నీట్ పేపర్ లీకేజ్ మరియు సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల అవకతవకలు పై చెలరేగిన విద్యార్థుల అలజడి, ఆత్మహత్యలు, పర్యవసానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు జూన్ — 20 నుంచి జరిపిన నిరవధిక ఆందోళనలు ఆర్ ఎస్ ఎస్, బిజెపి పాలకవర్గాలకు ఒక్క కుదుపు ఇచ్చాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మరియు పౌర సమాజంలోని ప్రముఖులు మద్దతు తెలియజేయడమే కాకుండా ఆ ఉద్యమంలో వారు పాలు పంచుకున్నారు. చివరి ఘట్టంలో జూలై 20న చలో పార్లమెంట్ ఉద్యమ దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అంతవరకు మౌనం వహించిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఇండియా కూటమి ఆ రోజు విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల ధమనకాండకు చెలించిపోయి, ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే ప్రజలకు దూరమైపోతామని భావించి,వారు పార్లమెంటును స్తంభింప చేశారు. మరోవైపు జులై 24న దేశవ్యాప్త బందుకి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం, అనూహ్యంగా ప్రజలలో మంచి స్పందన రావడం చూసి బిజెపి కూటమి దిగివచ్చి విద్యార్థి ఉద్యమ డిమాండ్లకి తలవంచింది. ఫలితంగా జూలై 25న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం మరో మూడు డిమాండ్లను కూడా అంగీకరించింది. ఈ విజయం గతంలో జరిగిన ఢిల్లీ రైతు ఉద్యమాన్ని తలపించింది. అయితే నేటి విద్యార్థి ఉద్యమం ప్రారంభించిన 35 రోజులలోనే ముగిసింది. ఈ ముగింపు తాత్కాలికమని, విద్యారంగ, పరీక్షల సంస్కరణలు పారదర్శకంగా అమలు జరిగే వరకూ మా పోరాటం ఉంటుందని సిజెపి నాయకత్వం విద్యార్థుల తరఫున ప్రకటించడం ఆనంద దాయకం, అభినందనీయం. ఆర్ఎస్ఎస్, బిజెపి పాలకవర్గాల నుంచి ఎంత ఒత్తడి, నిందారోపణలు వచ్చినా, కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ధైర్యంగా వాటిని ఎదుర్కొని ఉద్యమించడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి, వీరికి జరిగిన చర్చల సరళని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.
ఉద్యమ ప్రారంభంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చెల్లించాలని, విద్యారంగ, పరీక్షల విధానంలో సంస్కరణలు పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. జులై 20 చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన హింసాకాండ, అక్రమ కేసుల నమోదు జరిగిన తరువాత, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకొని, విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకోవాలని మరో డిమాండ్ చేశారు. జులై 25 నాటి కేంద్ర మంత్రులతో జరిగిన మూడవ దఫా చర్చలలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగినప్పటికీ, మిగిలిన డిమాండ్లను కూడా జులై 28 లోపు పరిష్కరిస్తామని మంత్రులు చెబుతూనే, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు చట్టప్రకారం గరిష్టంగా ఆర్థిక సహాయం చేస్తామని, విద్యారంగ, పరీక్షల సంస్కరణలపై ఎప్పటికప్పుడు సీజేపీ మరియు విద్యార్థి సంఘాల నాయకత్వంతో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంతృప్తి చెందిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ఉద్యమ విరమణ ప్రకటించింది.
పై అంశాలలో ప్రధానంగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అన్నది అనుమానాస్పదం. ఎందుకంటే కేంద్ర మంత్రులు చట్ట ప్రకారం అన్నారు తప్ప, ఇంత ఇస్తామని ప్రకటించలేదు. ఇక విద్యారంగ, పరీక్షల సంస్కరణల పారదర్శకత గూర్చి అప్పటికే ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి వర్గం రెండు విషయాలను ప్రకటించారు. ఒకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పరిచి, త్వరితగతిన నేరస్థులకు శిక్షలు వేయడం. రెండు, 2024 నాటి ప్రభుత్వ పరీక్షల రక్షణ చట్టానికి మెరుగులు దిద్ది, గరిష్టంగా నేరస్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల నష్టపరిహారం విధించి, సంబంధిత నేర సంస్థలను అదుపు చేయడానికి జులై 27న పార్లమెంటులో బిల్లు పెడతామని ప్రకటించారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటే, ఇటువంటి చట్టాలు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పటికి బిజెపి కూటమి పాలన లో 152 సార్లు కేంద్ర, రాష్ట్రస్థాయి పరీక్షలలో అక్రమాలు జరిగాయి. అక్రమాలు జరిగిన ప్రతిసారీ కేసులు నమోదు కావడం జరుగుతున్నది. అయితే ఎంతమందికి ఎన్ని సందర్భాలలో శిక్షలు వేశారన్నది ఎవరికీ తెలియదు. ప్రభుత్వాలు ప్రకటించవు.. మరి రేపు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో నేరస్తులకు శిక్షలు పడతాయన్న గ్యారెంటీ లేదు. ఇక్కడే కేంద్రమంత్రులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ మరియు విద్యార్థి నాయకత్వం కూడా తక్షణ సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యత చర్చలలో దీర్ఘకాలిక, మౌలికమైన అంశాల పట్ల చర్చలు జరపడం, వాటిని సాధించుకోవడం జరగడం లేదు. ప్రతిసారీ పరీక్షలలో ఆక్రమాలు, పేపర్ లీకేజీలు జరగడానికి ప్రధాన కారణం విద్యారంగ మాఫియా. ఈ మాఫియాకి వెన్నదన్నుగా విద్యా రంగ కార్పొరేట్ లు ఉంటున్నారు. ఈ కార్పొరేట్ శక్తులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారు. అందుకే వారు పట్టుబడిన ప్రతిసారీ శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. కావున మనం ఈ వ్యవస్థీకృత నేర సంస్థలను పొదుపు చేయడానికి డిమాండ్ చేయాలి. ప్రస్తుత నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత గల ఎన్ టి ఏ ఏజెన్సీని రద్దు చేయాలని, ఒకే దేశం- ఒకే పరీక్ష విధానం గల నీట్, జేఈఈ,AIEEE లాంటి పరీక్షలు రద్దుచేసి విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలని డిమాండ్ చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్ మొదలగు వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాలు ఇంటర్ మరియు ప్లస్ టు అకడమిక్ పరీక్షల మార్కుల ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసుకునే విధంగా చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో విద్యాబోధనను చేయడం కోసం మరియు 2020 జాతీయ విద్యా విధానాన్ని రుద్దకుండా ఉండడం కోసం మనం డిమాండ్ చేయాలి. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు విద్య ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేసినప్పుడు, విద్యారంగ కార్పొరేట్ మాఫియా కి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే పరీక్షలలో అక్రమాలు అరికట్ట బడతాయి. ఈ విధంగా శాస్త్రీయ, హేతుబద్ధ విద్యారంగ సంస్కరణలను ఉద్యమం ద్వారా సాధించుకున్నప్పుడు మాత్రమే విద్యారంగం లో పారదర్శకతను నెలకొల్పడం సాధ్యపడుతోంది. పై వాటి పట్ల మనందరం ఆలోచించాలని ఆశిస్తున్నాను.
——- పేడాడ కృష్ణారావు,
జిల్లా కన్వీనర్,
ప్రజా సంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.
తేదీ 26-07-2026.




