జీవించి ఉండగానే తన శ్రద్ధాంజలి రాసుకున్న విదర్భ రైతు
-ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్, 2005
‘గ్రామీణ ప్రాంతంలో ఘోరమైన ఏదో తప్పు జరుగుతోంది.’
యాభై ఏళ్ల రైతు శ్రీకృష్ణ కలంబ్ 2008 మార్చి 24న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల ముందు, తన మరణానంతర నివాళిని తానే రాసుకున్నాడు. కేవలం ఆరు లైన్ల ఆ నివాళిని తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బ్రిటిషర్లు బరార్[i] గా పిలిచే పశ్చిమ విదర్భ ప్రాంతంలో మాట్లాడే మరాఠీ మాండలికం అయిన స్వచ్ఛమైన వర్హాడీలో, అది ఇలా మొదలవుతుంది:
మీ ఆగలా వెగలా, మాహి న్యారిచ్ జిందగాని;
మహ్యే మరణ భీ ఆహే, జసే అవకలి పాని.
నేనో ప్రత్యేకమైన మనిషిని;
నా జీవితం ఒక అసాధారణ ప్రయాణం;
నా మరణం కూడా అకాల వర్షంలాంటిదే.
విదర్భ ప్రాంతం, 1995 నుండి రైతుల ఆత్మహత్యలతో వార్తల్లో నిలిచింది. కలంబ్ ఒక 5 ఎకరాల సాధారణ రైతు.[ii] అది వర్షాధార ప్రాంతం.[iii] తన కవితలు ఎంత విలువైనవో, తన పత్తి కూడా తనకు అంతే విలువైనదని రాశాడు. ఆ కవితల మాధుర్యాన్ని చెరుకుగడల తీపితో పోల్చాడు.
ఆ కవితలో, ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు, తలుపుకు తన శరీరం వేలాడుతున్నట్లుగా ఒక దృశ్యాన్ని మన ముందుంచాడు. గుండెల్ని పిండిచేసే కలంబ్ కవితలు ప్రతీకవాదంతో, తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి.
అకోలా జిల్లాలోని బాభుల్‌గావ్ (జహంగీర్) తన స్వగ్రామం. అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూర్తిజాపూర్ పట్టణంలోని తన సోదరి ఇంట్లో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భలోని ఆరు జిల్లాలలో అకోలా ఒకటి.[iv] ఇక్కడ రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అతను ఐదుగురు కుమార్తెలను, భార్యను దుఃఖం లో వదిలి వెళ్ళాడు.
చాలా మంది రైతుల లాగే, అతనికి బ్యాంకుల నుండి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి ఇంకా తీర్చని అప్పులు ఉన్నాయి. తన కూతుళ్ల పెళ్లిళ్లకు కావలసిన ఖర్చులు ఎలా అనే ఆందోళన కూడా అతన్ని కుంగదీసింది. కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం కారణంగా అతను కుంటుతూ నడవాల్సి వచ్చింది. గతంలో పని చేసినట్లుగా అతను ఇకపై శారీరకంగా కష్టపడి పనిచేయలేకపోయే వాడు. ఆర్థిక కష్టాలు పెరిగాయి. నిరాశ మానై కూచుంది.
‘వాసరే’ (దూడలు) అనే మరో కవితలో కలంబ ఇలా రాశాడు:
మేము దూడలం దూడలం,
మూగ ఆకలి దూడలం
ఆవులకు పాలు పట్టేది మేము,
కానీ దొంగలు వెన్నను పాలు దోచుకుపోతారు
చుక్క చుక్క చెమట చుక్క నేలపై కారుతుంది, భూదేవిపై చెమట ధారలు కారుతాయి
ముత్యాలను పండిస్తాము మేం,
మా పిల్లలు మాత్రం ఆకలితో అలమటిస్తారు.
కలంబ్ ది సున్నితమైన మనస్సు. మహారాష్ట్రకు చెందిన సంచార జాతి అయిన ధంగర్ (గొర్రెల కాపరి) కులానికి చెందిన అతని కవితలు ఆ ప్రాంతపు గ్రామీణ సంస్కృతిలో వేళ్లూనుకుని ఉన్నాయి. అవి సగటు భారతీయ రైతు జీవితంపై వెల కట్టలేని లోతైన కోణాలను అందిస్తాయి.
రైతు జీవితం, గ్రామీణ భారతదేశంలో మారుతున్న సామాజిక-ఆర్థిక, రాజకీయ, పర్యావరణ పరిస్థితులకు ఒక అద్దం పడుతుంది. కలంబ్ కవిత్వం ఆ పరిస్తితులను మన ముందుంచుతుంది.
‘లేక్’ (కూతురు) అనే మరో కవితలో, ఒక రైతు అయిన తండ్రి పడే ఆందోళనలను ఆయన కళ్లకు కట్టారు. ఆ కవితలో లోతైన పితృస్వామ్య భావనలు ఉన్నా, ఒకప్పుడు భూస్వామ్య ప్రాంతంగా ఉన్న విదర్భ ప్రాంతపు వ్యవస్థాగత సామాజిక సమస్యలను అది చక్కగా వివరిస్తుంది. కాలం మారుతున్నప్పటికీ, కుల, వర్గ విద్వేషాలు ఇంకా సూక్ష్మంగా వేళ్లూనుకునే ఉన్నాయి.
ఇక ‘ఇతిహాస్’ (చరిత్ర) కవితలో, ధనవంతుల ఘన చరిత్రను మాత్రమే కాలం భద్రపరుస్తోందని, నిరుపేదల అణచివేతకు వ్యతిరేకంగా జరిపిన సాహసిక పోరాటాలను మాత్రం ఉద్దేశపూర్వకంగా అణగద్రొక్కుతోందని ఆయన కాలాన్ని నిలదీస్తాడు.
కలంబ్ రైతుల కోసమే రాశాడు. ఒక రైతుగా ఆయనకున్న గుర్తింపు ఆయనలోని కవిని అణచివేయడం బాధాకరం. కానీ ఆయన తిరుగుబాటు పద్యాల ద్వారా ఆయన చిరకాలం జీవించే ఉంటారని మనం ఆశించవచ్చు.
కలంబ్ చిన్న చిన్న చిత్తు కాగితాలపై రాసేవాడు. తన రచనలను ఎప్పుడూ భద్రపరుచుకోలేదు. తన కవితలన్నింటినీ కంఠస్థం చేసుకుని, స్నేహితులు కోరినప్పుడల్లా వాటిని లయబద్ధంగా ఆలపించేవారు. ఆయన కన్నుమూసిన తర్వాత, ఆయన పెద్ద కూతురు ఉష, తన తండ్రి ట్రంకు పెట్టెలో, సంచుల్లో, స్నేహితుల ఇళ్లలో ఆ చిత్తు కాగితాల కోసం శ్రద్ధగా వెతికింది.
కలంబ్ రాసిన అనేక పద్యాలలో కేవలం యాభైకి పైగా చిత్తు ప్రతులను మాత్రమే ఆమెకు దొరికాయి. వాటిలో ఎక్కువ భాగం బేరార్ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ రైతు చిన్న ప్రపంచాన్ని మన కళ్ళకు కడతాయ. ఆ రైతు తన ప్రతి అవసరానికి నిత్యం అప్పులు చేయాలి. ఆ అప్పు తీర్చలేక సతమతమవుతూ ఎంతో వేదన పడతాడు. తోటి రైతుల ఈ దుర్భర జీవితాలను చూసి కలంబ్ ఎంతగానో బాధపడ్డాడు. ఒక రైతు అప్పుల్లోనే పుట్టి, అప్పుల్లోనే చని పోతాడు. మార్కెట్ చేతిలో, రాజకీయ వర్గాల చేతిలో మోసపోతాడు, పండిన పంట పెరిగినా ఆదాయం మాత్రం పెరగని దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతాడు.
కలంబ్ కవితలు బలంగా సూచించినట్లుగానే, గ్రామాల్లో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, అత్యవసరంగా జరగాల్సిన సామాజిక మార్పుల మందకొడి వేగం ఆయనను ఎంతగానో కలవరపెట్టాయి. ఆలోచింపజేశాయి. తండ్రి మరణించిన కొన్ని రోజుల తర్వాత ఉష నాతో మాట్లాడుతూ, తన తండ్రి ఏ క్షణంలోనైనా కష్టాల మధ్య ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు కవితలు రాసేవారని చెప్పారు.
ఆమె తండ్రి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయనందుకు ఆమె అప్పట్లో ఎంతగానో బాధపడింది, ఇప్పటికీ అలాగే బాధపడుతోంది. కుటుంబ పోషణ కోసం ఆమె చివరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం పొందింది.
ఈ పుస్తకంలో నేను నమోదు చేయదలుచుకున్నది కలంబ్ మరణం గురించిన సంఘటన కాదు. ఒక రైతు పడే నరకప్రాయమైన జీవితం గురించి రాశాను. అదే ఆయన కవితలు చిత్రించే వాస్తవం. ఆయన చేసిన గాఢమైన, తాత్కాలికమైన ఆలోచనలు భారతదేశంలోని రైతాంగాన్ని వేధిస్తున్న తీవ్రమైన సంక్షోభాన్ని ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయి. విదర్భలో, దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలోనూ నేను చేసిన రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాలలో, మానవ వేదనను, పోరాటాన్ని, సాహసోపేతమైన తిరుగుబాటును, ఆ ప్రపంచంలో అంతర్భాగమైన ఎన్నో సంక్లిష్టమైన, కుప్పకూలుతున్న ప్రపంచాన్ని స్వయంగా చూశాను. ఈ పుస్తకంలో[v] నేను చెప్పాలనుకుంటున్నది అదే.
తొమ్మిదో దశకం మధ్యకాలానికి, సరళీకృత, ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి అప్రమత్తత లేని ఎంతోమంది రైతులను వారి కల్పనకు మించిన సమస్యల్లోకి నెట్టివేసింది. దీనివల్ల 2000 ల ప్రారంభంలో ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. పత్తి పండే ప్రాంతంలో, నేను యువ, వృద్ధ రైతుల అకాల మరణాల నేపథ్యంలోనూ, కొత్త సహస్రాబ్దంలో రూపుదిద్దుకుంటున్న భారతం మధ్యలోనూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ జీవిస్తున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వ్యవసాయం కాకుండా సేవా రంగం వంటి ఇతర రంగాల ద్వారా నడుస్తోంది. స్థానిక రైతుల మార్కెట్లలోకి పత్తి లేదా ఆహార ధాన్యాల వంటి గ్లోబల్ మార్కెట్లు చొరబడ్డాయి. జనాభాలోని కొన్ని వర్గాలు వేగంగా ఆర్థికంగా పైకి ఎదుగుతుండటం కొత్త అసమానతలను సృష్టించింది. దీనివల్ల తాము అన్నిట్లోనూ వెనుకబడిపోతున్నామనే భావన రైతాంగంలో కలిగింది. ఈ వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు సమాజంలో ఎంతోకాలంగా వేళ్లూనుకున్న సామాజిక సమీకరణాలను కూడా మార్చివేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు గౌరవప్రదమైన తరగతులుగా ఉన్న భూస్వామ్య రైతులు ఇప్పుడు తమ పెరుగుతున్న అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. అదే సమయంలో, వ్యవసాయేతర వర్గాలు అసంఘటిత సేవా రంగంలో భాగమై, మెరుగైన వేతనాలు, పనుల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి, గతంలో వ్యవసాయ కూలీలుగా ఉన్నప్పటికంటే కాస్త మెరుగైన స్థితిలో జీవిస్తున్నాయి.
విదర్భలోని గ్రామీణ రైతాంగంలో కొత్త ఆర్థిక పరిస్థితులు తమకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయనే అభిప్రాయం బలంగా పెరుగుతోంది. ఉదాహరణకు, పత్తి రైతులు విద్యుత్, ఉత్పాదకాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో తమ సాగు ఖర్చులు అనేక రెట్లు పెరిగినట్లు చూశారు. సాధారణంగా జీవన వ్యయం – ఆరోగ్యం, విద్య మొదలైనవి పెరిగినప్పటికీ, వారి వాస్తవ ఆదాయాలు మాత్రం స్థిరంగా ఉండిపోయాయి. ప్రభుత్వ సబ్సిడీలను కొద్దో గొప్పో పెంచారు. లేదా పూర్తిగా ఉపసంహరించుకున్నారు. తగ్గుతున్న ఆదాయాలు, పెరుగుతున్న జీవన వ్యయం యాదృచ్ఛికంగా జరిగినవి కావని, కావాలని చేశారని వారు వాపోయారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ధనవంతుల వైపు మొగ్గు చూపుతున్నాయని, గ్రామాల్లో జీవించడం కష్టతరంగా మారిందని నేను చూసిన గ్రామాలు భావించాయి.
నిరసనగా, వారు అధికారుల దృష్టిని ఆకర్షించడానికి కొన్నిసార్లు వింతగా, సంచలనాత్మకమైన నిరసన పద్ధతులను ఆశ్రయించారు. కొన్ని గ్రామాలు తమను తాము ఇల్లూ, వాకిలి తో సహా అమ్మకానికి పెట్టాయి. కొంతమంది నివాసితులు తమ మూత్రపిండాలను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు బోర్డులు పెట్టారు. కేవలం తమ గోడు వినిపించడానికి వేలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చారు. విదర్భలోనే కాకుండా, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వారు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.
ఉదాహరణకు, 2021 ప్రారంభం నాటికి, నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తామని చెబుతూ ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా, రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని నిరసన తెలిపారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన రైతులు ఈ చట్టాలపై నమ్మకం లేక అసంతృప్తిగా ఉన్నారు. తమకు కొంతవరకు మద్దతు ధరను, సకాలంలో కొనుగోళ్లను అందించిన పాత వ్యవస్థను ఈ కొత్త చట్టాలు తుడిచిపెట్టేస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త చట్టాలు పెద్ద కార్పొరేట్లు తమ ఏకైక ఆస్తయిన భూమిని కైవసం చేసుకోవడానికి సహాయపడతాయని వారు భయపడుతున్నారు. రైతుల ఆదాయాల పెంచడానికి బదులుగా, ప్రభుత్వం వ్యవసాయానికి ఉన్న ప్రస్తుత మద్దతును తొలగిస్తోందని వారు వాదిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా, ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య ఈ చట్టాలను ఆమోదించిన తీరు వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.
దేశవ్యాప్తంగా రైతుల పోరాటం ఎట్టకేలకు ఊపందుకుంటోంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సంక్షోభం అంటే ఏమిటో నేను గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి కుటుంబాల మధ్య దగ్గరగా చూశాను. కొందరి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేకపోవడంతో, గ్రామస్తులంతా కలిసి డబ్బు పోగు చేసి దహన సంస్కారాలు నిర్వహించిన సందర్భాలను చూశాను. జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులకు రాసిన రైతుల లేఖలను, ఆత్మహత్య లేఖలను చదివాను. వాటిలో ఒక లేఖలో, ఒక యువ రైతు తన భార్యకు పునర్వివాహం చేసుకోవాలని సూచించాడు. అయితే రైతు ను మాత్ర౦ వద్దని కోరాడు. ఒక 24 గంటల వ్యవధిలోనే ఒక ఊరంతా కలిసి ఒక వివాహ వేడుకతో పాటు మూడు అంత్యక్రియలు జరిపారు. ఈ దృశ్యాన్ని నేను కళ్లారా చూశాను. బావి ఎండిపోతే బకెట్, మగ్‌తో తన నారింజ తోటకు నీళ్లు తోడి పోసిన వాషిమ్ ప్రాంతపు యువ రైతును చూశాను. మామ, భర్త, ఇద్దరు బావమరుదులు, ఇలా కుటుంబంలోని నలుగురు పురుషులు ఆత్మహత్య చేసుకున్నా సరే, కుటుంబాన్ని నిలబెట్టడానికి, అప్పులు తీర్చడానికి, ఒక ప్రగతిశీల రైతుగా ఎదుగడానికి పోరాడిన వితంతువును చూశాను. మహిళా రైతుల ఆత్మహత్యలు, చిన్నారుల ఆత్మహత్యలపై కూడా నేను రిపోర్ట్ చేశాను.
ఈ ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి: ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన విశ్వ ఆర్థిక వ్యవస్థ; వ్యవసాయమే కాదు, జీవితమే వాణిజ్య వస్తువుగా మారడం; తగిన భద్రతా వలయాలు లేకపోవడం వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థను తట్టుకోలేకపోతున్న గ్రామీణ జనాభా; గ్రామాలకు దూరంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకున్న కొత్త సంపన్న భారతం; పట్టణ ప్రాంతాలలో కూడా అల్లాడుతున్న పేదవారు. గత ముప్పై సంవత్సరాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ఒక వర్గం భారతీయులకు కలల జీవితాన్ని అందించాయి. కానీ కోట్లాది మంది రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు మాత్రం ఇది అంతులేని మాంద్యంలాంటి కల్లోలభరితమైన, మృత్యు కాలంగా మారింది. రాజకీయ పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
గ్రామీణ, పట్టణ భారతదేశం మధ్య అంతరం ఎంతగా పెరిగిందంటే, ఒక సీజన్‌లో వర్షం కురవకపోయినా, దానివల్ల వ్యవసాయ దిగుబడి తగ్గి ద్రవ్యోల్బణం పెరిగినా పట్టణ ప్రాంతాలలోని వారికి ఆ మాత్రం కూడా పట్టడం లేదు. దీనికి స్పష్టమైన ఉదాహరణ 2020 వేసవిలో కోవిడ్-19లాక్‌డౌన్ సమయంలో కనిపించింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు, లక్షలాది మంది పేద వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతలో వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్లారు. దారిలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోగా, సంపన్న భారతీయులు మాత్రం ఇళ్లకే పరిమితమై, చిన్నచిన్న అసౌకర్యాలతో సుదీర్ఘ సెలవుదినాలను ఆస్వాదించారు.
ఒకప్పుడు, మా నాన్న గుర్తు చేసుకున్నాడు. ‘మధ్యతరగతి ప్రజలు కూడా రుతుపవనాల రాక కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఎందుకంటే అది వారి కుటుంబ బడ్జెట్‌పైన కూడా ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.’ నేడు ఈ రెండు ప్రపంచాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అగ్రశ్రేణి 10 శాతం మందికి చెందిన ప్రపంచానికి, దిగువన ఉన్న 50 శాతం మందికి చెందిన ప్రపంచానికి మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న మధ్యతరగతి ప్రజలు ప్రతి ఏటా ఎంత బంగారం కొనుగోలు చేస్తున్నారో, అదే సమయంలో రైతులు తమ భూములను సాగులో ఉంచుకోవడం కోసం అత్యవసరంగా నగదును సమకూర్చుకోవడానికి బంగారాన్ని ఎలా అమ్ముకుంటున్నారో లేదా తాకట్టు పెడుతున్నారో పరిశీలిస్తే దీనికి ఒక ఉదాహరణ అర్థమవుతుంది.
భారతదేశపు అగ్రగామి గ్రామీణ వ్యవసాయ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ మాటల్లో చెప్పాలంటే, నేడు గ్రామీణ ప్రాంతాలు మూడో, నాలుగో లేదా ఐదో ప్రపంచంలా కాకుండా మరో గ్రహంలా ఉన్నామా, అన్నంతగా మారిపోయాయి. అత్యంత దయనీయమైన వ్యవసాయ ఆదాయంతో ఈ గ్రామీణ ప్రపంచం తన కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టంగా మారుతోంది. ఒక రిపోర్టర్‌గా, పౌరుడిగా, మిగతా దేశం ఎలాగైతే అభివృద్ధి చెందిందో, కాలక్రమేణా గ్రామీణ ప్రజల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అనుకున్నా.
అయితే నా ఆశ ఇప్పటివరకు నెరవేరలేదు.
1991లో దేశం తన ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన తర్వాత, కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మూలధన పెట్టుబడుల కారణంగా కొన్ని మార్పులు జరిగాయన్నది వాస్తవమే. కానీ విదర్భతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజల జీవితాలు, ఇవి పట్టణాలకు కేవలం కూత వేటు దూరంలో ఉన్నా, ఇప్పటికీ కష్టాలతోనే కూడుకుని ఉన్నాయి.
పెద్ద నగరాలకు దూరంగా, జీవనం మరింత భారంగా మారింది. దీనికి మినహాయింపులు చాలా అరుదు. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక ఇబ్బందులు నిరంతరం వేధిస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ వార్షిక నివేదికల డేటాను పరిశీలిస్తే, 1995- 2018 మధ్య భారతదేశంలో దాదాపు 4,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.[vi] ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు? రైతులు ఆకలి, అప్పులు, ఊహించనీ విపరీతమైనా వాతావరణ మార్పులు, ధరల హెచ్చుతగ్గులు, పేదరికం, వ్యవస్థాత్మక అసమానతలను ఎలా ఎదుర్కొంటున్నారు? వారిని ఏది ముందుకు నడిపిస్తోంది? వారికి ఏమైనా కలలు ఉన్నాయా – అసలు వారికి కలలు అనేవి ఉంటే?
రెండు దశాబ్దాలకు పైగా క్రితం యావత్మాల్ గ్రామంలో ఒక పత్తి రైతు ఆత్మహత్య గురించి నేను మొదటిసారి రిపోర్ట్ చేసినప్పటి నుండి, వ్యవసాయ సంక్షోభం కథ బోరింగ్‌గా మారుతోంది. రాజకీయ పార్టీలు ఉచితాలు, ఆకర్షణీయమైన కొత్త పథకాలను వాగ్దానం చేస్తాయి. ఆర్థికవేత్తలు మరిన్ని సంస్కరణల కోసం పిలుపునిస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొసలి కన్నీరు కారుస్తూ, కొత్త సాంకేతికతలను ప్రోత్సహిస్తాయి. ఆధునిక వ్యవస్థలను స్వీకరించాలని కోరుతాయి; అదే సమయంలో రైతులు నిశ్శబ్దంగా తమ పనులను కొనసాగిస్తూనే ఉంటారు – ఏటికేడూ మరింత లోతుగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఈ పుస్తకం ఎందుకు రాశాను? మరణాలను భయంకరమైన గణాంకాలతో వివరించడానికి కాదు. లేదా పత్తి పండే ఈ ప్రాంతం రైతుల శ్మశానవాటికగా ఎలా మారిందో చారిత్రక వృత్తాంతాన్ని అందించడానికాదు. ‘పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా’ ట్యాగ్‌లైన్ తెలిపినట్లుగా, సాధారణ రైతు దైనందిన జీవితాన్ని తెలియజేయడమే దీని ఉద్దేశం. తీవ్రమైన చర్చలు, వాదనలు, రకరకాల సంస్కరణల డిమాండ్లు, అనేక సైద్ధాంతిక సూత్రాలు, పేదలు, రైతాంగం కోసం కొత్త కార్యక్రమాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. వీటి మధ్య, అధికారంలో ఉన్నవారి దృష్టిలో, ఒక రైతు జీవితం సన్నటి దారానికి వేలాడుతుంటుంది. ఆ తీవ్రమైన అడుగు వేసేలా రైతును నడిపించే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం మధ్య విషాదాన్ని అలాగే మనిషి పట్టుదలను చాటే ఎన్నో కథలు దేశవ్యాప్తంగా వినిపిస్తాయి. ఇది కేవలం అందులో ఒకటి మాత్రమే.
ముందే చెప్పాను. ఇది కలాంబ్ కథ కాదు. మన మధ్య లేని వేలాది మంది ఇతర రైతుల వలె అతను కూడా జీవించి లేడు, ఈ కథను మనకు చెప్పడానికి. ఇది ఒక ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కథ. రామ్ రావ్ అనే రైతు వెత. కలాంబ్ కవితలు ఎవరి గురించైతే చెప్తాయో, ఆ సాధారణ రైతు అసాధారణ పోరాటమే ఇది. ఇది ఒక అసమాన ప్రపంచంలో జీవన సాగించే కథ. నిరంతరం ఆశపై ఆధారపడే ప్రపంచం. ఎండమావిలా వేలాడే ఆశ.
పాద సూచికలు
[i] సంస్కృత పదం “విదర్భ” స్థానిక మాండలికాల ద్వారా “వర్హాడ్”గా మారింది. ఆ తర్వాత ఫార్సీ ప్రభావంతో, బ్రిటిష్ పరిపాలనలో ” బరార్”గా రూపాంతరం చెందింది.
[ii] తరతరాలుగా భూములు పంపకాలు అవ్వడం వల్ల, దేశవ్యాప్తంగా ఒక్కో రైతు వద్ద ఉండే సగటు సాగు భూమి పరిమాణం సుమారు 0.74 నుండి 1.08 హెక్టార్లకు (దాదాపు 1.8 నుండి 2.6 ఎకరాలు) తగ్గిపోయింది.
వ్యవసాయ అర్థశాస్త్రం ప్రకారం- ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో- 1 హెక్టారు (సుమారు 2.47 ఎకరాలు) కంటే తక్కువ సాగు భూమి ఉన్న రైతు వ్యవసాయం ఒక్కదాని పైనే ఆధారపడి జీవించడం సాధ్యం కాదని వ్యవసాయ విధాన విశ్లేషకులు మరియు కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (CACP) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయేతర ఆదాయ మార్గాలు ఉంటే తప్ప ఈ భూమి ద్వారా మాత్రమే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం.
మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు మొత్తం రైతుల్లో 86% కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ, వారి వద్ద ఉన్నది మొత్తం సాగు భూమిలో కేవలం 47% మాత్రమే.
[iii] భారతదేశంలో మొత్తం సాగు భూమి (నెట్ సోన్ ఏరియా) దాదాపు 140 నుండి 142 మిలియన్ హెక్టార్లుగా ఉంది. అందులో సుమారు 51% నుండి 55% భూమి కేవలం వర్షపాతం (వర్షాధారం) పైనే ఆధారపడి సాగువుతోంది. కాలువలు, బోరు బావులు వంటి కృత్రిమ నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల దాదాపు 70 నుండి 73 మిలియన్ హెక్టార్ల భూమి పూర్తి నీటి కోసం వర్షాలపైనే ఆధారపడుతోంది.
విదర్భలో మొత్తం నికర సాగు భూమి దాదాపు 54.5 లక్షల హెక్టార్లు కాగా, అందులో దాదాపు 80% అంటే సుమారు 43.6 లక్షల హెక్టార్ల భూమి నీటిపారుదల వసతులు లేక పూర్తిగా వర్షపాతంపైనే ఆధారపడి సాగువుతోంది.
[iv] పశ్చిమ విదర్భ (అమరావతి విభాగం) పరిధిలోకి అమరావతి, అకోలా, బుల్ధానా, వాషిమ్, యవత్మాల్ జిల్లాలు వస్తాయి.
[v] Ramrao: The Story of India’s Farm Crisis పుస్తకాన్ని 2021లో హార్పర్ కోలిన్స్ ఇండియా ప్రచురించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన రామ్‌రావ్ పంచలేనివార్ అనే ప్రత్తి రైతు జీవితం ఆధారంగా ఇది రూపొందింది. ఆత్మహత్యాయత్నం నుండి బయటపడిన ఆ రైతు కథ ద్వారా, భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు రైతుల కష్టాలను ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుంది.
[vi] వ్యవసాయ రంగంలో నమోదవుతున్న మొత్తం ఆత్మహత్యలలో 70% నుండి 80% వరకు వరుసగా ఐదు రాష్ట్రాల (మహారాష్ట్ర- ఇది ఒక్కటే దాదాపు 38%, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్) నుండే నమోదవుతున్నాయి.




