ఎంత సరిపోయింది
పార్లమెంటు ఉన్న రాజధాని ఢిల్లీలోనే
భూమి చలన సూత్రాన్ని కనుగొన్న
కోపర్నికస్ మార్గం ఉంది
జగన్నాటకమో, గ్రీక్ ట్రాజెడీ యో
షేక్స్పియర్ చెప్పినట్లు
శబ్దము, ఆగ్రహం తప్ప ఏమీలేని
ప్రపంచ నాటక రంగమో
ఆధునిక అబ్సర్డ్ డ్రామాయో
అన్నీ కలిసిన రాజకీయ నాటక రంగమో
ఉన్న ఆ వీధిలోనే
ఒక లిటిల్ థియేటర్ ఆడిటోరియం ఉన్నది

ఆ రోజక్కడ
‘ఆజాదీ ఓన్లీ వే’ బ్యానర్ వెలిసింది
దేశంలోనే కాదు
దేశం నుంచీ ఆజాదీ కోరే
ఆ హక్కు ప్రజలకే ఉంటుంది
ఆరోజు, ఏ రోజైనా
ఆజాదీ ప్రకటనలో నేనున్నాను
దండకారణ్యంలో ఆమె కామ్రేడ్స్ తో నడచిన రోజు
గ్రీన్ హంట్ కమిటీ అగెయినిస్టు వార్ ఆన్ పీపుల్ తో
యాన్మిర్డాల్ సాయిబాబాతో పాటు
ప్రతిఘటించిన రోజు
మనసారా నేనక్కడున్నాను

ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
చదివినన్ని రోజులూ నేనామె నవలలో
నాకు నచ్చిన పాత్రనయ్యాను
ఇండియాలో యువ కశ్మీర్ స్వరం
మా సిఆర్పిపి అధ్యక్షుడు అమరుడు
ఎస్ఆర్ గిలానీ నిర్వహించిన సభలో
కశ్మీర్లో హురియత్ వృద్ధ స్వరం సయ్యదలీ గిలానీ
కశ్మీర్ నిబద్ధ మేధావుల గొంతు షౌకత్
హుస్సేన్ భాయ్
హిందుత్వ భారత్లో ఆజాదీ స్వరం అరుంధతీరాయ్ ల
తో పాటు నేనున్నాను

సమస్యలో ఉండడమంటే
ప్రత్యామ్నాయ పరిష్కారంలో ఉండడమే
బుద్ధిజీవి కర్తవ్యం

నక్సల్బరీ ఏక్ హీ రాస్తా ఎజెండాతో
స్వాతంత్య్రాలు కోరే దేశాలతో విముక్తి కోరే జాతులతో
విప్లవం కోరే ప్రజలలో నేనున్నాను

అడుగడుగున భారత్ సైనిక పదఘట్టనల కింద
వినిపించే ప్రజల ఆజాద్ స్వరంలో నేనున్నాను
మక్బూల్భట్, అఫ్జల్గురు
ఉరికంఠాలలో నేనున్నాను
ఎన్కౌంటర్ అమరుల ముక్తకంఠమనదగిన
బుర్హాన్ వనీ నెత్తుటి సంతకంలో నేనున్నాను
అదృశ్య కశ్మీరీ యువకుల అమ్మల
అవిశ్రాంత న్యాయపోరాటంతో నేనున్నాను
అత్యాచారాలను, హత్యాచారాలను
ఆధిపత్య దేశాలు దేహాలపై చేసే
ఆక్రమణ దాడులని ప్రతిఘటిస్తున్న
కశ్మీరీ మహిళల అసాధారణ
సాహసాలతో నేనున్నాను

మోషాలు 2019 ఆగస్టు 5న రద్దుచేసిన
ఆర్టికల్ శబ్దంలోని నిశ్శబ్దమైన
ప్రజల ఆకాంక్షలో నేనున్నాను
ప్రజలు పంటి బిగువుతో భరించిన
అవమానాల్లో నేనున్నాను
అత్యధిక సంఖ్యలో ఓట్లు పోలయిన ఎన్నికల్లో
కుహనా రాజకీయ నాయకుల నందరిని ఓడిరచిన
నిరసనలో
ఐదేళ్లుగా జైల్లో ఉన్న రషీద్ తో పాటు నేనున్నాను

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి
అరుంధతీరాయ్ షౌకత్భాయీలను
ప్రాసిక్యూట్ చేయడానికి మాత్రమే కాదు
మళ్లీ విస్పోటనంచెందుతున్న కశ్మీరియత్ను
చూసిన ఫాసిజం కళ్లలోని భయం సంతకమది
పిరికితనాన్ని దాచుకుంటున్న ‘జీరో టాలరెన్స్’
బ్రాహ్మణీయ హిందుత్వ ద్వేష చర్య అది

మోషాలకు చరిత్ర
కశ్మీర్లో 2019 ఆగస్టు 5న ప్రారంభమైంది
పాలస్తీనా చరిత్ర 2023 అక్టోబర్ 7న ప్రారంభమైంది
తెలంగాణ చరిత్ర 2014 జూన్ 2న ప్రారంభమైంది
మాకు ఈ మూడిరటి చరిత్ర 1948 లోనే ప్రారంభమైంది
చలనంలో ఉన్న భూగోళం
సంకెళ్లు తెగిపడే సమూల మార్పు మా స్వప్నం.

Leave a Reply