ఇటు చూడు

కన్నీళ్ళతో నిండిన

నీకళ్ళను

నాకు చూపియ్యడానికి   సిగ్గుపడకు…

ఈ రోజైనా కన్నీటి వర్షాలు వరదలు పెట్టనివ్వు

      -కబీర్.

అక్టోబర్ 4వ తేదీన ముప్పైమంది మావోయిస్టుల హననం జరిగిన వారం రోజుల తర్వాత సాయిబాబా మరణించాడు. దుఃఖానికి ఒక కొలత ఉండాలి. దానికొక అడ్డు కూడా ఉండాలి. కానీ నిర్వికల్పసంగీతంలా భారత సమాజంలో దుఃఖం ప్రవహిస్తుంది. దుఃఖతీవ్రత సాయిబాబ దగ్గర  ఆగింది.  

2013 విరసం  జనరల్ బాడీ సమావేశం కావలిలో జరుగుతుండగా ఢిల్లీలో సాయిబాబా  నివాసంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  ఉన్నదని  వరవరరావు మా దృష్టికి  తీసుకువచ్చారు. యూపీఏ పాలనలో కేసు నమోదు అయింది. తర్వాత వచ్చిన సంఘ పరివార్ ప్రభుత్వం యావజ్జీవ కారాగార  శిక్ష వరకు తీసుకువెళ్లింది.

ఒక పదేళ్ల కాలం భారత సమాజానికి విప్లవోద్యమానికి  పరీక్షా  కాలం. ఈ దేశంలో మైనారిటీలు రాజ్య అణిచివేతను చూసి కలత  చెందుతున్న కాలం. దీనిని విప్లవోద్యమం ఒక స్థాయిలో ప్రతిఘటిస్తుంది.   ఈ పదేళ్లుగా సాయిబాబా విడుదల కోరుతూ అనేక నిరసనలు, పోరాటాలు జరిగాయి. దీనికి బీమా కోరేగాం  కుట్ర కేసు అదనపు చేర్పు. అనేక హత్యలు, ఎన్కౌంటర్లు, అరెస్టులు కల్లోలభరిత కాలం నడుస్తున్నది .  హఠాత్తుగా సాయిబాబ వెళ్ళిపోయాడు. ఎవరూ ఊహించని విషాదం.

సాయి బహిరంగ విప్లవో ద్యమ కార్యకర్త. నేను చావును  నిరాకరిస్త్తున్నాను, కబీర్ కవితలు,ఫైజ్  అహ్మద్ పైజ్ అనువాదం ఆయన జైలు రచనలు. సాయిబాబ తన  రాజకీయ అవగాహనను  కవిత్వంలో వ్యక్తీకరించాడు . జీవితంలో కూడా కవిత్వ  పఠనం, రాయడం అతనికొక ఓదార్పు. సాయిబాబ కవిత్వం చదివిన వారికి జైలు, ఒంటరితనం, ప్రకృతి మన హృదయం లోకి తర్జుమా అవుతాయి . రాజకీయ అవగాహనకు సంబంధించిన తాత్వికతను ఆయన కవిత్వం ద్వారా గ్రహించాడు. జీవితాన్ని త్యాగం చేయడానికి కావాల్సిన ఆయువు పట్టును సాధించాడు.

సాయి,  స్టాన్ స్వామిలా  జైలులోనే మరణిస్తాడు అనుకున్నది భారత సమాజం. జైలు బయట నిమ్స్ లో సాయి మరణించడం అసలు విషాదం.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో సాయిబాబ  జన్మించాడు. అమలాపురం కే.డీ.బి.ఎం కాలేజీలో ఉన్నత చదువుకు వెళ్ళాడు. తదనంతర హైదరాబాద్ జీవితం సాయిబాబ  విప్లవ రాజకీయాలను పరిచయం చేసింది. జీవితమంతా ఆ రాజకీయాల మధ్యనే సంచరించాడు. భారత సమాజాన్ని దాన్ని అర్థం చేసుకునే తీరులో సాయికి బాబాకు అవగాహన ఉన్నది. వివేచన ఉన్నది. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు దేశ,కాల పరిస్థితులలో ఇవాల్టి భారతదేశాన్ని అన్వేషించాడు.  ప్రపంచీకరణ, అయోధ్య వంటి ప్రధాన విషయాలు భారతదేశ రంగస్థలం పైకి వస్తున్న  క్రమంలో వాటిని అర్థం చేసుకొని వాటికి సంబంధించిన అన్వేషణ  ఆరంభించాడు. ఈ దేశంలో హిందుత్వ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? అన్నది దేశం ముందున్న పెద్ద సవాలు. నరేంద్ర మోది  పాలనా కాలంలో భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ప్రగతిశీల శక్తులకు ఎదురవు తున్న నిర్బంధ రూపాలు.  వందలాది మంది ఆలోచనా పరులు, బుద్ది జీవులు నిర్బంధంలో ఉన్నారు.ఈ దేశపు ప్రగతిశీలతను  మోది ఖైదు చేసాడు. సత్యానికి, భయానికి మధ్య జీవితం ఉంటుంది. ఆ ధైర్యాన్ని భారతసమాజానికి అందించినవాడు సాయిబాబ.ఇతరులతో పోలికలేదు. రాజకీయాలు విశ్వాసాలు, కుటుంబం  ఎక్కడా రాజీ పడలేదు. జైలు జీవితంలో   తోటి ఖైదీల మధ్య సాహచర్య వంతెన వేసాడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని  తోటి ఖైదీలకు అందించాడు . ప్రగతి శీల భావజాలం వారిలో మిళితం చేశాడు.

సాయిబాబ ప్రధానంగా దృష్టి సారించిన అంశం భారతదేశ భౌతిక స్థితిని. మతం ఈదేశంలో సాగిస్తున్న అనేక రాజకీయ ప్రకంపనల  పట్ల అవగాహన ఉంది. భారతదేశం మతోన్మాదం వైపు వెళుతుందనే భావన ఉంది. అదే క్రమంలో  ఫాసిజం దేశంలోకి ప్రవేశించింది. సనాతనత్వాన్ని దాని   కుటిల   సంభాషణను ఈదేశం గుండెలపై మోస్తుంది. అనేక అభ్యుదయ,నాస్తిక ఉద్యమాల ప్రభావం వలన ఈ దేశంలో సమాంతర ప్రజా స్వామ్య భావనలకు కూడా జాగా వుంది. వేల సంవత్సరాల జీవన సంస్కృతిలో ఈ దేశం రక్తంలో హింస, భిన్నత్వం  కలిసి ప్రవహించాయి. సమైక్యత అనే చిన్న మెరుపు ఈ దేశాన్ని  కలిపి ఉంచింది. ఈ కలయిక, సామూహికశక్తి మెజారిటీ హిందుత్వను బలపరిచే శక్తులను ధిక్కరిస్తుంది .  ఇక్కడే వర్తమాన కాలంలో భారతదేశం ఒక ప్రసవ  వేదనను అనుభవిస్తున్నది. భారతదేశం అనేక ప్రసవ వేదనలను దాటి వచ్చింది. భారతదేశ ప్రయాణంలో  ఇదొక పరీక్షా కాలమే.

సాయి జైలు నిర్బంధంకు  కేవలం విప్లవోద్యమ కారణాలే కాదు. సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. మతం , శ్రమ,పెట్టుబడిని దాటి ఒకానొక విధ్వంసీకరణ వైపు దేశం నడుస్తున్నప్పుడు ఆలోచనపరులకు బుద్ధి జీవులకు జైళ్లు తెరచు కుంటాయి. సాయి ఇక్కడ నిలబడి ఉన్నారు. జైలు జీవితం సుదీర్ఘకాలపు  ఒంటరితనం సాయిబాబను మరింత ధృడం చేసాయి. పదేళ్ల తర్వాత 2024 మార్చిలో విడుదలైన సాయిబాబ కేవలం ఆరు  నెలలపాటు స్వేచ్చా జీవిగా ఉండి  జీవితం నుండి  నిష్క్రమించాడు. జీవితాన్ని,ఉద్యమాన్ని, సాహిత్యాన్ని వదిలి  వెళ్ళిపోయాడు.తన పుట్టిన నేలపై నుండి ప్రజాపోరాటాల గొంతుగా మారాడు.ఎక్కడా తలవంచలేదు.సాయిబాబ ను వర్తమాన,భవిష్యత్తు కాలం ఎలా అనువర్తింప చేసుకుంటుంది. ఏభై  ఏళ్ల విప్లవోద్యమం, ప్రపంచీకరణ, ఫాసిజం వీటి మధ్య పెరిగిన తరం అర్ధాంతర చావును దుఃఖచరిత్రగా అనువర్తింప చేసుకుంటుందా! జ్ఞానాన్ని కలిగిన తరం మానవ జీవితంలోని సంక్షోభ దశలను వేరు చేయాల్సిన ఒకానొక సందర్భం.కేవలం సాయిబాబ పదేళ్ల జైలుజీవితం దగ్గరే ఆగితే నిర్బంధితుడుగా మిగిలిపోతాడు.ఇంకా ఆవల ఏదో ఉన్నది. మానవ స్వభావంలో ఈ త్యాగ చరిత వెనుక దాగిన తాత్వికతను గుర్తించడం చాలా ముఖ్యమైనది. తనకు తాను అన్నిటినీ వదులుకొని ప్రజల దగ్గరకు దాహార్తిగా  వచ్చాడు. ఏడు దశాబ్దాలు  దాటిన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశాడా! ప్రజాస్వామ్యపు డొల్లతనాన్ని ప్రశ్నించాడా? భయం కలిగించి  మరింత ధిక్కరించాడా ? ఇదొక వర్తమాన పోరాట చరిత్ర.

ఈ దేశ ప్రజాస్వామ్యం అనేక రూపాలలో ఎందరినో  నిర్మూలించింది. ఈ అణిచివేత  సామాన్య ప్రజల నుండి సాంస్కృతిక రాయబారుల వరకు కొనసాగింది. అందులో భాగంగానే ఈ సాయిబాబ మరణ క్షణాలను  అంచనా వేయవచ్చు. అనేక పొరల నుండి తూకం వేయాలి. జీవితంపై ఆశ. పసిపిల్లల చిరునవ్వు. ఆ చిరునవ్వు వెనుక దాగిన ఆకాంక్ష. నూతన ప్రజాస్వామిక భావన వీటన్నిటిలో దాగి వుంది. సాయిని ప్రతి బింబాన్ని ఇక్కడ  చూడాలి. మానవ ప్రవృత్తిలోనే ఏదో లోపం ఉన్నది.. దానిని సరి చేసుకోవాలి. విప్లవ దశకు చేరుకోవడం మాత్రమేనా మానవ స్వభావంలో దాగిన అనేక రుగ్మతులను వదిలి వేయకుంటే ఈ దేశపు ప్రజాస్వామ్యం అనేక హత్యలకు సిద్ధంగా ఉన్నది. ఇది రాజ్యపు హత్య అనే భావన నుండి అన్నిటికీ రాజ్యమే కారణం. సాయిబాబ మరణం వెనుక రాజ్యపు మంద్ర స్థాయి స్వభావం ఇమిడి ఉన్నది. ఈ దాడికి తట్టుకుని  నిలబడిన జీవితం. చివరకు అతనిని  ప్రపంచం నుండి వేరు చేసింది.సాయిబాబకు   ప్రపంచంలోని ఎవరితోనూ పోలిక అవసరం లేదు. పల్లెటూరి పిల్లగాడు ఎదిగిన క్రమంలో స్టేట్ అజెండాను  తిరస్కరించాడు. జైలు, మృత్యువు అని తెలుసు. అలాంటి అనేక మరణాలకు దోవ రాజ్యం. ఈ విషయం సాయిబాబ వెలుగులో మరింత స్పష్టమైనది . ఆయన దళితులు, ముస్లింలు, ఆదివాసులు..  అంతిమంగా దేశ ప్రజల మిత్రుడు.

Leave a Reply