దేశ దేశాల కవిత్వంతో కరచాలనం
(*అనువాద స్వరం* కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . పాలమూరు నుంచి ప్రపంచ కవిత్వాన్ని పరిశీలిస్తూ , అధ్యనం చేస్తున్న సీనియర్ కవి ఉదయమిత్ర ఈ శీర్షికను నిర్వహిస్తారు)
హంజా
మా ఊళ్లో
ఒక సాధారణ వ్యక్తి
రొట్టె ముక్క కోసం
చెమటోడ్చే కూలి
ఓ రోజు
నేను ఆయనను కలిసినప్పుడు
ఊరంతా
విచారంలో మునిగి ఉంది
గాలి మొత్తం స్తంభించినట్టుగా ఉంది
లోలోపలే
ఓడిపోయిన ఫీలింగ్ కలిగింది
హంజా నవ్వుతూ భుజం తట్టి
ఇలా అన్నాడు
“అక్కా
ఇది పాలస్తీనా
దీని గుండెలయ
సముద్రహోరు
ఆగేదిగాదు
సమస్త పర్వతాల ,
అగ్నిగర్భాల రహస్యాల్ని దాచిపెడుతుందిది
ఈ నేలపొడుగునా
ఎన్ని నిర్బంధాల
ముళ్ళ తీగలు పరుచుకున్నా
ఇది
నిరంతరం యోధులకు జన్మనిస్తుంది .
ఇది
ఉనికిని కోల్పోయే జాతులకు
విశ్వాసాలనిచ్చే… వీరమాత
ఇది
పాలస్తీనా “
మూలం: ఫద్వా తుఖాన్
సమకాలీన అరబ్ కవిత్వంలో ఇజ్రాయిల్ ఆక్రమణను ప్రతిఘటించిన పాలస్తీనా కవయిత్రి
**
జీవిత కాలం..1917-2003. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనాలోని నే బ్లెస్ అనే చోట పుట్టి , అక్కడే మరణించారు.
ఆమె సుప్రసిద్ధ పుస్తకాలు..
1) a mountainous journey
2) last method
3) nightmares.. 10 poems