలో ట్రేడ్ యూనియన్ చురుకుగా పనిచేస్తోందని, అనిరుద్ధ్‌కు, ఆ కార్మిక సంఘానికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదు అని మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎంజిఎంఎస్) కోశాధికారి బిందు రామ్ అన్నారు.
బిందు ది అబ్జర్వర్ పోస్ట్‌తో మాట్లాడుతూ, “అనిరుధ్ మావోయిస్టు అనే వాదన పూర్తిగా నిరాధారం. కార్మికుల హక్కుల కోసం నిలబడే అనేకమంది ఇతర కార్మిక నాయకుల్లాగే అతన్ని తప్పుగా ఇరికిస్తున్నారు.
“కార్మికులు, రైతులు, మేధావులు లేదా న్యాయవాదుల హక్కుల గురించి అవగాహన కలిగించేవారిని ప్రభుత్వం శత్రువుగా చూస్తుంది.”
” ఈ నిరాధార ఆరోపణల ఉద్దేశ్యం న్యాయం కోసం పోరాడుతున్న వారి నిశ్శబ్దం చేయడం, సామ్రాజ్యవాదానికి సేవ చేస్తున్న పెట్టుబడిదారుల దోపిడీని రక్షించడమే.”
“చార్టర్డ్ అకౌంటెన్సీలో వున్న నేపథ్యం వల్ల అతనికి కార్పొరేట్ దోపిడీ గురించి బాగా తెలుసు. కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత కార్మికుల పరిస్థితి క్షీణించడం అతనిని తీవ్రంగా ప్రభావితం చేసింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశోధించడానికి, పరిశీలించడానికి అతను పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్లాడు.”
“ఐఎంటి మనేసర్‌లో, వలస వచ్చిన, స్థానిక కార్మికులు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను అతను ప్రత్యక్షంగా చూశాడు. వీరిలో చాలా మందికి లాక్‌డౌన్ సమయంలో వేతనాలు లేవు. అద్దె చెల్లించకుండా ఉండేందుకు ఇంటి యజమానులు ఒప్పుకోలేదు; వారి గదులను ఖాళీ చేయమని పదేపదే అడిగారు.”
“కరోనా విపత్తు చుట్టూ భయం, మరణం ఉన్నప్పటికీ, వారికి సహాయం చేస్తూ అనిరుద్ధ్ కార్మికుల మధ్య పని చేస్తూనే ఉన్నాడు.”
ఢిల్లీ యూనివర్శిటీ నుండి సోషియాలజీలో మాస్టర్స్ కోసం సిద్ధమవుతున్న అనిరుద్ధ్, 2017లో స్క్రోల్.ఇన్‌లో తన కథనాన్ని ప్రచురించారు; వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి ఉద్దేశించిన నిధులు పన్ను సంస్కరణల తరువాత రాష్ట్రాలకు పరిహారం ఇవ్వడానికి ఎలా మళ్లించబడ్డాయి అనే అంశాన్ని గురించి ఆ వ్యాసం ఎత్తి చూపింది.
“కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత, లక్షలాది మంది పారిశ్రామిక కార్మికులు ఉపాధి కోల్పోవడం, వైరస్ కారణంగా మరణ భయం, చెల్లించని జీతాల కారణంగా అద్దె చెల్లించలేకపోవడం వంటి కారణాలతో ఆకలితో పోరాడారు. ఈ కష్టాలే మమ్మల్ని పని చేసేలా చేశాయి. అనిరుద్ధ్, నేను ఎంజిఎంఎస్ స్థాపించాము” అని బిందు వివరించారు.
“మేము కాంట్రాక్టర్ వ్యవస్థ, తక్కువ వేతనాలు, చెల్లించని ఓవర్‌టైమ్, బోనస్‌లు లేకపోవడం వంటి సమస్యల పైన పని చేసాం. పని స్థలం వెలుపల, ఇళ్ల అధిక అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలాంటి సమస్యలపై పని చేసాం.”
” బెల్సోనికా, హిటాచీ వంటి యూనియన్లలో కాంట్రాక్టర్ వ్యతిరేక నిరసనలకు మద్దతు ఇచ్చింది; శాశ్వత ఉపాధి, కార్మికులకు వేతన పెంపుదలకోసం కృషి చేసింది.”
అనిరుధ్ అరెస్ట్ వెనుక మనేసర్‌లోని పారిశ్రామిక కంపెనీలు ఒక కారణమని బిందు అనుమానిస్తున్నారు.
“మరొక కంపెనీకి ప్రతినిధులుగా నటిస్తూ మమ్మల్ని మోసం చేసిన మారుతీ సుజుకీ నియమించిన ప్రైవేట్ గూండాలు 2-3 సంవత్సరాల క్రితం, అనిరుధ్‌ను బెదిరించారు. ఈ గూండాలు, స్థానిక పోలీసులు, గ్రామ సర్పంచిలను కలిసి మా గురించి సమాచారాన్ని సేకరించారు; ఐఎంటి మనేసర్ కార్మికులను సమీకరించడం కొనసాగిస్తే, మమ్మల్ని చంపేస్తామని హెచ్చరించారు.
” కంపెనీలు తమ దోపిడీని అదుపు లేకుండా కొనసాగించడానికి వీలు కల్పించే కార్మికుల మధ్య ‘శాంతి’ని కొనసాగించడమే వారి లక్ష్యం” అని బిందు ఆరోపించారు.
కొత్త లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న వారితో సహా కార్మిక నాయకులపై ప్రభుత్వ అణిచివేత, ఎంజిఎంఎస్ సహా కార్మిక సంఘాలపై ఇటీవల చేపట్టిన చర్యలతో ముడిపడి ఉందని సంస్థ విశ్వసిస్తోంది.
అనిరుధ్ మావోయిస్టుల “ఓవర్‌గ్రౌండ్ వర్కర్” అనే ఆరోపణలను అనిరుధ్ పూర్వ యజమాని, పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ అకౌంటబిలిటీ కలెక్టివ్ వ్యవస్థాపక సభ్యుడు, సౌత్ ఏషియన్ సాలిడారిటీ కలెక్టివ్ కన్వీనర్ అయిన విజయన్ ఎంజె తోసిపుచ్చారు.
“ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫీషా ఫాతిమా మొదలైన యువ తిరుగుబాటు మనస్సులను ఇరికించడానికి ఈ రకమైన కథనాలను తయారు చేయాల్సిన అవసరం రాజ్యానికి అవసరం!”
“ఇది ఆ సిరీస్‌లో తాజాది కానీ భిన్నమైన కథనంతో ఉంది! అనిరుద్ధ్ ఒక తెలివైన యువకుడు, అతను ఆర్థిక విశ్లేషణ, ఆర్థిక పరిశోధనలలో రాణిస్తున్నాడు; ప్రజాస్వామిక మార్గాల ద్వారా ఫ్యాక్టరీ కార్మికుల మధ్య బహిరంగంగా పనిచేస్తున్నాడు, ”అని విజయన్ అన్నారు.
అరెస్టు వెనుక పెద్ద కుట్ర ఉంది; దీనిని మధ్య భారతదేశంలోని ట్రేడ్ యూనియన్లపై కొనసాగుతున్న అణిచివేతలో భాగంగా చూస్తున్నారు విజయన్; ఎన్నికలకు ముందు హర్యానాను ‘ఉగ్రవాదానికి’ వ్యతిరేకంగా కొత్త యుద్ధభూమిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.
“రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీకి తెలుసు. అభివృద్ధిపై గంభీరమైన వాగ్దానాలు చేయడం సహాయపడదు; కేవలం ముస్లిం వ్యతిరేక ప్రచారంపై ఆధారపడటం వల్ల బిజెపికి ఓట్లు రావు”అన్నారాయన.
“ముస్లింలకు వ్యతిరేకంగా మతపరమైన ఎజెండాతో పాటు, హర్యానాను మధ్య భారతదేశంలో వామపక్ష తీవ్రవాద కేంద్రంగా చిత్రించడానికి బిజెపి ప్రభుత్వానికి బలిపశువుల అవసరం ఉంది. శత్రువులను కల్పించి, వారిని విలన్‌గా చేయడం ద్వారా భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్న భావనను సృష్టిస్తున్నారు. సురక్షితమైన రాజ్యానికి, ఎన్నికలలో గెలవడానికి ఇదే ఏకైక ఆశ.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హర్యానా రైతులు పాల్గొనడం కూడా రాజ్యానికి అస్థిరపరచింది. ఓట్లను పటిష్టం చేసుకోవడానికి ఈ ఉద్యమాలన్నింటినీ కల్పిత శత్రువులతో అనుసంధానించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.”
బిజెపి ప్రాయోజకులుగా ఉన్న అనేక పెద్ద భూ కబ్జా కార్పొరేట్‌లకు హర్యానాలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో సమరశీల ట్రేడ్ యూనియన్‌లు, రైతాంగ ఉద్యమాలు వేగంగా పెరగడం కార్పొరేట్‌లకు, బిజెపికి ముప్పు కలిగిస్తుందని విజయన్ ఎత్తి చూపారు.
“అనిరుద్ధ్ ఒక సాధారణ ఫ్యాక్టరీ కార్మికుడు అయితే, వారు అతనిని నిశ్శబ్దం చేయడానికి ఇతర మార్గాలను ఉపయోగించేవారు. కానీ అతని యూనియన్ కార్యకలాపాల వల్ల అరెస్టు చేయడం కష్టం. హర్యానాలో జరిగితే కార్మికుల్లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యేవి. హర్యానా వెలుపల అతన్ని అరెస్టు చేయడానికి మావోయిస్టు వ్యతిరేక కథనం మార్గాన్ని సుగమం చేసింది.
“అరెస్ట్ చుట్టూ ఉన్న కథనాలను పోలీసులు తయారు చేశారు. ఆ కథనాల చుట్టూ ఉన్న విపరీతమైన తెలివితక్కువతనం మీడియా విచారణలను రూపొందిస్తాయి; న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తాయి.”
“హర్యానాకు చెందిన ఓ మావోయిస్టు రహస్యంగా తన స్నేహితురాలిని కలవడానికి వచ్చినప్పుడు బెంగుళూరులో పట్టుకోవడం” వంటి కథనాన్ని వారు ఉపయోగించకపోతే ‘ఒక దెయ్యంగా’ చిత్రించడం అసంపూర్ణమవుతుంది. దానిని పూర్తిగా బహిర్గతం చేయాలి. పోలీసు కథనాలను పునరుత్పత్తి చేయడాన్ని మీడియా మానేయాలి, ”అని విజయన్ అన్నారు.
అనిరుధ్ పనిచేస్తున్న న్యూ ట్రేడ్ యూనియన్ ఇనిషియేటివ్ (ఎన్‌టియూఐ) జనరల్ సెక్రటరీ గౌతమ్ మోడీ, ఆయనను నిజాయితీ గల కార్యకర్తగా గుర్తు చేసుకున్నారు.
” ప్రజలను కేవలం జైలులో పెట్టడమే ఈనాడు ఒక శిక్షగా మారింది; వారికి బెయిల్ మంజూరు చేయకుండా జైల్లో ఉంచుతున్నారు; ఇలా జరగడాన్ని అనుమతించకూడదు లేదా సహించకూడదు” అని మోడీ అన్నారు.
“మనం తీవ్ర అణచివేత రాజ్యంలో జీవిస్తున్నాం. చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిన అనిరుధ్‌కు సంబంధించి నేను ఏం చెప్పినా రాజ్యం దుర్వినియోగం చేస్తుందని భయపడుతున్నాను” అన్న మోడీ, తదుపరి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
ద్వేషానికి పేరుగాంచిన కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది గిరీష్ భరద్వాజ్ జాతీయ సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నందున కేసును ఎన్‌ఐఎకి అప్పగించాలని అమిత్ షాను కోరాడు.
అనిరుధ్ 2018 నుండి సిఎఎస్‌ఆర్‌లో ఉన్నారని, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో సహా భీమా కోరెగావ్ కేసులో అరెస్టు అయిన రాజకీయ ఖైదీల విడుదలకు సంబంధించిన ప్రచారాలలో క్రమం తప్పకుండా పాల్గొంటారని క్యాంపెయిన్ ఎగైనెస్ట్ స్టేట్ రెప్రెషన్ (రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం, సిఎఎస్‌ఆర్) సభ్యుడు దీపక్ చెప్పారు.
“మధ్య భారతదేశంలోని ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలపై విచిత్రమైన ఆరోపణలు చేసిన తర్వాత అరెస్టుల సరళి భీమా కోరేగావ్ నమూనా భయాన్ని సజీవం చేస్తోంది… ఇటీవల హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో జరిగిన దాడులు న్యాయవాదులు, విద్యార్థులు, రైతాంగ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉత్తర ప్రాంతీయ బ్యూరో (ఎన్‌ఆర్‌బి)ని పునరుద్ధరిస్తున్నాడని, మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలతో న్యాయవాది, నిర్వాసిత్వ వ్యతిరేక కార్యకర్త అజయ్ కుమార్ అరెస్టుతో ముగిశాయి”అని దీపక్ అన్నారు.
“అదే విధంగా, ఉత్తర భారతదేశంలో మావోయిస్టు నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నాడని ఆరోపిస్తున్న మీడియా నివేదికలతో అనిరుద్ధ్ అరెస్టు కూడా ఇదే కథనాన్ని అనుసరిస్తుంది. ఉత్తర భారతదేశంలోని విద్యార్థులు, కార్మికులు, రైతులు, ప్రజలను ఒకే కథనాన్ని ఉపయోగించి మానవ హక్కుల రక్షకులను నిశ్శబ్దం చేయడానికి రచిస్తున్న విస్తృత వ్యూహాన్ని ఈ నమూనా సూచిస్తుంది.
ఆగస్టు 30న అరెస్టు చేసిన అనిరుద్ధ్, అడ్వకేట్ అజయ్ కుమార్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం సెప్టెంబర్ 12న ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించింది.
మీడియాను ఉద్దేశించి ప్రొఫెసర్ నందితా నారాయణ్, న్యాయవాది సీమా ఆజాద్, ప్రొఫెసర్ సరోజ్ గిరి, ప్రొఫెసర్ సచిన్ ఎన్, అడ్వకేట్ ఆర్తి, న్యాయవాది సర్ధా నంద్ సోలంకి, నవశరణ్ కౌర్ మాట్లాడారు.