అనగనగా ఒక రాజు. పేరు రామప్ప రావు బహదూర్. రాజు నివసించే ఒక పెద్ద రాజభవనం. భారీ పాత రాజభవనం/ఎస్టేట్ పేరు “భువనాలయం”. గోడల నిండా పూర్వీకుల చిత్రాలు. ప్రతి చిత్రంలోనూ ఒకే గర్వం.
ఒకే చూపు. ఒకే వంశం. ఆ చిత్రాల మధ్యలో ఒక మనిషి- ఒక పిల్లవాడు మాత్రం అతకనట్టు ఏడుపు మొహం వేసుకుని ఉంటాడు. అక్కడ ఇమడలేనట్టు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినా అతడిని రాజప్రాసాదం వేర్లు లాగి పట్టి తిరిగి గోడలలోని ఫోటో ఫ్రేమ్ లో బిగించేస్తాయి.
రామప్ప నివాసం ఉండేది ఒక విశాలమైన పూర్వీకుల భవనం. (sprawling ancestral mansion/estate). భువనాలయంలో ఒక చెరువు/నీటి ప్రదేశం కూడా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి రామప్పకి భయం. ఈ విషయం రామప్ప రాజరికానికి అలవాటు పడుతున్నప్పుడొ లేక అంతకు ముందో ఇతర భయాలు అనుమానాలు మొదలయ్యే క్రమంలోనే తెలుసుకుంటాడు. కానీ ఇది కేవలం రామప్ప నివసించే ఇల్లు కాదు; కథలో దాదాపు ఒక ముఖ్యమైన పాత్ర. రామప్ప వార్ధక్యంలో ఉంటాడు. బుర్రలోకి ఒక పురుగు పోగా తల తిరిగినట్టు, కాదు తన లోపల తాను, కాదు భవనపు గోడలు తిరుగుతున్నట్టు, తాను మాత్రం ఆసరా దొరకక, అనుమానపు గోడలతో పాటు గిరగిరా తిరుగుతుంటాడు.
రామప్ప అసలు శరీరాన్ని క్యాన్సర్ తినేస్తోంది. కానీ వైద్యులు ఆశ్చర్యపోయేలా అతను ఇంకా బతికే ఉంటాడు. అతనికి మిగిలింది కొద్దికాలమే అని వైద్యులు చెబుతున్నా, రామప్ప మరణాన్ని కూడా మొండిగా తిరస్కరిస్తున్నట్టే జీవిస్తుంటాడు. అతని శరీరానికంటే అతని మనసును తినేస్తున్నది ఒకటే, ఒక అనుమానం. రామప్ప ఇంట్లో ఒక పనిమనిషి. రామప్పని అప్ప అని భక్తితో పిలుచుకుంటూ రామప్ప పట్ల కరుణతో అతని బాగోగులు చూసుకుంటుంది, అతని తండ్రిని చూసినట్టుగానే. రామప్ప బాధనీ, దుఃఖాన్ని నిజమని నమ్మి జాలి పడుతుంటుంది. అవకాశం రాలేదు కానీ కట్టప్పకి తక్కువెం కాదు. రామప్ప పెద్ద కొడుకు లవణప్ప. తండ్రి పిచ్చి చేష్టల్ని చూస్తో వారసత్వం కోసం నిజాయితీగా ఎదురుచూస్తుంటాడు. చివరికి అది దొరుకుతుంది. అంతకంటే అతను చేయగలిగేందేమి ఉండదు.
రామప్ప భార్య రేణుక. ఆమె ఈ ఇంట్లోనే ఉంది. కానీ ఎనిమిదేళ్లుగా ఒక గది నుంచి బయటకు రాలేదు. ఎందుకు? ఆ ప్రశ్నకు ఇంట్లో ఎవ్వరూ సమాధానం చెప్పరు. రామప్పకు మాత్రం ఆ గది ఒక తలుపు కాదు. ఒక నేరానికి గుర్తు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక విషాదం వారి కుటుంబాన్ని రెండుగా చీల్చింది. వారి కుమారుడు కుసుమప్ప చనిపోయాడు. ఆ రోజు నుంచి రేణుక తనను తాను ఒక గదిలో బంధించుకుంది.
రామప్ప మాత్రం తనను తాను మరో గదిలో బంధించుకున్నాడు. ఆ గది అతని మనసు. కుసుమప్ప ఎవరి కుమారుడు? ఇదే అసలు కథకు నిప్పు పెట్టే ప్రశ్న. రామప్పకు ఒక అనుమానం. కుసుమప్ప నిజంగా తన కుమారుడేనా? రేణుక తనను మోసం చేసిందా? తన వంశానికి చెందిన రక్తం కాని ఒక మనిషిని తాను తన వారసుడిగా పెంచుకున్నాడా? ఈ ఆలోచన మొదట ఒక చిన్న పురుగులా అతని మనసులోకి వస్తుంది. కానీ ఆ పురుగు క్రమంగా పెరుగుతుంది. అతని ఆలోచనలను తింటుంది.
రామప్పకు ఒక అద్దం లాంటి స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు నారాయణాచారి. అతను కుటుంబ వైద్యుడు కూడా. అతని మాట వినగలిగే ఏకైక మనిషి. రామప్ప ఇతరులకు కనిపించని పాత్రధారులతో (కుంతీ దేవి సహా మహాభారతంలోని కీలకమైన పాత్రలతో) సంభాషణ చేస్తాడు. ధర్మ సందేహాల్ని, అధర్మ సంశయాలని చర్చకు పెట్టి వాదన చేస్తుంటాడు. ఒకరకంగా.. తనలోపల తాను తర్కించుకున్నట్టే ఉంటాడు. ఐతే తన మనసులోని చీకటిని ఆచారి ముందు మాత్రమే తెరుస్తాడు. తన భార్య గురించి. తన కుమారుడి గురించి. తన గతం గురించి. తన అనుమానాల గురించి. ఆచారి మాత్రం అతనిని తిరిగి వాస్తవంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ రామప్ప మనసులో ఒకసారి పుట్టిన అనుమానం ఇక వైద్యంతోపోయే వ్యాధి కాదు. అది అతని అహంకారంతో పెరిగిన మానసిక రాక్షసి.
రామప్ప – రేణుక ప్రేమకథ
1968 నుంచి 1991 మధ్య రామప్ప జీవితంలోని అనేక దశలను సినిమా ముందుకు వెనక్కు ప్రయాణిస్తుంది. అతని రాజవంశ నేపథ్యం, ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం, కుమారులు—అన్నీ ముక్కలుగా బయటపడతాయి.
అంతకు ముందు రామప్ప ఫ్రీ లైఫ్ కి అలవాటు పడి ఉంటాడు. రాజులు దేశాలు తిరిగేది ప్రాపంచికి జ్ఞాన సముపార్జనకె కాబట్టి అలా దేశాలు పట్టుకుని తిరుగుతూ జీవితాన్ని అనుభవిస్తూ, రాసాన్వేషణ చేస్తుంటాడు. ఒక రకంగా వెస్ట్రన్ థాట్ అఫ్ ఫ్రీ విల్ ని ప్రభోదిస్తూ పాత ఆచార వ్యవహారాల్ని విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇది కూడా పరిణామ క్రమమే. స్నేహితుడు ఆచారి ఎలాగోలా తనని పట్టుకుని తండ్రి మంచాన ఉన్నాడని నీకోసం పలవరిస్తున్నాడని చెప్పి భువనాలయానికి వెంట పెట్టుకొస్తాడు. భువనాలయానికి అడుగుపెట్టటం చేతనే స్వతంత్ర భావాలు కల ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె ఎవరో కాదు తన తండ్రిని చూసుకోడానికి ఆచారి నియమించిన నర్స్. పేరు రేణుక. తండ్రి జ్ఞాపకాలని, వాత్సల్యపు అనుభూతుల్ని భువనాలయం అతనికి చూపిస్తుంది. లేదూ అతనే తరచి చూసుకుంటాడు. రేణుక తాను కలలు కన్నట్టే ఉండే ప్రణయ సఖి. తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటూనే తనలో కూడా ప్రేమ సరాగాలు పుట్టించగలిగిన నేర్పరి. సహజంగానే ఇష్టపడతాడు. తనకుండే చిన్న చిన్న చింతల్ని, భయాలను కాచి భువనాలయపు సౌందర్యాలను దగ్గరుండి చూపిస్తుంది. తండ్రి కాలం చేస్తాడు. రేణుక తన ప్రేమని తిరస్కరిస్తుంది. భయం వేస్తుంది. తిరస్కరణ లోంచి పుట్టిన భయం. దేశాటనకు బయదేరినవాడల్లా రాజు ఎందుకో ఆగిపోతాడు. అప్పటికే పని వారు ఒక్కక్కొకరుగా వెళ్లిపోతుంటారు. అప్పుడు జరుగుతుంది అసలు వ్యవహారం. సోషల్ కండిషనింగ్ అనబడు ఒక బ్రెయిన్ వాష్. దీనిని రామప్ప పూర్వికులు రామప్పకి కలలో చేసినట్టుగా చూపిస్తాడు దర్శకుడు.
రేణుకను రామప్ప ఎలా వివాహం చేసుకున్నాడు?
కళ్ళు తెరిచాక రామప్ప తన వేషాన్ని మార్చుకుంటాడు. చూపును, దర్పాన్ని మార్చుకుంటాడు, రాచ ఠీవి ఉట్టి పడుతుండగా నేరుగా ఆచారి దగ్గరికి వెళ్ళి రేణుక నాకు కావాలంటాడు. తన ఇష్టంతో పని లేదని, ఆడవారికి ఇష్టాలు ఏమి ఉండవని మా వంశాన్ని వృద్ధి చేయడమే తన పరమావధి కావున చచ్చినట్టు పెళ్లాడాల్సిందేనని భీషిస్తాడు. తప్పదన్నట్టు ఆచారి రేణుకని సముదాయించి వెంటబెట్టుకొస్తాడు. అప్పటికి రేణుక తన మొదటి ప్రేమలో ఓడిపోయి ఉంటుంది కాబట్టి సరేనని ఒప్పుకుంటుంది.
రేణుక మీద తనకు ఒకప్పుడు కలిగిన ప్రేమని పక్కన బెట్టి ఒకప్పుడు ఆమె స్వేచ్ఛగా తిరిగిన రాజ్యసవానం లోనే ఇల్లాలి హోదానిచ్చి ఖైదు చేస్తాడు. రేణుక మనసులో రామప్పకు ఉన్న స్థానం ఏమిటి? అసలు ఆమెకు పెళ్ళి తర్వాత ఏనాడైనా రామప్ప పట్ల ప్రేమ కలిగిందా? రామప్ప అన్నట్టు ఆడవారు వంశ వృద్ధి కోసం మాత్రమే పనికి వస్తారు కాబట్టి అన్నట్టుగానే అదే పనికి ఆమె ఒప్పుకుందా? స్వేచ్ఛ భావనల్ని ఎందుకు వదిలేసింది? తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తమా? లేక ఒక రకమైన వైరాగ్యమా? రెండో సంతానంతో మొదలవుతుంది అసలు పేచీ. నిన్ను ముద్దు పెట్టుకుంటే నా మొహం నల్ల బడిపోతుందేమోరా ఎలారా అని రాజ్యంలో ప్రజా ఐన ఓ ముసలావిడ మాటను, ఆ వెనుక నవ్వుల్నీ కొలమానంగా చేసుకుని బుర్రలోకి ఒక పురుగును చేర్చుకుంటాడు రామప్ప. ఎక్కడో విన్నట్టు లేదూ? మహారాజుకి రాణి పట్ల ఆ మాత్రం అనుమానం కూడా రాజధర్మమే కాబోలు. అప్పటినుండి కొడుకుని, తల్లిని ఈసడించుకోవడం మొదలుపెడతాడు. రాణివాసపు బాధ్యత కనుక రేణుక భరిస్తుంది. లోపల మాత్రం కొడుకుకి పట్టిన గతిని చూసి కుమిలిపోతుంది. ఒక (అ)శుభ ముహూర్తాన రాజుగారి రెండో సంతానం (అవునో కాదో తెలియని) రాజ ప్రసాదంలో ఉన్న కొలనులో పడి మరణిస్తాడు. రేణుక భర్తని ఈసడించుకుని అన్ని బాధ్యతల్ని వదిలి ఒక గదిలోకి, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతుంది.
రామప్ప అంతర్ముఖుడై పోతాడు. అంతఃశోధన, మొదలు పెడతాడు. తనని తాను తెలుసుకునే శోధన కాదు అది. వైరాగ్యం అసలే కాదు. కుసుమప్ప మరణానికి తాను కారణం కాదని, సహజ పశ్చాత్తాపాన్ని రద్దు చేసుకునేందుకు గోడల చాటున నీడల మాటున నడిపే మార్మికపు రాచరికపు క్రీడ. తన చుట్టూ మనుషులు తన పట్ల విధేయత చూపనందుకు ఒక రకమైన అలక అది. తనకున్న సంశయాలకు ప్రతిరూపాలు తయారు చేసుకుంటాడు. చారిత్రక వ్యక్తుల్ని తీసుకొచ్చి మంతనాలు చేస్తాడు. సాక్ష్యాలను సేకరిస్తాడు. జన్యు పరీక్ష కావాలంటాడు. (అగ్నిపరీక్షకు ఆధునిక రూపం కాబోలు). ఆచారి నివ్వెరపోతాడు. నీలోనే చెడు ఉందంటాడు. కాదు నువ్వే కపటివని స్నేహితుణ్ని నిందిస్తాడు రామప్ప. రామప్ప నిజాన్ని వెతకడం లేదు. తన అనుమానం నిజమే అని నిరూపించే ఆధారాలను మాత్రమే వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆచారి ఆట మొదలు పెడతాడు. సర్వ వేదాలని అవపోసన పట్టినట్టుండే ఆచారి రామప్పని, రాజరికపు వరుసల్ని, విలువల్ని కుదిపేసే యజ్ఞాన్ని మొదలు పెడతాడు. ఒక్కొక్క నిజం యజ్ఞంలో పడి పుణీతం అయిపోతాయి. రాజు శాంతి పొంది, ఊపిరి వదిలి దర్పంతోనే పాడె మీద సేదతీరుతాడు.
ఇక్కడ రాజు కూడా వినలేని నిజాలని రేణుక, ఆచారి, యజ్ఞంలో పోసినట్టుగా మన చెవిలో వేసి దర్శకుడు శుభం కార్డు వేస్తాడు.
వెంకటేష్ మహా దర్శకత్వంలో, సత్యదేవ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రావు బహదూర్’ సాధారణ కథను చెప్పే సినిమా ఇది. ఈ కథ నాకు ఇట్లా అర్థం ఐతే కొందరికి ఇంకొన్ని పార్శ్వాలు ఇంకోలా అర్థం కావొచ్చు. ‘రావు బహదూర్’ కథను దర్శకుడు ప్రేక్షకులకి నేరుగా చెప్పడు. గుర్తులు, అనుమానాలు, వస్తువులు, సంభాషణలు, నిశ్శబ్దాలు, వాతావరణం ద్వారా కథను ప్రేక్షకులే నిర్మించుకునేలా చేస్తాడు. ఒక వ్యక్తి కథను చెప్పినట్టుగా మొదలై—వంశం, వారసత్వం, కులం, రక్తశుద్ధి, సామాజిక గౌరవం, అనుమానం, మానసిక అస్థిరత వంటి అనేక పొరలను ఒకదానిలోకి మరొకటి కలుపుతూ సాగుతుంది. దీనిని మామూలు సైకాలజికల్ థ్రిల్లర్ కంటే మ్యాజికల్ రియలిజం, తాత్వికత, సామాజిక వ్యంగ్యం కలిసిన మానసిక నాటకంగా చూడటం అవసరం.
రామప్ప జీవితంలో ఏది నిజం? ఏది జ్ఞాపకం? ఏది భ్రమ? అనే ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా దర్శకుడు ఉద్దేశపూర్వకంగా ఒక మబ్బు తెరను సృష్టిస్తాడు. ఈ పద్ధతి సినిమా కథనానికి మిస్టరీని మాత్రమే కాదు, మ్యాజికల్ రియలిజం అనుభూతిని కూడా ఇస్తుంది. ఇక్కడే వెంకటేష్ మహా ఎంచుకున్నకథనం సాంప్రదాయ తెలుగు సినిమాల నుంచి భిన్నంగా నిలుస్తుంది. ప్రేక్షకులని ‘చూసే వ్యక్తి’గా కాకుండా కథను డీకోడ్ చేసే వ్యక్తిగా మార్చడం ఆయన ఉద్దేశం. ఈ సినిమాలో మనం చూసే ఇంటి నిర్మాణం, గదులు, కారిడార్లు, పాత వస్తువులు, గోడలు—ఇవన్నీ కేవలం ప్రొడక్షన్ డిజైన్ కాదు. అవి రామప్ప మనస్తత్వానికి ప్రతిరూపాలు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన సమీక్షలో ఈ సినిమాను థియేటర్‌లా నిర్మించబడిన ఛాంబర్ డ్రామాగా పేర్కొంటూ, మాన్షన్ గోడలు రామప్ప మనసులోని గోడలకు ప్రతిబింబాలుగా పనిచేస్తాయని విశ్లేషించింది. ఇదే దర్శకుడి ముఖ్యమైన విజయం. వెంకటేష్ మహా స్క్రీన్‌ప్లేలో అత్యంత ఆసక్తికరమైన అంశం సమాచారాన్ని దాచిపెట్టే పద్ధతి. ఇది ఇంతకు ముందు సినిమాలో కూడా మనం చూస్తాం. ఇది ఒక రకంగా ‘మిస్టరీ ఆఫ్ ది మైండ్’. కానీ ఇక్కడే స్క్రీన్‌ప్లేకు ఒక సమస్య కూడా ఉంది. సినిమా పూర్తిగా రియలిస్టిక్ ప్రపంచంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలను దర్శకుడు పూర్తిగా వివరణ ఇవ్వకుండా వదిలేస్తాడు. ఇది మ్యాజిక్ రియలిజంలో జరిగేదే. ఐతే సినిమా తన ఆలోచనలపై కొన్నిసార్లు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే, దర్శకుడికి తన ప్రపంచం మీద ఉన్న నమ్మకంతో కొన్ని సన్నివేశాలను కుదించాల్సినంతగా కుదించలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. సినిమా 2 గంటల 49 నిమిషాల నిడివితో ఉండటం స్క్రీన్ ప్లే విధించిన పరిమితి.
సినిమా సమాజంలో ఉన్న వంశాభిమానాన్ని ఒక మానసిక వ్యాధిలా చూస్తుంది. “నేను ఎవరి వారసుడిని?” అనే ప్రశ్న క్రమంగా “ నేను ఎవరు?” అనే అస్తిత్వ ప్రశ్నగా మారుతుంది. ఇది కథకు తాత్వికమైన లోతును ఇస్తుంది. పైకి చూస్తే ఇది ఒక కుటుంబం, ఒక వంశం, ఒక వారసుడి కథ. కానీ లోపల ఇది సమాజం మనిషికి ఇచ్చే గుర్తింపుపై వ్యంగ్యం.
రామప్ప పాత్రలో సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. మేకప్, శరీర భాష, డైలాగ్ డెలివరీ, చూపులు—ప్రతి అంశంతో పాత్రలోని అస్థిరతను బయటపెడతాడు. ఇది ఆయన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పొచ్చు. ఇక్కడ నటుడు పాత్రను పోషించడం కంటే—పాత్ర మనస్తత్వాన్ని తన శరీరంతో వ్యక్తీకరిస్తాడు. ముఖ్యంగా దీర్ఘమైన సంభాషణలలో ఎదురుగా కెమెరా ఎక్కువసేపు ఉండటం ఒక రిస్క్. కానీ అదే రిస్క్ సినిమాకు థియరిట్రికల్ ఇంటెన్సిటీని ఇస్తుంది. ఇందుకు సత్యదేవ్ కి హాట్సొఫ్ చెప్పాల్సిందే.
వెంకటేష్ మహా కమర్షియల్ సినిమాకు వ్యతిరేకంగా సినిమా తీయడం కాదు—తెలుగు సినిమాలో కథ చెప్పడానికి సరికొత్త మార్గం కూడా ఉందని నిరూపించాడు. ఆ ప్రయత్నం ఒక చోట అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోచోట మేధావితనంగా అనిపిస్తుంది.
సినిమా ముగిసిన తర్వాత కూడా రామప్ప మనసులో ప్రశ్న మన మనసులో మిగిలిపోతుంది. అదే ‘రావు బహదూర్’ అసలు విజయం.
టాగ్ లైన్: తప్పక చూడాల్సిన సినిమా.
- పి. రాము




