వసుధేంద్ర రచించిన “తేజో తుంగభద్ర” పుస్తకం ఒక అద్భుతంలా ఉంటుంది.
ఈ పుస్తకం యొక్క గొప్పదనం ఏమిటంటే, ఇందులో కేవలం రాజుల యుద్ధాలు, సామ్రాజ్యాల గెలుపోటములు మాత్రమే కాకుండా ఐరోపాలోని ‘తేజో’ నది తీరాన, భారతదేశంలోని ‘తుంగభద్ర’ నదీ తీరాన వందల ఏళ్ల క్రితం నాటి సామాజిక పరిస్థితులు,ప్రేమికుల కథలు, వారి హృదయ వేదనలు, ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతూ మనసులను ఆర్ద్రం చేస్తాయి.
తేజో నది ఒడ్డున అంటే లిస్బన్ నగరం పోర్చుగల్ దేశంలో ఒక పేద క్రైస్తవ యువకుడు గేబ్రియెల్, తన ప్రియురాలు అయిన బెల్లాను ప్రాణంగా ప్రేమించుకుంటారు. మత వివక్ష, సమాజం పెట్టే కష్టాల మధ్య వారి ప్రేమ చిక్కుకుంటుంది. బెల్లా తండ్రి విధించిన షరతు ప్రకారం, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అవసరమైన ధనాన్ని సంపాదించడం కోసం గాబ్రియెల్ నావికుడిగా మారి, ప్రాణాలకు తెగించి సముద్ర ప్రయాణం ద్వారా భారతదేశానికి బయలుదేరుతాడు.
ఆ భారతదేశానికి 1498 లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా ఐరోపా నుండి భారతదేశానికి సరికొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఆయన ఆఫ్రికా ఖండం చుట్టూ ప్రయాణించి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ భారతదేశంలోని కేరళ తీరానికి చేరుకున్నారు. గాబ్రియెల్ కూడా ఈ సముద్ర మార్గం గుండానే భారతదేశానికి ప్రయాణం చేస్తాడు. ఈ కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం వల్ల దేశాలు దగ్గరయ్యాయి. కాని అదే సమయంలో వ్యాపారాలు, మత మార్పిడులు మరియు సరికొత్త రాజకీయ గొడవలు మొదలయ్యాయి. కాలం తెచ్చిన ఈ మార్పులు సమాజం విసిరిన సవాళ్లపై ఆ ప్రేమికులు ఎలా ఎదురొడ్డి నిలిచారో, వారి నిస్వార్థ పోరాటాన్ని రచయిత ఈ పుస్తకంలో చాలా
అద్భుతంగా వివరించారు. అలాగే ఇక్కడి తుంగభద్ర నది ఒడ్డున సాగే కథ (విజయనగర సామ్రాజ్యం – భారతదేశం)
అటువైపు భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రతిభావంతుడైన శిల్పి, కేశవ. అందమైన అమ్మాయి హంపమ్మ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కాని, నాటి సమాజంలో ఉన్న కఠినమైన కుల, మత ఆచారాలు, సంప్రదాయాల సుడిగుండంలో వీరి ప్రేమ బలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకోని పరిస్థితుల వల్ల కేశవ హంపమ్మకు దూరమై, సుదూర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రియుడి పక్కన లేని సమయంలో హంపమ్మ జీవితం మరింత చీకటిగా మారుతుంది. నాటి సమాజంలోని క్రూరమైన ఆచారాలు ఆమెను చుట్టుముడతాయి. ముఖ్యంగా భర్త చనిపోతే భార్య కూడా చితిపై దూకాలి అనే సతి ( సతీ సహగమనం) దురాచారం నుండి తప్పించుకోవడానికి ఆమె ఎన్నో కష్టాలు పడుతుంది. ఒంటరి మహిళగా సమాజం పెట్టే వేధింపులను, అవమానాలను తట్టుకుంటూ తన ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి హంపమ్మ చేసే పోరాటం చదువరుల కళ్లను చెమర్చేలా చేస్తుంది.
ఇటువైపు భారతదేశంలో హంపమ్మ కష్టాలు పడుతుంటే, అటువైపు పోర్చుగల్ నుండి బయలుదేరిన గాబ్రియెల్ ప్రయాణం కూడా సుఖంగా ఏమీ సాగలేదు. 1498 లో వాస్కోడిగామా కనుగొన్న సముద్ర మార్గం గుండా గాబ్రియెల్ ప్రయాణించే ఓడలు భయంకరమైన తుఫానులకు, సముద్ర దొంగల దాడులకు, సముద్ర తరంగాలకు గురవుతున్నాయి. విధి ఆడిన వింత నాటకంలో, ప్రాణాలతో బయటపడిన గాబ్రియెల్ చివరకు భారతదేశం చేరుకుంటాడు. కాని, ఇక్కడి రాజకీయ పరిస్థితుల వల్ల అతను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాల్సి వస్తుంది. తన పేరు ‘అహ్మద్ ఖాన్’ గా మారినా, అతని గుండెల్లో బెల్లా పై ఉన్న ప్రేమ మాత్రం అస్సలు చావలేదు.
అటు పోర్చుగల్‌లో ఉన్న బెల్లా, గాబ్రియెల్ తిరిగి వస్తాడనే నమ్మకంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంది. కానీ కాలక్రమంలో ఆమె కుటుంబం కూడా కష్టాల పాలై గోవా తీరానికి చేరుకుంటుంది. అక్కడ మొత్తం ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. దేశాలు, మతాలు మారినా.. విధి వీరిద్దరినీ గోవాలోనే మళ్లీ కలుపుతుంది. కానీ అప్పటికే వారి జీవితాలు, పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న బెల్లా, గాబ్రియెల్‌ల కథ చివరకు ఎందుకు కన్నీళ్లతో,గుండె బరువుతో ముగుస్తుందో తప్పక చదవాలి. సమాజపు స్వార్థం, మత విశ్వాసాల ముందు వీరి పవిత్ర ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది.
భారతదేశ వైభవం మరియు దినుసుల వ్యాపారం:
ఈ పుస్తకంలో కేవలం మనుషుల ప్రేమ కథలే కాకుండా, నాటి భారతదేశపు సంపదను, ముఖ్యంగా మసాలా దినుసుల ప్రాధాన్యతను రచయిత చాలా బాగా చూపించారు. ఆ కాలంలో భారతదేశంలో దొరికే మిరియాలు, లవంగాలు, యాలకులు, వంటి దినుసులకు ఐరోపా దేశాలలో బంగారం కంటే ఎక్కువ విలువ ఉండేది. కేవలం ఈ సుగంధ ద్రవ్యాల కోసమే వాస్కోడిగామా లాంటి నావికులు ప్రాణాలకు తెగించి,సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చారు.
విజయనగర సామ్రాజ్యంలోని అంగళ్లలో రత్నాలు, వజ్రాలు రాశులుగా పోసి అమ్మేవారు అనే చారిత్రక సత్యాన్ని, నాటి భారతదేశపు వైభవాన్ని ఈ పుస్తకం మనకు కళ్లకు కడుతుంది. ప్రేమకథలతో పాటు నాటి సమాజంలో ఉన్న కఠినమైన ‘లంకెల వ్యవస్థ’ (రాజు కోసం ప్రాణాలు ఇచ్చే నమ్మకస్థులైన సేవకులు) గురించి కూడా వసుధేంద్ర గారు ఇందులో విస్తారంగా రాశారు.
ఈ ఆచారాల వల్ల ఎందరో అమాయక యువకులు, వారి కుటుంబాలు ఎలా బలైపోయాయో రచయిత తన నవలల్లో చూపించారు. కేశవ, హంపమ్మలతో పాటు సమాజంలో అణచివేతకు గురై సామాజిక వివక్షను అనుభవించిన మనుషుల గూర్చి, వారి మధ్య ఉన్న వర్గ భేదాలను సైతం ఈ నవల చాలా స్పష్టంగా ప్రతిబింబించింది. నాటి కాలంలో విజయనగర సామ్రాజ్యానికి, బహుమనీ సుల్తానులకు మధ్య జరిగిన యుద్ధాలలో ‘అరబ్బు గుర్రాల’ పాత్ర అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి. ఆ గుర్రాల వ్యాపారం పై పట్టు సాధించడం కోసమే పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్నారు. వివిధ ప్రాంతాల రాజులు తమ సైనిక బలాన్ని పెంచుకోవడానికి చేసిన వ్యూహాలు, ఆ గొడవల మధ్య సామాన్య వ్యాపారులు, సైనికులు పడిన ఇబ్బందులు ఈ పుస్తకం మనకు చూపిస్తుంది. ఈ మనుషుల నమ్మకాలు , మతాచారాలు చాలా లోతుగా ఉంటాయి.
ఈ పుస్తకంలో చెప్పినట్టు మతం మారినా లేదా భూభాగాలు మారినా… అధికారం కోసం రాజులు, పాలకులు చేసిన రాజకీయాల వల్ల ఎప్పుడూ సామాన్య ప్రజలే నష్టపోయేవారు. చివరిగా చెప్పాలంటే ‘తేజో తుంగభద్ర’ అనేది కేవలం ఐదు వందల ఏళ్ల క్రితం నాటి కథ మాత్రమే కాదు. అది ఆనాటి మనుషుల గుండె చప్పుడు. ఈ నవలను చదువుతుంటే, దేశాలు, భాషలు, మతాల గోడలు ఎంత పెద్దవైనా… మనుషుల మధ్య ఉండే ప్రేమ బాధ అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే అనిపిస్తుంది.
వాస్కోడిగామా కనుగొన్న సముద్ర మార్గం వల్ల దేశాలు దగ్గరయ్యాయేమో కానీ, మనుషుల మధ్య ఉన్న స్వార్థం, మత భావనలు మాత్రం ప్రేమికులను దూరం చేశాయి. నదులు ఎలాగైతే ఎత్తుపల్లాలను దాటుకుంటూ సాగిపోతాయో, మనుషుల జీవితాలు కూడా అలాంటి కష్టసుఖాల మధ్య ముందుకే సాగుతాయని ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. కథ ముగిసినా.. గాబ్రియెల్, బెల్లా, కేశవ, హంపమ్మల పాత్రలు మన మనసుని వదిలి వెళ్లవు. ఈ పుస్తకంలో వాళ్ళ ఈ పాత్రలు కళ్లలో నీళ్లు తెప్పిస్తూనే, గుండెల్లో మానవత్వం పై ఒక గొప్ప నమ్మకాన్ని, ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి అనుభూతిని మిగులుస్తాయి. ఒక అద్భుతమైన పుస్తకం ఇది.
కానీ నేటి సమాజంలో కూడా మనుషులు సృష్టిస్తున్న కులాలు, మతాలు, దేశాల సరిహద్దుల కంటే ‘మానవత్వం’ మరియు ‘ప్రేమ’ అనేవి చాలా గొప్పవి. ఈ పుస్తకం ద్వారా మనం నేటి ఆధునిక సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వవచ్చు. ఐదు వందల ఏళ్ల క్రితం నాటి మనుషులు మతం పేరుతో, కఠినమైన ఆచారాల పేరుతో గొడవలు పడ్డారు. మరి ఇంత సాంకేతికత పెరిగి, చదువుకున్న నేటి సమాజంలో కూడా మనం ఇంకా కులమతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొట్టుకు చావడం ఎంతవరకు న్యాయం? అనే ప్రశ్నను ఈ పుస్తకం మన ముందు ఉంచుతుంది.
నాటి కాలంలో హంపమ్మ ‘సతి’ లాంటి దురాచారాల వల్ల కష్టాలు పడితే, మరి ఈరోజు మహిళలకు నిజంగా పూర్తి రక్షణ, స్వేచ్ఛ లభించాయా? అని మనం ఆలోచించాల్సి ఉంది. అందువల్ల, నేటి సమాజంలో మన ఎదుటి వ్యక్తి ఏ మతానికి లేదా ప్రాంతానికి చెందినవాడైనా.. వారిని ఒక తోటి మనిషిగా గౌరవించడం, వారి పట్ల సానుభూతి కలిగి ఉండటం మనం అలవర్చుకోవాలి. మనుషుల మధ్య గోడలు కట్టే మతం కంటే, ఒకరిని మరొకరితో కలిపే ‘మానవత్వమే’ అన్నిటికన్నా మిన్న అని మనం తెలుసుకుని నడుచుకోవాలి. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురిస్తూ, మన చుట్టూ ఉన్న జీవితాలలో ప్రేమను నింపేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజుల్లో మనం టెక్నాలజీతో ప్రపంచాన్ని ఎంతగానో మార్చేశాం, కానీ తోటి మనిషిని ప్రేమించే గుణాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోయాం. ఇలాంటి కాలంలో తేజో తుంగభద్ర పుస్తకం మన చుట్టూ ఉన్న స్వార్థపు గోడలను బద్దలు కొట్టి, మన గుండెల్లో మానవత్వాన్ని మళ్లీ బతికిస్తుంది.
కథ ముగిసి పుస్తకం మూసేసినా, ఆ పాత్రల పవిత్రమైన ప్రేమ మన మనసుల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాల్సినది ఇది. ఈ గొప్ప పుస్తకం సరళమైన భాషతో తెలుగులో ఉంది. కానీ ఈ పుస్తకం కన్నడ మూలానికి చెందినది. మనందరికీ అర్థమయ్యేలా తెలుగు భాషలోకి అనువాదం అయ్యింది. నాటి సమాజం ఎలా ఉండేదో, నేటి సమాజం ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం.




