తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు. ఈ పుస్తకం వచ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర అవసరమైన సాహిత్య విమర్శ అయినందున ఈ వ్యాసాలకు కాలం తీరదు. “నిశిత” అనే ఈ పుస్తకం పేరు నూరుపాళ్ళు సార్థకమని మనం ఒప్పుకొని తీరుతాం. ఇందులో పరిశీలన నిశితమైనదే. కానీ చెంచయ్య గారి వ్యక్తిత్వం నుండి చెప్పిన తీరు “వ్యక్తిత్వమే సాహిత్య విమర్శ” అనిపిస్తూంది.
“కవిలో చిత్తశుద్ధి ఉంది- అవగాహనే కొరవడింది” అనే సమీక్షా వ్యాసంలో కవిత్వం రాసే వాళ్లలోని గందరగోళాన్ని వివరించారు. సరియైన అధ్యయనం లేకపోవడం వల్ల కవిత్వంలో వచ్చే వైరుధ్యాల్ని గ్రహించుకోలేక , కొందరు కవులు మొత్తంగా సమాజాన్నే ప్రశ్నిస్తూ ఉంటారు, “పాలకవర్గాన్ని ప్రశ్నించలేని కవి ప్రజలకు విజ్ఞప్తి చేసే నైతిక హక్కును కోల్పోతాడు” అని చారిత్రక వాస్తవాన్ని సామాజిక పునాది నుండి గుర్తు చేస్తారు.
అట్లాగే కవిత్వంలో భాష, పదప్రయోగాలు, ప్రజాస్వామ్యం అనేక విషయాల్లో ఉండే వైరుధ్యాల్ని వివరిస్తూ, ఓ కవి మిత్రుడు జ్యోతిబసు కు సంతాపాన్ని తెలుపుతూ “శ్రమైక జీవన సౌందర్యానికి అర్థం చెప్పిన మహర్షి” అనడాన్ని, 1967 నక్సల్బరి వెలుగుల నుండి వివరించి ఆ కవిని మేల్కొల్పుతాడు . అంటే కవులకు ఉండాల్సిన చారిత్రక దృష్టి లోపించ కూడదని ప్రజలపక్షంగా నిలబడే వాడు కవి కాబట్టి అది కవికి తప్పనిసరి అని విశదం చేస్తారు. పీడిత ప్రజానీకం తరఫున సాంస్కృతిక రంగంలో సాహిత్య కారునిగా పోరాడే కవి ప్రజా యుద్ధ సైనికుడవుతాడు అని వివరిస్తారు. అట్లా సాహిత్యానికి సమాజానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తారు.
మరో కవి గురించి విశ్లేషిస్తూ
“పట్టెడన్నం పెట్టే తొలి పొద్దు కోసం
మళ్ళీ మళ్ళీ పుడతాం” అని ఆ కవి ఆదివాసీల ఆశావహమైన దృక్పథాన్ని ఎత్తి పట్టిన తీరును అభినందిస్తారు. ఎంతో అభ్యుదయంగా రాస్తూ కూడా కొందరు కవుల్లో అక్కడక్కడా నిరాశ, వైరాగ్యం కనిపించడాన్ని ప్రస్తావిస్తూ, నిరంతర అధ్యయనం సమిష్టి ఆచరణలకు దగ్గరవ్వడమే పరిష్కారం అని స్పష్టం చేస్తారు. ఒంటరిగా మిగిలిపోకుండా, సమిష్టి ఆచరణలో భాగమవడమే శాస్త్రీయంగా ముందుకు సాగడం అని అంటారు.
ప్రజల కష్టాల్ని కన్నీళ్ళని ముందు పెట్టే కవికి “గుండె తడి అన్నది ప్రాథమిక షరతు” అంటారు. అదొక్కటే చాలదు శాస్త్రీయమైన దృక్పథం చారిత్రక అవగాహన ఉండాలి. పీడకుల్ని విమర్శించడంతో సరిపోదు ప్రజలను కర్తవ్యోన్ముఖుల్ని చేయాలనేది కవులకు ఉండాల్సిన బాధ్యత అని కూడా స్పష్టం చేస్తారు.
“బ్రతుకుల్లో వెలుగు నిండాలంటే
శ్రీ శ్రీ కావాలి
కృష్ణదేవరాయల కాలం రావాలి ” అనే కవి వాక్యాన్ని అందులోని చారిత్రక అవగాహనా లోపాన్ని తెలియజేస్తూ ఆయా చారిత్రక దశల గురించి కవులకు తప్పనిసరి అవగాహన ఉండాల్సిందని, లేకుంటే ఇలాంటి వైరుధ్యాలు మనల్ని గమ్యం వైపుకు సాగకుండా అడ్డగిస్తాయని తెలియజేస్తాడు. నిజమే కదా స్వర్ణ యుగాలని పాఠ్యాంశాల్లో చెప్పిన కథనాలు, రాజుల ఉదాత్త వ్యక్తిత్వాల వర్ణనల నుండి మనం బయటపడాల్సిందే. వ్యవస్థ మూలాలను తెలుసుకోకుండా పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోకుండా నేటి కవి ప్రజా కవిగా నిలబడలేడు. సాహిత్య విమర్శకుడు ఇలాంటి మౌలిక విషయాల పట్ల కవుల్ని జాగరూకుల్ని చేయాల్సిందే కదా! “ఎవడైతేనేం ఒక్కొక్కడు మహా హంతకుడు “అనిన శ్రీ శ్రీ వాక్యాలు మనకు వెలుగుదారులు కదా!
మరో కవి మిత్రుని ఉద్దేశిస్తూ, కవిత్వంలోని పద ప్రయోగాల్ని అవగాహనల్ని మానవ సంబంధాలు సామాజిక సమస్యలపై క్లిష్టత, అస్పష్టత లేని మంచి కవిత్వాన్ని చెప్పగలిగాడని అభినందిస్తూనే, “నా ఇష్టం” అనే కవితలో ఆధునిక నాగరికత మనిషిని ఎంత కృత్రిమంగా తయారు చేస్తున్నది బాగా చెప్పాడు. చివర్లో .. అనాది మానవుడ్నే నేను ఇష్టపడతాను అన్నాడు. అంటే వర్గ పూర్వ సమాజంలోని అభద్రతతో, అమాయకత్వంతో ఉన్న మానవుడే మేలని అనుకుంటున్నాడిక్కడ కవి. కానీ రాబోయే వర్గరహిత వ్యవస్థలోని మానవుని ఆహ్వానిస్తే బాగుండేది అంటారు..ఆ కవికి చివరి కంటా జాగరూకతను అంద జేస్తూ చెంచయ్య గారు.
ఈ కవుల రచనల విషయంగానే గాక, ఆయా సంకలనాల్లో ముందు మాటలు రాసిన వాళ్ళ అభిప్రాయాల్లోని వైరుధ్యానికి తన సహజమైన వ్యంగ్యంతో చురక లంటించారు. ఇదంతా సాహిత్య విమర్శకుని బాధ్యతలో నుంచి ఆయన చేసినట్లు ఒక సాహిత్య విమర్శకునిగా తన కర్తవ్య నిర్వహణలో ఇదీ భాగమని భావించినట్లు మనకు అర్థమవుతుంది.
ఇటీవల కాలంలో ఆస్థాన కవిత్వం లాగా కుటుంబ నిర్వహణలో కవిత్వ ఆవిష్కరణలు, అధికార కేంద్రాల సరికొత్త భువన విజయాలనూ చూస్తున్నాం. వంద పేజీల పుస్తకంలో యాభై పేజీల దాకా ముందు మాటలు ఫోటోలు రకరకాల భక్తి ప్రపత్తులతో కవిత్వం ఒక వైయక్తిక కుటుంబ, కులాచార కలాపంలా సాగుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కవిత్వ సంకలనాల్లోని సాహిత్యాంశాల్ని, రూపాన్నీ సారాన్నీ ఊహించవచ్చు. ఇట్లా సామాజిక దృక్పథాన్ని నిశితంగా విశ్లేషించి తగు సలహాలను చెంచయ్య గారు అందించడం ఇవాళ్టి సాహిత్య అవసరమను కుంటాను.
ఈ కవిత్వ సంకలనాలు గాక మరో ఐదు పుస్తకాల్ని ఇందులో సమీక్షించారు. భాషకు సంబంధించి “తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి” అని తూమాటి సంజీవరావు గారి గురించి, ‘తెలుగు పద సోపానం’ ఆయన భాషా కృషి లో ప్రత్యేకంగా చెప్పుకోదగిందని తెలిపారు. విశ్రాంత జీవితంలో అవిశ్రాంతంగా తెలుగు భాషాభివృద్ధి కోసం తపిస్తూ, తమిళనాడులో తెలుగువాచకాల్లోని తప్పుల్ని సవరించాలని ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినా వాళ్లు పట్టించుకోకపోతే కోర్టులో కేసు వేసి విజయం సాధించారని, ఆయన పట్టుదలను భాషావేత్తగా ఆయన రచనలను విద్యార్థులు ఉపాధ్యాయులు విలేకరులు రచయితలకు ఉపయోగపడే రచనలు ఆయన చేశారని అద్దంలో చంద్రుడిలాగా వర్ణ, పద, అర్థం అనర్థం వాక్య నిర్మాణ విభాగాలుగా సమగ్రమైన రచనను అందించారని తెలిపారు. అలాగే ఆయన రచనలోని అస్పష్టతలు పొరబాట్లు భేదాభిప్రాయాలను చర్చించి ముందు భాష తర్వాత వ్యాకరణం పుడుతుందని కాలక్రమంలో భాషలో మార్పులు సహజమని సంజీవరావు గారి కృషిని వివరిస్తూ చివరికి ఆసక్తికరంగా “ఆయన నాకు ఆప్తమిత్రుడు” అని ముగించారు . తూమాటి ఇంటి పేరుతో నాకైతే ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త తూమాటి ద్రోణప్పగారు గుర్తుకొచ్చారు.
భాషకు సంబంధించిందే మరొక లోతైన వ్యాసం, “ఒక జాతిలో వర్గాలుంటాయి గాని వర్గ భాషలు ఉండవు” అనేది. “మార్క్సిజం-భాషా శాస్త్ర సమస్యలు” పేరుతో స్టాలిన్ రాసిన వ్యాసాన్ని పేర్కొంటూ సాగిందీ వ్యాసం. పునాది ఉపరితలం విభిన్న సామాజిక వ్యవస్థల్లో ప్రతి పునాదికి దానికి తగిన కట్టడం ఉంటుంది. భాషను పునాది మీది కట్టడంగా భావించడాన్ని స్టాలిన్ తీవ్రంగా ఖండించాడు. సోవియట్ అక్టోబర్ విప్లవం తర్వాత కూడా పదజాలంలో కొంత మార్పే గాని భాషలో కాదని, భాషలో పెను మార్పు వల్ల విప్లవానికి ఒరిగేదేమీ ఉండదన్న” స్టాలిన్ అభిప్రాయాలతో లోతైన అవగాహనను అందించారు.
ఈ వ్యాసాన్ని అక్షరం అక్షరం మనం చదువుకోవాల్సిందే. స్టాలిన్ దాకా వెళ్లాల్సిందే. “భాష తన మౌలిక లక్షణాన్ని వదులు కోకుండానే దశలు దశలుగా అభివృద్ధి పొందుతూ క్రమ పరిణామం చెందుతుంది. భాషాభివృద్ధిలో ఆకస్మిక విధ్వంసం ఉండదు. కొత్త భాషను హఠాత్తుగా సృష్టించడమూ ఉండదు. ఇదే మార్క్సిస్ట్ అవగాహన.” అని మనల్ని అక్కడ నిలబెడతారు చెంచయ్య సారు.
” విద్యా విధానంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి”ఆ మధ్య బాగా వైరల్ అయిన విషయం ఇది.” దళిత బహుజనులకు తెలుగు అగ్రకులాలకు ఇంగ్లీషు చదవా? “అనే కంచె ఐలయ్య గారి పుస్తకం గురించిన వ్యాసమిది. ఇందులో ఐలయ్యగారు లేవనెత్తిన అనేక ప్రశ్నలు ఆలోచింపదగినవని, ఈ ధోరణిలో ఆయన కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారని అంటాడు వ్యాస రచయిత. ముఖ్యంగా ” లింక్ లాంగ్వేజ్ గా, బోధనా భాషగా ఎలాగూ ఆచరణలో ఉన్నప్పుడు దానినే అధికారికంగా జాతీయ భాషగా గుర్తించాలన్నది ఆయన చేస్తున్న వివాదాస్పద ప్రకటనల్లో ఒకటి. ఆచరణలో నిజమైనా ఎవరికీ మాతృభాష గాని భాషను జాతీయ భాషగా గుర్తించాలనడం, దేశంలో ఎలాగూ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని చట్టబద్ధం చేయాలనడం లాంటిదే అవుతుంది అంటారు చెంచయ్య గారు. ఆంగ్లాన్నీ, ప్రాంతీయ భాషనూ రెండింటినీ సమానంగా బోధించాలన్న ఐలయ్య స్ఫూర్తికి ఇది భిన్నంగా కనిపిస్తుందీ” అంటారు. ఇంకా అనేక విషయాలతో లోతైన భాషా సమస్యలపై సమాధానాల వైపుగా ఈ చిన్న వ్యాసం మనల్ని ఎంతగానో ఎడ్యుకేట్ చేస్తుంది.
“బుద్ధుడి కాలామసుత్తం ఏం చెబుతుంది?” అనే వ్యాసంలో డి .చంద్రశేఖర్ పుస్తకాన్ని చర్చించారు.” అన్ని తాత్వికచింతలను పరిశీలించి సరైన నిర్ణయానికి రావడానికి కాలామసుత్తం ప్రాతిపదికను అందిస్తుంది”అనే రచయిత అభిప్రాయం విడ్డూరంగా ఉందని సోదాహరణంగా వివరంగా చర్చిస్తారు. ఈ వ్యాసం కూడా మనల్ని ఆసక్తికరంగా కట్టిపడేసి బౌద్ధం పరిమితుల్ని నాటి మొత్తం వ్యవస్థ స్థితిని, పరిణామాన్నీ చర్చిస్తూ మనకు ఎంతో అవగాహన అందిస్తుంది. వర్ణము కులమూ రెండూ విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి అనే శీర్షికతోనే”వర్ణం నుండి కులం దాకా” యలపర్తి నవీన్ బాబు ఎంఫిల్ థీసిస్ పై, ఇది మార్క్సిస్టు దృక్కోణం నుండి చేసిందే అన్నారు. ఈ వ్యాసం మనకు ఒక టార్చ్ లైట్ లాంటిది. యలపర్తి నవీన్ బాబును, మొత్తంగా వర్ణము కులము పై సమగ్ర అవగాహనను అందు కునేందుకు మనం తప్పకుండా చదవాల్సింది.” “నవీన్ బాబు జాతీయవాది నుండి అంతర్జాతీయ వాదిగా, సామాజిక శాస్త్రవేత్త నుండి విప్లవకారుడిగా, ఒక కామ్రేడ్ నుండి అమరవీరుడిగా ఎదిగిన యువ మార్క్సిస్టు మేధావి” అంటారు చెంచయ్యగారు.
” నిశిత” అనే పేరుతో కేవలం 43 పేజీల ఈ పుస్తకం ఒక నిబద్ధ సాహిత్య కారుని జీవితం నుండి మనకు అందివచ్చిన సాహిత్య సామాజిక అవగాహనా నిధి. కొండ అద్దమందు కొంచమై ఉండదా! అన్నట్లు ఈ పుస్తకాన్ని ఇందులోని విషయాల్ని సొంతం చేసుకోవడం ఒక సాహిత్య బాధ్యత అనుకుంటాను.




