తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరం బలంగా ముందుకొచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు. కోర్టుల్లో కనీసం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని అమలుచేయండి అని తమపై మోపిన కుట్ర కేసుల విచారణ సందర్భంలో విరసం తొలి కార్యదర్శి కేవీఆర్ వాదించేవారు. అలా, కాంగ్రెస్ పాలన నడిమధ్యకు వచ్చినా ప్రజాస్వామ్య భావన ఇంకా ఒక ఆకాంక్షగానే, వెయ్యి పోరాటాలు చేసైనా అందుకోవాల్సిన లక్ష్యంగానే తెలంగాణలో మిగిలి ఉంది. ప్రజాస్వామ్య భావనకు పాలకవర్గాలు ఎన్ని నగిషీలు చెక్కినా వాక్, భావ, సభా స్వాతంత్య్రం రూపంలోనే ప్రజలు ఆ భావనను అనుభవిస్తారు. కింది నుంచి ప్రజాస్వామ్యం అమలయినప్పుడు సమాన పనికి సమాన వేతనం, రాజ్యాధికారం వంటి అంశాలను కూడా కలిపి మాట్లాడతారు. అయితే, పైనుంచి కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని కనీసం ఏడాది కాలంగా ఆ సమాజం ఫిర్యాదు చేస్తోంది. సభా హక్కును ప్రజలకు నిరాకరించడం ద్వారా ఆ మాట నిజమేనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధ్రువీకరించింది. హైదరాబాద్‌లో విరసం ఆవిర్బావ సభను హాలు పర్మిషన్ సాకుతో పోలీసులు జూలై 5న అడ్డుకున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోనే హక్కుల సంఘాల సభలను, వరంగల్‌లో ఇతర ప్రజా సంస్థల సభలను, కాకతీయ యూనివర్సిటీలో రచయితలు కలుసుకుని మాట్లాడుకుంటుంటే దాడి చేసి వారి సభను కూడా జరగనీయలేదు. తెలంగాణలో పోలీసులు వెళ్లలేని చోటకు ఫాసిస్టు గూండాలు వెళుతుంటారు. అంతిమంగా ఇద్దరూ కలిసి ఎలా దాడి చేస్తారనేందుకు కాకతీయ ఘటనే నిదర్శనం. రచయితలు, విప్లవ అభిమానుల భాగస్వామ్యంతో జరిగే విరసం ఆవిర్భావ సభను అడ్డుకున్న సందర్భం.. ఈ ప్రమాదకర కలయికను మరోసారి తెరపైకి తెచ్చింది. విరసం సభకు ఫాసిజం థీమ్ కావడం పోలీసులకు, ప్రభుత్వానికి అభ్యంతరకర అంశం కావడాన్ని ఈ వైపు నుంచి చూడాలి.
నిరసనలకు హైదరాబాద్‌లో అవకాశాలు కొడిగడుతున్న సమయంలోనే.. దళిత క్రైస్తవ రిజర్వేషన్ల అంశంపై ఏపీలోని గుంటూరులో ఆ మధ్య సభ జరిగింది. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు కులం ఆధారంగా కేటాయించే రిజర్వేషన్లు వర్తించబోవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కుల వ్యవస్థను విస్మరించడం అంటే తమకు సామాజిక న్యాయాన్ని శాశ్వతంగా దూరం చేయడమేనని దళిత క్రైస్తవులతోపాటు పలు ఎస్సీ సంఘాలు గట్టిగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులో వారు సభ పెట్టుకున్నారు. దళిత క్రైస్తవులు ప్రభుత్వ ఉద్యోగాలు, గజిటెడ్ హోదా పోస్టుల్లో తగిన మోతాదులోనే ఉన్నారు కాబట్టి, ఆ సభకు ఇతరేతర ఇబ్బందులు ఉండవని అంతా భావించారు. కానీ, సభ జరుగుతుందని ప్రకటించిన రోజునుంచే దానిని అడ్డుకోవడానికి ఏపీలో జరగని ప్రయత్నం లేదు. సభకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ సోషల్ మీడియాలో బెదిరించారు. పోలీసులు దాదాపుగా సహాయ నిరాకరణ చేశారు. దీంతో వేలాది మందితో తలపెట్టిన ఆ సభకు హాజరు పలచగా ఉంది. ఏపీలో అప్పటికే దళిత క్రైస్తవులు అన్యుల జాబితాలో చేరి, తీవ్రమైన సామాజిక ఒత్తిడికి గురవుతుండటం దీనికి నేపథ్యంగా పనిచేసింది. అధికారాన్ని శాశ్వతం చేసుకునే కేంద్రీకృత రాజకీయ క్రీడ ఏపీలో నడుస్తోంది. ఇందుకు దగ్గరి దారిగా.. సమాజంలో మత విభజనను తీసుకురావడాన్ని చంద్రబాబు- పవన్‌కల్యాణ్ జోడీ ఎంచుకుంది. జగన్‌కు దళిత క్రైస్తవులు గట్టి ఓటు బ్యాంకు అనే అంచనాతో ఆ సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. వారిపై దాడులు చేయడం, కోర్టుల్లో కేసులు వేసి వేధించడం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదంలో క్రైస్తవ మత ప్రయోజనాలను చొప్పించే ప్రయత్నం, పాస్టర్ ప్రవీణ్‌కుమార్ అనుమానస్పద మరణం, ప్రశ్న రావణ్‌పై ఉపా మోపడమే కాకుండా వారి తల్లిదండ్రుల్లో ఒకరు దళిత క్రైస్తవులని ప్రచారం చేయడం.. ఇలా పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ సనాతన భావన కేంద్రంగా సంఘటితంచేసే పని కూడా అంతే వేగంగా జరుగుతోంది. దీని వెనుక బీజేపీ పీపుల్ ముక్త్ కార్పొరేట్ భారత్- 2047 లక్ష్యాలు, చంద్రబాబు కేంద్రీకృత అభివృద్ధి నమూనాలు పనిచేస్తున్నాయి. ఏపీ గాలిలో ఫాసిజం సుడులు తిరుగుతోంది.
న్యాయమైన భావన పట్ల అన్యాయంగా వ్యవహరించిన సమాజాల్లోకి ఫాసిజం తేలిగ్గా వచ్చి కూర్చుంటుంది. ప్రత్యేక తెలంగాణ విషయంలో పరిణతి చెందిన వైఖరిని ప్రదర్శించడంలో ఆంధ్రా సమాజం వైఫల్యం చెందింది. కేంద్రంలోని బీజేపీకి ఏపీ పాలకవర్గాలు దగ్గర కావడానికి… విభజన చట్టం, రాజధాని, పెట్టుబడుల అవసరాలు, ఉపాధిని తెచ్చిపెట్టే అభివృద్ధి ప్రాజెక్టులు అక్కడినుంచి రావాల్సి ఉండడం వంటి కారణాలు ఎన్ని వల్లించినా, అవేవీ వడ్లను, పెరుగును కలపలేవు. ఆదివాసీల స్వాభావిక హక్కులను తీసివేస్తుంటే మాట్లాడని సమాజం.. దళితుల అసైన్డ్ భూములను లాగేస్తుంటే ఉలకని సమాజం.. మైనారిటీల వక్ఫ్ ఆస్తులను లాగేసి ఆ సమాజ ఆర్థిక పునాదిని ధ్వంసం చేస్తుంటే చూస్తుండిపోయిన సమాజం… స్త్రీలకు విద్యను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని, సామాజిక అవకాశాలను నిరాకరిస్తున్న సనాతన విషాన్ని మింగుతున్న సమాజం.. ఇలా గాక ఎలా ఉంటుందని ఒక నిట్టూర్పు విడిచి సమాధానపడలేం. అయితే, ఒక సమాజం సజీవంగా ఉందా, శిథిల స్థితిలోకి జారిపోతుందా అనేది సామాజిక క్షేత్రంలో పట్టిచ్చే లిట్మస్ టెస్ట్ కేసులివి. నిజానికి, ఫాసిజం మన ఇంట్లోకి ఏ గుమ్మం నుంచి వస్తుందో, అది వచ్చిందాకా చెప్పలేం. ప్రత్యేక అణచివేత చట్టాల ద్వారా, రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఉనికి పొందుతూ, నిర్దిష్ట రాజకీయార్థిక ప్రత్యేకతలు కల్పించే అనుకూలతల నుంచి వేర్వేరు రూపాల్లో అది ప్రపంచమంతా వేగంగా విస్తరించిన మాట నిజం. ఇందుకు అవసరమైన సమ్మతిని, మానసికతను సమాజం నుంచి అది ఓపిగ్గా పొందుతూ వస్తోంది. ఏపీలో ఇప్పటికీ ఫాసిజం పాలక పార్టీల చేతిలోని చట్టాలు, అధికార సాధనాలు, అణచివేత విధానాలు, దేవాదాయ పాలనా వ్యవహారాల పరిధిలోనే ఉన్నదనే వాదన ఉంది. మత ఉద్రిక్తల చరిత్ర లేని ఏపీలో బీజేపీకి సామాజిక పునాది కష్టమేనని కూడా అనేవారు ఉన్నారు. పొలిటికల్‌గా ఇప్పటికీ బీజేపీకి మూడు, నాలుగు సీట్లే ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ, ముందే చెప్పినట్టు అది ఏ గుమ్మంలోంచి వస్తుందో..! ఇప్పుడది ఏపీలో దళిత క్రైస్తవులు లక్ష్యంగా సమాజాన్ని మతపరంగా చీల్చే వ్యూహంతో ముందుకొస్తోంది. దళిత క్రైస్తవుల హక్కుల చాంపియన్‌గా జగన్, వైసీపీ చెప్పుకొంటున్నాయి. కానీ, జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలలను పోషించడం, విశాఖ శారదా పీఠాధిపతికి మానస పుత్రుడిగా మెలగడం ఆయన హయాంలోనే చూశాం. బలమైన కమ్యూనిస్టు పోరాటాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకు ఉనికిపట్టు ఆంధ్ర. అలాంటి సమాజం కూడా ఫాసిజం ఉచ్చులో పడిపోయింది. ఫాసిజం బలాన్ని కేంద్ర అధికారం, కార్పొరేట్ విధ్వంసక విస్తరణలోనే తెలుసుకోగలం. నిజమే. మరి ఈ జ్ఞానాన్ని పొందిన మనం ఏం చేస్తామనేది ప్రశ్న. ఈ జ్ఞానమంతా ప్రతిఘటనకు దారితీయకపోతే, గడ్డి వేళ్ల నుంచి నిరసనలను రాజేయకపోతే సామాజిక శ్రమశక్తులకు పడిన బాకీని మేధస్సు ఎలా తీర్చుకోగలదు? దళిత క్రైస్తవులు, ఇతర మత మైనారిటీల మీద, వారి యూట్యూబ్ చానళ్ల మీద, వారి మత విశ్వాసాల మీద దాడులను, అణచివేతను ఖండించడంతో ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ పని ఏపీలో మొదలు కావాలి. సమాజాన్ని కాపాడుకోవడం అంటే ఫాసిస్టు సందర్భంలో ఎంతో క్లిష్టమైన, జఠిలమైన ప్రయాణానికి సిద్ధం కావడమే. రావణ్‌పై ఉపా సందర్భంలో మొత్తంగానే ఆ చట్టం రద్దు చేయాలంటూ వామపక్షాలు రోడ్డెక్కడం, క్రియాశీల ఆందోళనలకు పిలుపునివ్వడం, ప్రజాస్వామిక వేదికలు కొన్ని అయినా గొంతులు సవరించుకోవడం సానుకూల పరిణామాలు. అయితే, ఆలస్యంగా పడే అడుగులు నడక దూరాన్ని పెంచుతాయి.
కేవలం ఏపీ అనుభవంగానే దీనిని చూడలేం. కాస్త పట్టు దప్పితే తెలంగాణ కూడా ఫాసిజం అంచుకే వచ్చి చేరుతుంది. మత ఉద్రిక్తతల చరిత్ర ఉన్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల బీజేపీ సీట్లు తెచ్చుకొంటోంది. నిజానికి, మిగతా సమాజాలతో పోల్చితే తెలంగాణ ఫాసిజం వ్యాప్తికి అనుకూలంగా ఉండాల్సిన రాష్ట్రం. సామాజికంగా ఇప్పటికే బీజేపీ అక్కడ ఎదిగి రావాల్సింది. కానీ, కేసీఆర్ శాశ్వత అధికారం, సంపద తన కుటుంబానికి ఉండాలని, ప్రతిపక్షాలు, నిరసనలు జాన్తా నై అన్నప్పటినుంచే, అంటే గత 12 ఏళ్ల నుంచే బీజేపీ వాస్తవంగా తెలంగాణలో బలపడటం మొదలుపెట్టింది. అంతకుముందుదాకా ఎందుకు దానికి పట్టు దొరకలేదనేది కాంగ్రెస్ పాలకులు సైతం ఆలోచన చేయాలి. గైర్ ముల్కీ నుంచి నిన్నటి ప్రత్యేక తెలంగాణ వరకు.. ప్రతిదీ తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకుంది. గడ్డి వేళ్ల స్థాయిలో విస్తరించి సాగిన పోరాటాలు కావడంతో.. ప్రతిఘాతుక సంస్కృతిని అణచిపెట్టి, ప్రజాస్వామిక విలువలను సామాజిక చైతన్యంలో భాగం చేయగలిగాయి. తెలంగాణలో కేసీఆర్ సభలను బంద్ పెట్టడాన్ని, అధికారాన్ని పదిలపరుచుకునేందుకు ఫాసిస్టులను పోషించడాన్ని సమాజం వేర్వేరుగా చూడలేదు. అందుకే ప్రజాస్వామ్యం షరతుగా కాంగ్రెస్ పాలించడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తానని ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మాట తప్పితే తాను ఇచ్చిన పర్మిషన్ను తెలంగాణ సమాజం వాపసు తీసుకుంటుంది. గత ఎన్నికలు తెలంగాణలో బాగా చలికాలంలో, ఏపీలో మండే ఎండల్లో జరిగాయి. వర్షాల సీజన్ నడిమధ్యకు వచ్చినా ఈసారి రెండు రాష్ట్రాలూ మండిపోతున్నాయి. గాలిలో తేమ లేక రెండు చోట్లా ఉక్కపోత స్థితి నెలకొంది. అయితే, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రమాదకర క్రీడ ఇప్పుడు ఆ ఉక్కపోతను వాతావరణ ఆవరణ నుంచి సమాజంలోకి విస్తరిస్తోంది. వేసవి ఉక్కను, చలికోతను కూడా తట్టుకుని ఆంధ్రా, తెలంగాణ సమాజాలు నిలబడాల్సిన తరుణం ఇది!




