ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం వెనుక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. 1905 బ్రిటిష్ వలస పాలనలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం భారతీయులను విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ చేనేత వస్త్రాలను వినియోగించే దిశగా నడిపించింది. అదే స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక వృత్తిని స్మరించుకునే రోజు మాత్రమే కాదు, అద్భుత‌మైన‌, క‌ళాత్మ‌క‌మైన వృత్తి సంస్కృతిని, స్వావలంబనను, నేతన్నల శ్రమను గౌరవించాల్సిన‌ రోజు.

భారతదేశ చరిత్రలో చేనేతకు వేల ఏళ్ల సంప్రదాయం ఉంది. సింధు నాగరికత కాలం నుంచే నూలు నేయడం ఒక కళగా, జీవన విధానంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత చేనేతకు ఉన్న ప్రత్యేక గుర్తింపులో రాయలసీమ చేనేత ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ధర్మవరం పట్టు చీరలు, హిందూపురం చేనేత, రాయదుర్గం, తాడిపత్రి, మదనపల్లె వంటి ప్రాంతాలు దశాబ్దాలుగా చేనేత కళకు చిరునామాలుగా నిలిచాయి. ముఖ్యంగా ధర్మవరం పట్టు చీరలు తమ నాణ్యత, నైపుణ్యం, వైభవంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయి. అగ్గిపెట్టెలో పట్టేంత పరిమాణంలో చీర నేశారంటే ఇక్కడి చేనేత నైపుణ్యానికి, కళకు అద్భుత నిదర్శనం. ఈ ఘనత, నైపుణ్యం రాయ‌ల‌సీమ ప‌ల్లె సీమ‌ల బ‌డుగు ప్ర‌జ‌ల సొంతం.   

ఒక చీర నేయ‌డం వెనుక రోజుల తరబడి కష్టపడే నేత కార్మికుల‌ చేతుల్లో కళ, సహనం, సృజనాత్మకత అద్భుతంగా మిళితమై ఉంటాయి.  కానీ ఆ కళకు తగ్గ గౌరవం, ఆ శ్రమకు తగిన ప్రతిఫలం మాత్రం ఇప్పటికీ అందడం లేదు.  రాయ‌ల‌సీమ నాలుగు ఉమ్మ‌డి జిల్లాల్లో చేనేత మీద‌నే బ‌తికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కుటుంబాలు ద‌య‌నీయంగా మారిపోయాయి. ప్ర‌సిద్ధి పొందిన రాయ‌ల‌సీమ చేనేత ఇప్ప‌డు వెలిసిపోతోంది. దానికి కొత్త రంగులు అద్దాలి. ఈ సంక్షోభం నుంచి బైట ప‌డేసే విధానాలు కావాలి.

రాష్ట్రంలో చేనేత ఉత్పత్తిలో రాయలసీమ వాటా 30 శాతంగా ఉంది. ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం, కదిరి ప్రాంతాలు చేనేతకు కేంద్రాలుగా ఉన్నాయి. ప్రభుత్వం కేవలం చీరలు నేసే కార్మికుల‌నే చేనేత కార్మికులుగా గుర్తిస్తోంది. చేనేత కార్మికులు అంతే కేవలం చీరలు నేసే శ్రామికులే కాదు. ఆ చీర వేయడానికి అవసరమయ్యే ముడి పదార్థాలను తయారు చేసే శ్రామికులంతా కూడా చేనేత కార్మికుల కిందే వస్తారు.

రంగులు అద్దేవారు : ముడి నూలు లేదా పట్టు దారాలకు రసాయన లేదా సహజ రంగులను అద్ది ఆరబెట్టే కార్మికులు.

ఆసు పోసేవారు / దారం చుట్టేవారు: కండెలు, రాట్నాల సహాయంతో దారాలను విడదీసి, మగ్గానికి సరిపడా పడుగు- పేకలుగా సిద్ధం చేసేవారు.ఈ విభాగంలో మహిళలు ఎక్కువగా ఉంటారు.

అచ్చులు అల్లేవారు: మగ్గంలో దారాలు చిక్కుపడకుండా డిజైన్ ప్రకారం అచ్చులను, పళ్లేల‌ను తయారు చేసే సాంకేతిక నిపుణులు.

డిజైనర్లు / గ్రాఫ్ రాసేవారు: చీరలపై వచ్చే జరీ బుటాలు, అంచుల డిజైన్లను గ్రాఫ్ షీట్లపై గీసి, జాకార్డ్ మగ్గాల కోసం పంచ్ కార్డులను తయారు చేసే కళాకారులు.

ఇలా ఎంతోమంది కార్మికులు చేనేత రంగానికి అనుబంధంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం రాయలసీమ వ్యాప్తంగా 30వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని చెబుతున్నప్పటికీ, వాస్తవిక పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది.  ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 30 వేల మంది చేనేత కార్మికులు ఉన్నట్లు కొన్ని సంస్థల సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సంఖ్యల వెనుక ఒక విషాద వాస్తవం దాగి ఉంది.

ఒకప్పుడు ప్రతి గ్రామంలో మారుమోగిన మగ్గాల శబ్దం నేడు క్రమంగా మూగబోతోంది. ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు, మద్దతు లేకపోవడం వలన చేనేత కుటుంబాలు క్రమంగా చేనేతకు దూరమవుతూ, ఇక్కడి చేనేత కుటుంబాల యువత ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్తోంది. చాలా చోట్ల మగ్గాలు దుమ్ము పట్టి మూలన పడి ఉండగా, వాటిని నడిపే చేతులు కూలి పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక వృత్తి క్షీణత కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సంస్కృతి, ఒక జీవన విధానం నెమ్మదిగా కనుమరుగవుతున్న సంకేతం.

రాయలసీమ చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనేకం. నూలు, రంగులు వంటి ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. పవర్‌లూమ్ ఉత్పత్తులు తక్కువ ధరలకు మార్కెట్‌ను ఆక్రమించడంతో సంప్రదాయ చేనేత పోటీని తట్టుకోలేకపోతోంది. మధ్యవర్తుల ఆధిపత్యం వల్ల అసలు శ్రమించిన నేత కార్మికుల‌కు సరైన ధర అందడం లేదు. ఆధునిక మార్కెటింగ్ అవకాశాల కొరత, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్ల అభివృద్ధిలో వెనుకబాటు, సహకార సంఘాల బలహీనత వంటి అంశాలు ఈ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయి. కరువు, నీటి కొరత, ఉపాధి సమస్యలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న రాయలసీమ ప్రజానీకానికి నేత కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్ట పరిస్థితులు ‘మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్లు’ రాయలసీమలో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.

1.రాయలసీమలో ప్రత్యేక చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఉత్పత్తి నుంచి విక్రయం వరకు సమగ్ర వ్యవస్థను రూపొందించాలి.

2.ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం వంటి చేనేత కేంద్రాలకు భౌగోళిక గుర్తింపు (GI) ఆధారిత బ్రాండింగ్‌ను మరింత బలోపేతం చేయాలి.

3.ప్రభుత్వ యూనిఫారాలు, పాఠశాలల దుస్తులు, ప్రభుత్వ కార్యాలయాల వినియోగ వస్త్రాల్లో చేనేతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

4.ఈ-కామర్స్ వేదికల ద్వారా మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు నేరుగా విక్రయించే అవకాశాలను విస్తరించాలి.

5.అంతర్జాతీయ మార్కెట్లలో రాయలసీమ చేనేతకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పించి ఎగుమతులను ప్రోత్సహించాలి.

6.అంతకంటే ముఖ్యంగా యువతను చేనేత రంగం వైపు ఆకర్షించాలి. ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ అభివృద్ధి, ఉత్పత్తుల వైవిధ్యంపై ప్రత్యేక శిక్షణ అందించి చేనేతను సంప్రదాయ వృత్తిగానే కాకుండా ఆధునిక సృజనాత్మక పరిశ్రమగా తీర్చిదిద్దాలి.

7.నేతన్న కుటుంబాలకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సామాజిక భద్రత, తక్కువ వడ్డీ రుణాలు వంటి సౌకర్యాలను మరింత విస్తరించాలి.

చేనేతను కాపాడుకోవడానికి చేనేత వస్త్రాలను వాడే విధంగా ప్రభుత్వం ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చైతన్యం కలిగించాలి. మనం పండుగలు, వివాహాలు, శుభకార్యాలు, జాతీయ పర్వదినాల్లో కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేస్తే అది ఒక నేత కార్మిక‌ కుటుంబానికి ఉపాధిని, ఆత్మవిశ్వాసాన్ని అందించినట్టే. “వోకల్ ఫర్ లోకల్” అనే నినాదానికి నిజమైన అర్థం స్థానిక చేనేతను ఆదరించినప్పుడే సాకారం అవుతుంది.

రాయలసీమ అభివృద్ధి జరగాలంటే సాగు, తాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, విద్య వైద్యం, పరిశ్రమలు,, ప్రాజెక్టుల నిర్మాణం తోపాటు శతాబ్దాల చరిత్ర కలిగిన చేనేత వంటి సంప్రదాయ వృత్తులను కాపాడుతూ, వాటికి ఆధునిక మార్కెట్ కల్పించడం, కళాకారులకు గౌరవప్రదమైన జీవనం కల్పించినప్పుడు మాత్రమే రాయలసీమ సమగ్ర అభివృద్ధిని సాధించగలం.  ఒక మగ్గం ఆగిపోతే కేవలం ఒక కుటుంబం ఆదాయం కోల్పోదు,  ఒక ప్రాంతం తన చరిత్రలోని, సంస్కృతిలోని, సృజనాత్మకతలోని ఒక విలువైన  నైపుణ్యాన్ని, కళను కోల్పోతుంది.

ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేయాలి—”చేనేత వస్త్రాన్ని కొనడం అంటే ఒక బట్టను కొనడం కాదు.  ఒక నేత కుటుంబం భవిష్యత్తుకు అండగా నిలవడం.” ప్రభుత్వం, సమాజం, వినియోగదారులు, యువత కలిసి చేనేతకు తోడుగా నిలిస్తేనే రాయలసీమ చేనేతకు కొత్త ఊపిరి లభిస్తుంది. నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది… చేనేత బతికితేనే రాయలసీమ కళ, సంస్కృతి, స్వాభిమానం సజీవంగా నిలుస్తాయి.

Leave a Reply