సెప్టెంబరు 21న విక్టర్ విజయ్‌కుమార్ ఆంధ్రజ్యోతిలో విరసం రచన, ఆచరణ, తాత్వికతను కాలంతో ముడిపెట్టి, సంస్థకు కాలం చెల్లిందని ఒక వ్యాసం రాశారు. అంతక ముందు సంస్థ 56వ ఆవిర్భావ సభ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలోని అంశాలను విమర్శిస్తూ జూలై 4 ఒక వ్యాసం రాసి ఉన్నారు. విరసం ఏర్పడిన కొత్తల్లోనే సాహిత్యంలోకి నక్సలైట్లు జొరబడ్డారని, ఆ సంస్థను నిషేధించాలని విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఏ మర్యాద అడ్డు వచ్చిందో లేక మరీ అలా అంటే తన ఉదారవాద మేధో ముసుగు తొలగిపోతుందని అనుకున్నారో తెలియదుగాని విక్టర్ విజయ్‌కుమార్ ఆ మాట అనలేదు. రెండేళ్లపాటు సంస్థను మూసుకోవాలని విరసానికే సలహా ఇచ్చారు.
ఒక సంస్థ కృషిని కాలంతో ముడిపెట్టి కొలవడం తప్పేం కాదు. ప్రయాణం ఆరంభించినప్పుడు ఎంచుకున్న లక్ష్యానికి కాలక్రమంలో ఎంత దగ్గరగా, లేదా ఎంత దూరంగా ఉన్నదీ అంచనా వేసేందుకు, అప్రమత్తం అయ్యేందుకు అలాంటి ప్రమాణాలు అవసరమే. కాలాన్ని అంకెల్లో గణిస్తాం కాబట్టి ఇలాంటి ప్రయోజనాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుంది. ఈ పని సంస్థలు నిరంతరం చేస్తుంటాయి. లేదంటే గతం వాటికి మోయలేని తలభారంగా మారుతుంది. ఈ బరువు నుంచి బైట పడ్డానికి మార్క్సిస్టులు విమర్శ- స్వీయ విమర్శ పేరుతో విశ్లేషించుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. విరసానికి సంబంధించినంత వరకు స్వీయ విమర్శను, దిద్దుబాటు ప్రక్రియను ప్రచురించి మిత్రులకు, పరిశీలకులకు, విమర్శకులకు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద కూడా ఎవరైనా విమర్శనాత్మకంగా మాట్లాడవచ్చు. అసలు ‘విరసం ఎలా ఉంది? ఎలా ఉండాలి?’ అని సంస్థనే కొన్ని ప్రశ్నలు ఇచ్చి బైటి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న సందర్భాలూ ఉన్నాయి. సభల్లో అలాంటి చర్చను నిర్వహించిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఒక విప్లవ సంస్థ ప్రజా జీవితంలో కొనసాగడమంటే సామాజిక సంబంధాల్లో ఉనికిలోకి వచ్చి, వాటిని మార్చే క్రమంలో క్రియాశీలతను పొంది, దాన్ని తీర్చిదిద్దుకోడానికి సిద్ధం కావడమే.
ఇలాంటి అన్ని సందర్భాల్లో మిత్రులు, విమర్శకులు సంస్థ గురించి ఏమనుకుంటున్నదీ విరసం తెలుసుకోగలిగింది. వాటి నుంచి స్వీకరించవలసిన వాటితో తన కార్యాచరణను పదును పెట్టుకుంది. తన ఆలోచనా చట్రాన్ని సుసంపన్నం చేసుకున్నది. తన రచనా శక్తితో, విప్లవ సాహిత్యోద్యమం బలోపేతమయ్యేలా తీర్చిదిద్దుకున్నది. అదే సందర్భంలో విప్లవేతర అభిప్రాయాలను, విప్లవానికి నష్టం చేసే సూచనలను చర్చించి పక్కన పెట్టింది. ఇదంతా ఇంతగా ఎందుకు చెప్పవలసి వస్తున్నందంటే విక్టర్ విజయ్‌కుమార్ వాదనలో అనుకూలాంశం ఏదీ కనబడటం లేదు. గతంలో కొద్ది మందిలాగా, విరసం తాత్విక, రాజకీయ, సిద్ధాంత మౌలిక భావనలను ఆయన ఎద్దేవా చేశారు. చివరికి ఆ భావజాలానికి, తాత్విక దృక్పథానికి ఎక్స్పైరీ డేట్‌ను విక్టర్ విజయ్‌కుమార్ ప్రకటించారు.
చారిత్రకంగా వర్గపోరాటం అభివృద్ధి చెందే క్రమంలో కుదుపునకు గురయినప్పుడల్లా రాజకీయేతర ధోరణులు మేధో సమాజాన్ని ఆవరించడం కొత్తేం కాదు. అలాంటప్పుడల్లా సామాజిక శాస్త్రాలు తీవ్ర విమర్శకు గురి కావడమూ ఆశ్చర్యం కలిగించదు. ప్రస్తుతం విప్లవోద్యమం తాత్కాలికంగా ఓడిపోయింది. ఆ మాటకొస్తే అంతర్జాతీయంగానే కార్మికవర్గ పోరాటాలు బాగా బలహీనపడ్డాయి. ఇండియా వంటి వెనుకబడిన దేశాల నిర్దిష్ఠ రాజకీయార్థిక ప్రత్యేకతల వల్ల, రాజ్యస్వభావం వల్ల, తీవ్రమైన అణచివేత వల్ల, అనేక సామాజిక విశ్లేషణ పరికరాలను ఆవిష్కరించి, ఆచరణలో నిగ్గుతేల్చిన విప్లవోద్యమం వెనకతట్టు పట్టింది. ఇది మన కాలానికి కొత్త పరిస్థితి. కానీ, చరిత్ర గుణపాఠాలు నేర్వకుండా చరిత్రను మార్చే అత్యంత సృజనాత్మక, మానవీయ, ప్రజాస్వామిక కృషికి మానవాళి పూనుకోలేదు. తమ ఇష్టానుసారం మానవ కార్యకతృత్యం సాగదు. ఈ క్రమమంతటా మానవ ఆవిష్కరణలు, సాహిత్యం, కళలు వర్గపోరాట శాస్త్రంలో సంలీనమవుతూనే ఉంటాయి. తన కాలానికి విరసం ఈ చెమట చుక్కల మేధో సంచిత జ్ఞానానికి వారసురాలు. దీన్ని వదిలేయడమంటే కాడి పడేసి తన దారి తాను చూసుకోవడమే. ఈ పనిని విరసం చేయకపోవడమే విక్టర్ విజయ్‌కుమార్ వంటి తక్షణ ఫలిత ప్రాధాన్యవాదులకు కంటగింపుగా మారింది.
ఆయనలాంటి వాళ్ల మాటల నేపథ్యంలోని ఈ వాతావరణం అర్థం కాకపోతే, విరసంపై జరిగే దాడుల స్వభావం గ్రహించలేం. ఓడిపోతున్నప్పుడు దిక్కు మార్చుకోవాలి కదా..గాలివాటు చూసుకోవాలి కదా.. అంటూ మర్యాదపూర్వక భాషలో, మెత్తగా సలహాలు ఇచ్చేవారు సమాజంలో పెరిగిన మాట నిజం. పరిస్థితులు మారాయి కాబట్టి మీరూ మారాలని ఏ అర్థంలో చెబుతున్నారో గ్రహించకుండా , ఇలాంటి వాదనతో తలపడలేం. ఈ కోవలో విక్టర్ విజయ్‌కుమార్ మొదటివారుగానీ, చివరివారుగానీ కాదు. ఇదంతా విరసం అనే ఒక సంస్థను టార్గెట్ చేసుకోవడం కాదని గ్రహించాలి. మొత్తంగా విప్లవ రాజకీయాల అవసరాన్ని తిరస్కరించడం అసలు ఉద్దేశం.
విరసం సాహిత్య కృషి లేదని, పనికి వచ్చే పుస్తకాలు తేవడం లేదనేదే ప్రధాన విమర్శ అయితే, సాహిత్యంలో వర్గపోరాటానికి నూతన వ్యక్తీకరణలుగా విరసం ఎంతో సాహిత్యం సృష్టిస్తున్నది. ఆ రోజు నుంచి ఇప్పటి దాకా భూషణం కొండగాలి, అల్లం రాజయ్య కొలిమంటుకున్నది నుంచి పాణి అనేక వైపుల, నల్లూరి రుక్మిణి చుక్కపొడుపు నవలల వరకు విస్తరించిన ఉద్యమ నవలా ప్రస్థానం, రెగ్యులర్‌గా తెస్తున్న పత్రికల వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నవే. విరసం 2025లో అజ్ఞాత మహిళా రచయితల ‘వియ్యుక్క’ కథలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది. ఇప్పటి వరకు మూడు సంకలనాలు తీసుకువచ్చాం. మరొక మూడు సంకలనాలు త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన సంకలనాలు అంతర్జాతీయంగా కూడా ప్రచురణకు నోచుకున్నాయి. ఇవి ఇప్పటికే లాటిన్, ఇతర భాషలలోకి అనువాదం అవుతున్నాయి. వియ్యుక్క సంకలనాలే కాకుండా మా ఇతర ప్రచురణలు ఇంగ్షీషు, హిందీ, పంజాబీ, ఒడియా, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ బాషాల్లోకి అనువాదం అయ్యాయి. వీటిని తెలుసుకోవడం, అధ్యయనం చేయడం విక్టర్ విజయ్‌కుమార్‌కు పెద్ద కష్టం కాదు. విరసం యాభై ఏళ్ల సందర్భంగా ఈ మొత్తం కృషిపై నేరుగా సమాజ విమర్శను ఆహ్వానించాం. భిన్న ఆలోచనలు, వేర్వేరు ఆచరణలు కలిగిన సాహిత్య, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను క్రోడీకరించి సావనీర్ ప్రచురించాం.
మార్క్సిస్టు- లెనినిస్టు రాజకీయాలకు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలతో మరింత ప్రాచుర్యం కల్పించిన సాయిబాబా సాహిత్యాన్ని, కులం మీద మా పూర్వ కార్యదర్శి కల్యాణరావు సాహిత్యం ముందుపెట్టి ఆ రాజకీయాలపైనే విక్టర్ విజయ్‌కుమార్ దాడికి దిగారు. పైగా సామ్రాజ్యవాదం అనే పదం ఉచ్చరించడానికే ఇష్టపడటం లేదు. దళిత, ఇతర అస్థిత్వాలను విరసానికి పోటీ పెట్టాలని ప్రయాస పడుతున్నారు. విరసం, విప్లవోద్యమం తన ఆచరణ నుంచేగాక, ఈ దేశ ప్రజల తరతరాల పోరాటాల నుంచీ, పీడిత ప్రజల కళా సాహిత్య సృజన నుంచీ ఎంతో నేర్చుకుంది. ముఖ్యంగా గడ్డి వేళ్ల చేవను, సౌందర్యాన్ని విరసం, విప్లవోద్యమం గరిష్ఠంగా సొంతం చేసుకున్నాయి. బ్రాహ్మణీయ హిందుత్వ అనే పదం కరపత్రంలో మూడు సార్లే మేం వాడామనేది విక్టర్ విజయ్‌కుమార్ విమర్శ. అక్కడ మేం మూడుసార్లే వాడి ఉండవచ్చుగానీ, ఇప్పటికి పదేళ్లుగా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాల వ్యతిరేక వ్యూహాన్ని సాహిత్య, ఐక్యసంఘటనా రంగంలో నిర్మించే పనిలో విరసం ఉంది. ఇది కులం, పితృస్వామ్యం, సనాతన ధర్మం, బ్రాహ్మణీయ భూస్వామ్యం పునాదులపై నిర్మాణమైన ఫాసిజం. కార్పొరేట్ పెట్టుబడి అవసరాలు తీర్చడానికి వచ్చిన ఫాసిజం. అందుకే దీన్ని మేం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అనీ, కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం అనీ సూత్రీకరించాం. దీని మీద రాజకీయార్థిక, చారిత్రక, సాంస్కృతిక, భావజాల విశ్లేషణను అనేక పుస్తకాల్లో ప్రచురించాం.
ఇండియా నిర్దిష్టత చాలా విషయాల్లో యూరప్ కంటే భిన్నమైంది. ఇక్కడ భూస్వామ్యానికి కులం ఉంది. అందువల్ల ఇండియాలో కులం, మతం సంస్కృతికే పరిమితమై లేవు. పాలకవర్గాల తాత్వికతలను రూపుదిద్దడంతో తమ పని అయిపోయిందని అవి భావించడం లేదు. దళారీ, నిరంకుశ బూర్జువాతో కలిసి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇక్కడ కుల భూస్వామ్యం పని చేస్తోంది. సరిగ్గా గ్రహిస్తే అర్ధ భూస్వామ్యం క్యారెక్టర్ ఇది. 40 ఏళ్ల కిందటి రూపంలో భూస్వామ్యం ఇప్పుడు లేదు. కానీ, కుల భూస్వామ్య లక్షణాలతో కొత్త పెత్తందారులు గ్రామాల్లో తిష్ఠ వేసుకున్నారు. కార్పొరేట్, సామ్రాజ్యవాద పరిభాషలో పోస్టు మోడ్నరిజంతో పెనువేసుకుని మాట్లాడుతున్న వాళ్లు పట్టణాల్లో తయారయ్యారు. ఈ శక్తులన్నీ రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో కలిసి విజృంభిస్తున్నారు. ఒక పక్క ఫాసిస్టులు ఆచరణలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంటే, ఇంకో పక్క సిద్ధాంత రంగంలో రాజ్యాంగవాదం ప్రబలింది. ఫాసిజానికి వ్యతిరేకంగా ఉదారవాద శక్తులతో కలిసి పని చేస్తూనే , రాజ్యాంగవాదాన్ని సిద్ధాంత స్థాయిలో విరసం ఎదుర్కొంటోంది. అధికారం ఒకే చోట కేంద్రీకృతం కావడం, అతివాద జాతీయవాదం, మనుషుల కంటే దేశం గొప్ప అనే భావజాలమే ఫాసిజం అని విక్టర్ విజయ్‌కుమార్ అంటున్నారు. కానీ మన దేశంలో ఫాసిజం అంత స్వల్పమైంది కాదు. ఈ అవగాహన తప్పక ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలను ఓటమి తీరానికి చేర్చుతుంది. భారత నిర్దిష్ట చరిత్రను, రాజకీయార్థిక వ్యవస్థను, ఇక్కడి కుల ఆధారిత సాంస్కృతిక భావజాల రంగాలను అర్ధం చేసుకోవాల్సిన వర్గ పోరాట వాస్తవికతను పక్కనపెట్టి, కంటికి కనిపిస్తున్న దుర్మార్గాల మీద చేసే సూత్రీకరణలు చాలా ఔట్ డేటెడ్‌గా మిగిలిపోతాయి. ఏది తోస్తే అదే ఫాసిజంగా వ్యక్తులు ఎవరైనా మేధో మస్తిష్కాల్లో సృష్టించుకోవచ్చు. కానీ ఫాసిజం బారి నుంచి సమాజాన్ని బైటపడేయడానికి ఆ ఆలోచనలు పనికి రావు. కాబట్టి ఈ వాదనలను ఆయనకే వదిలేద్దాం.
అయితే, ఫాసిజం యూరప్‌లో ఉన్నట్టే ఇండియాలో ఉందా? ఆ మాటకొస్తే.. ఏ భావనా సమాజ చలనానికి బయట అమూర్తంగా ఉండదు. ప్రపంచ సన్నివేశం మారినప్పుడల్లా అవీ రూపాలు మార్చుకుంటున్నాయి. ఒకనాడు దళారీ బూర్జువా అంటే చెప్పిన అర్థం ఇవాళ మరింత బాహాటంగా రోజువారీ పాలకవర్గ విధానాల్లో సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతోంది. తన ప్రయోజనాలూ, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలూ తీర్చే వర్గంగా ఇప్పుడు అది ఎట్లా ఎదిగిందో శాస్త్రీయ విశ్లేషణలు విరసం, విప్లవోద్యమం అందించాయి. అర్ధ భూస్వామ్యం కూడా ఒకప్పుడు ఉన్నట్లు ఇవాళ లేదు. కులం కేంద్రంగా హిందుత్వ ఫాసిజం రాజకీయ, సాంస్కృతిక నియంతృత్వంగా మారిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. మరి భూస్వామ్యం, దళారీ, బూర్జువా వంటి మాటలకు కాలం చెల్లిపోయిందంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి హానీ తలపెట్టడమే కదా. ఈరోజు జరుగుతున్న రాజకీయార్థిక మార్పులన్నీ ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరణలో భాగం. ఇవేమీ ఇప్పటికిప్పుడు వచ్చిపడ్డవి కావు. అనూహ్యమైనవి అసలే కాదు. సామాజిక శాస్త్రాల ఆధారంగా విరసం అనేక కొత్త ఆలోచనలను, పరికరాలను, పరిభాషను సమాజం నుంచి గ్రహించి, తన అధ్యయనంలో భాగంగా మెరుగుపరిచి తిరిగి సమాజ పురోగతికి తన వంతు కానుకలుగా అందిస్తోంది. ఈ గతితర్కం అంతుబట్టకపోతే ఇండియా వంటి సంక్లిష్ట సమాజాల సారం సమగ్రంగా అందదు.
వలసకు ముందు స్వయం సమృద్ధ గ్రామాలు ఇండియాలో ఉండేవని, రామరాజ్యం నడిచిందని అన్న గాంధీలో అంబేడ్కర్ పచ్చి హిందుత్వ కులవాదిని కనుగొన్నాడు. గ్రామాలు బలంగా ఉండటం అంటే, కుల వ్యవస్థ బలంగా ఉన్నట్టే కదా అని అంబేడ్కర్ వాదించారు. అభివృద్ధి ప్రకటనల పట్ల, అవి కలిగించే రూప భ్రాంతుల పట్ల ఉండాల్సిన ఎరుక ఇది. ఆనాడే సమాజాన్ని ఈ దిశగా అంబేడ్కర్ అప్రమత్తం చేశారు. కానీ, విక్టర్ విజయ్‌కుమార్ మాత్రం ప్లాట్‌ఫామ్ ఎకానమీ, డిజిటల్ పెట్టుబడిదారీ వర్గం, డేటా క్యాపిటలిజంతో దేశం ఎక్కడికో వెళ్లిపోయిందంటూనే..కులం అనే మౌలిక సామాజిక వాస్తవికతను వదిలేశారు. సామ్రాజ్యవాద దశను క్రోనీ క్యాపిటలిజం దాటేసిందని సూత్రీకరించారు. మరి ఈ నయా దునియాలో కులాన్ని ఆయన ఎక్కడ లొకేట్ చేస్తున్నారు? సారంలో సామ్రాజ్యవాదులకు మరింత సేవ చేస్తున్న భారత పెట్టుబడిదారీ విధానాన్ని దళారీ బ్యురాక్రటిక్ పెట్టుబడిదారీ విధానంగా గుర్తించకపోతే కులం అర్థం కాదు, బ్రాహ్మిణిజం అర్థం కాదు. ఇదంతా క్రోనీ క్యాపిటలిజం కంటే వ్యవస్థీకృతంగా నడుస్తున్న కాంప్రడార్ క్యాపిటలిజంలో భాగం. కొత్త కార్మిక సంపుటి గ్రిగ్ వర్కర్ల ప్రస్తావన విక్టర్ విజయ్‌కుమార్ సరిగ్గానే చేశారు. కానీ, ఆయన ఛీత్కరించే వర్గపోరాట సిద్ధాంతాన్ని ఈ కొత్త ఆవిష్కరణ వమ్ము చేయలేదు. పైగా మార్క్సిజం మరో ఆవిష్కరణ అయిన అదనపు విలువ సిద్ధాంతాన్నే ఈ అన్ని మార్పులూ రుజువు చేస్తున్నాయి. ఈ కార్మికుల అనుభవాలను సాహిత్య ప్రక్రియల్లోకి తీసుకురావాల్సి ఉంది.
చివరిగా, విక్టర్ విజయ్‌కుమార్ ఆవు కథ దగ్గరకు వద్దాం. మనుషులు, సమాజాలు, ప్రపంచాలు, వాటిని నడిపించే సూత్రాలు అన్నీ మారినా.. విరసం మారడం లేదని, ఆవుకథ తరహాలో సంస్థ తయారయిందని ఆయన అన్నారు. కానీ, విరసం, విప్లవ రచయితలు పులి దగ్గరకు వెళ్లిన ఆవు కథను ఏనాడో విప్లవీకరించారు. మాట ఇచ్చినట్టు బుద్ధిగా లేగకు పాలు ఇచ్చి పులి దగ్గరకు వెళ్లే నెరేషన్‌ను నక్సల్బరీ మార్చివేసింది. తన వంటి బాధితులైన మరికొన్ని ఆవులను వెంట పెట్టుకుని వెళ్లి, తలపడి పులి నెత్తుటితో తన జాతికి విముక్తిని సంపాదించుకున్న కొత్త ఆవు కథను లిఖించింది. విరసం, విప్లవ రచయితలు, విప్లవోద్యమమూ సాధించింది ఇదీ.
( ఆంధ్రజ్యోతి పత్రిక ;వివిధ’లో అక్టోబర్ 19న ప్రచురించిన వ్యాసానికి పూర్తి టెక్స్ట్ )




