రేణిగుంట జంక్షన్… పొద్దున్నే ఆరు గంటలకి పొగమంచు ఇంకా ఇడిపోల. సలి ఎముకల్ని కొరికేస్తా ఉండాది. రైలు పట్టాల మీద మంచు బిందువులు తడితడిగా మెరుస్తా ఉండాయి. ఆ మంచుని సీల్చుకుంటా ఎక్స్ప్రెస్ బండి ఒకటి కూత పెట్టుకుంటా వచ్చి మూడో నెంబర్ ప్లాట్ఫారం మీదకి పెద్ద నిట్టూర్పు ఇడిచినట్టు ‘స్సుస్స్…’ మని ఆగింది.
గ్యాంగ్మన్ రమణ చేతిలో ఇనప సుత్తి పట్టుకుని, ప్లాట్ఫారం కిందకి దిగి ఆగిన రైలు సక్రాలను ‘టక్… టక్… టక్…’ అని కొడతా పోతా ఉండాడు. ఆ ఇనప సక్రాల సప్పుడు వాడికి ప్రాణం. ఏ సక్రం పగులిచ్చిందో, ఏ సక్రం గట్టిగా ఉండాదో ఆ సుత్తి దెబ్బకే వాడికి తెలిసిపోతాది.
లోకం దృష్టిలో రమణగాడు కొంచెం ఎర్రోడు, ఎవడితోనూ కలవడు. కానీ వాడికి అసలు రోగమంతా మనుషులతోనే. ఈ మనుషులుండారే… పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. అదే ఈ ఇనప సక్రాలు అబద్ధం ఆడవు, సారా తాగేసి వచ్చి తన్నవు. రమణకి ఎప్పుడూ ఆ స్టేషన్, ఆ పట్టాలే లోకం.
ఒక్కోసారి ఏ ప్యాసింజర్ బండిలోంచో కంపు కొట్టే నాటు సారా వాసన రాగానే వాడికి వాళ్ళ నాయన గుర్తొస్తాడు. వాడు పసిపిల్లాడిగా ఉన్నప్పుడు, సారా తాగి వచ్చిన వాళ్ళ నాయన కంపుకొట్టే నోటితో పచ్చి బూతులు తిడతా, వాళ్ళమ్మని ఇనప రాడ్డుతో కొట్టిన రాత్రులు వాడికింకా పచ్చి పుండులాగా గుర్తున్నాయి.
ఆ వాసన తగిలితే సాలు రమణకి గుండెల్లో దడ మొదలవుతాది, చేతులు వణుకుతాయి, ఊపిరి ఆడదు. ఎవరూ చూడకుండా సీకట్లోకి పోయి, కళ్ళు మూసుకుని “ఊపిరి పీల్చుకో రమణా… యాడో సచ్చిపోయినాడు ఆ పెద్దోడు…” అని తనకి తాను సెప్పుకుంటాడు.
అలాంటి రమణకి, ఆ పాటల పిచ్చోడు తగలడం ఒక విచిత్రం.
అదొక మండుటెండ మధ్యాహ్నం. ప్లాట్ఫారం చివర్లో ఉన్న కుళాయి కాడ ఒక ముసలోడు నీళ్ళు తాగుతా ఉండాడు. సిరిగిన బట్టలు, పిలక జుట్టు, దుమ్ము పట్టిన గడ్డం. ఇద్దరు పోకిరీ నాయాళ్లు ఆ ముసలోడి మీద పడి, వాడి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్ని లాక్కుని, మురికి గుంటలో పడేశారు.
“ఏందిరా తాగుబోతు ఎదవా… యాడకొచ్చి అడుక్కుంటాండావా? లేరా లే!” అని ఒకడు బూటు కాలితో ఆ ముసలోడి పక్కటెముకల మీద తన్నాడు.
అటుగా పోయే ఆడోళ్ళు ముఖం తిప్పుకుని పోతా ఉండారు. టీ అమ్ముకునే కుర్రాళ్ళు చూసీ చూడనట్టు పోతా ఉండారు. రమణకి ఎక్కడ లేని కోపం ముంచుకొచ్చింది. చేతిలో ఉన్న ఇనప సుత్తి పట్టుకుని గబగబా పోయి, “ఏరా, వయసులో పెద్దోడు, సిగ్గులేదురా మీకు? పోతారా సుత్తితో ఎముకలు ఇరగ్గొట్టమంటారా?” అని అరిచాడు.
ఆ ఇద్దరు ఎదవలు రమణ చేతిలో సుత్తిని చూసి, బూతులు తిట్టుకుంటా ఆడనుంచి ఉడాయించారు.
ఆ ముసలోడు కింద పడిపోయి, ఆ బురదలోనే నవ్వుకుంటా పైకి లేచాడు. వాడి ముఖంలో ఎక్కడా కోపం లేదు, బాధ లేదు. రమణ వాడికి చెయ్యిచ్చి పైకి లేపాడు.
“బాగుండావా నాయనా… ఏమనుకోకపోతే టైమెంతయిందో కాస్త సెప్పు సామి,” అన్నాడు ఆ ముసలోడు, తన బట్టలకు అంటిన బురద దులుపుకుంటా.
రమణకి ఒళ్ళు మండింది. ‘ఇప్పుడే తన్నులు తిన్నాడు, అప్పుడే టైము అడుగుతాండాడే ఏందిరా ఈ పిచ్చోడు’ అనుకుని, స్టేషన్ గడియారం వంక చూసి… “మూడు కావటానికి ఇంకో నిమిషం ఉండాదిలే,” అన్నాడు ఇసుగ్గా.
ఆ ముసలోడి మొకంలో ఒక్కసారిగా కోటి సూర్యులు ఎలిగినట్టు ఎలుగు వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి, “అదిగో నాకిష్టమైన టైమొచ్చేసింది. నా మూడు గంటల టైం. నేను పాడే టైం నాయనా!” అని చేతులు పైకి ఎత్తి దండం పెట్టాడు.
రమణ వింతగా చూస్తా ఉండగానే, ఆ ముసలోడు తన జేబులోంచి సగం తాగిన నాటు సారా సీసా బయటికి తీశాడు. అది చూడగానే రమణకి రోత పుట్టింది. కానీ మరుక్షణమే ఆ ముసలోడు కళ్ళు మూసుకుని, గొంతు సవరించి ఒక్కసారిగా పాట మొదలుపెట్టాడు.
“ఏ తీరుగ నను దయచూసెదవో… ఇనవంశోత్తమ రామా”
అంతే, ఆ రేణిగుంట స్టేషన్లో ఉన్న రైలు కూతలు, జనాల అరుపులు, టీ అమ్మేటోళ్ల అరుపులు అన్నీ ఆ గొంతు ముందు మూగబోయాయి. యాడినుంచి వస్తాండాదో ఆ గొంతు. కంచు కంఠం అంటారు సూడు, ఆ గొంతులోంచి పుట్టుకొస్తాండ రాగానికి ఆ ప్లాట్ఫారం మీద ఉన్న రాళ్ళు కూడా కరిగిపోయి నీళ్ళైపోతాయేమో అన్నంత అద్భుతంగా ఉండాది. మురికి బట్టల్లో ఉన్న అడుక్కునే పిచ్చోడి గొంతులోంచి సాక్షాత్తు ఆ అన్నమయ్యే దిగొచ్చి పాడుతాండాడా అన్నట్టుండాది వాతావరణం.
రైలు ఎక్కబోయే జనాలు ఆగిపోయినారు. ఒకావిడ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, దగ్గరికొచ్చి పది రూపాయల నోటు వాడి చేతిలో పెట్టింది. రమణకి కూడా తెలియకుండానే వాడి కళ్ళలోంచి నీళ్లు సుక్కలు రాలినాయి. పాట పూర్తి కాకుండానే, ఆడనుంచి తప్పుకుని తన పనిలోకి పోయినాడు రమణ. మనసులో మాత్రం వాడికి ‘పాటల పిచ్చయ్య’ అని పేరు పెట్టేసుకున్నాడు.
నెలలు గడిచిపోయినాయి. రోజూ సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి ఆ పాటల పిచ్చయ్య గొంతు స్టేషన్లో మారుమ్రోగతానే ఉంటాది.
యాడున్నా రమణకి ఆ గొంతు ఇనపడాల్సిందే. ప్లాట్ఫారం మీద పడుకున్న కుక్కలు కూడా వాడి పాటకి చెవులు నిక్కబొడుచుకుని ఇంటాయి.
ఒక్కోసారి తల మీద గువ్వలు వచ్చి వాలినా, కదలకుండా శిలలాగా నిలబడి పాడతా ఉంటాడు. పాటలయ్యాక సారా సీసా మూత తీసి ఒక గుటక వేస్తాడు. ఎవడన్నా డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే గాలికి దండం పెట్టి పోతాడు.
ఒకరోజు సాయంత్రం, రమణ డ్యూటీ ముగించుకుని ఇంటికి పోదామని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు. లోపల ఇసుక ఏస్తే రాలనంత జనం. ఊపిరి ఆడనంత ఉక్కపోత. అందరూ చెమటలు కక్కుకుంటా, ఒకరి మీద ఒకరు పడుకుంటా నరకం అనుభవిస్తా ఉండారు.
సరిగ్గా అప్పుడే ఒక మూల నుంచి ఆ పాటల పిచ్చయ్య లేచి నిలబడ్డాడు. మందు కొట్టి ఉండాడేమో, కొంచెం తూలుతా ఉండాడు. టైం చూస్తే మూడు అవుతాండాది. అంతే, కళ్ళు మూసుకుని గొంతు ఇప్పాడు. ఆ ఇరుకు డబ్బాలో వాడి గొంతు సల్లటి గాలివానలాగా తాకింది. జనం అంతా ఆశ్చర్యంగా వాడి వంక చూస్తా ఉండారు.
అప్పుడే అక్కడికి వచ్చిన టీటీఈ వాడిని చూసి చిందులు తొక్కాడు. “ఏయ్ తాగుబోతు ఎదవా, టికెట్ లేదు పాటలేదు, మల్లా ఈడ అడుక్కుంటావా? దిగరా కిందకి!” అని అరిచాడు.
పిచ్చయ్య కోప్పడలే. నవ్వతానే పాట దారి మళ్ళించాడు. జానపద బాణీలో “అరెరె నల్లటి కోటు ఏసిన దొరగారు వచ్చారే, మన జేబులు ఖాళీ చేసే దేవుడల్లే దిగొచ్చారే…” అంటూ టీటీఈ మీద సరదాగా పాట కట్టి పాడేశాడు.
డబ్బాలో ఉన్న జనమంతా పగలబడి నవ్వారు. టీటీఈకి కూడా నవ్వొచ్చేసి, వాడికి రెండు రూపాయలు చేతిలో పెట్టి, “ఏదో ఒకటి చేసి ఏడువు” అని పోయినాడు.
ఒక కుర్రాడు “అదుర్స్ తాతా!” అని అరిచాడు.
రమణ దూరం నుంచి అదంతా చూస్తా, ఆ పిచ్చయ్య వైపు దండం పెట్టాలనిపించినంత మురిసిపోయినాడు.
కాలం తిరిగింది. డిసెంబర్ మాసం వచ్చింది. మాఘమాసం సలి గుండెల్ని కోసేస్తా ఉండాది. పగలు కూడా పొగమంచు ఇడిపోవడం లేదు. జనాలు స్వెట్టర్లు, మంకీ క్యాప్లు ఏసుకుని కూడా వణికిపోతా ఉండారు.
ఆ సలికి పిచ్చయ్య గొంతు పగిలిపోయింది. మధ్యాహ్నం మూడు గంటలకి పాడటానికి సతమతమవుతా ఉండాడు గానీ, గొంతులోంచి కితం మాదిరి రాగం రావడం లేదు. దగ్గు వస్తాండాది. రక్తం పడతాండాదేమో అనిపించేంతగా దగ్గతా ఉండాడు. సలికి వాడి శరీరం గజగజా వణకతా ఉండాది.
ఒకరోజు మధ్యాహ్నం రమణ దూరం నుంచి చూస్తా ఉండగానే పిచ్చయ్య చేతిలో ఉన్న ఖాళీ సారా సీసాని నేలకేసి కొట్టాడు. అది పగిలి ముక్కలైంది. ఆ ముక్కల వంక చూస్తా, చేతులు జోడించి ఎవడితోనో మాట్లాడుతున్నట్టుగా ఏడస్తా ఉండాడు. “నాకు టైం అయిపోతా ఉండాదిరా… ఇంక రాలేనేమోరా…” అని గొణుక్కుంటా ఉండాడు.
రమణకి మనసు కలుక్కుమంది. ‘ఈరోజు డ్యూటీ అయిపోగానే వాడికి ఏదైనా ఏడిఏడిగా ఇడ్లీలు కొనియ్యాల, అసలు వాడి పేరేంటో, ఊరేంటో అడగాల’ అనుకున్నాడు. కానీ మల్లా పక్కనే ఉన్న సారా సీసా పెంకులు, వాడి వణుకుతున్న చేతులు చూసి… పాత గాయాలు గుర్తొచ్చి, అటు పోకుండానే తన పనిలోకి పోయినాడు.
మరుసటి రోజు ఉదయం. ఆకాశం ఇంకా తెల్లారలే. సలి గాలి కత్తుల్లా కోస్తా ఉండాది. రమణ ఒకటో నెంబర్ ప్లాట్ఫారం చివరన ఉన్న సిమెంట్ బెంచి కాడికి నడుచుకుంటా పోయాడు.
ఆ బెంచి మీద చిన్న మూటలాగా ముడుచుకుని పడుకుని ఉండాడు పిచ్చయ్య.
రమణ అడుగులు ఆగిపోయినాయి. లోపల ఏదో కీడు శంకిస్తా ఉండాది. మెల్లగా దగ్గరికి పోయాడు. పిచ్చయ్య శరీరం వణకడం లేదు. చర్మం అంతా పాలిపోయి, నీలం రంగులోకి మారిపోయింది. కళ్ళు సగం తెరుచుకుని, శూన్యంలోకి చూస్తా ఉండాయి. గడ్డం మీద పడిన మంచు బిందువులు మెరస్తా వుండాయి.
రమణ చేతులు వణకతా ఉండగా, తన మెడలో ఉన్న మఫ్లర్ తీసి వాడికి కప్పబోయాడు. ఆ తర్వాత పిచ్చయ్య మెడ మీద సెయ్యి ఏసి చూశాడు. మంచు గడ్డకన్నా సల్లగా ఉండాది ఆ దేహం. నాడి కొట్టుకోవడం లేదు. గొంతులోంచి పాట కాదు కదా, ప్రాణ వాయువు కూడా ఎప్పుడో ఆగిపోయింది. సలి వాడి ప్రాణాల్ని ఏ సడి చేయకుండా లాగేసుకెళ్ళిపోయింది.
రమణ గుండె పగిలిపోయింది. ఆ బెంచి పక్కనే చతికిలబడి, గంటల తరబడి అలాగే శూన్యంలోకి చూస్తా ఉండిపోయాడు. ఎంతసేపు అయిందో వాడికే తెలీదు. రైల్వే పోలీసోళ్ళు, స్వీపర్లు స్ట్రెచర్ పట్టుకుని ఆడికి వచ్చారు.
“ఇంకో ఫ్రీ టికెట్ కేసా, నెలకి ఒకడు రాలిపోతానే ఉండాడు. మున్సిపాలిటోళ్ళకి ఫోన్ చేయండిరా, యాడ పూడుస్తారో వాళ్ల ఇష్టం,” అని కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా అన్నాడు.
స్వీపరు పిచ్చయ్య జేబులు వెతకతా ఉండాడు. “ఏమన్నా ఆధార్ కార్డు లాంటివి ఉండాయేమో చూడరా,” అన్నాడు కానిస్టేబుల్.
“ఏం లేవు సార్, ఏదో పాత ఫోటో, ఖాళీ సీసా మూత ఉండాయి అంతే,” అంటూ ఆ ఫోటోని పక్కన పడేశాడు స్వీపర్.
రమణ యంత్రం లాగా లేచి, కింద పడిన ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. పాతబడిపోయిన ఫోటో. అందులో ఆడమనిషి నవ్వతా ఉండాది. ఆమె పక్కన పదేళ్ల కుర్రాడు. ఆ కుర్రాడికి నెత్తి మీద ఒక్క యెంట్రుక కూడా లేదు. కానీ వాడి ముఖంలో మాత్రం అంతులేని నవ్వు.
ఆ కుర్రాడిని పట్టుకుని ఉండాడు, మన పాటల పిచ్చయ్య అప్పుడు వాడి మొకంలో గడ్డం లేదు, సిరిగిన బట్టలు లేవు అందమైన, హుందాగల తండ్రి మొకం.
రమణ చేతులు వణకతా ఉండగా, ఆ ఫోటో ఎనక్కి తిప్పి చూశాడు. పెన్సిల్తో సగం చెరిగిపోయిన అక్షరాలతో, తెలుగులో రాసి ఉండాది
“తిరుపతి రుయా ఆసుపత్రి, క్యాన్సర్ వార్డు. గది నెంబర్ 9, మధ్యాహ్నం 3 గంటలు, నా ప్రాణం డిల్లీగాడికి ఇష్టమైన టైం”
ఆ క్షణంలో రమణకి చెంప మీద ఎవడో సుత్తితో కొట్టినంత పనైంది. ఆ ముసలోడి మాటలు వాడి చెవుల్లో ప్రతిధ్వనించాయి.
“అదిగో… నాకిష్టమైన టైమొచ్చేసింది. నా మూడు గంటల టైం…”
పిచ్చయ్య రోజూ మూడు గంటలకు పాడింది పిచ్చితో కాదు, తాగిన మత్తులో కాదు. రుయా ఆస్పత్రిలో సరిగ్గా మూడు గంటలకు కన్నుమూసిన తన కొడుకు కోసం.
ప్రతి రోజూ ఆ మూడు గంటలకు తన గొంతును ఆకాశానికి ఇనిపిస్తే, యాడో ఉన్న తన కొడుకు ఇంటాడన్న ఆశ. వాడు తాగింది బాధను మర్చిపోవడానికి కాదు, ఆ మూడు గంటల వరకు బ్రతికి ఉండటానికి ఆసరాగా.
స్వీపర్లు పిచ్చయ్య శరీరాన్ని స్ట్రెచర్ మీదకి ఎక్కించి, ఇసుగ్గా లాక్కపోతా ఉండారు.
“ఒరేయ్! కొంచెం మెల్లగా తీసుకుపోండ్రా… మనిషిరా వాడు!” అని అరిచాడు రమణ కళ్ళమ్మట నీళ్లు కారుతా ఉండగా.
వాళ్ళు రమణ వంక పిచ్చోడిని చూసినట్టు చూసి, స్ట్రెచర్ని వ్యాన్ వైపు లాక్కుపోయినారు. రమణ ఆడే నిలబడి, వ్యాన్ దూరంగా పోయే వరకు చూస్తా ఉండిపోయాడు.
ఆ ప్లాట్ఫారం మీద ఇంక ఎప్పటికీ మూడు గంటలకు పాట ఇనపడదు అన్న నిజం వాడిని కలచివేసింది. ఎన్నో ఏళ్లుగా మనుషులంటేనే అసహ్యించుకున్న రమణకి, మొదటిసారి ఒక మనిషిని చూసి గుండెల్లోంచి ప్రేమ, జాలి తన్నుకొచ్చాయి.
తన బాబు చేసిన గాయాల వల్ల, ఈ లోకంలో ప్రతి ఒక్కర్నీ అనుమానంగా చూసిన తన బతుకు ఎంత సిన్నదో వాడికి అర్థమైంది.
“నాయనా… అందరూ మీ నాయన లాంటోళ్ళు కాదురా… లోకాన్ని కాస్త కండ్లు తెరిచి సూడు…” అని వాళ్ళమ్మ ఎప్పుడో సిన్నప్పుడు సెప్పిన మాటలు ఇప్పుడు వాడి చెవుల్లో గింగురుమన్నాయి.
చేతిలో ఉన్న ఆ ఫోటో అంచులు పాతబడిపోయి మడతలు పడిపోయినాయి. రమణ ఆ ఫోటోని తన గుండెలకు హత్తుకుని, ఎంతో భద్రంగా తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బయట మంచు కురుస్తా ఉన్నా, ఆ ఫోటో వాడి గుండెకి ఇంత ఎచ్చదనాన్ని ఇస్తా ఉండాది.
ఆరోజు ఉదయం… జీవితంలో ఎప్పుడూ తన డ్యూటీకి డుమ్మా కొట్టని గ్యాంగ్మన్ రమణ, చేతిలో ఉన్న ఇనప సుత్తిని పక్కన పడేసి, యాడికో దిక్కు తెలియని దారిలో నడుచుకుంటా పోయినాడు. వాడు ఆరోజు డ్యూటీకి పోలే. బహుశా, తనలో సచ్చిపోయిన మనిషిని బతికించుకోవడానికి పోయినాడేమో.




