స్నానం ఒక పవిత్ర విధి
సరాసరి, చిన్నపంచెతో బజార్లో ప్రత్యక్షం
ఆ మొక్కల పువ్వులనవ్వుల్నీ
తడి బట్టతో కోయడమొక కర్తవ్యం
గాలాడనిచోట బంధించటం
ఓ ఘనకార్యం

సుమ సమూహాలకదో జైలు
సహజంగా వికసించడం నేరం
మనుషులంతా సమానంగా
జీవించడం మహా పాపం

తులసి మొక్కకు రాగిచెంబునీళ్లు
సూర్య నమస్కారం,
జందెం పోగుల్లేని బాపన్లే అంతా-
ఎక్కడో అగ్రహారాల్లో కాదు
పట్టణాల్లో మహామహా నగరాల్లో
డిగ్రీల పీజీల ఉద్యోగ అధికార
నిచ్చెన మెట్ల నవ సమాజంలో
అంతో ఇంతో ఎదిగిన నానాకుల
పుంగవులు , ఎకడమిష్టులు
సారీ! ఆడవాళ్లు పూజలుచేస్తే
పర్వాలేదనటం కాదు
పాపం! వాళ్లింకా ఏర్పాట్లలోనే,
అన్నింటా మరో అడుగు వెనకాలే,

ఆధునికత ఇలాగ వర్ధిల్లుతోంది
కార్పొరేట్ భారతంలో..
ఫాసిజానికి,
ఎన్నెన్ని సానుకూలతలో ..

వాడు సమస్త వైవిధ్యాల్ని
జీవన సౌందర్యాల్ని
తన ఉన్మాదంతో ముడేసి
వేనవేల శతాబ్దాలు నడిచొచ్చిన
సమాజాన్ని మధ్యయుగాల అగాధాల్లోకి తేలిగ్గా తోసెయ్య గలుగు తున్నాడంటే,
ఆలోచించి నిప్పుపెట్టాల్సింది అక్కడేనేమో!

Leave a Reply