తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చాలని తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అయితే ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను అభివృద్ధి చేయడం కోసమే స్కిల్ యూనివర్సిటీ లో విలీనం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికి ఈ విలీనం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని అర్ధమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు కు ముందే బ్రిటిష్ పాలనలో హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్ర సంస్థానంగా ఉన్నప్పుడే 1923 వ సంవత్సరం తర్వాత ఉస్మానియా సెంట్రల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గా ఉండేది కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళనుంచి అధికార మార్పిడి జరిగిన తర్వాత 1954 ఉమ్మడి తెలుగు రాష్టంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసబ్ ట్యాంక్, తర్వాత అనేక జిల్లాలలో పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు అయ్యాయి. అవి నేటి వరకు (SBTET )స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బోర్డు పరిధిలో కొనసాగుతున్నాయి.
అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం జీవో 97 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గతంలో ఉన్న కార్మిక ఉపాధి శాఖను శక్తి SHAKTHI(skill, human capital and knowledge initiative’s) మార్చి వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలు,ITI (Integrated training institute) కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(YISU ) మరియు శక్తి పరిధిలోకి విలీనం చేశారు.
విద్యార్థులు, ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు.?
విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్యా అవకాశాలు దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఇప్పటివరకు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ (ECET ) ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా నేరుగా బీటెక్ సెకండియర్ లోకి అడ్మిషన్ లో చేరే (LATERAL ENTRY) అవకాశం నిలిచిపోతుంది అన్న భయం.
పాలిటెక్నిక్ విద్యారంగం ప్రైవేటీకరణ అయితుందేమోనని, అధిక ఫీజులు విద్యార్థులకు భారమవుతాయేమోనని విద్యార్థులు భావిస్తున్నారు.
ఎందుకంటే యంగ్ ఇండియా స్కిల్ పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్ లో కొనసాగుతుంది. దీనివల్ల ఫీజులు పెరిగి పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య భారంగా మారుతుంది.
మరొక విషయం అకడమిక్ పాలిటెక్నిక్ డిప్లమా కాస్త షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ కోర్సుగా మారుతుందేమోనని ఉద్యోగులు, విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పాలిటెక్నిక్ విద్యారంగంలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల భద్రత మరియు ప్రమోషన్ సర్వీసు రూల్స్ మారిపోతాయేమో అనేటువంటి భయం ఉద్యోగుల్లో నెలకొన్నది. ఎందుకంటే సాంకేతిక విద్య శాఖ నుండి ఉపాధి శాఖకు మారితే క్రీడలు ప్రమోషన్లు జీతాల నిబంధనలు దెబ్బతింటాయని లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ :
- విద్యార్థులు, ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో.97 ను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
- SBTET(STATE BOARD TECHNICAL EDUCATION AND TRAINING ) పరిధిలోనే పాలిటెక్నిక్ విద్యారంగాన్ని కొనసాగించాలి.
- ECET (BTECH లేటరల్ ఎంట్రీ) యథావిధిగా కొనసాగించాలి. విద్యార్థులకు బీటెక్ సెకండియర్ లోకి నేరుగా ప్రవేశం కల్పించే ఈసెట్ అవకాశాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలి.
- PPP- పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్ వల్ల పెరిగే ఫీజుల భారాన్ని పేద విద్యార్థులపై వేయకూడదు. ఫీజుల పెంపుని అడ్డుకోవాలి పాలిటెక్నిక్ విద్యారంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలి.
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ లెక్చరర్ మరియు సహాయక సిబ్బంది (టీచింగ్ -నాన్ -టీచింగ్ )పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
- పాలిటెక్నిక్ విద్యారంగానికి బడ్జెట్ కేటాయించి పాలిటెక్నిక్ కళాశాలల్లో, ల్యాబ్ లు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
విద్యార్థులు, ఉద్యోగులు పాలిటెక్నిక్ జేఏసీ (TPJAC), వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, PDSU,SFI, DSA, ఇతర విద్యార్థి సంఘాలు ప్రదానంగా పై డిమాండ్స్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా నిత్యం రాష్టంలోని SBTET పరిధిలో ఉన్న సుమారుగా 150 పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు సుమారు 67, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలు 83 , మాసబ్ ట్యాంక్,పెద్ద అంబర్పేట్, రామంతాపూర్, వరంగల్, కొత్తగూడెం కరీంనగర్,ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట,వనపర్తి, గద్వాల మొత్తంగా రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ స్పందన :
పాలిటెక్నిక్ విద్యార్థుల, TPJAC పోరాటం పోరాటం పట్ల తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పందిస్తూ పాలిటెక్నిక్ విద్యారంగ అభివృద్ధి కోసమే స్కిల్ యూనివర్సిటీ లో పాలిటెక్నిక్ కళాశాలల ను విలీనం చేస్తున్నామని, ఈసెట్ ఎప్పటిలాగానే కొనసాగుతుందని, విద్యార్థులు B.TECH కూడా చేసుకోవచ్చని, ఉద్యోగుల్ల సర్వీస్, ప్రమోషన్ రూల్స్ యథావిధిగా కొనసాగుతాయని అంటున్నాడు.
పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం వలన తెలంగాణ ప్రభుత్వం కేశవరావుకి హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. mlc కోదండరాం, రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతా సిన్వ్హా, నవీన్ మిట్టల్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సభ్యలు గా హై లెవెల్ కమిటి ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో నమ్మకం కలగటం లేదు.
Go. 97 రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగులు, TPJAC, స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాయి.
రాష్టంలోని అన్ని పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యా రంగానికి 30 శాతం కేటాయించకుండా కేవలం 6 నుంచి 8 శాతమే బడ్జెట్ కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేద విద్యార్థులకు విద్యను ఒక పద్ధతి ప్రకారం దూరం చేస్తుంది. ఇందులో భాగంగానే సాంకేతిక (టెక్నికల్ ) విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి విద్యార్థులను కేవలం పరిశ్రమలకు కార్మిక బానిసలుగా మార్చడానికి అధికార ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను తిప్పికొడుతూ పాలిటెక్నిక్ విద్యారంగాన్ని ప్రభుత్వం పరిధిలో కొనసాగేలా, పాలిటెక్నిక్ విద్యారంగానికి తక్షణమే 500 వందల కోట్ల బడ్జెట్ కేటాయించి మౌలిక, సదుపాయాలు, ఆధునిక ల్యాబ్ లు ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.
- పిడమర్తి వేణు
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి




