2026 ఏప్రిల్ 03
ఒడిశాలోని సిజీమాలి లో ఘర్షణ:
2026 మార్చి 25న ఒడిశాలోని కలహండి జిల్లాలో కార్యకర్త నేతలు లింగరాజ్ ఆజాద్, సురేష్ సంగ్రామ్‌లను అరెస్టు చేశారు. నీరు, అడవి, భూమి (జల్, జంగల్, జమీన్) కోసం గ్రామీణ, ఆదివాసీ సముదాయాల హక్కులను కాపాడటంలో, అలాగే వేదాంత లిమిటెడ్ మైనింగ్ సంస్థను వ్యతిరేకించడంలో వీరిద్దరూ చురుగ్గా పాలుపంచుకున్నారు. బాక్సైట్ సమృద్ధిగా ఉన్న ఒడిశాలోని ఈ ప్రాంతంపై మైనింగ్ సంస్థల కన్ను పడింది. తమ భూమిని నిలబెట్టుకోవడానికి ఈ జిల్లాలో గతంలో అనేక ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల దృష్టి సిజిమాలిపై పడింది.
మైనింగ్ ప్రాజెక్ట్; పర్యావరణ ఆందోళనలు
2023లో, సుమారు 1,549 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌లో మైనింగ్ ప్రారంభించడానికి వేదాంత గ్రూప్ అనుమతి పత్రాన్ని పొందింది. ఇక్కడ సుమారు 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. సిజిమాలి అనేది స్వచ్ఛమైన అడవులు, గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన కొండ ప్రాంతం. తమ ఆరాధ్య దైవం ‘తీజ్ రాజా’ సిజిమాలి కొండపై ఉన్న ఒక గుహలో కొలువై ఉన్నారని వారు నమ్ముతారు కాబట్టి స్థానిక ఆదివాసీ సముదాయాలకు ఇది ఎంతో పవిత్రమైనది.
తమకు ముందున్న అనేకమంది కార్యకర్తల వలె ఆజాద్, సంగ్రామ్లపై కూడా కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు నేరపూరిత కుట్ర, దేశద్రోహం, చట్టవిరుద్ధమైన సంస్థలకు మద్దతు ఇవ్వడానికి సంబంధించిన భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం కూడా వారిపై ఆరోపణలు మోపారు.
లింగరాజ్ ఆజాద్ అధ్యక్షుడిగా ఉన్న సమాజ్ వాదీ జన్ పరిషత్ అధినేత అఫ్లటూన్, ప్రజాస్వామిక అసమ్మతిని అణచివేయడానికి ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. “మైనింగ్ ప్రాంతం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కిందకు వచ్చే 18కి పైగా ఆదివాసీ ప్రాబల్య గ్రామాలలో విస్తరించి ఉంది, ఇది ఆదివాసీలకు స్వయం పాలన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తి హక్కును కల్పిస్తుంది. పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం ప్రకారం, గ్రామసభల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ మైనింగ్ జరగకూడదు. కానీ కొండలను లీజుకు ఇచ్చే ముందు స్థానిక గ్రామస్థుల నుండి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు,” అని అఫ్లటూన్ అన్నారు.
భయాందోళనలు; నిఘా ఆరోపణలు
ఒడిశా పోలీసులు, సిఆర్పిఎఫ్ అనుసరిస్తున్న బెదిరింపు చర్యలలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. వారు గ్రామాల్లో 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు, దీనివల్ల మహిళలు, పిల్లలను కూడా తమ ఇళ్లను విడిచి బయటకు రావడానికి అనుమతించటం లేదు. అదనపు నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. పంట కోత ఆలస్యం కావడం వల్ల నిలబడి ఉన్న పంటలు నాశనమయ్యాయి.
సిజిమాలిలో గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న ఆసియా పసిఫిక్ ఫోరమ్ ఆన్ ఉమెన్, లా అండ్ డెవలప్మెంట్ (ఫెమినిస్ట్ నెట్వర్క్) సభ్యురాలు, కార్యకర్త శరణ్య నాయక్ ఇలా అన్నారు: “ఐదు గ్రామాలు అసమ్మతికి కేంద్రాలుగా ఉండడం వల్ల అవి మరింత ఎక్కువ లక్ష్యంగా మారాయి. సజబారి, కాంతమాల్ గ్రామాల్లో (ఎక్కువగా ఆదివాసీ, దళిత కుటుంబాలు ఉన్న ప్రాంతాలు) పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మహిళలు బయటకు వచ్చి ఈ కొండలలో సమృద్ధిగా ప్రవహించే ఊటల నుండి తాగునీరు తెచ్చుకోవడానికి కూడా అనుమతించడం లేదు.”
“ప్రజలు బయటకు వెళ్లి పని చేసుకోలేకపోతున్నారు, దీనివల్ల కుటుంబాలు రోజుకు ఒక్క పూట భోజనంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణీ స్త్రీలను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల కోసం వెళ్లనివ్వడం లేదు,” అని శరణ్య తెలిపారు.
బలవంతపు సమ్మతి; అరెస్టులు
రాయగడలోని ఆసుపత్రికి తన గర్భిణీ కోడలిని ప్రసవం కోసం తీసుకెళ్లిన 50 ఏళ్ల గిరిజన మహిళా నాయకురాలు నారింగ్ దేయ్ మాఝీని అరెస్టు చేసిన ఘటనను ఇక్కడి గ్రామస్థులు ఉదహరిస్తున్నారు. ఆమెను ఆసుపత్రి ప్రాంగణంలోనే అరెస్టు చేశారు. గత ఏడు నెలలుగా ఆమె లాకప్‌లోనే ఉన్నారు.
ఇటువంటి బెదిరింపు చర్యలు గత మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ గ్రామస్థుల నుండి సమ్మతిని పొందినట్లు చూపించుకోవడానికి జిల్లా యంత్రాంగం ‘నకిలీ’ గ్రామసభ సమావేశాలను నిర్వహించింది. తరువాత సమాచార హక్కు ద్వారా సేకరించిన సమాచారంలో ఈ సమ్మతి పత్రాల్లోని సంతకాలు చాలా వరకు నకిలీవని నిర్ధారితమైంది.
“మమ్మల్ని మావోయిస్టులని పిలుస్తున్నారు, కానీ మాది పూర్తిగా అహింసాయుత నిరసన. పోలీసులు చిన్న పిల్లలను కూడా తీసుకెళ్లి కొట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే ఇక్కడ నివసించే చాలా కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచడానికే మొగ్గు చూపుతున్నాయి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. నేను స్వతంత్ర దేశంలోనే ఉన్నానా అని. భారతదేశం ఒక పెద్ద జైలుగా మారిపోయింది,” అని కొన్ని నెలలు జైలులో గడిపి ఇటీవల విడుదలైన మైనింగ్ వ్యతిరేక కార్యకర్త లక్ష్మణ్ మాఝీ ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణ; జీవనోపాధి సంబంధిత ఆందోళనలు
ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, కంపెనీ అధికారులు రహస్యంగా కొండల్లోకి ప్రవేశించి ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండా నిరోధించేందుకు, గ్రామస్థులు 2023లో సిజిమాలి కొండపై ఒక డేరాను (టెంట్) ఏర్పాటు చేశారు.
ఈ గనులను ప్రజలు వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మైనింగ్ వల్ల స్వచ్ఛమైన అడవుల నరికివేత, యు పర్యావరణం నాశనం కావడమే కాకుండా, వారి నీటి చక్రం కూడా దెబ్బతింటుంది. లక్ష్మణ్ దీనిపై స్పందిస్తూ, “మా పర్యావరణ చక్రాన్ని కాపాడటంలో బాక్సైట్ కీలక పాత్ర పోషిస్తుంది. వర్షపు నీటిని నిల్వ ఉంచడంలో బాక్సైట్ సహాయపడుతుంది, ఇది ఏడాది పొడవునా, ముఖ్యంగా వేసవి నెలల్లో ఊటల ద్వారా విడుదలవుతుంది,” అని వివరించారు.
సిజిమాలికి 40 కిలోమీటర్ల దూరంలో నివసించే 8,000 మంది జనాభా కలిగిన ‘దోంగ్రియా కొంద్’ తెగ కూడా ఈ పరిణామాలతో ముప్పును ఎదుర్కొంటోంది. దోంగ్రియా కొంద్ ఆదివాసులకు నియమగిరి కొండ వారి దైవమైన ‘నియమ రాజా’ నివాసస్థలం. ‘దోంగ్రియా కొంద్’ అంటే ‘జలధారల సంరక్షకులు’ అని అర్థం. గత 2,000 సంవత్సరాలుగా వారు వీటిని సంరక్షిస్తూ, పోషిస్తున్నారు.
నియమగిరి; హస్దేవ్ అరండాల నుండి పాఠాలు
నియమగిరి కొండల్లో కూడా భారీ బాక్సైట్ నిల్వలు ఉన్నాయి; ఇవి గత కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. దోంగ్రియా కొంద్లు తమ హక్కుల కోసం పన్నెండేళ్లపాటు పోరాడారు; చివరికి సుప్రీంకోర్టు ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరపాలని ఆదేశించింది. ఆ సేకరణలో ఆదివాసులు ఏకగ్రీవంగా బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
నియమగిరి కొండల రక్షణలో ముందుండి, తన కృషికి గాను 2017లో ‘గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు’ పొందిన కార్యకర్త ప్రఫుల్ల సమంతర ఇలా అన్నారు: “ఈ ప్రాంతంలో కార్పొరేట్ ఉగ్రవాదం కొనసాగుతోంది. ఈ కొండల్లో బాక్సైట్, బొగ్గు, సున్నపురాయి తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అరుదైన అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోంది. కేవలం 25 ఏళ్ల వ్యవధిలోనే మన నదులు, పర్యావరణం, జీవవైవిధ్యం — సర్వస్వం నాశనమైపోతాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, జరుగుతున్న దానిపై ప్రతిపక్షాలు కూడా నోరు మెదపడం లేదు.”
ఛత్తీస్‌గఢ్‌లోని భారతదేశపు చివరి నిరంతర అటవీ ప్రాంతమైన హస్దేవ్ అరండాల విధ్వంసాన్ని చూస్తున్న సిజిమాలి, నియమగిరి ఆదివాసులు, తమ తోటివారు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు. అక్కడ నివసిస్తున్న ఆదివాసులు పెద్ద సంఖ్యలో తమ అటవీ ఉత్పత్తులను సేకరించడానికి లేదా వారి పవిత్ర స్థలాలను సందర్శించడానికి ఇప్పుడు అనుమతించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
మైనింగ్ విధానం; సుస్థిరతపై చర్చ
ఖచ్చితంగా, మైనింగ్ అనేది ముఖ్యమైనదే, కానీ భారతదేశంలో ఎంత మేర మైనింగ్ చేయాలి; ఎంత చేయకూడదు అని నిర్ణయించే పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగం లేదు. అతిగా మైనింగ్ చేయరాదని వివిధ ప్రభుత్వ సంస్థలు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. బొగ్గు అన్వేషణ ప్రణాళికలో నిమగ్నమై ఉన్న ‘సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్’, పలు అడవుల్లోని బొగ్గు నిల్వలు కేవలం ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు మాత్రమే బొగ్గును అందించగలవని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. అటువంటి స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కీలకమైన అడవులను ఎందుకు నాశనం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.
‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’లో క్లైమేట్ & ఎకోసిస్టమ్ ప్రాక్టీస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న దేబాదిత్య సిన్హా, మైనింగ్, థర్మల్ పవర్ ప్లాంట్లు, నదులపైన ఆనకట్టల వల్ల ఈ అడవులకు జరుగుతున్న కోలుకోలేని నష్టాన్ని నొక్కి చెప్పారు.
సోషలిస్ట్ నాయకుడు కిషన్ పట్నాయక్ ఒకప్పుడు ఇలా రాశారు: “సమకాలీన నాగరికతలో మైనింగ్ అనేది అత్యంత క్రూరమైన సాంకేతికత… గనులను కలిగి ఉన్న సముదాయాలు సుస్థిరమైన రీతిలో వాటిని వినియోగించుకోవడానికి వీలుగా మనిషి ఒక కొత్త సాంకేతికతను మరియు పద్ధతిని కనిపెట్టాలి.”
రాజకీయ హామీలు; భవిష్యత్తు ఆందోళనలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆదివాసీల ‘జల్, జంగల్, జమీన్’కు ఎటువంటి ముప్పు ఉండదని మోదీ హామీ ఇచ్చారు. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రెండింటిలోనూ బిజెపి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత — ఇక్కడ ముఖ్యమంత్రులు ఆదివాసులే అయినప్పటికీ — అడవులను నరికివేయడానికి కార్పొరేట్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు గురించి ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది.
- రశ్మి సెహగల్ రచయిత్రి, స్వతంత్ర జర్నలిస్టు
- తెలుగు: పద్మ కొండిపర్తి




