గత నెలక్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… కొంద‌రు తనను విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేయాల‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోష‌న్లు స‌క్రమంగా చేప‌ట్టినందుకా? ఎందుకు రాజీనామా చేయాలో వాళ్లు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా తానే కొనసాగుతానని కుండ బద్దలు కొట్టారు. ఆయన చెప్తున్న మాటలకు ఆచరణలో విద్యాశాఖ నిర్వహణను గమనిస్తే పొంతన ఏమాత్రం లేదనేది స్పష్టం అవుతుంది. అంతే కాక ఆయన విద్యాశాఖ నిర్వహణలో విఫలం అయ్యారనేది స్పష్టమవుతుంది. ప్రతి సమావేశంలో విద్య ద్వారా బతుకులు మార్చుకోవాలని, తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని వచ్చానని చెబుతూనే వాస్తవంలో ప్రభుత్వ విద్యకు పాతర వేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. విద్యారంగాన్ని కాషాయికరించే  కార్పోరేటికరించే  ప్రజా వ్యతిరేక జాతీయ నూతన విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం తోనే, ఆయన ఎంత సమర్థుడో అర్ధమవుతుంది. ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర విద్యా పాలసీని గమనిస్తే ఆ రాష్ట్రంలో విద్యా రంగ పరిస్థితిని అంచనా వేయవచ్చు. తెలంగాణా రాష్ట్రం లో అమలయ్యే విద్యా విధానం కార్పొరేట్ అనుకూల పాలసీ. ఈ ఒక్క కారణం చాలు ఆయన రాజీనామాకు.

    దీంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలో వందల కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం చర్చ కోసం పది కారణాలు వారికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పేర్కొంటున్నాను.

  1. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడచి నప్పటికీ ప్రభుత్వ బడులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించ లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, తరగతి గదులు లేవనేది వారు నియమించిన విద్యా కమీషన్ స్పష్టం చేసింది. రేషనలైజేషన్ పేరుతో, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల స్థాపన పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు బహిరంగంగా కృషి చేస్తున్నారు.
  2.  గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు శిథిలావస్థకు చేరాయి. మెజారిటీ హాస్టళ్ళు సొంత భవనాలు లేక నేటికీ అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి.
  3. గత రెండేళ్లుగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించారు.
  4. పదివేల కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం లేదు.
  5. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు చట్టం చేస్తామని దాటవేశారు. ప్రైవేటు ఫీజుల దోపిడీకి అండగా నిలిచారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలో డొనేషన్ల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీ పై మౌనం వహించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేశారు .
  6. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కృషి చేయకుండా , పరిశోధనలకు నిధులు కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు కార్పొరేట్ విశ్వ విద్యాలయాలకు, విదేశీ వర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
  7. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని ఒకవైపు ప్రకటలు చేస్తూ మరోవైపు విద్యార్థి సంఘం ఎన్నికలపై నిషేధం కొనసాగిస్తున్నారు.
  8. జీవో 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను శక్తిస్కీం ద్వారా కార్మిక శాఖలో విలీనం చేసి, పాల్టెక్నిక్ విద్యను బలహీనపరిచేలా జీవో తెచ్చారు. దీనివల్ల కాలేజీల భూములు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించి, రియల్ ఎస్టేట్ పరం చేస్తున్నారు.
  9. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూములను కబ్జా చేయాలని చూశారు.
  10. తన ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై పోరాడుతున్న విద్యార్థి, నిరుద్యోగ యువతపై అక్రమ కేసుల సంప్రదాయం, అనుమతుల నిరాకరణ, నిర్భంధ నిరంకుశ విధానాలను కొనసాగిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చిలకపలుకులు పలికినటువంటి ఈ కాంగ్రెస్ పాలకులు నేడు ఈ రెండున్నర ఏళ్ల కాలంలో అనేక నిర్బంధ విధానాలను అమలు చేస్తూ విశ్వవిద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మార్చింది వాస్తవం కాదా. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. రెండు నెలల కింద గుట్టు చప్పుడు కాకుండా పాలిటెక్నిక్ విద్యను కార్మిక శాఖలో విలీనం చేస్తూ జీవో తెచ్చారు. ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? పాలిటెక్నిక్ విద్యార్థులతో కనీసం చర్చించకుండా ఈ జీవో మీద కనీసం మేధావుల, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నియంతలాగా వ్యవహరిస్తూ ఏడు లక్షల మంది విద్యార్థులను ఈరోజు రోడ్డుపాలు చేసినటు వంటి ముఖ్యమంత్రి గారికి ఇంకా విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదు. విద్యా నాణ్యత పతనం అవుతున్న ఈ సందర్భంలో ఇంకా విద్యాశాఖ మంత్రిగా కొనసాగాలనుకోవడం ముమ్మాటికి ఏకపక్ష నియంత పోకడనే అవుతుంది. చట్టసభలలో ప్రవేశానికి యువతీ యువకులకు 21 ఏళ్లుగా నిర్ణయించాలని పోరాడుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణా రాష్ట్రంలో 1996 నుంచి అమలు అవుతున్న విద్యార్థి ఎన్నికలపై నిషేధాన్ని మాత్రం ఎత్తివేయలేక పోతున్నారు.

        ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో గొప్పలు చేస్తున్నామంటూ ప్రకటించిన అంశాలను గమనిస్తే… రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకం అమలు చూసినట్లయితే ఈ  పథకం హరే రామ హరే కృష్ణ అనే ఒక ప్రైవేటు ట్రస్ట్ సహకారంతో నడపడానికి ముందుకు వచ్చారు. నేడు ఇది పైలట్ దశలోనే ఉంది, అమలు చేస్తున్న కొన్ని చోట్ల కూడా నాణ్యత లేకుండా ఉంది. మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించ కుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లలో పారదర్శకత పాటిస్తున్నామన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేటికీ 317 జీవో బాధితులను సమస్యలను పరిష్కరించ లేదు. అదే సమయంలో డిప్యుటేషన్ పేరుతో అనేక అక్రమాలకు అధికారులు తెర తీస్తున్నప్పటికీ కనీసం విచారణకు కూడా ఆదేశించడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన కూడా అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కోల్పోయినటు వంటి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతూ వారి పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. విద్యార్థులు లేరనే సాకుతో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ కనీస విద్యా హక్కు చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు. తామూ అధికారం రాగానే మొదటి హామీగా మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయున్ని/ఉపాధ్యాయినిని నియమిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేడు ఉపాధ్యాయుల నియామకం చేపట్టకుండా రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలను దివాలా తీయిస్తూ, ఇంకా  విద్యాశాఖ మంత్రిగా తానే కొనసాగుతాననడం పేద, గ్రామీణ విద్యార్థులకు నష్టమే అవుతుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజల మెప్పు పొందాలనే ఉద్దేశంతో కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను కూడా విడుదల చేయకుండా మోసం చేసింది. ప్రభుత్వ యూనివర్సిటీలలో విపరీతంగా కోర్సు ఫీజులు పెంచుతూ ప్రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల వద్దనే వసూలు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రైవేశ పెడుతూ విద్యార్థుల వద్ద ముందస్తుగా డబ్బు కట్టించు కుంటున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో పరిశోధనలకు నిధులు కేటాయించకుండా విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా దళిత బహుజన విద్యార్థులకు యూనివర్సిటీ గేట్లు మూసేస్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ఇక్కడి భూములను ఉచితంగా కేటాయిస్తున్నారు .

     తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పది ప్రైవేటు వర్శిటీలు ఉండగా అమిటీ యూనివర్సిటీ మరియు  సెయింట్ మేరీస్ రిహాబిటేషన్ యూనివర్సిటీ అనే మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ గతేడాది శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ‘తెలంగాణా ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును” ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2,878 టీచింగ్  పోస్టులు ఉండగా  753 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలలో అసిస్టెంట్  ప్రొఫెసర్ల భర్తీ  కోసం గత ప్రభుత్వం కామన్ ఉస్మానియా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు శాసనసభలో చట్టం చేయగ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆ బిల్లును పట్టించుకోకుండా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్శిటీ లలో పోస్టులు భర్తీ కోసం ప్రొఫెసర్ గంటా చక్రపాణి నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు వచ్చినప్పటికీ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన కొత్త మార్గదర్శకాలతో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్ట నున్నామని చెప్పి నెలలు గడుస్తున్నా రిక్రూట్మెంట్ చేయడం లేదు. రాష్ట్రంలో 2,125 పోస్టులు ఖాళీగా ఉండగా ఆర్థిక శాఖ 400 పోస్టులకే అనుమతి మంజూరు చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో అస్పష్టత కొనసాగుతోంది. బోధన, బోధనేతర సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిధుల లేమి, మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇవన్నీ సమస్యలు యూనివర్సిటీలలో పెండింగ్ లో ఉండగా ఈ అంశాలను విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు శాసన సభలో చర్చకు తేకుండా, పరిష్కరించకుండా ప్రైవేటు యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ వేయడాన్ని తెలంగాణా సమాజం ఖండించాలి. విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో మరింత ప్రైవేటీకరణకు బాటలు వేస్తూ పబ్లిక్ -ప్రైవేటు-పాట్నర్ షిప్ పేరుతో ప్రపంచ బ్యాంకు మోడల్ పి.పి.పి అమలును మళ్ళీ తెరమీదకు తెచ్చారు. అందులో భాగమే యంగ్ ఇండియా స్కూల్ యూనివర్శిటీలో మహేంద్ర సంస్థల భాగస్వామ్యం. పాలిటెక్నిక్  కళాశాలలను శక్తి స్కీం లో విలీనం చేయడం. ప్రభుత్వంలో ఒక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి యొక్క ఆలోచన, విజన్ అనేది ఆ యొక్క శాఖను అభివృద్ధి వైపు నడిపిస్తూ ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారి విజన్ గమనిస్తే ఏ కొసన కూడా పేదలకు మేలు చేయాలనే లక్ష్యం లేదు. పేదలకు మేలు చేస్తున్నామని చెబుతూనే ప్రైవేటు కార్పొరేట్లకు దోచి పెట్టాలనే నిగూఢమైన గుప్తమైన ఒక ఉద్దేశం దాగి ఉంది. తెలంగాణ  విద్యాపాలాసీని రూపొందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు కేశవరావు నేతృత్వంలో కమిటీని వేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ విద్యాపాలసి పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామని అందుకు అధ్యయనం చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆ కమిషన్ సిఫారసులను చెత్త బుట్టలో పడేసారు. ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం ఆ కమిషన్ చేసిన సిఫారసులు చాలా ముఖ్య మైనవి అలాంటి సిఫార్సులను పక్కన వేయడం అంటే పేద గ్రామీణ విద్యార్థులను నిర్లక్ష్యం చేయడమే. ప్రజానుకూల సిఫారసులను పక్కన పెడుతూ ప్రజావ్యతిరేక ప్రైవేటు కార్పొరేట్ చర్యలను మాత్రం ప్రోత్సహిస్తూ  వారికి మరింత దోచిపెట్టడమే ధ్యేయంగా ముఖ్య మంత్రిగారు పనిచేస్తున్న క్రమంలో ఈ ముఖ్యమంత్రి గారు మాకు అవసరమా అని చెప్పి ఇటీవల పాలిటెక్నిక్ విద్యార్థులు నిలదీశారు. విద్యార్థుల మాటలను గమనిస్తే “ మేము పేద వర్గాల నుంచి వచ్చిన వారము, మేము మా కుటుంబాలలో మొదటి తరం విద్యార్థులుగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అభివృద్ధి వైపు నిలబడాలనుకున్నాము. మా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఎవరు? వారికి ఏం హక్కు ఉంది? మాతో చర్చించకుండా మా కళాశాలలను శక్తి స్కీమ్ లో ఎలా విలీనం చేస్తారు ? ఇది మా భవిష్యత్తును నాశనం చేయడం కాకుండా మరేమవుతుంది ? అని విద్యార్థులు అన్నారు”. విద్యార్థుల మాటలే ముఖ్యమంత్రి గారికి సమాధానం. ముఖ్య మంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగాలో వద్దో నిర్ణయించేది విద్యార్థులే. రాష్ట్రంలో ఏ పాఠశాలకు వెళ్లినా సమస్యలే, ఏ కళాశాలకు వెళ్లినా ఫీజు వేధింపులే, ఎక్కడ చూసినా ప్రైవేటు వ్యక్తుల జోక్యమే ఇలాంటి తరుణంలో ఇంకా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖని ఉద్ధరిస్తారని అనుకోవడం తగదు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలకు మొదటి పరిష్కారం తెలంగాణలో విద్యను నూతన జాతీయ విద్యా విధానం నుండి మినహాయించడం.

రెండో పరిష్కారం ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నుండి తప్పుకొని ప్రజాపక్ష వ్యక్తులెవరికైనా అప్పగించడం.

-కోట ఆనంద్.

29.08.2026

Leave a Reply