“వెదురుతోని వేయి లాభాలు” అంటారు. వ్యవసాయ నాగరికత పెట్టుబడిదారి పూర్వ దశలో ఉన్నప్పుడు, దానికి ప్రధాన అనుబంధ వృత్తులుగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వృత్తులు, కొంత అప్రధాన వృత్తులుగా కుమ్మరి, మేదరి, కౌంసాలి, కంచరి, శిల్పి వృత్తులు ఉనికిలో ఉన్నాయి. చాకలి, మంగళి వృత్తులు సేవా వృత్తులుగా ఉండేవి. వృత్తికారులు ప్రధానంగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వారు సంవత్సరం పొడవునా పంటలు పండించడానికి అవసరమైన పనిముట్లు చేసి ఇచ్చేవారు. చెడిపోయిన వాటిని మరమ్మతు చేసే వారు. వీరికి పంటల మీద కళ్ళంలోనే, రైతుకు ఉన్న భూమిని కొలమానంగా తీసుకొని ప్రతిఫలం, ధాన్యం రూపంలో ముట్టజెప్పేవారు. ఈ ఏర్పాటును సామాజిక శాస్త్రవేత్తలు “జాజ్ మని” వ్యవస్థ అన్నారు. అది వినియోగం కోసం చేసే వ్యవసాయం. విఫణి కోసం కాదు.
వ్యవసాయం ఒక సమాహార వృత్తి. అనేక వృత్తుల కలబోత. పండిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి కాగులు, కొట్టెలు, వంట చేసుకోవడానికి కూరకుండలు, బువ్వ కుండలు కుమ్మరలు చేసి ఇచ్చేది. ఇదే మాదిరిగా వెదురుతో అనేక వస్తువులను మేదరులు చేసి ఇచ్చేవారు. ముఖ్యంగా చాటలు, గంపలు, మొంటెలు, గుళ్ళలు, విసనకర్రలు, పొన్కలు, చిన్న కచ్చురం, తడికలు ఈ విధంగా అనేక వస్తువులు మేదరులు చేసి ఇచ్చేవారు.
కుమ్మరి, మేదరి వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలకు అవసరమైన వస్తువులను అందించి, ధాన్యం రూపంలో ప్రతిఫలం పొందేవారు. ఈ రెండు వృత్తులకు చేత లేదు. (నిర్దిష్టమైన రైతుకు సంవత్సరం పొడవునా సేవ చేసే కట్టుబాటును చేత అంటారు).
ఈనాటి మాదిరిగా మార్కెట్ మీద ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ కాదు అది. ప్రకృతిలో దొరికిన పదార్థాలను వినియోగించుకొని వృత్తి, ఇంటి, ఆహారం అవసరాలు తీర్చుకొనేవారు.
అడవిలో కంకపొదలు, చెరుకు కదురు మాదిరిగా గుంపులు గుంపులుగా పెరుగుతాయి. ఒక్కొక్క గడ (గయి) చివరన ఆకులు అల్లుకొని పెనం మాదిరిగా కనబడుతుంది. అందుకే దీన్ని కంకపెనం అని కూడా అంటారు.
లోపల బోలుగా ఉంటే దాన్ని కంకబొంగు అంటారు. లోపల గట్టిగా ఉంటే కంక కట్టె అంటారు. గట్టి వెదురు కర్రను ముల్లుగర్ర, గొడ్డలి, పార, దిమ్మీస కామగా, దుడ్డుకర్రగా, దండెంగా ఉపయోగిస్తారు. మధ్యలో బోలుగా ఉన్న బొంగును అనేక వస్తువులుగా తయారు చేస్తారు మేదరులు.
బొల్లం బాలకృష్ణ రాసిన “వెదురు జీవనరాగం” దీర్ఘ కవిత ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకు మేదరుల జీవితాన్ని చిత్రీకరిస్తుంది. ఈ వృత్తి రాతియుగంలోనే ప్రారంభమైందని, ఇనుము ఉపయోగంలోకి రాక ముందే ఉనికిలో ఉన్నదని కవి తన కవిత్వంలో వర్ణించినాడు.
“నిప్పు పుట్టకముందు
ఇనుము కనక ముందు
రాతి పనిముట్లతో వెదురును ఛేదించి
స్థిర నివాసానికి నీటిపై పయనానికి
గుడిసెలు తెప్పల నిర్మాణాలు
ఆదిలోనే చేసిన ఇంజనీరు”
కవి తన కవిత్వంలో చేసిన ఊహకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నవీన శిలాయుగాన్ని “విప్లవం” అన్నాడు ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త గార్డెన్ చైల్డ్. ఈ కాలంలో మానవులు స్థిర నివాసం ఏర్పచుకొన్నారు. వ్యవసాయం నేర్చుకొన్నారు. అడవి జంతువులైన గొర్రె, మేక, మూపురం ఉన్న ఎద్దును మచ్చిక చేసుకొన్నారు. ఈ జంతువుల నుండి పాలు, మాంసం అందుబాటులోకి వచ్చింది. మాంసం కోసం వేటాడే అవసరం తీరింది. అప్పటికి ఇంకా కుండలు చేయడం తెలియదు. జంతువుల రోమాల (ఉన్ని) నుండి నేయడం నేర్చుకున్నారు. వెదురులాగా మధ్యలో బోలుగా ఉండే ఒక రకమైన కాకి వెదురు (Reed) మొక్క నుండి బట్టలు అల్లడం నేర్చుకున్నారు. అప్పటికి ఇంకా ఇనుప పనిముట్ల వాడకం లేదు.
అడవికి పోయి కంక పొదల నుండి బొంగులు నరుక్కొని వచ్చి ఇంటిలో వస్తువులు చేస్తారు. వాళ్ళకు ముడి సరుకు అందించే అడవిని తల్లిలాగా భావిస్తారు.
“అడవి మా అవ్వగారి ఇల్లు అడివే మా బలం బలగం
వెదురు మా ఇంటి ఆడపిల్ల”
“కంకవనం తిరిగి
కంక బియ్యం తిని
కంకపాలు తాగి
కనక వస్తువులు చేసి కప్పి మీద బతికే బిడ్డలు”
కంక చెట్ల నుండి కంకబియ్యం వస్తాయి. బియ్యాన్ని వండుకొని తింటారు. కంకబొంగు చీరేటప్పుడు దాని లోపల ఆరతి కర్పూరం బిల్లలాంటి తెల్లని రేణువులు ఉంటాయి. వాటిని కంకపాలు అంటారు. కంకబియ్యం, కంకపాలు మేదరులకు ప్రీతిపాత్రమైన అడవి ఉత్పత్తులు.
ప్రతి వృత్తి పనికి కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు లేనిదే ఆ పని జరగదు అందుకే కవి
“కత్తి అమ్ము మా అతారెలు
అవి రెండు మా బలం బలగం” అని చాటుతున్నాడు.
ఏ పని చేసినా, ఆ పనిలో నిపుణత గల వ్యక్తి, ఆ వస్తువుతోని సంబంధంలోకి వచ్చినపుడు మెదిలే తీరును కవి కవిత్వీకరించినాడు.
“ఎడమకాలు మడిచి
కుడికాలు చాచి
కాలి కింద కత్తితో బిలుకులు చీల్చి”
ఇది పని చేసేటప్పుడు వారు కూర్చుండే పద్ధతి.
కంకబొంగులు పచ్చివి, ఎండినవి ఉంటాయి. పచ్చి వాటిని వెంటనే చీల్చి బద్దలు చేస్తరు. వస్తువు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని బద్ద మందం నిర్ణయమవుతుంది. ఎండిన బొంగులను నీటిలో నానబెట్టి చీరుతారు.
కంకబద్దలు చీరేటప్పుడు, వస్తువులు అల్లేటప్పుడు చిన్న చిన్న పేడు ముక్కలు చేతులకు కుచ్చి గాయం అవుతుంది. ఆ గాయాలను కవితలో
“కాయలు చేతులు కాంతిపుంజాలు
కుచ్చిన పేళ్ళు కుసుమ పూలు” అని గాయాలను వర్ణిస్తాడు.
బొంగు, పేళ్ళ రకాలు, అల్లిక పద్ధతులను కవిత్వంలో చాలా వివరంగా వర్ణించినాడు కవి.
“అస్సాం బొంగులు పెలుసులు పెలుసులు
కుర్సటి బొంగులు బొరుసులు బొరుసులు
చీమపొక్కు బొంగు కురుపులు కురుపులు”
పసరుపేడు, కండ పేడు, బెండుపేడు ఇట్లా పేడు రకరకాలు. ఒంటాలల్లకం, రెంటాలల్లకం, మూటాలల్లకం, నాటాలల్లకం అని అల్లకాన్ని వర్ణిస్తాడు.
“అల్లకం మొదలు పెడితే తీగ పారినట్టు
ఒర్రె పొంగినట్లు
జడ అల్లినట్లు
సాలె గూడు నేసినట్లు” ఉంటుంది.
వెదురు పరికరాలు విరివిగా వాడిన కాలంలో ఊరు వాడ తిరిగి రంధ్రాలు పడ్డ గంపలు, చాటలకు మరమ్మత్తులు చేసేవారు.
“పర్రె చాటలు తుర్రె గంపలు
పేళ్లు పట్టుకొని అమ్ము పట్టుకొని ఊరూ వాడ పల్లె తిరిగి
శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు”
ప్రతి వృత్తి కులానికి పెండ్లి చేసుకొనే సంప్రదాయం వేరువేరుగా ఉంటుంది. ఈ పనివారి పెండ్లిలో – పెండ్లి పిల్ల, పిలగాన్ని సద్ది కట్టి అడవికి పంపుతారు. వెదురును నరికినంక సద్దిని ఒకరికి ఒకరు తినిపించుకోవడం ఈ వృత్తిలోని పద్ధతి.
“సద్ది గిన్నెలో బువ్వను కలిపి
ఒకరికొకరు తినిపించుకోవడం”
అడవి మీద ఆధారపడ్డ వృత్తి బొంగు అమ్మకంతో దీనిలో వ్యాపారం ప్రవేశించింది. బొంగు కొనడానికి చేసిన అప్పు తీర్చడం ఎంతో కష్టం. ఇంటిల్లిపాది కష్టం చేసినా
“పొద్దటిది పొట్టకు
మాపటిది బట్టకు” అయింది.
ఎంతో నిపుణతను స్వంతం చేసుకొన్న వృత్తి. జల్లెడను ఎంతో జాగరూకతతో అల్లుతరు. బియ్యం పడితే నూకలు కిందికి రాలి కేవలం బియ్యం మాత్రమే దానిలో మిగులుతాయి. రంధ్రాలలో ఏకరూపత సాధిస్తారు.
“జల్లెడ డం అంటే
సన్నని రంద్రాల్లో సహనాన్ని నేయడం”
ప్రతి ఇంటిలో పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. అది ఒక వృత్తి కుటుంబమైతే ఆ పిల్లలు ఆ వృత్తిని కుటుంబంలోని పెద్దలను చూసి నేర్చుకుంటారు.
“మొంటెతో మొదలైన విద్య
చాటలలో చిగురించే నైపుణ్యం”గా పరిణామం చెందుతుంది.
వ్యవసాయం యంత్రీకరణ చెందింది. దానికి అనుబంధంగా ఉన్న వృత్తులు, పాక్షికంగా, లేక పూర్తిగా యంత్రీకరణ చెందినాయి. ఇదివరకు వృత్తికారులు చేసిన వస్తువులను పరిశ్రమలు ఉత్పత్తి చేస్తు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. యంత్రీకరణ వలన డిమాండు పడిపోయిన వృత్తుల్లో మేదరి వృత్తి ఒకటి. ఈ వృత్తి పోయినా కులం పేరు మాత్రం నీడలాగా వెంటాడుతుంది అంటాడు కవి.
“వెలివాడలు లేని వెలివేతలు
శూద్రులలో అతి శూద్రులు మేదరులు.”
భారతీయ సమాజం నిచ్చెన మెట్ల సమాజం. Graded inequality ఉంటుంది. గ్రామ సమాజంలో శూద్రులు, అగ్రవర్ణాల వారు పక్క పక్కన ఇండ్లు కట్టుకొని జీవిస్తారు. దళితులను ఊరికి దూరంగా ఉంచుతారు. ఊరిలో ఉన్న అతి శూద్రులు మేదరులు.
శూద్రుల్లో సత్ శూద్రులు, అసత్ శూద్రులు అనే విభజన ఉంది. దక్షిణ భారతదేశంలో కుడి చేతి కులాలు (వలంగై), ఎడమ చేతి కులాలు (ఇడంగై) అన్న విభజన ఉంది. ముఖ్యంగా వృత్తికారులను ఎడమచేతి కులాలు అంటారు. మేదరులు వెదురు వస్తువులను చేసి ఇచ్చినప్పుడు వాటిని శుద్ధి చేసుకోవడానికి, ఆ వస్తువుల మీద పసుపు నీళ్ళు చల్లి తీసుకుంటారు. ఈ వివక్షనే శూద్రుల్లో అతి శూద్రులం, సవర్ణుల వాడలో వెలివేయబడ్డ వాళ్ళం అన్నాడు కవి.
పారిశ్రామిక ఉత్పత్తులు అన్ని వృత్తులను ధ్వంసం చేసినట్టే, ఈ వృత్తిని కూడ అంతం చేసింది. ఇప్పుడు మేదరులకు కొన్ని పనులు మాత్రమే మిగిలినవి. అవి వారసంతలో అమ్మే చాటలు, పెండ్లికి చేసి ఇచ్చే రంగు రంగుల డిజైన్ గంపలు, కొన్ని షోకేస్ బొమ్మలు, రోడ్ల వెంట కట్టే బ్యానర్లు, ఎండకాలం పచ్చడి మామిడికాయలు, పెండ్లికి వేసే తడికల పందిర్లు ఈ పనుల్లో ఉన్నాయి.
“అలంకరణకు ఆకలి తీరక
డెకరేషన్ పనికి డొక్కలు నిండక అల్లికలకు ఆదరణ లేక
అడ్డకూలీలుగా అట్టడుగున మేదర్లు”
బూర్జువాలు ఉత్పత్తి సాధనాలను నిరంతరం విప్లవీకరిస్తారు. ఉన్న ఉపాధులను ఊడ్చి వేసి కొత్త వాటిని సృష్టిస్తారు. వాటిలో కూడా కొద్దిమంది శ్రామికులకు పని కల్పిస్తారు. పెద్ద నిరుద్యోగ సైన్యాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా చేయడం వలన తక్కువ వేతనానికి పని చేసే శ్రామికులు దొరుకుతారు. చిన్న ఉత్పత్తిదారులైన మేదరులు (Petty producers) తమ వృత్తిని కోల్పోయి శ్రామిక సైన్యంలో చేరుతున్న క్రమాన్ని కవి బలంగా చిత్రీకరించినాడు.
“గ్లోబలైజేషన్ పీతిరిగద్ద
ప్లాస్టిక్ పాము కాటుతో
వీధిన పడ్డారు తల్లడిల్లినారు”
“చాట్ల బియ్యం ప్లాస్టిక్ మయం
మనిషితనం లబ్బరు మయం”
మన కవులకు, బుద్ధిజీవులకు 1991లో అమలులోకి వచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) వలన వృత్తులన్నీ ధ్వంసం అయి, ఉపాధి కోల్పోయి, శ్రామికులు వీధిన పడ్డారన్న భావన బలంగా ఉంది. కాని 1730లో ఇంగ్లాండులో వచ్చిన పారిశ్రామిక విప్లవం చేతి వృత్తులను, వృత్తి సంఘాలను ధ్వంసం చేసి యంత్ర పరిశ్రమలను తెచ్చింది. ఒకసారి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్న తర్వాత అది విశ్వవ్యాపితం అవుతుంది. అన్ని రంగాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆవిధంగా అది ప్రపంచంలో ఉత్పత్తి స్వరూపాన్ని మార్చి వేసింది. అది భారత దేశంలోని కుటీర పరిశ్రమలను కూలగొట్టింది.
ప్రపంచీకరణ కంటే ముందు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర పోషకంగా, పూరకంగా ఉండేవి. సరళీకరణల అమలు ప్రభుత్వ రంగాన్ని కుదించింది. ప్రైవేటుకు ప్రాణం పోసింది. విదేశీ, స్వదేశి పెట్టుబడిదారులు ద్రవ్య పెట్టుబడిదారుల అవతారం ఎత్తినారు. స్థిర పెట్టుబడికి ఒక భౌగోళిక ప్రాంతం. ఒక ప్లాంటు, యంత్రాలు, నిర్దిష్టమైన ఉత్పత్తి ఉంటుంది. ఆ ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ద్రవ్య పెట్టుబడికి ఇవి ఏవీ ఉండవు. ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతం, వస్తు ఉత్పత్తి లాంటివి ఉండవు. ఒక కమోడిటి నుండి మరొక కమోడిటికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారగలదు.
ప్రభుత్వాలు మారినా పాలసీలు మారవు. పేర్లు మాత్రం మారుతాయి. ఒకరు స్వర్ణాంధ్ర అంటే, ఇంకొకరు బంగారు తెలంగాణ అంటారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు నిర్దేశించిన నియమాలను ప్రభుత్వాలు ఉల్లంఘించకుండ వారి ప్రతినిధి బృందం పని చేస్తుంది. ఒక వేళ ఏదైనా నియమ ఉల్లంఘన జరిగితే ప్రభుత్వాలను ఆ సంస్థలు హెచ్చరిస్తాయి. ద్రవ్య పెట్టుబడిని ఉపసంహరించుకుంటామని బెదిరిస్తాయి.
ఇప్పుడు దేశంలో ఉపాధి రహిత వృద్ధిరేటు కొనసాగుతుంది. అది మారాలంటే ఆర్థిక నమూనా మారి అందరికి అభివృద్ధి ఫలాలు అందించే ఆర్థిక నమూనా అమలు జరగవలసిన అవసరం ఉంది.
ఈ కవి తన వృత్తి చుట్టూ ఆవహించి ఉన్న ఆవరణాన్ని కవిత్వీకరించినాడు. ఈ కవిత్వంలో జీవన తాత్వికత ఉంది. “పుట్టినప్పుడు చాట, సచ్చినప్పుడు పాడే” అంటాడు కవి. బిడ్డ పుట్టినపుడు చాటలో బియ్యం పోసి, అన్నంలో వేసినం అని ఆనందపడతారు. బిడ్డకు జీవితకాలంలో అన్నానికి ‘ లోడు రాకూడదని ఆశిస్తారు. చనిపోయిన తర్వాత ఎవరైనా పాడె ఎక్కవలసిందే.
ఈ కవిత్వంలోని వృత్తి మాండలిక పదాలను ఒక అనుబంధంగా చేర్చడం వలన పాఠకులు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది, ఆనందించడానికి అవకాశం ఇస్తుంది. ఈయన కవిత్వంలో ఉపమ, రూపకం, ఉత్ప్రేక్ష, అంత్యప్రాసలు, అంతఃప్రాసలు, అనుప్రాస అలంకారాలు ఉన్నాయి. శుద్ధవచనం రాసి కవిత్వంగా చెలామణి చేస్తున్న కవులున్న కాలంలో కవితా ప్రేమికులకు మంచి కవిత్వం కానుకగా అందించిన బొల్లం బాలకృష్ణ అభినందనీయుడు. ఈ దీర్ఘకవితకు గుండు రమణయ్య వేసిన బొమ్మలు భావస్పోరకంగా ఉన్నాయి.




