నరేంద్ర భూపతికి చాలా అసహనంగా వుంది.
అడవిని ఆక్రమించుకోడానికి గొడ్డళ్ళు పట్టుకొని వెళ్ళిన మంత్రివర్గ సహచరులు తిరిగి రాకుండా మాయమైపోతున్నారు. ఏం జరుగుతోందో ఆయనకి యెంత తల బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదు. తన సహోదర తుల్యులు అత్యంత ఆప్తులు అంతరంగ మిత్రులు కిచెన్ క్యాబినెట్ సభ్యులు రాత్రికి రాత్రి అదృశ్యమవడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నాడు. విదేశీ కుట్రలన్నీ తన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి కాబట్టి విదేశీ కుట్రకి ఆస్కారం లేదు.
ఆంతరంగిక సమావేశ మందిరానికి రమ్మని రక్షణ సలహాదారుకి కబురంపాడు. విషయం అప్పటికే తెలుసుకున్న అతను తక్షణం ఆయన ముందు చేతులు కట్టుకొని వాలాడు. మిత్రదేశం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సాంకేతిక పరికరాల సాయంతో అడవిని జల్లెడపట్టమని పురమాయించాడు. ఆయన ఆదివాసీల వేషంలో అడవిలోకి వేగుల్ని పంపాడు. కోవర్ట్ యాక్టీవిటీ అన్నిటికన్నా బెస్ట్ సాంకేతిక ఆయుధం అని ఆయన అనుభవం.
అడవిలో వొక యక్షిణి వుందనీ ఆమె యేవో ప్రశ్నలు అడుగుతోందనీ సరైన సమాధానం చెప్పని వాళ్ళని యెక్కడో అజ్ఞాత ప్రదేశంలో దాచిపెడుతోందనీ ఆ రహస్య ప్రాంతం తమ దుర్భిణులకు గానీ రాడార్ వ్యవస్థకి గానీ డ్రోన్ లకి గానీ దొరకడం లేదనీ నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న భూపతి యక్షిణితో అమీ తుమీ తేల్చుకోడానికి స్వయంగా బయలుదేరాడు.
రక్షణ సలహాదారు అజిత్తు యెంత వారించినా వొప్పుకోలేదు. తన తెలివితేటల మీద ఆయనకి అపారమైన నమ్మకం. అలా అని యక్షిణి అడిగేది ప్రశ్నలే కదా అని తేలిగ్గా తీసుకోదల్చుకోలేదు. హోంవర్క్ చేశాడు. భారతం తెప్పించుకొని ధర్మరాజు యక్షప్రశ్నలకు చెప్పిన సమాధానాలన్నీ క్షుణ్ణంగా బట్టీ కొట్టాడు. అలవాటులేని విద్య కావడంచేత కొంచెం కష్టమనిపించి యక్షిణిని వాళ్ళ వంశానికి చెందిన స్త్రీలందర్నీ బండబూతులు తిట్టుకున్నాడు. ముఖంమీద నిలువుగా యింత సింధూర్ బొట్టు పెట్టుకొని కాషాయం రుమాలు తలకు చుట్టి యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరాడు. ఆఫ్టరాల్ ఆడదానితో తలపడాల్సి వచ్చినందుకు ఆయనికి చిన్నతనమనిపించింది గానీ సహచరుల్ని కాపాడి తెచ్చుకోడానికి మరో మార్గం కనిపించలేడు. పైపెచ్చు అది ఇజ్జత్ కా సవాల్ అని కూడా భావించాడు. తన పూర్వావతారంలో చేసిన తాటకి సంహారాన్ని గుర్తుచేసుకున్నాడు.
***
ఆపరేషన్ పోస్ట్ కగార్ పేరు మనస్సులో అనుకొని నరేంద్ర భూపతి అడవి బాట పట్టాడు.
దారి పొడుగూతా అడివి దెయ్యాన్ని తిట్టని తిట్టు లేదు. రాత్రంతా ప్రయాణం చేసి అడివి అంచుకి చేరుకున్నాకా యిద్దరు యువతులు యెదురయ్యారు. కళ్ళకి గంతలు కట్టి చెరొక రెక్కా పట్టుకొని అడవిలోకి నడిపించుకుపోయారు. గంతలు విప్పేసరికి యెదురుగా యెత్తైన బండపైన వుదయిస్తోన్న సూర్యుడి యెర్రటి వెలుగులో మెరిసిపోతూ వొక వృద్ధురాలు నిలబడి వుంది.
సన్నగా రివటలా పీక్కు పోయిన దవడలతో యినప కడ్డీలా వున్న ఆమెను యెక్కడో చూసినట్టనిపించింది.
“ఎవర్నువ్వు” బక్కపల్చటి మనిషిని దబాయించి అడిగాడు.
“అమ్మను” అని ఆమె క్లుప్తంగా బదులిచ్చింది.
“అడివి తల్లివా?” కావాల్సినంత వెటకారం జోడించి అడిగాడు.
“అలాగే అనుకో.”
ఆమె మాటలకి వొక చెవులపిల్లి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళ వద్దకు చేరింది.
ఆమె దాన్ని వొడిలోకి తీసుకుంటూ బండమీద కూర్చుంది. భూపతిని దగ్గరే వున్న మరో రాతిపైన కూర్చోమని సైగ చేసింది.
“ఏవో ప్రశ్నలడుగుతున్నావట! ప్రశ్నించడం మా రాజ్యంలో నేరం. తెలీదా?” ఆమె ముందు కూర్చోడం అవమానంగా భావించి నిలబడే అడిగాడు.
ఆమె సమాధానమివ్వలేదు. పక్కనే చెట్టు కొమ్మకి తగిలించి వున్న బుర్ర నుంచి అడవి తేనె వొక చిప్పలోకి వొంచి అతని చేతికిచ్చింది. భూపతికి కూర్చోక తప్పలేదు.
శరీరాన్ని ముందుకు వంచి చెట్టు దగ్గరకు వెళ్లి వచ్చిన ఆమె నడకలోని వేగం చూసి అతని కళ్ళ ముందు వొక దృశ్యం మెరుపు మెరిసినట్టైంది.
“హిడ్మా.. హిడ్మా తల్లివి కదా నువ్వు” వెన్నులో జలదరింపు పుట్టి అప్రయత్నంగా అడిగాడు. పొడారిన తన గొంతులో వొణుకు తనకే స్పష్టంగా తెలుస్తోంది.
“అడవిని కాపాడటానికి ప్రాణాలిచ్చిన బిడ్డలందరూ నా బిడ్డలే” అంది ఆమె దూరంగా చూస్తూ. ఆ మాట అంటున్నప్పుడు ఆమె శరీరం వుద్వేగంతో కంపించింది. కానీ మాట కరకుదీరింది, చూపు నిశితమైంది.
ఒంటరిగా వొచ్చినందుకు నరేంద్ర భూపతి వొక్క క్షణం భయపడ్డాడు. వెనక్కి పోతే పోలా అనుకున్నాడు. రోషం పొడుచుకొచ్చింది. నిరాయుధుణ్ణి చంపదులే అని ధైర్యం తెచ్చుకున్నాడు. అడ్డగోలుగా ప్రవర్తించకుండా తెలివిగా అడిగిన ప్రశ్నలకి సమాధానాలిచ్చి ప్రాణాలు కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు.
“సరే ముందు నా ప్రాండ్స్ ని యే ప్రశ్నలు అడిగావో చెప్పు” అని లేని గాంభీర్యం తెచ్చుకొని అడిగాడు.
“అందరికీ వొకే ప్రశ్న;
లోకంలో అందరికన్నా బలవంతుడెవడు?”
“వాళ్ళేం జవాబిచ్చారు?” వుత్సుకత చంపుకోలేక ప్రశ్నించాడు.
“అలా చెప్పడం తొండి. నోరు తెరిచి పరువు విడిచి అడిగావు కదా! నా నోటితో చెప్పను. చూడు”
అని అమ్మ అరచేతిలో అంజనం వేసి చూపించింది. వరసగా వొకరి తర్వాత మరొకరి సమాధానాలు ఆమె అరచేతిలో డిస్ ప్లే అయ్యాయి.
రక్షణ మంత్రి: సైన్యం
మాయమైపోయాడు.
హోమ్ మినిష్టర్: ఎన్నైఏ
అదృశ్యం.
ఫైనాన్స్: ఈడీ అండ్ ఐటీ
ఇన్ఫ్లేటైన బుడగలా పేలిపోయింది.
విద్యా శాఖ మంత్రి: ఆరెస్సెస్ సిలబస్
గాయబ్.
న్యాయ శాఖ: మనుధర్మం అహాఁ కాదు; బుల్డోజర్
ఆవిరైపోయాడు.
వాళ్ళ సమాధానాలు విన్న దేశ్ కా నేతా కి చిర్రెత్తుకొచ్చింది. చెత్త మంద అని తిట్టుకున్నాడు.
నా జాతకం కూడా దీని అరచేతిలో లేదుగదా కొంపదీసి అనుకున్నాడు. ముందు యీ వ్యవహారం తేలితే తర్వాత దీని పని యెలా పట్టాలా అని ఆలోచిస్తున్నాడు.
“నీ వాళ్ళని అడిగిన ప్రశ్న కాకుండా మొత్తం పది ప్రశ్నలు అడుగుతాను, నీకు పది తప్పులకు అవకాశం వుంది” అతని ఆలోచనలు భగ్నం చేస్తూ యక్షిణి స్వరం తీక్షణంగా పలికింది.
“రెడీ. పది కాదు మొత్తం డెబ్భై రెండూ వదులు. నేను రెడీ” అన్నాడు.
“భూమికంటే బరువైనది ఏది?”
“కడుపులో బిడ్డను మోసే తల్లి”
ప్రశ్నలు వీడికి ముందే తెలిసిపోయాయా అని ఆమెకు అనుమానం కలిగింది.
“ఆకాశం కంటే యెత్తయినది ఏది?”
‘తండ్రి’ అని నేర్చుకొని వచ్చిన సమాధానం చెప్పబోయి యక్షిణి ముఖంలోకి చూసి భూపతి జవాబు అప్పటికప్పుడు మార్చేశాడు.
“నా కీర్తి. అదే అన్నిటికన్నా.. హిమాయలయాల కన్నా.. యెత్తుగా శిఖరాయమానంగా వుంది” అని గర్వంగా చెప్పాడు.
“గాలి కంటే వేగమైనది ఏది?”
“గాలికన్నా వేగమైనది మనస్సు. కానీ అది చొరరాని చోటుకు కూడా చొచ్చుకుపోయేది పెగాసస్. అదే సరైన జవాబు” అన్నాడు గెడ్డాన్ని చూపుడు వేలితో గోక్కుంటూ.
“రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?”
“పొందడు. నావిష్ణుః పృథివీ పతిః అని తెలుసుకొని స్వయంగా ప్రకటించుకోవాలి”
“అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏంటి?”
“ప్రజాస్వామ్యం. దాన్ని యెన్ని విధాలుగా ఖూనీ చేసినా మనం తయారుచేసిన వోటర్లు ప్రతి యెన్నికల్లోనూ ప్రజాస్వామ్య బద్ధంగా మళ్ళీ మనకే అధికారం కట్టబెడతారు”
ఈ సమాధానం ఆమెకి జవాబులా తోచలేదు. అదేదో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాగ్నాకార్టాలా వినిపించింది. సహచరులకన్నా వీడు బాగా ముదిరిపోయాడు అనుకుంది.
“సరే యిప్పుడు ర్యాపిడ్ ఫైర్..”
“దయకు నిర్వచనం యేంటి?”
“చేతకాని తనం; అది మా నిఘంటువులో లేదు”
“మూర్ఖులెవరు?”
“ఆ పదం తప్పు; వాళ్లంతా నా భక్తులు”
“సిగ్గు అంటే..”
“తెలీదు”
“మనిషి మనిషిగా యెప్పుడు మారవచ్చు”
“స్వధర్మం పాటించినప్పుడు”
“ఏది ధర్మం”
“నేను చెప్పిందే ధర్మం”
“ఆఖరి ప్రశ్న. మీ వాళ్ళని అడిగిందే..
లోకంలో అందరికన్నా బలవంతుడు ఎవడు?”
దేశాధినేత కాసేపు ఆలోచించాడు చీఫ్ ఎలెక్షన్ కమీషనర్ అందామనుకున్నాడు. ఛా.. వాడు కూడా మన కనుసన్నల్లో పని చేసిపెట్టేవాడే కదా అని యెలిమినేట్ చేసేశాడు. చీఫ్ జస్టిస్ కూడా మనం అప్పాయింట్ చేసేవాడే కదా, పైగా రిటైర్ అయ్యాకా మనం పడేసే బొక్క కోసం అడక్కుండానే మన మను తీర్పులు యిచ్చేవాడేగా అని తీసి పక్కన పడేశాడు. తన మంత్రులు చేసిన తెలివి తక్కువ పని తాను చేయకూడదనుకున్నాడు.
“నేనేనేనేనేనే”
విశ్వగురువూ దైవంశ సంభూతుడైన తన కంటే అధికులెవరూ లేరు అన్న ధీమాతో నరేంద్రుడు చెప్పిన సమాధానానికి అడవి తల్లికి ఆగ్రహం కలిగింది. ఈ జన్మకి వీడు మారడని తెలుసుకుంది. ఈ అడవిలో వీడిని శిక్షించి లాభం లేదు అనుకుంది. ప్రజాకోర్టులో పరిష్కారం చేయడానికి నిశ్చయించుకుంది.
“నీకు నీ సహచరులకీ శిక్ష జనారణ్యంలోనే” అని చేతిలోకి కర్ర తీసుకొని నెత్తి మీద వొకటిచ్చింది.
నరేంద్ర భూపతికి దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మాయి.
కళ్ళు తెరచి చూసేసరికి సహచరులతో సహా పార్లమెంట్ ముట్టడికి ర్యాలీ తీస్తున్న జెన్ జి విద్యార్థుల మధ్యలో పడ్డాడు.
అడవిలో వున్నా బలుసాకు తింటూ బతికేవాళ్ళం కదా అని మంత్రివర్గ సహచరులందరూ అతని వంక గుర్రుగా చూశారు.




