ప్రస్తుతం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) భారతదేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా ఉంది. ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) వ్యతిరేక ఉద్యమ సమయంలో అమిత్ షా చెప్పిన “ఆప్ క్రోనాలజీ కో సమఝియే” (మీరు కాలక్రమాన్ని అర్థం చేసుకోండి) అనే మాట ఒక మీమ్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఎన్నికల సంఘం ఆదేశించిన ఎస్ ఐ ఆర్ అనేది, కాలక్రమానుసారంగా చూస్తే, ఎన్ ఆర్ సి ప్రాథమిక దశేనని స్పష్టమవుతోంది. దేశ జనాభా మొత్తానికి సంబంధించిన పౌరసత్వ చట్టబద్ధత, నిర్దిష్ట సమాచారం, పత్రాల ఆధారంగా ధృవీకరించబడుతుందని ఎన్ ఆర్ సి లో తెలిపారు. ఎస్ ఐ ఆర్ అని పిలవబడే ఈ కొత్త సామూహిక వేధింపుల కార్యక్రమం, ఇప్పుడు అవే పత్రాల ఆధారంగా చట్టబద్ధమైన ఓటర్లను ధృవీకరించడం గురించి మాట్లాడుతోంది.
2014లో భారత రాజ్యంలో ఫాసిస్ట్ ఆరెస్సెస్-బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే, వారు “అక్రమ చొరబాటుదారుల” గురించి నిరంతరం గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. భారత ప్రజలలోని ఒక పెద్ద సమూహానికి కనీస ప్రజాస్వామ్య హక్కులను కూడా దూరం చేసి, వారిని రెండవ తరగతి పౌరులుగా మార్చడమే దీని లక్ష్యం. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? దేశీయ, విదేశీ కార్పొరేట్ యజమానుల ప్రయోజనాలకు సేవ చేయడానికి, ఎలాంటి బేరసారాల శక్తి లేని, శక్తిహీనులైన, నిర్బంధ చవక కార్మికుల నిల్వను సిద్ధం చేయడం. దానితో పాటు, వారిని కొన్నిసార్లు వివిధ ప్రయోగాలకు గినియా పందులుగా, మరికొన్నిసార్లు సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రాలలో ముందు వరుసలో రాలిపోయే సైన్యంగా మార్చడం. మన దేశంలో అధికారంలో ఉన్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తి కూడా ఈ నిస్సహాయ ప్రజలను తమకు విధేయులైన సైనికులుగా మార్చాలని కోరుకుంటోంది.
ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక సందర్భాన్ని కూడా మనం కాదనలేము. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దాని నుండి తప్పించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులు పెరుగుతున్నాయి. భారతదేశం నేడు రికార్డు స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. ప్రైవేటీకరణ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి శాతం క్రమంగా తగ్గిపోతున్నాయి. కార్మికులు, రైతుల నుండి చిన్న వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర దుస్థితిలో ఉన్నారు. విద్యార్థులు, కార్మికులు, రైతుల ఆత్మహత్యల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాలపై హింస కూడా ఆకాశాన్నంటింది. సామాన్య ప్రజల దృష్టిని వారి అత్యవసరాల నుండి మళ్ళించేందుకు గాను—ప్రధానంగా మైనారిటీ ముస్లిం జనాభాను లక్ష్యంగా చేసుకుంటూ—బిజెపి-ఆరెస్సెస్ తమ హిందుత్వ ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాయి. తద్వారా, దేశ ప్రజల శ్రమశక్తిని, వనరులను ఆదాని, టాటా, అంబానీ, గోయెంకా, ఎస్సార్, వేదాంత వంటి వారికి అమ్మేసి తమ ఫాసిస్టు ఎజెండాను నెరవేర్చుకోవాలని అవి చూస్తున్నాయి. దీనికి బదులుగా, ప్రభుత్వంలో తమ అధికారాన్ని కొనసాగించుకునే వెసులుబాటును అవి కొనుగోలు చేసుకోగలవు.
ఇది అంచెలంచెలుగా, నెమ్మదిగా ముందుకు సాగిన ఒక సుదీర్ఘ ప్రక్రియ. 2019 ప్రారంభం నుంచే ప్రభుత్వం ఈ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో, భారీ ఎత్తున జరిగిన ఎన్ ఆర్ సి – సి ఏ ఏ వ్యతిరేక ప్రజా ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి వారు వెనక్కి తగ్గక తప్పలేదు. అప్పటి నుండి, తమ ఎజెండాను అమలు చేయడానికి వారికి సాధ్యమైన ప్రతి ఎత్తుగడను, వ్యూహాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. దానికి ముందుగా, కీలకమైన సంస్థాగత వ్యవస్థలను ‘కాషాయీకరణ’ చేయడం వారికి అత్యవసరమైంది. 2025 ఫిబ్రవరి 19న, జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (CEC) “ఎన్నుకున్నారు”. భారతీయ జనతా పార్టీతో ఆయనకున్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. 2019లో, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అటువంటి ఒక ‘సంఘ్’ కీలుబొమ్మను ఎన్నికల కమిషన్ అధిపతిగా నియమించారు. ఆయన నియామకం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ), కేంద్ర హోం మంత్రి (అమిత్ షా), లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (రాహుల్ గాంధీ) సభ్యులుగా ఉండే ఒక త్రిసభ్య కమిటీ ద్వారా సి ఇ సి నియామకం జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే, జ్ఞానేష్‌ను నియమించింది ఆ ముగ్గురే. అయితే, ఈ నియామకానికి తాను మద్దతు ఇవ్వలేదని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ, ఆయన మద్దతు ఇచ్చినా లేదా వ్యతిరేకించినా, మెజారిటీ నిర్ణయం (2:1) మాత్రం మారేది కాదని స్పష్టమవుతోంది. కానీ, సి ఇ సి నియామకానికి సంబంధించిన ఈ విచిత్రమైన, ఏకపక్ష నియమం మొదటి నుంచీ ఉన్నది కాదు, శాశ్వతమైనదీ కాదు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. సి ఇ సి నియామక నియమాలను నిర్దేశించే చట్టాన్ని 2023లో మార్చారు. ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, 2023’ని అప్పట్లో రూపొందించారు. రాష్ట్రపతి ఆమోదంతో, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులతో కూడిన ఒక సంయుక్త కమిటీ ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తుందని ఈ కొత్త చట్టం పేర్కొంటోంది. కేవలం సి ఇ సి ని మాత్రమే కాకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను కూడా ఈ కమిటీనే నియమిస్తుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఒక ‘కీలుబొమ్మల నాటకం’లా ప్రభుత్వ చేతుల్లోకి—తద్వారా ‘సంఘ్’ చేతుల్లోకి—అప్పగించడం వెనుక ఉన్న అసలు కథ ఇదే. వాస్తవానికి దీనికి ముందే, మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనే, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత వైఖరిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈసారి ఆ అనుమానాలు మరింత బలంగా, నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యాయి. అంతేకాకుండా, భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కూడా ఈ కాషాయీకరణ ప్రక్రియ ఫలితమే. ప్రభుత్వం తన ఎస్ ఐ ఆర్ (SIR) ఆధారిత అజెండాను పూర్తి చేయడానికి చాలా కాలంగా పూర్తి స్థాయిలో పనిచేస్తోందని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
ఆ తర్వాత ఏం జరిగింది? బీహార్ తర్వాత, బెంగాల్లో కూడా ఎస్ ఐ ఆర్ నిర్వహించారు. భవిష్యత్తులో, దీనిని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేస్తారు. గత సంవత్సరం మార్చి-ఏప్రిల్ నెలలంతా, ఎన్ ఆర్ సి ట్రయల్ రన్‌ను పూర్తి చేసే లక్ష్యంతో, ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (EROలు), సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)లతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. వారు మరోసారి “అక్రమ చొరబాటుదారులు” అనే పాత భూతాన్ని తమ ఆయుధంగా ముందుకు తెచ్చారు. ఎన్నికలకు ముందే బీహార్‌లో ఎస్ ఐ ఆర్ నిర్వహించారు. బీహార్‌లో వేగవంతమైన పట్టణీకరణ జరిగిందని ఎన్నికల సంఘం వాదించింది. దాని ఫలితంగా, ప్రజలలో భారీ వలసలు చోటుచేసుకున్నాయి. దానితో పాటు, అక్రమ చొరబాటుదారుల సమస్య కూడా ఉంది. వారు ఓటర్ల జాబితాలోకి ప్రవేశించవచ్చని ఆరోపించారు. అయితే, బీహార్‌లో ఎస్ ఐ ఆర్ కారణంగా, చొరబాటుదారులు అని పిలవబడే వారు కాకుండా, బీహార్‌లోని సాధారణ ప్రజలే, చాలా సందర్భాలలో స్వయంగా బీహారీ హిందువులే తొలగించబడటం మనం చూశాం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బీహార్‌లో 65 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి, వీరిలో 55% మంది మహిళలు ఉన్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నిర్వహించిన 2020 సర్వే ప్రకారం, బీహార్ జనాభాలో సగానికి పైగా వలస కార్మికులుగా వివిధ రాష్ట్రాలలో చెల్లాచెదురుగా ఉన్నారు. అయినప్పటికీ, అక్కడ ఎస్ ఐ ఆర్ కేవలం మూడు నెలల్లోనే (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) పూర్తయింది. జూలై 14 నాటికి, పని ప్రారంభించిన సుమారు 20 రోజుల్లోనే బీహార్ ఓటర్లలో 83% మంది తమ ఫారాలను నింపారని కమిషన్ పేర్కొంది. బీహార్ ఓటర్ల జనాభా దాదాపు 8 కోట్లు. కమిషన్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం, ఆ 20 రోజుల్లో దాదాపు 6 కోట్ల మంది ఫారాలు నింపడం పూర్తి చేశారు. ఇది అనివార్యంగా ఎన్నికల కమిషన్, BLOల విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ ఐ ఆర్ ఎలా ఉపయోగపడిందో బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్యను చూస్తేనే అర్థమవుతుంది. ఓటర్ల జాబితా నుండి ప్రతిపక్ష ఓటర్లను క్రమపద్ధతిలో తొలగించడానికి బీజేపీ, సంఘ్ చేస్తున్న ప్రయత్నమే ఎస్ఐఆర్ అని విమర్శకులు ముందే అంచనా వేశారు.
అయితే, బెంగాల్లో ఈ దీనిని కొంత భిన్నంగా నిర్వహించారు. ఫాసిస్ట్ శక్తులు అప్పటికే దేశవ్యాప్తంగా బంగ్లాఫోబియాను వ్యాప్తి చేయడం ప్రారంభించాయి. అస్సాం, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర – ఈ రాష్ట్రాలన్నింటిలోనూ గత కొన్నేళ్లుగా బెంగాలీ నివాసితులు, వలస కార్మికులపై వేధింపులు అనేక రెట్లు పెరిగాయి. అస్సాం ముఖ్యమంత్రి అయితే బెంగాలీలు బయటివారని, చొరబాటుదారులని బహిరంగంగానే అన్నారు. బహుశా అందుకేనేమో పని కోసం ఢిల్లీకి వెళ్లిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బెంగాలీ కార్మికులను బంగ్లాదేశ్‌లోకి అంత అమానుషంగా గెంటేశారు. దేశవ్యాప్తంగా, బెంగాలీలపై ప్రణాళికాబద్ధంగా అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ రాష్ట్రాల్లో, సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, బెంగాలీ కుటుంబాల ఇళ్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు. బెంగాలీ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడం ద్వారా, బెంగాల్లో ఎస్ ఐ ఆర్ కు చట్టబద్ధతను, ప్రజా మద్దతును పొందేందుకు సంఘ్ ప్రయత్నించింది. బీహార్‌లో మాదిరిగానే, ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎస్ ఐ ఆర్ ను నిర్వహించారు. సువేందు అధికారి వంటి బీజేపీ నాయకులు బెంగాల్ రోహింగ్యాలతో నిండిపోతోందని పదేపదే తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంతా రంగం సిద్ధం చేయడానికే జరిగింది. ఇలాంటి సమయంలో, గత ఏడాది ఆగస్టులో బెంగాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత, యుద్ధ ప్రాతిపదికన, కేవలం కొద్ది రోజుల్లోనే బూత్ లెవెల్ ఆఫీసర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేశారు. చివరకు, నవంబర్ 4న బెంగాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభమైంది. ఇప్పుడు, ఎస్ ఐ ఆర్, ఎన్ ఆర్ సి, సి ఏ ఏ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటో నిర్దిష్టంగా చూద్దాం.
ఎస్ ఐ ఆర్ ప్రకారం, 2026 జనవరి 1 నుండి, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ తాము భారత పౌరులమని, చట్టబద్ధమైన ఓటరు అని నిరూపించుకోవాలి. ఇది సరిగ్గా పౌరసత్వ సవరణ చట్టం (సి ఏ ఏ-2003) లోని భాషనే పోలి ఉంటుంది – అంటే, ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదు; ప్రతి ఒక్కరూ తాము పౌరులమని నిరూపించుకోవాలి. ఈ చట్టం ద్వారానే భారతదేశవ్యాప్తంగా మొదటి ఎన్ ఆర్ సి కి పునాది రాయి వేయబడింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వం వంటి సహజమైన దానిని నిరాకరిస్తూ, కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్‌పేయ్, బీజేపీ ప్రభుత్వం 2003లో పాత పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది. పౌరసత్వ ప్రమాణాలను నిర్వచించడానికి, పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) నియమావళి, 2003ను రూపొందించారు. ఈ నిబంధనల ద్వారా, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాల జాబితాను రూపొందించారు. ఆ జాబితాకు ప్రస్తుత ఎస్ ఐ ఆర్ తో కూడా బలమైన పోలికలు ఉన్నాయి. దాని ప్రకారం, 1 జూలై 1987 – 3 జూలై 2004 మధ్య జన్మించిన వ్యక్తి తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. వారు తమ తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన రుజువులను ఏర్పాటు చేసుకోవాలి లేదా తాము “అక్రమ చొరబాటుదారులు” కాదని సాక్ష్యం అందించాలి. అవును, మీరు 1987 కంటే ముందు జన్మించినట్లయితే, పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఎందుకంటే మీరు మీ కోసం మాత్రమే కాకుండా, మీ తండ్రి, తల్లి ఇద్దరి పౌరసత్వము, జన్మస్థల రుజువులను కూడా సేకరించాల్సి ఉంటుంది. ఎస్ ఐ ఆర్ లో కూడా అటువంటి 11 పత్రాలు ప్రస్తావించబడ్డాయి. ఈ పత్రాలలో కనీసం ఒకదానితోనైనా, మీరు మీ పుట్టిన తేదీని, ఇంకా “జన్మస్థలాన్ని” నిరూపించుకోవాలి. మరోసారి, సిఏఏ 2003 నీడలు కమ్ముకుంటున్నాయి. ఏ పత్రాలు అవసరం? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి సాధారణ ప్రజలకు సులభంగా లభించే పత్రాలు ఈ జాబితాలో చేర్చలేదు. పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు (PPO), ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి విద్యా ధృవీకరణ పత్రం, భూమి నివాస ధృవీకరణ పత్రం, ఆస్తి పత్రం, 2002 ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్లు తెలిపే పత్రాలు వంటివి సమర్పించాలి – ఇవి సామాన్య ప్రజల నుండి వాస్తవంగా ఆశించలేనివి. ఇదే విధానాన్ని మనం సి ఏ ఏ లో కూడా గమనించాము. అవును, ప్రభుత్వానికి ఎంతో ప్రియమైన ఆధార్ కార్డు మొదటి నుంచే తిరస్కరణ జాబితాలో ఉంది. విచారణల సమయంలో ప్రతి ఒక్కరినీ ఆధార్ అడుగుతున్నారని వినబడుతోంది. అయితే, ఇప్పటికే ఎన్ ఆర్ సి పూర్తయిన రాష్ట్రాలలో, ఎన్ ఆర్ సి జాబితాను అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. దీని అర్థం, అస్సాంలో ఎస్ ఐ ఆర్ నిర్వహిస్తే, ఎన్ ఆర్ సి నుండి మినహాయించబడిన 19 లక్షల మంది ప్రజలు- నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారితో పాటు- ఈ ప్రక్రియ పరిధిలోకి కూడా రారు.
కానీ ఇంత సమాచారం సేకరించిన తర్వాత కూడా మనం చూస్తున్నది ఏమిటి? ఎస్ ఐ ఆర్ పేరుతో బెంగాల్ జనాభా మొత్తం తీవ్రమైన వేధింపులకు గురైంది. పేర్లలో అక్షర దోషాలున్నాయన్న సాకుతో, చాలా మందిని “అనుమానాస్పదులు”గా ముద్రవేసి, పదేపదే విచారణలకు పిలిచారు. అవసరమైన పత్రాలను సరిగ్గా సమర్పించినప్పటికీ, దాదాపు 91 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. మరో 27 లక్షల మంది ఇంకా విచారణలో ఉన్నారు. స్పష్టంగా, మైనారిటీ ముస్లిం సమాజం, దళితులు, ఆదివాసీ ప్రజలు, మహిళలలోనే అత్యధికంగా తొలగింపులు జరిగాయి. ఎన్ ఆర్ సి ప్రాథమిక దశ జాతీయ జనాభా రిజిస్టర్ (NPR), అంటే పౌరులందరి పేర్లను నమోదు చేయడం. దీని బాధ్యతను రిజిస్ట్రార్ల చేతుల్లో పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారని వారికి కేవలం “అనిపిస్తే”, ఆ వ్యక్తి సమాచారాన్ని కోరే పూర్తి అధికారం వారికి ఉండేది. ఎస్ ఐ ఆర్ విచారణ ప్రక్రియలో కూడా మనం ఇదే ఆటను చూశాం. ఎన్ ఆర్ సి కింద కేవలం అనుమానంతో పౌరసత్వాన్ని తొలగించే అధికారం, ఈ రోజు ఎస్ ఐ ఆర్ ద్వారా ఓటు హక్కును లాక్కునే అధికారంగా మారింది. ఈ పరిస్థితిలో, లెక్కలేనంత మంది బహిష్కరణకు గురైన ప్రజల భవిష్యత్తు ఏమిటి?
వారు ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అవును, ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా పౌరసత్వం పొందడమనేది సి ఏ ఏ 2019లో నిర్దేశించిన మార్గమే. దీని అర్థం ఏమిటంటే, మీ పత్రాలన్నీ ఉన్నప్పటికీ, విచారణలలో మీ సమాచారం పదేపదే ధృవీకరించబడినప్పటికీ, మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో, మీరు భారతదేశ పౌరుడిగా మారడానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ అత్యంత అవమానకరమైన, కించపరిచే ప్రక్రియలో, మీరు మీ సొంత దేశ పౌరులు కాదని ప్రకటించేలా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. కమిషన్ ఇప్పటికీ దాని ఖచ్చితమైన విధానాన్ని వివరంగా చెప్పలేదు. మీరు పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే తప్ప, మీ ఓటు హక్కును, పౌరసత్వాన్ని తిరిగి పొందే ఆశను వదులుకోవలసి వస్తుందని భావించవచ్చు. లేకపోతే, ట్రిబ్యునల్‌లో మీ కేసును కొనసాగించడానికి అయ్యే ఖర్చును భరించడానికి మీరు మీ ఇంట్లోని పాత్రలను కూడా అమ్ముకోవలసి వస్తుంది.
2002 డిజిటల్ ఓటర్ల జాబితాను 2025 జాబితాతో సరిపోల్చడం, ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేయడం, ఆ ఫారాలను సేకరించి యాప్‌లో అప్లోడ్ చేయడం, సాంకేతిక సమస్యల కారణంగా పేర్లు సరిపోలని వారికి నోటీసులు పంపడం బీఎల్ఓ ల పని. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే, ఓటరు సహజంగానే సంబంధిత బీఎల్ఓ ను బాధ్యుడిగా భావిస్తారు. అయినప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా పేర్లు జాబితాలో లేకపోతే, ప్రజలు విచారణలకు హాజరు కానవసరం కూడా లేదని కమిషన్ పేర్కొంది. అటువంటి చాలా మంది పేర్లు తుది జాబితాలో లేవు. దీనికి నింద బీఎల్ఓలపై పడుతుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా బీఎల్ఓలపై ఎంత తీవ్రమైన ఒత్తిడి తెచ్చారో కూడా మనం చూశాం. దాని ఫలితంగా, వారిలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు, కొందరు మరణించారు కూడా. కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
ప్రపంచ బ్యాంకు 2023 అంచనాల ప్రకారం, భారతదేశంలో 40 కోట్లకు పైగా ప్రజలు రోజుకు కేవలం ₹250 ఆదాయంతో జీవిస్తున్నారు, ఇది జనాభాలో దాదాపు 30 శాతం. వారి వద్ద సాధారణంగా ఆధార్, ఓటరు కార్డు, రేషన్ కార్డు మినహా పెద్దగా పత్రాలు ఉండవు. చాలా మంది వద్ద ఇవి కూడా లేవు. అంతేకాకుండా, మన దేశం అభివృద్ధి, పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్న దేశం. గ్రామాలు, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం చాలా ఎక్కువ. కార్పొరేట్ లాభాల కోసం “స్మార్ట్ సిటీలు” అని పిలవబడేవి నిర్మిస్తున్నారు, కానీ అనేక గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ చేరలేదు. వివిధ రాష్ట్రాలలో వరదలు అత్యంత సాధారణంగా, పదేపదే సంభవిస్తుంటాయి. ప్రతి వర్షాకాలంలో, వరదల వల్ల కలిగే నష్టం ఇళ్లను నాశనం చేయడం నుండి లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొనడం, ఇంకా అంతకు మించి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రతి సంవత్సరం కనీసం ఒక తుఫానునైనా ఎదుర్కొంటారు. కొండ ప్రాంతాలలో, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. అటువంటి సందర్భాలలో, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడాన్నే అత్యవసరంగా భావిస్తారు; అక్కడ పత్రాల ప్రాముఖ్యత ద్వితీయ స్థానంలో ఉంటుంది. సహజంగానే, ఈ ప్రాంతాల ప్రజలందరూ ఎస్ ఐ ఆర్ కారణంగా వెలివేయబడ్డారు. వారు ట్రిబ్యునల్స్ లో తమను తాము సమర్థించుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు.
ఇంతలో, రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించి ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈసారి, మినహాయించబడిన 91 లక్షల మంది, నమోదుకాని 27 లక్షల మంది ఓటర్లు ఓటు వేయలేకపోయారు. అవును, వారు చట్టబద్ధమైన ఓటర్లే అయినప్పటికీ, ఈసీఐకి దాన్ని పట్టించుకునే ఓపిక లేదు. కేవలం బీజేపీ ప్రయోజనం కోసమే వారు అంత ఆత్రుత చూపారని విమర్శకులు అంటున్నారు. కానీ ఈ అక్రమ ఎన్నికను రద్దు చేయాలని లేదా బహిష్కరించాలని ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? బెంగాల్లో అధికార తృణమూల్ పార్టీ నుంచి ఎస్ఐఆర్కు మాటల రూపంలో వ్యతిరేకత వచ్చినప్పటికీ, దాని వ్యర్థమైన వ్యతిరేకత నాటకం ద్వారా, చివరికి తృణమూల్ కూడా ఆర్ఎస్ఎస్కు సహచరురాలేనన్న వాస్తవం స్పష్టమవుతోంది. ఇదే తృణమూల్ ఒకప్పుడు ఎన్ఆర్సి అమలుకు గట్టి సమర్థకురాలనే విషయాన్ని మర్చిపోకూడదు. బెంగాల్లో తలెత్తిన ఎస్ఐఆర్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా అపారమైనవి. తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో కొనసాగడానికి అనుమతి పొందాలంటే, వారు సంఘ్ మన్ననలు పొందాలి. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా జరిగిన అనేక నిరసన ప్రదర్శనలను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఇలాంబజార్లో, ఎస్ ఐ ఆర్ విచారణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై లాఠీఛార్జ్ కూడా జరిగింది. చకులియాలో కూడా ఇదే జరిగింది. ఎస్ ఐ ఆర్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ప్రజా ఉద్యమ కార్యకర్తలపై అణచివేత చర్యలు చేపట్టారు – కొన్నిసార్లు వారి పోస్టులను లేదా ఫేస్బుక్ ఖాతాలను తొలగిస్తారు, కొన్నిసార్లు అరెస్టులు చేస్తారు. జనవరి 26న, ఎస్ ఐ ఆర్ కు వ్యతిరేకంగా ముర్షిదాబాద్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. దానికి మద్దతుగా పోస్టులు పెట్టినందుకు, రాష్ట్రవ్యాప్తంగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్ ప్రభుత్వంలో పోలీసు మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలు లేకుండా ఇది జరిగిందనే విషయాన్ని బహుశా ఆమె కూడా ఒప్పుకోకపోవచ్చు. మాల్దా, మేదినీపూర్, ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలకు దిగినప్పుడు, వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టులు చేశారు. వీటన్నిటికీ తృణమూల్ ప్రభుత్వమే ప్రత్యక్ష మద్దతు ఇచ్చింది. ప్రజా పోరాట ప్రవాహాన్ని అర్థం చేసుకోలేకపోయిన పార్లమెంటరీ వామపక్ష పార్టీలు, ఒకవైపు నిరసనకారులను ఖండిస్తూనే, మరోవైపు సిగ్గులేకుండా “పారదర్శకమైన ఎస్ఐఆర్” కావాలని డిమాండ్ చేస్తూ, ఈ అక్రమ ఎన్నికలలో పాల్గొనడానికి ప్రచారం చేశాయి. ప్రజలను అణచివేయడానికి సుప్రీంకోర్టు ఉగ్రవాద ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐఏను రంగంలోకి దించింది. సీజేఐ సూర్యకాంత్ మాటల్లో చెప్పాలంటే, ఈ న్యాయమైన ప్రజా ఉద్యమం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దెబ్బతీసిందట!
ఇలాంటి పరిస్థితుల్లో, ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా చేసే పోరాటం ప్రజల సొంత పోరాటం అయింది. చట్టపరమైన మార్గాల ద్వారా ఎస్ఐఆర్ ను వ్యతిరేకించడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా సుప్రీంకోర్టు వైఖరి కనిపిస్తోంది. మనం చేయాల్సింది ఏమిటంటే, ఎన్ ఆర్ సి వ్యతిరేక ఉద్యమం, కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం నుండి పాఠాలు నేర్చుకుని, దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైన, పోరాటపటిమ గల ప్రజా ఉద్యమాన్ని సృష్టించడం. మోతాబారి, మాల్దాలోని కాలియాచక్ లలో ఇటీవల జరిగిన పోరాటాల నుండి పాఠాలు నేర్చుకుని మనం ముందుకు సాగాలి. ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజా ఉద్యమం నిర్మించడం రెండింటినీ ఏకకాలంలో ముందుకు తీసుకువెళ్లాలి. హిందుత్వ విషాన్ని ఎదుర్కొంటూ, దాడికి గురవుతున్న ప్రతి అణగారిన ప్రజలు మన ముంగిట ఉన్న ఈ ఎన్ ఆర్ సి ని ఆపడానికి పోరాటంలో ఏకం కావాలి. ప్రగతిశీల, వామపక్ష శక్తుల ఐక్య ప్రతిపక్షం ఇప్పుడు అత్యవసరం. ప్రతిఘటనకు ఇదే సమయం. ఒక్క పౌరుడిని కూడా పౌరుడు కాని వ్యక్తిగా మార్చినా, ఒక్క చట్టబద్ధమైన ఓటరును కూడా మినహాయించినా, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినా, ప్రజలు ఆ ఎన్నికలను బహిష్కరించి, విస్తృత ప్రజా ఉద్యమంలో చేరాలని ఇదివరకే పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ (SIR)ను పూర్తిగా తిరస్కరించాలనే డిమాండ్‌ను ప్రతిచోటా ఒక బలమైన, పోరాటపటిమ గల ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే నిలబెట్టగలం.
అనువాదం : వరలక్ష్మి




