దేశంలో 12.5 కోట్ల మందికి పైగా పౌరులను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినప్పటికీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆదివాసులను స్వదేశీ ప్రజలుగా అధికారికంగా గుర్తించడానికి భారతదేశం నిరాకరించడంపైన దృష్టి సారించాలని ఆదివాసీ, స్వదేశీ సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఐక్యరాజ్యసమితిని కోరాయి.
ఆదివాసి మహాసభ ఫౌండేషన్, ఇండియా ఇండిజినస్ పీపుల్స్, ఆదివాసి సమన్వయ మంచ్, ఇండిజినే గ్లోబల్ కాన్ఫెడరేషన్, ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ట్రైబల్ పీపుల్స్ (నార్త్ ఈస్ట్ జోన్), బోడో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి ఆదివాసీ ప్రజల హక్కుల నిపుణుల యంత్రాంగంనిర్వహించిన 19వ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాయి.
ఈ సమావేశం జెనీవాలోని పలైస్ డెస్ నేషన్స్‌లో జూలై 13 నుండి 17 వరకు జరిగింది.
ఐక్యరాజ్యసమితి సంస్థలలో ఆదివాసులను అధికారిక భాగస్వామ్యం నుండి మినహాయించడం, మైనింగ్, అభివృద్ధి ప్రాజెక్టులలో సాముదాయక సమ్మతిని ఉల్లంఘించడం, శాసనపరమైన నిష్క్రియాత్మకత, దేశీయ భాషలకు ముప్పు; కృత్రిమ మేధస్సులో దేశీయ జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి అంశాలపైన వరుసగా ఇచ్చిన ప్రకటనల ద్వారా ఆ బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఐక్యరాజ్యసమితిలో ఆదివాసీ ప్రజల భాగస్వామ్యం, ఆదివాసీ ప్రజల హక్కులపైన ఐక్యరాజ్యసమితి ప్రకటనకు రాబోయే ఇరవయ్యవ వార్షికోత్సవం, నిపుణుల యంత్రాంగపు భవిష్యత్తు కార్యాచరణ, దాని మునుపటి అధ్యయనాలపైన తదుపరి చర్యలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ప్రతిపాదనలు, అలాగే ఆదివాసీ భాషల పరిరక్షణ వంటి అంశాలలో వారు జోక్యం చేసుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన, ఆదివాసీ, స్వదేశీ ప్రజల గుర్తింపు వ్యవస్థల్లో ఒకదాన్ని దేశీయంగా కొనసాగిస్తూ, అదే సముదాయాలను అంతర్జాతీయ స్థాయిలో “స్వదేశీ ప్రజలు” గా గుర్తించడానికి నిరాకరించడం భారత్ ఇక కొనసాగించలేదని అన్నారు.
భారత్ 12.5 కోట్లకు పైగా పౌరులను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తోంది. అలాగే, రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూళ్ల కింద వారి పరిపాలనకు రాజ్యాంగపరమైన వ్యవస్థను అందిస్తోంది. అయితే, 2007లో స్వదేశీ ప్రజల హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రకటన కు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, దాదాపు రెండు దశాబ్దాలుగా తన ఆదివాసీ జనాభాను అంతర్జాతీయ చట్టం ప్రకారం అధికారికంగా “స్వదేశీ ప్రజలు”గా గుర్తించేందుకు భారత్ నిరాకరిస్తోందని ఆ సమూహాలు పేర్కొన్నాయి.
“రాష్ట్రం రెండు విధాలుగా వ్యవహరించదానికి వీలులేదు” అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు.
అలాగే, కైలాష్ & ఇతరులు వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం కేసులో 2011లో న్యాయమూర్తులు కట్జూ, మిశ్రాలు చేసిన “భారతీయులందరూ స్వదేశీయులే” అనే సుప్రీంకోర్టు వ్యాఖ్యను కూడా ఆ సమూహాలు ప్రస్తావించాయి. ఈ వైఖరి ఒక చట్టపరమైన కల్పితం అని, ఆదిమవాసులకు, తర్వాతి కాలంలో వలస వచ్చినవారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపివేసే ఒక చట్టపరమైన కల్పనగా వారు ఈ వైఖరిని అభివర్ణించారు.
ఆ సంస్థల ప్రకారం, భారత ప్రభుత్వం ఆదివాసీల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి బదులుగా, తన అంతర్జాతీయ బాధ్యతలను తప్పించుకోవడానికి ఈ వైఖరిని ఉపయోగిస్తోంది.. “అందరూ స్వదేశీయులే అయితే, ఎవరూ నిర్వాసితులు కాలేదు, అలాగే ఎవరికీ ఎలాంటి హక్కు లేదా దావా ఉండదు” అని వారు వాదించారు.
గ్రామ సభ నిర్ణయాలను తోసిపుచ్చారు
షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్వేచ్ఛాయుత, ముందస్తు, సమాచారంతో కూడిన సమ్మతి (FPIC) నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నట్లు ఆ బృందాలు ఎత్తి చూపాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని పెల్మాలో ప్రతిపాదిత బొగ్గు గనికి వ్యతిరేకంగా గ్రామ సభ నాలుగు వేర్వేరు సందర్భాల్లో ఓటు వేసింది. అయితే, ప్రతిసారీ సమాజం తెలిపిన వ్యతిరేకతను పక్కన పెట్టేందుకు బొగ్గు నిక్షేపాల ప్రాంతాల చట్టాన్ని (కోల్ బేరింగ్ ఏరియాస్ చట్టం) ఉపయోగించారని ఆ సమూహాలు ఆరోపించాయి.
అదేవిధంగా, ఒడిశాలోని సిజిమాలి ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. సమాజం వ్యతిరేకించినట్లు నమోదైన ఆధారాలు ఉన్నప్పటికీ, అలాగే సమ్మతికి సంబంధించిన వివాదాలు ఇంకా పరిష్కారం కాకపోయినప్పటికీ, అక్కడ వేదాంత గ్రూప్‌కు అనుబంధమైన బాక్సైట్ తవ్వకాల ప్రాజెక్టు,ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు.
ఆ ప్రకటనల్లో ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అరండ్ అటవీ ప్రాంతం, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, బాలాఘాట్ ప్రాంతాల్లో జరిగిన పర్యావరణ విధ్వంసం, భారీ స్థాయిలో అడవుల నరికివేత, అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని, భారీ ఎత్తున అడవులను నరికివేయడాన్ని ఒక వ్యవస్థీకృత విధానంలో భాగంగా ప్రస్తావించారు.
ఆదివాసీ పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేయడాన్ని, ఆదివాసీల “సార్వభౌమాధికారాన్ని” ధ్వంసం చేయడం నుంచి వేరు చేసి చూడలేమని ఆ సమూహాలు పేర్కొన్నాయి.
ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న భూకబ్జాలు ఏదో ఒకటి రెండు మినహాయింపు ఘటనలు కావని, అవి పదేపదే కొనసాగుతున్న ఒక విధానంలో భాగమని వారు వాదించారు. ఒక సమాజం తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారులకు లేదా మూలధన ప్రయోజనాలకు అనుకూలంగా లేనప్పుడు, **స్వేచ్ఛాయుత, ముందస్తు; సమాచారంతో కూడిన సమ్మతిని (ఫ్రీ, ప్రయర్ అండ్ ఇంఫార్మ్డ్ కన్సెంట్)తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసే విధానం పునరావృతమవుతోందని వారు పేర్కొన్నారు.
2001 నుంచి పెండింగ్‌లో ఉన్న మెసా బిల్లు
షెడ్యూల్డ్ ప్రాంతాలకు మున్సిపాలిటీల విస్తరణ బిల్లు (మున్సిపాలిటీస్ ఎక్స్టెంషన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ బిల్ – ఎంఇఎస్ఏ) ను ఆమోదించి చట్టంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఈ బిల్లు 2001 నుంచి పెండింగ్‌లోనే ఉంది.
ఈ జాప్యం కారణంగా, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఆదివాసీ భూములు మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చినప్పుడు, పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ సముదాయాలకు చట్టపరమైన రక్షణ లేకుండా పోతోందని వారు తెలిపారు.
రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ చట్టపరమైన జాప్యం వల్ల, ప్రస్తుత విధాన వ్యవస్థల్లో పట్టణ ఆదివాసీ సముదాయాలు కనిపించనివారిగా (అదృశ్య సముదాయాలుగా) మారిపోయాయని ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు.
ఆదివాసీ భాషలకు ఇప్పటికీ గుర్తింపు లేదు
రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ భాషలకు పరిమిత గుర్తింపు మాత్రమే లభిస్తోందని ఆ బృందాలు నొక్కిచెప్పాయి.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో కేవలం సంథాలి, బోడో భాషలకు మాత్రమే చేర్చారు. అయితే, లక్షలాది మంది ప్రజలు మాట్లాడే గోండి, కురుఖ్, ముండారి, హో, కుయి, భిలీ వంటి భాషలను ఇప్పటికీ ఆ జాబితాలో చేర్చలేదు. వీటిలో అనేక భాషలను యునెస్కో కూడా అంతరించిపోతున్న భాషలుగా గుర్తించిందని ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు.
ఆదివాసీ భాషల మనుగడను, నిరంతర వినియోగాన్ని నిర్ధారించే చర్యలు లేకుండా కేవలం రాజ్యాంగపరమైన గుర్తింపు మాత్రమే సరిపోదని ఆ సంస్థలు స్పష్టం చేశాయి.
2022 నుంచి 2032 వరకు నిర్వహిస్తున్న “అంతర్జాతీయ ఆదివాసీ భాషల దశాబ్దం”కు సంబంధించిన చర్చల్లో, అలాగే సంఘర్షణలు, సంఘర్షణానంతర పరిస్థితుల్లో ఆదివాసీ ప్రజల హక్కులపైన రూపొందుతున్న ముసాయిదా అధ్యయనానికి సంబంధించిన చర్చల్లో వారి జోక్యం ఒక భాగంగా ఉంది.
భాషా మనుగడ సాంస్కృతిక మనుగడతోనూ, స్వయం నిర్ణయాధికార హక్కుతోనూ విడదీయరాని సంబంధం కలిగి ఉందని వారు వాదించారు.
కృత్రిమ మేధస్సు ప్రాజెక్టుల్లో ఆదివాసీ జ్ఞానంపై హక్కు
ఆ ప్రకటనల్లో ఆదివాసీ సముదాయాలు; వారి జ్ఞాన వ్యవస్థలపైన కృత్రిమ మేధస్సు చూపే ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు.
భారతదేశంలోని ఆదివాసీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్మించకూడదని; సాంకేతిక ఆవిష్కరణలకు కేవలం అధ్యయన అంశాలుగా లేదా లబ్ధిదారులుగా మాత్రమే ఆదివాసీలను చూడకుండా, విలువైన జ్ఞాన వ్యవస్థల సంరక్షకులుగా గుర్తించాలని వారు అన్నారు.
మౌఖిక చరిత్రలను నమోదు చేయడం, ఆదివాసీ భాషలను పరిరక్షించడం, సాంస్కృతిక భూభాగాలను చిత్రించడం, సంప్రదాయ జ్ఞానాన్ని రక్షించడం వంటి కార్యక్రమాల కోసం సమాజం ఆధ్వర్యంలో నడిచే కృత్రిమ మేధస్సు కార్యక్రమాలకు ప్రాజెక్టు ఆధారిత నిధులు అందించాలని వారు కోరారు.
ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ స్వేచ్ఛాయుత, ముందస్తు, సమాచారంతో కూడిన సమ్మతి ఆధారంగా నిర్వహించబడాలని వారు పేర్కొన్నారు. తమ జ్ఞానమూ, సాంస్కృతిక వనరులపైన యాజమాన్యం, నియంత్రణ, ప్రాప్యత, సంరక్షణ బాధ్యత ఆదివాసీ సముదాయాల వద్దే కొనసాగాలని వారు స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో భాగస్వామ్యానికి అధికారిక మార్గం లేదు
భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలను గుర్తించేందుకు విస్తృతమైన దేశీయ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఆదివాసీ సముదాయాలు “స్వదేశీ ప్రజలు”గా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో అధికారికంగా భాగస్వామ్యం అయ్యేందుకు ప్రస్తుతం ఎలాంటి అధికారిక మార్గం లేదని ఆ సమూహాలు పేర్కొన్నాయి.
భారతదేశంలో పరిమిత స్థాయిలో లభిస్తున్న గుర్తింపును ఆధారంగా చేసుకుని, అంతర్జాతీయ వేదికల్లో ఆదివాసీ సముదాయాలను మినహాయించడం లేదా వారి స్వరాన్ని అణచివేయడాన్ని సమర్థించలేమని వారు వాదించారు.
ఆ సంస్థలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి మూడు ప్రధాన ప్రతిపాదనలను సమర్పించాయి.
2007లో స్వదేశీ ప్రజల హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రకటన (యుఎన్ డిఆర్ ఐపి)కు అనుకూలంగా భారత్ ఓటు వేసినప్పటికీ, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ ప్రకటన అమలులోకి రాకపోవడం ముగిసేలా, రాజ్యాంగ సవరణ లేదా న్యాయపరమైన విధానం ద్వారా ఆదివాసీ సముదాయాలను యుఎన్ డిఆర్ ఐపి కింద స్వదేశీ ప్రజలుగా అధికారికంగా గుర్తించేందుకు భారతదేశంతో చర్చలు జరపాలని వారు మానవ హక్కుల మండలిని కోరారు.
పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం (పెసా) కింద గ్రామ సభ ఇచ్చే సమ్మతిని బాధ్యతాయుతమైనదిగానూ, కట్టుబడి ఉండే నిర్ణయంగానూ పరిగణించాలని, దానిని కోల్ బేరింగ్ ఏరియాస్ చట్టం లేదా ఇతర సమానమైన ప్రత్యేక చట్టాల ద్వారా అధిగమించకూడదని కూడా వారు డిమాండ్ చేశారు. పెల్మా, సిజిమాలి ప్రాంతాల్లోని వివాదాలను స్వతంత్రంగా పర్యవేక్షించాలని ఆ సమూహాలు కోరాయి.
పట్టణీకరణకు లోనైన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలను రక్షించేందుకు మెసా బిల్లును తక్షణమే ఆమోదించి చట్టంగా అమలు చేయడం వారి మూడవ డిమాండ్.
UNDRIP 20వ వార్షికోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో, సాధారణ అధ్యయనాలకే పరిమితం కాకుండా, నిర్దిష్టంగా కొనసాగుతున్న కేసులను నిరంతరం పర్యవేక్షించడం ప్రారంభించాలని ఆ సమూహాలు నిపుణుల యంత్రాంగాన్ని కోరాయి.
“ఇవేవీ కేవలం ఆశయపూర్వకమైన అభ్యర్థనలు కావు” అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రతి డిమాండ్‌కు సంబంధించిన వ్యవస్థను భారత్ ఇప్పటికే దేశీయంగా ఏర్పాటు చేసిందని, అయితే వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి లేదా పూర్తి చేయడానికి భారత్ నిరాకరిస్తోందని వారు అన్నారు.
తెలుగు: పద్మ కొండిపర్తి




