దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో వున్నారు. ఈ సంవత్సరం, ఛత్తీస్‌గఢ్ ఈ ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు. ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ.
ఈ సీరీస్‌లో ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను స్క్రోల్ వెబ్ సైట్ అందిస్తోంది.
ఆ ఫోటోలో మహిళ ముక్కు, నోరు రక్తంతో కళ్ళు సగం తెరిచి, తల పక్కకు తిప్పి నేలపై పడుకుని వుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల పత్రికా ప్రకటన ప్రకారం, ఫోటోలో కనిపిస్తున్న మహిళ, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సాయుధ విభాగం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన ఆరో కంపెనీ సభ్యురాలు. వట్టేకల్ గ్రామానికి చెందిన సన్ని అలియాస్ సుందరి.
జూన్ 7న నారాయణపూర్ జిల్లాలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవుల్లో భద్రతా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన ఆరుగురు మావోయిస్టులలో ఆమె కూడా ఉన్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.
పోలీసుల ప్రకారం, ఆమె సాధారణ మావోయిస్టు కాదు. ఆమె తలపై బహుమానం ఉంది. ఆమెను చంపిన భద్రతా సిబ్బంది ఎవరైనా రాజ్యం నుండి రూ. 8 లక్షల రివార్డును స్వీకరించడానికి అర్హులు. అయితే వట్టెకల్ గ్రామంలోని ఆమె ఇంటి వద్ద తండ్రి ఈశ్వర్ కుమేటి తన కుమార్తె మావోయిస్టు అనడాన్ని ఖండిరచారు.
ఆమె ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డును చూపుతూ, తన కుమార్తె పేరు సన్ని కాదని, మన్బటి కుమేతి అని చెప్పాడు. చాలా మందికి ఆమె కారీ అనే ముద్దుపేరుతో తెలుసు. చనిపోయేనాటికి ఆమెకు 23 ఏళ్లు.
జూన్ 7 ఉదయం భద్రతా దళాలు గ్రామానికి చేరుకుంటున్నారనే వార్త భయాందోళనలకు గురిచేసిందని, ఆ సమయంలో కారీ ఇంట్లోనే ఉందని గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటమనిషిగా పనిచేస్తున్న కారి సోదరుడు బాల్కు కుమేటి చెప్పాడు. పాలుతాగే బిడ్డలున్న స్త్రీలు, శిశువులు, వృద్ధులు మినహా అందరూ అడవిలోకి పారిపోయారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంత గ్రామాలలో తిరుగుబాటుదారులకు మద్దత్తునిస్తున్నామనే పేరుతో ప్రభుత్వ బలగాలు తమపై ప్రతీకారం తీర్చుకుంటాయనే భయంతో ఇలా పారిపోవడం అనేది ఒక సాధారణ ప్రతిస్పందన.
సాయంత్రం వరకు కొందరు తమ గ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ, కారి రాలేదు. జూన్ 8న, ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులవిగా పేర్కొన్న ఆరు మృతదేహాల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఐదు మృతదేహాలు యూనిఫాంలో ఉన్నాయి. ఆరవ దేహానికి యూనిఫాం లేదు. గళ్ల చొక్కా ధరించివున్న ఆ మహిళే కారీ. కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
‘‘నేను నా తండ్రితో పాటు ఆమె మృతదేహాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, వారు తప్పు చేశారని అక్కడ ఉన్న సీనియర్ అధికారులకు చెప్పాము’’ అని కారీ రెండవ సోదరుడు బలిరామ్ కుమేటి చెప్పాడు. కానీ అధికారులు ఆమెను మావోయిస్టు అన్నారు. నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ ‘‘ఆ విషయాన్ని పరిశీలిస్తానని’’ అన్నాడు.
ప్రతిస్పందన కోసం స్క్రోల్ సంప్రదించినప్పుడు, పోలీసు సూపరింటెండెంట్ పుష్కర్ శర్మ కుటుంబం చేసిన ఆరోపణను తోసిపుచ్చాడు. లొంగిపోయిన మావోయిస్టులు అన్ని మృతదేహాలను గుర్తించారని, వారికి క్యాడర్‌తో పరిచయం ఉన్నదని, ఖచ్చితంగా గుర్తించగలరని నమ్మవచ్చని అన్నాడు.
పోలీసులు విడుదల చేసిన పేర్లు, ఫోటోల జాబితాలో హత్యకు గురైన ప్రతి ఒక్కరి వెలను, మొత్తాన్ని పేర్కొన్నారు. రూ. ఒక లక్ష నుంచి రూ.8 లక్షల వరకు వ్యక్తిగత బహుమతులతో ఆ మొత్తం రూ.38 లక్షలు.
‘‘పార్టీలో వారి సీనియారిటీ, శ్రేణి ఆధారంగా బహుమానం మొత్తం ఉంటుంది’’ అని శర్మ వివరించారు.
‘‘ఒక మావోయిస్టు పోలీసులకు లొంగిపోయినప్పుడు, అతనికి లేదా ఆమెకు పునరావాస సహాయంగా బహుమాన మొత్తాన్ని ఇస్తాం, కానీ భద్రతా చర్యలో ఒక మావోయిస్టు మరణించినప్పుడు, ఆ చర్యలో పాల్గొన్న బృందానికి బహుమతి పంపిణీ చేస్తాం. మావోయిస్టులను అరెస్టు చేస్తే ఎలాంటి ప్రతిఫలమూ వుండదు. అది మా సాధారణ విధులలో భాగం’’ అన్నాడు.
ఇలా చేయడం వల్ల మావోయిస్ట్‌లను అరెస్టు చేసి న్యాయస్థానానికి తీసుకువెళ్ళడానికి బదులు వారిని నిర్ధాక్షిణ్యంగా హత్య చేసేలా పోలీసులను ప్రోత్సహించడం కాదా? అని అడిగిన ప్రశ్నకు ‘‘బహుమతిగా ప్రకటించిన మొత్తాన్ని పెద్ద సంఖ్యలో వున్న భద్రతా సిబ్బందికి పంపిణీ చేస్తాం కాబట్టి తరచుగా వ్యక్తిగత వాటా చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. కాగితంపై ఇది పెద్ద మొత్తంగా కనిపించవచ్చు, కానీ పెద్ద సంఖ్యలో వున్న బృందం పంచుకున్నప్పుడు అది చాలా తక్కువ మొత్తం. ప్రోత్సాహకం అయ్యే అవకాశం లేదు’’ అని అన్నాడు.
బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పట్టిలింగం సుందర్‌రాజ్ కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచాడు. ‘‘నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి, మావోయిస్టులను మట్టుబెట్టడం ద్వారా ఎవరూ ధనాన్ని ఆర్జించరు. విజయవంతమైన మావోయిస్టువ్యతిరేక కార్యకలాపాలకు బహుమతులు ఇవ్వడం పాత విధానమే. అంతేకాకుండా, ఒక కమిటీ వైద్య నివేదికలు, మెజిస్టీరియల్ విచారణ నివేదికలతో సహా ఒక చర్యలోని ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ చర్యలో పాల్గొన్న కోర్ టీమ్ (మౌలిక బృందం)కి డబ్బు పంపిణీ చేస్తాం’’ అన్నాడు.
జూన్ 7న జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో మొత్తం ఎంత మంది సిబ్బంది పాల్గొన్నారని ప్రశ్నిస్తే, భద్రతా కారణాలను చూపుతూ నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ శర్మ సంఖ్యను వెల్లడిరచడానికి నిరాకరించాడు. ఇన్‌స్పెక్టర్ జనరల్ కూడా, ‘కోర్ టీమ్’లో సాధారణంగా ఎంత మంది సిబ్బంది ఉంటారో చెప్పడానికి నిరాకరించాడు.
ఇలా పారదర్శకత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సంవత్సరం, బస్తర్ ప్రాంతంలో 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్ పోలీసులు చంపేసారు. ఇది గత దశాబ్దాలలో అత్యధిక వార్షిక సంఖ్య. చంపిన వారిలో చాలా మంది తలలపై వెలలు ఉన్నాయి. 28 ఎన్‌కౌంటర్లకు సంబంధించి నేరుగా లేదా మీడియా నివేదికల ద్వారా ‘స్క్రోల్’ పోలీసు ప్రకటనలను సేకరించగలిగింది. వీటిలో బహుమానంగా యిచ్చిన డబ్బు మొత్తం రూ.5.42 కోట్లు. 10 ఎన్‌కౌంటర్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ బహుమానాలు భద్రతా కార్యకలాపాలు నిర్వహించే విధానాన్ని వక్రీకరించి, అనుమానాస్పద హత్యలకు దారితీశాయా?
‘స్క్రోల్’ మూడు జిల్లాల్లో చెదురుమదురుగా ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్లి, ఈ సంవత్సరం బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో మరణించిన 141 మందిలో 37 మంది కుటుంబాలను కలుసుకున్నది. వీరిలో 12 కుటుంబాలు పోలీసుల వాదనలను ఖండిరచి, హత్యకుగురైనవారు మావోయిస్టులు కాదని, పౌరులని చెప్పారు. వీరిలో కనీసం ముగ్గురి తలలపై పోలీసులు వెల ప్రకటించారు.
మిగిలిన 25 మంది కుటుంబాలు వారు మావోయిస్టులని అంగీకరించాయి. 20 మంది తలలపై బహుమానాలు ఉన్నాయి. కానీ బహుమానం ప్రకటించిన చాలా కేసులు మావోయిస్టులు అని చేసిన వర్ణనకు, మరణించినవారికి సరిపోలవు. వారి కుటుంబాలు తమ పిల్లలు చిన్న వయసు వాళ్ళని, కింది స్థాయిలో వున్న, నిరాయుధ కేడర్ అని చెప్పారు. వీరిలో చాలా మంది మావోయిస్టుల్లో చేరి సంవత్సరం కంటే తక్కువ కాలం అయింది.
బహుమాన ప్రకటన మావోయిస్టులకా లేక పౌరులకా?:
రేకవాయ గ్రామ పంచాయతీ నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ ..ఈ మూడు జిల్లాల కూడలిలో ఉంది. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంద్రావతి నది ప్రవహిస్తుంది. బీజాపూర్‌లోని భైరామ్‌గఢ్ బ్లాక్ నుండి చెట్ల బోదెలతో తయారు చేసిన తెప్పలలో ప్రజలు నది దాటుతారుబీ వేసవిలో రాళ్ళు వున్న ప్రాంతంలో, నీళ్లులేని చోట నడిచివెళ్లడం సాధ్యమవుతుంది.
‘‘ఆపరేషన్ జల్ శక్తి’’ అనే భద్రతా చర్యలో భాగంగా మే 23న కొంతమంది భద్రతా సిబ్బంది ఇలా వెళ్ళారు. రేకవాయ నారాయణపూర్‌లోని ఓర్చా బ్లాక్, పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినప్పటికీ, దంతెవాడ జిల్లా పోలీసులే ఈ సైనిక చర్యకు కీర్తిని పొందారు.
మే 24న పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 72 గంటలపాటు సాగిన ఈ సైనిక చర్య ముగిసిన తర్వాత యూనిఫారం ధరించిన ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలను అమర్చినట్లు అనుమానిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రకటన పేర్కొంది.
అదే రోజు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని 40 మంది పేర్లతో చేతిరాతతో వున్న ఒక జాబితాను దంతేవాడలో నివసిస్తున్న ఆదివాసీ నాయకురాలు సోనీ సోరీకి గ్రామస్థులు పంపారు.
ఆ తర్వాత, ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి పేర్లు, ఫోటోల జాబితాను, ఒక్కొక్కరి పైనా ఎంత డబ్బు బహుమానంగా ప్రకటించారు అనే వివరాలను పోలీసులు విడుదల చేసారు. ఆ మొత్తం రూ. 31 లక్షలు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గ్రామస్తుల చేతితో రాసిన నోట్‌లో వున్న 40 మంది పౌరులలో, చనిపోయిన ఎనిమిది మంది మావోయిస్టుల జాబితాలో వున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ వైరుధ్యం వివరిస్తున్నది ఏమిటి?
ఆ ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను కలిసేందుకు జూలై 11న ఆ ప్రాంతానికి వెళ్లాను.
వారిలో ఒకరు బుగూర్ రaురి. అతడిని రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన, స్థానిక మావోయిస్టు గెరిల్లా దళంలో సభ్యుడిగా పోలీసులు గుర్తించారు. అయితే బుగుర్ భార్య ఊర్మిళ రaురి మాత్రం తన భర్త మావోయిస్టులతో కలిసి పని చేసాడనడాన్ని ఖండిరచింది.
ఈ దంపతులు ఇటుల్ గ్రామంలో నివసిస్తున్నారు. వారి పిల్లలలో చిన్నది మూడు నెలల పాప. నేను వెళ్ళినప్పుడు తల్లి దగ్గర పాలు తాగుతోంది.
‘‘నా భర్త బొడ్గా గ్రామంలో మహువా సేకరించడానికి వెళ్ళినప్పుడు, తీసుకెళ్లి చంపేశారు’’ ఊర్మిళ రaురి బలహీనమైన, కానీ స్పష్టమైన స్వరంతో చెప్పింది.
తమ గ్రామం కొండ ప్రాంతంలో వుండడం వల్ల దగ్గర్లో మహూవా చెట్లు లేవవని, గ్రామస్థులు ఆర్థికంగా లాభదాయకమైన మహువా పువ్వుల కోసం లోయలో ఉన్న బోడ్గా వంటి గ్రామాలకు చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వుంటుందని తెలిపింది. మే 23వ తేదీ ఉదయం, కోడి కూయగానే గ్రామ సమీపంలోని అడవికి వెళ్ళాడని, తిరిగి వస్తున్నప్పుడు, అడవుల్లో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు విని, ఇటుల్‌కు కాలినడకన ఒక గంట దూరంలో ఉన్న పోరోపాడ్కోలోని తన మామ ఇంటి వద్ద ఆగిపోవాలని అనుకున్నాడని ఆమె వివరించింది.
అలా ఆగిపోవడం, బుగూర్కు ప్రాణాంతకమైంది.
బుగూర్ మామ మంకు రaుర్రీ మాట్లాడుతూ, భద్రతా బలగాలు గ్రామంలోకి దూసుకెళ్లబోతున్నాయన్న కబురు పోరోపాడ్కోలో గ్రామస్తులందరినీ కూడా అడవికి పారిపోయేలా చేసింది. మంకు కొడుకు సోను రaురీ, మరొక బంధువు గొర్రా రaురీలతో పాటు బుగూర్ కూడా వెళ్ళాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక తూటా సోను వీపులో తగిలి పొట్ట నుంచి బయటకు వచ్చిందని మంకు చేతి సంజ్ఞలతో వివరించాడు. గొర్రా కుడి అరచేతిపైన ఒకటి, వీపుపైన రెండు తూటాలు తగిలాయి.
సోను,గొర్రా ఇద్దరూ గాయపడ్డారు కానీ తప్పించుకోగలిగారు. బుగూర్‌ను భద్రతా బలగాలు పట్టుకోవడాన్ని చూసిన వారు అర్థరాత్రి ఇటుల్ గ్రామానికి వచ్చి తమ బంధువులకు చెప్పారు. మరుసటి రోజు ఉదయం, మంకు కుమారుడు సోను బుల్లెట్ గాయాలతో మరణించాడు. గొర్రా ప్రాణాలతో బయటపడ్డాడు.
భద్రతా దళాల చేతిలో పడిన తర్వాత బుగూర్‌ను ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ నిర్దాక్ష్ణ్యంగా కాల్చి చంపి, బహుమతి ప్రకటించిన మావోయిస్ట్‌గా ప్రకటించారని మంకు, ఇతర కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
పోలీసుల జాబితాలోనూ, గ్రామస్తులు రాసిన జాబితాలోనూ కూడా పేరు ఉన్న మరొక వ్యక్తి పోరోపాడ్కో గ్రామానికి చెందిన మంగ్లు రaురి. సిపిఐ (మావోయిస్ట్) ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన ప్లాటూన్ నంబర్ 16లో సభ్యుడిగా, తలపై రూ. 2 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు పత్రికా ప్రకటన పేర్కొంది. అయితే అతడు మావోయిస్టు అనడాన్ని అతని కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండిరచారు.
ఎన్‌కౌంటర్ తర్వాత ఉదయం పోలీసులు చుట్టుముట్టిన 40 మందిలో తాను, తన మేనమామ ఇద్దరమూ ఉన్నామని, తమని పశువుల్లా అడవిలో తోలుకెళ్ళారని మంగ్లూ మేనకోడలు రాంబతి రaురి చెప్పింది.
ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇంద్రావతి నది గుండా పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు ఉన్న ప్రదేశానికి చేరుకునేవరకు మృతదేహాలను గుంపులోని వ్యక్తులతో మోయించారు. 35 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దంతెవాడ పోలీస్ స్టేషన్ దగ్గర ముగిసింది. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాతనే తన మామ ఆ గుంపులో లేడని రాంబతి గ్రహించింది.
మిగిలిన వారి నుండి వేరు చేసి, మరొక దిశలో తీసుకెళ్లి, భద్రతా దళాలు చంపేసి బహుమానం ప్రకటించిన మావోయిస్ట్‌గా చూపించారని మంగ్లూ కుటుంబం అనుమానిస్తోంది.
పోలీసు పత్రికా ప్రకటనలో అతని మృతదేహం ఫోటో చూసిన తర్వాత, మంగ్లూ భార్య మండి రaుర్రీ దంతెవాడ పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తింది. మంగ్లూ మావోయిస్టులతో ఐదేళ్లుగా ఉన్నాడనే ఓ ప్రకటనపై సంతకం చేయకుంటే భర్త మృతదేహాన్ని ఇవ్వమని పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి బెదిరించారని ఆమె ఆరోపించింది. ఆమెతో పాటు ఉన్న, చదవటం తెలిసిన పొరుగున వుండే యువకుడు వినేష్ పొడియం ఆ ప్రకటనను చదివి వినిపిస్తే, మండి రaురి సంతకం చేయ నిరాకరించింది.
దీంతో కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆదివాసీ నాయకురాలు సోనీ సోరీని సంప్రదించారు. ‘‘చనిపోయిన మిగిలిన ఆరుగురు మావోయిస్టులని గ్రామస్తులు కాదనడం లేదు, అలాంటప్పుడు భార్యపై తప్పుగా సంతకం చేయమని ఎందుకు పట్టుబడుతున్నారు?’’ అని పోలీసు అధికారిని అడిగానని సోరి గుర్తు చేసుకున్నారు. చివరికి మంగ్లూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించారని ఆమె తెలిపారు.
రెకవాయా ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎనిమిది మందిలో ఇద్దరు పౌరులేనన్న ఆరోపణలను దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ ఖండిరచాడు. ‘‘తమ కుటుంబ సభ్యుడు మావోయిస్టు కాదని గ్రామస్థులు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్‌కౌంటర్‌లో అమాయక గ్రామస్తులు చనిపోయారనేది మావోయిస్టుల కథనం’’ అని అన్నాడు.
అయితే, అమాయక ప్రజలను చంపి, వారిని బహుమానం ప్రకటించిన మావోయిస్ట్‌లుగా తరలించినట్లు పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు ఇవి మాత్రమే కాదు. మేలో బీజాపూర్‌లోని పిడియా గ్రామంలో పది మంది గ్రామస్థులను చంపిన ఎన్‌కౌంటర్‌ను పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కార్యకర్తలు పరిశోధించి, ‘‘బూటకం’’ అని, వారి తలలకు వెల ప్రకటించారని చెప్పారు.
రేకవాయలో పోలీసులు అదుపులోకి తీసుకున్న మిగిలిన 38 మంది ఏమయ్యారు? కుటుంబాలు తమ ఆధార్ కార్డులు చూపించడం ద్వారా 11 మందిని పోలీసు కస్టడీ నుండి విడుదల చేయగలిగామని గ్రామస్తులు తెలిపారు. నలుగురు మైనర్‌లతో సహా మరో పది మందిని ‘‘లోన్ వర్రాటు’’ (గోండి భాషలో ‘‘ఇంటికి తిరిగి రండి’’) అనే లొంగుబాటు పథకం లోగోతో తెల్లటి టీ-షర్టులు వేసి, లొంగిపోయిన మావోయిస్టులుగా చూపించిన తర్వాతనే విడుదల చేశారు.
మరో 15 మంది ఉదంతం కుతంత్రం అనిపించేలా వుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ఐదు రోజుల తర్వాత మే 28న, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలను ఉపయోగించినందుకు గుమల్నార్ గ్రామ సమీపంలో ఏడుగురు మహిళలతో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు దంతెవాడ పోలీసులు ప్రకటించారు. రేకవాయ నుండి 40 కి.మీ దూరంలో గుమల్నార్ వుంటుంది. గుమల్నార్‌లో అరెస్టయిన 15 మంది మరెవరో కాదు, మే 24న గ్రామస్థులు వ్రాసిన జాబితాలో పేర్లువున్న రేకవాయ గ్రామ పంచాయతీ నివాసితులు. వారు ప్రస్తుతం జగదల్‌పూర్ జైలులో ఉన్నారు.
గుమల్నార్‌లో రేకవాయ నివాసితులను అరెస్టు చేసిన అసాధారణ పరిస్థితుల గురించి అడిగినప్పుడు, పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్, ఇవి రెండు వేర్వేరు ఘటనలు, వేర్వేరు ప్రథమ సమాచార నివేదికలు అని చెప్పారు.
ఇటీవలే మావోయిస్టుల్లో చేరారు.. వారి వద్ద తుపాకులు లేవు:
తుపాకీ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలు మృతులు మావోయిస్టులని అంగీకరించిన సందర్భాల్లో కూడా, బహుమానం డబ్బు వుండడం వల్ల అరెస్టు చేయకుండా చంపేసారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భద్రతా బలగాలకు బహుమానంగా ఇచ్చిన రూ.5.29 కోట్లలో ఒక్క ఎన్‌కౌంటర్‌కే రూ.1.85 కోట్లు. ఇది ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలోని ఛోటేబెటియా అడవుల్లో జరిగింది. ఇప్పటి వరకు ఒకే దాడిలో అత్యధిక సంఖ్యలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు చంపేశారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో అత్యంత విజయవంతమైన మావోయిస్టు వ్యతిరేక చర్య అని పోలీసులు పేర్కొన్నారు.
ఛోటే బేటియా హత్యలకు సంబంధించి రూ.1.78 కోట్లు రివార్డుగా ప్రకటించగా, ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నందుకు మరో రూ.7.55 లక్షలు ప్రకటించారు.
కానీ, ఆ మావోయిస్టులు ఏడాది కిందటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరిన నిరాయుధ కార్యకర్తలని మృతుల్లో చాలా మంది కుటుంబాల వారు చెబుతున్నారు.
అలాంటి ఒక కేసు 21 ఏళ్ల సునీల మడ్కంది. మే 9న నారాయణపూర్‌లోని ఓర్చా బ్లాక్‌లోని డుంగా గ్రామంలో ఆమె కుటుంబాన్ని కలిసినప్పుడు, ఆమె తల్లి సుక్డి మడ్కం, తండ్రి కోసో మడ్కం, తోబుట్టువులు అడవుల నుండి సేకరించిన తునికాకులను ఒక్కొక్కటి 50 ఆకుల కట్టలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సునీల మరణంతో కుటుంబం ఇంకా దుఃఖంలో ఉంది, కానీ పని చేయకుండా కుదరదు. ముఖ్యంగా టెండు ఆకుల సేకరణ, అమ్మకం వారి ప్రధాన ఆదాయ వనరు.
ఆరుగురు పిల్లలలో సునీల మూడవది. 3వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. కానీ సమీప మిడిల్ స్కూల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్చా బ్లాక్ హెడ్‌క్వార్టర్స్‌కు మారిన తర్వాత చదువు మానేసింది. గత సంవత్సరం, మావోయిస్ట్ క్యాడర్‌తో కొంత సమయం గడిపిన తరువాత, సునీల, ఆమె స్నేహితురాళ్ళు, సీతాల్ మాండవి, షీలా కుంజం, గీతా కుంజం, పింటు ఓయం అధికారికంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విత్తనాలు సీజన్ ముగిసిన వెంటనే, ఆగస్టులో చేరారు అని సుక్డి చెప్పింది.
అమ్మమ్మ చనిపోవడంతో సునీల చివరిసారిగా మార్చి రెండో వారంలో ఇంటికి వచ్చింది. ‘‘నేను ఆమెను ఇంట్లో ఉండమని చెప్పాను, కానీ ఆమె తనకు వీలైనప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయింది’’ అని తల్లి గుర్తుచేసుకుంది.
కేవలం ఒక నెల తర్వాత, ఏప్రిల్ 16 ఎన్‌కౌంటర్‌లో సునీల మరణించింది. మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె నలుగురు స్నేహితులు కూడా మరణించారు. వీరిలో ఒకరిని రూ.2 లక్షల రివార్డు వున్న మావోయిస్టుగా పోలీసులు గుర్తించగా, సునీలతో సహా మిగతా వారికి రూ.8 లక్షల రివార్డులు ఉన్న మావోయిస్టులుగా చూపారు.
మావోయిస్టు సాయుధ విభాగంలో ఆమె గడిపిన ఎనిమిది నెలల కాలంలో సునీల ‘‘అంత బహుమతి ప్రకటించేంతలా పని చేసి వుండకపోవచ్చు’’ అని ఆమె సోదరుడి అభిప్రాయం.
భైరమ్‌గఢ్‌లోని ఉట్ల గ్రామంలోని షీలా కుంజం ఇంటి వద్ద, ఆమె తండ్రి జోగు కుంజం కూడా పోలీసుల వాదనలపై అవిశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ యువత అంతా ఇటీవల చేరారని చెప్పాడు. పోలీసులు ప్రతిఫలం ప్రకటించేంతగా ఏమీ చేసి వుండరని అన్నాడు.
మావోయిస్టులు వారికి ఇంకా ఆయుధాలు కూడా ఇవ్వలేదని, నాతో మాట్లాడేందుకు గుంపుగా గుమిగూడిన ఇతర గ్రామస్తులు పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారికి పంచేందుకు ఆయుధాలు, తూటాల కొరత పార్టీకి ఉందని వారు తెలిపారు. అదీ కాకుండా, పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్న కొత్తవాళ్లకు పార్టీ తన ఆయుధాలు కోల్పోయే ప్రమాదం ఎందుకు తీసుకుంటుందని ఒక పెద్దాయన నవ్వుతూ అడిగాడు.
ఆ యువ కేడర్లు నిరాయుధులుగా ఉన్నప్పుడు, వారిని ఎందుకు అరెస్టు చేసి జైలుకు పంపలేదని గ్రామస్తులు ప్రశ్నించారు.
ఆశ్చర్యకరంగా, పోలీసుల ప్రకటనలో కూడా సునీల, ఆమె నలుగురు స్నేహితుల పేర్లపై ఎటువంటి ఆయుధాలు లేవు. 29 మంది మావోయిస్టులలో ఏడుగురి వద్ద మాత్రమే రైఫిళ్లు, ఆటోమేటిక్ తుపాకులు ఉన్నట్లు చూపించారు. ఈ ప్రకటన ‘‘రికార్డ్ ప్రకారం వారు దగ్గర ఉన్న ఆయుధం ఆధారంగా’’నే తప్ప ‘‘నేర సన్నివేశానికి సంబంధించినది కాదు’’ అని కాంకేర్ పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా అన్నాడు.
బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ యువ మావోయిస్టులు నిరాయుధులైన ఇటీవలి రిక్రూట్‌మెంట్ల గురించి కుటుంబాల వాదనలను వ్యతిరేకించాడు. యువకులు అధికారికంగా పార్టీలో చేరడానికి ముందు బాల సంఘం, చేతనా నాట్య మంచ్ వంటి మావోయిస్టు సంస్థలతో తరచుగా అనధికారికంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు.
అయితే, చనిపోయిన వారిలో చాలా మంది సాపేక్షంగా జూనియర్ కేడర్లేనని ఆయన అంగీకరించారు. సీనియర్ మావోయిస్టులు ‘‘నిస్సిగ్గుగా కిందిస్థాయి కార్యకర్తలను తమ మానవ కవచంగా ఉపయోగించుకుని’’ తప్పించుకుని పారిపోతారని అన్నాడు.
తమ ప్రధాన లక్ష్యం సీనియర్ మావోయిస్టు నాయకులు అనీ, జూనియర్ క్యాడర్‌లు కాదని, వారు ఒత్తిడితో పనిచేస్తున్నారని, లొంగిపోవడానికి ఆసక్తిని కలిగి ఉన్నారని పోలీసు అధికారులు తరచుగా అంటూ వుంటారు. అదే నిజమైతే, వారిని చంపే బదులు, జూనియర్ క్యాడర్‌లను ఎందుకు అరెస్టు చేయకూడదు? ‘‘యువ తిరుగుబాటుదారులను హతమార్చడం అంత సులభం కాదని, జవాన్లు తక్షణ ప్రమాదం, అపాయాలను బట్టి ప్రతిస్పందించాల్సి వుంటుంది’’ అని సుందర్‌రాజ్ అన్నాడు.
నిర్దాక్షిణ్య హత్యలా?:
కానీ సునీల, ఇతర యువ మావోయిస్టు కార్యకర్తల కుటుంబాలు ఈ హత్యలు క్షణికావేశంలో జరగలేదని నమ్మడానికి కారణం ఉందని చెప్పారు – యువ కార్యకర్తలను కాల్చి చంపడానికి ముందు హింసించారని వారు అనుమానిస్తున్నారు.
మృతదేహాలను సేకరించేందుకు కాంకేర్‌కు వెళ్ళినప్పుడు గాయాల తీరును చూసి చలించిపోయామని సునీల సోదరుడు తెలిపారు. నుదుటిపై తుపాకీ గాయంతో ఉన్న పింటూ ఓయామ్‌ను మినహాయించి, మిగిలిన వారి తలలు, చేతులు, తొడలపై రాళ్లు వంటి బరువైన వస్తువులతో కొట్టడం వల్ల అయిన గాయాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
సుందర్‌రాజ్ ఈ ఆరోపణలను ఖండిరచాడు: ‘‘మా జవాన్లు అలా చేయరు. అలా చేసే శిక్షణ పొందలేదు. చనిపోయిన వారు మావోయిస్టులే అయినా గౌరవిస్తాం. మావోయిస్టులే పలు సందర్భాల్లో భద్రతా సిబ్బంది మృతదేహాలను ధ్వంసం చేశారు, ఛిద్రం చేశారు’’ అన్నాడు.
ఛోటే బెటియా ఎన్‌కౌంటర్ జరిగిన రెండు రోజుల తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో, మరణించిన 29 మంది మావోయిస్టు కార్యకర్తలేనని సీపీఐ (మావోయిస్ట్)అంగీకరించింది. కానీ కాల్పుల్లో 12 మందిని మాత్రమే కాల్చి చంపారని ఎన్‌కౌంటర్ నుండి తప్పించుకోగలిగిన ఇతర కార్యకర్తలు చెప్పారని ప్రకటన పేర్కొంది. మిగిలిన వారిని చుట్టుముట్టి, మావోయిస్టులు నిర్మించిన స్మారకం వద్దకు రెండు కిలోమీటర్లు నడిపించుకు వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మావోయిస్టు ప్రకటనలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 23న, తుపాకీ కాల్పులు జరిగిన ఒక వారం తర్వాత, నేను అడవిలో లోతట్టు ప్రాంతంలో వున్న ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి, స్మారక చిహ్నం దగ్గరకు వెళ్ళాను. ఎన్‌కౌంటర్ స్థలంలో, తుపాకీ కాల్పులకు సంబంధించిన చిహ్నాలు కనబడ్డాయి- చెట్లపై తుపాకీ కాల్పుల గుర్తులు, రాళ్లపై ఎండిన రక్తపు మరకలు, మావోయిస్టులు ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రాల్ సాచెట్‌లు, బహుశా భద్రతా సిబ్బంది ఉపయోగించిన పొడి చిరుతిళ్లు, అమూల్ లస్సీ, టెట్రా ప్యాక్‌ల ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి.
స్మారక చిహ్నం సమీపంలోని ఇళ్లలో, గ్రామస్తులు ఏమి జరిగిందో చెప్పడానికి ఇష్టపడలేదు. పెద్ద సంఖ్యలో ఉన్న భద్రతా బలగాలు గ్రామస్తులను తమ ఇళ్లలో నుంచి బయటకు రానీయకుండా బెదిరించినట్లు వారు అంగీకరించినప్పటికీ, కాల్పుల శబ్దం వినిపించలేదన్నారు.
భద్రతా బలగాలు చుట్టుముట్టి చంపేశాయనే మావోయిస్టుల వాదనను సమర్థించే హామీ ఇవ్వగల ప్రత్యక్ష సాక్షులు ఎవరూ కనబడలేదు.
అయితే, బీజాపూర్‌లోని కోర్చోలి-నేంద్ర ఎన్‌కౌంటర్ విషయంలో, ఈ సిరీస్‌లో గతంలో నివేదించినట్లుగా, తుపాకీ కాల్పులు, కాల్పుల తర్వాత భద్రతా సిబ్బంది ఒక మహిళను అదుపులోకి తీసుకుని ఆ తరువాత ఆమెను నిర్ద్యాక్షిణ్యంగా చంపేశారనే ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు వివరంగా చెప్పారు.
బీజాపూర్‌లోని చీపుర్‌భట్టి గ్రామంలో మార్చి 27 న జరిగిన మరో ఎన్‌కౌంటర్ గురించి కూడా ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పులు ముగిసిన వెంటనే, మొత్తం రూ. 14 లక్షల రివార్డ్‌ను ప్రకటించిన ఆరుగురు మావోయిస్టులను చంపినట్లు పోలీసులు ప్రకటించారు. వారిలో ఒకరిని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన ప్లటూన్ డిప్యూటీ కమాండర్ పూనెం నగేష్‌గా గుర్తించారు. అతని పైన 5 లక్షల రివార్డు వున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే, అదే రోజు, ఒక వ్యక్తి నేలపై కూర్చొని, చేతులు వెనక్కు కట్టివేసి, పోలీసు సిబ్బంది చుట్టుముట్టినట్లు చూపించే ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అతడు మరెవరో కాదు నగేష్ అని స్థానికులు గుర్తించారు.
నగేష్‌ను అరెస్టు చేసిన తర్వాత హత్య చేశారనే ఆరోపణ గురించి అడిగినప్పుడు, సుందర్‌రాజ్ ‘‘మేము పరిశీలిస్తున్నాము’’ అన్నాడు.
12 ఆగస్టు 2024