వీరమాత వేదమ్మ ఆచరణలో అన్నపూర్ణమ్మ. ఆమె తెలిసిన ఆమె గురించి విన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పుట్టిన ఇంట తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నపూర్ణమ్మనే . తల్లిదండ్రులది 700 ఎకరాల భూస్వామ్య కుటుంబమటగాని అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాకపోవడం వల్ల కావచ్చు తనది ఉన్నత మధ్య తరగతి కుటుంబమని చెప్పుకునేది. విద్యావంతుడై వ్యవసాయం కూడా చేయక నాలుగేళ్లు ఉద్యోగం కొరకు అన్వేషించిన బి. రామిరెడ్డి గారిని చేసుకోవడం వల్ల ఆమె అట్లా చెప్పి ఉండవచ్చు. ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఐదుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో ఆఖరి కన్నబిడ్డ. తండ్రి మొదట తన 17వ ఏట వ్యవసాయ కుటుంబం నుంచే సంబంధం చూసాడట. పెళ్ళికొడుకువైపు వారు తీరా తాళి కట్టే ముందు కట్నం గురించి గొడవ చేస్తే ఆ పెళ్లి ఎత్తిపోయింది. అప్పటికే ఆమె మానసికంగా రెబెల్. ఈ పెళ్లి ఎత్తిపోవడమే మంచిదయిందనేంత చైతన్యం ఆమెకు 17వ ఏటనే ఉంది. ఆ తర్వాత అలీఘఢ్ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ.,ఎల్.ఎల్.బి చేసిన బి. రామిరెడ్డి గారితో వివాహమైనప్పుడు ఆమెకు అత్తగారింటి వారు వేదమ్మ (వేదవతి) అని పేరు పెట్టారు. నిజానికక్కడ ఆమె కథ మొదలైంది.

ఆ కథలోకి వెళ్లే ముందు మొదట చెప్పవలసింది ఆమె మాకు అప్పటికి చాలా మైనర్లైన పిల్లలతో పాటు ఎమర్జెన్సీలో చంచల్ గూడ జైలుకు రామిరెడ్డి గారితో జైలు ములాఖత్‌కు వచ్చినప్పుడు పరిచయమైంది. మేం మీసా డిటెన్యూలం గనుక మాకు ఇంటర్వ్యూలో జైలరు, డిప్యూటీ జైలర్ల విశాలమైన ఆఫీసు గదుల్లో కుర్చీలు, బెంచిల మీద కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండేది. హైదరాబాదు, సికిందరాబాదు జైళ్ళు మీసా డిటెన్యూలుగా ఇందిర, వెంగళరావు శత్రుపక్ష రాజకీయ ఖైదీలతో నిండిపోయిన కాలమది. ఇక విప్లవ పార్టీల ప్రజాసంఘాల గురించి చెప్పేదేముంది.

నూరు మంది సభ్యత్వం కూడా లేని విప్లవ రచయితల సంఘం నుంచే 35 మంది దాకా కార్యవర్గ, క్రియాశీల సభ్యులు రాష్ట్రంలోని జైళ్ళలో ఎమర్జెన్సీ కాలమంతా ఉన్నారు. హైదరాబాదు జైల్లో జంట నగరాల నుంచి అరెస్టయిన చెరబండరాజు, ఎం.టి. ఖాన్, ఎం. రంగనాథం మాత్రమే కాకుండా నిజామాబాదు నుంచి వచ్చిన బొజ్జా తారకం, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన బి. రామిరెడ్డి గారు, నెల్లూరు జైలు నుంచి కె. వి. రమణారెడ్డి, వరంగల్ జైలు నుంచి నేను జైలు అధికారుల ఆగ్రహానికి గురయి వచ్చి ఉండక పోతే బహుశా నాకు ఎమర్జెన్సీ ఎత్తివేసే దాకా బి. రామిరెడ్డి గారితో అంత స్నేహానుబంధం, వేదమ్మగారి కుటుంబాన్ని మా రెండు కుటుంబాలను కలిపిన ఒక వీరమాతగా సన్నిహితంగా చూసే అవకాశం వచ్చి ఉండేదే కాదేమో.

ఆశ్చర్యమేమంటే రాడికల్ విద్యార్థి సంఘం 1974 అక్టోబర్ లో ఏర్పడి 75 ఫిబ్రవరిలో ప్రధమ మహాసభలు జరుపుకొని జూన్ 25/ 26 తేదీన దక్షిణ తెలంగాణలోని బలంగా ఆర్ఎస్‌యు గాలులు వీచిన జిల్లాల్లో ఒకటైన మహబూబ్‌నగర్‌కు కేంద్ర స్థానంలో ఉన్నది గద్వాల. అక్కడ చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ‘విమోచన’ పార్టీ రాజకీయాలున్న మితభాషి, రిజర్వుగా ఉంటూ మా నలుగురికి (చెరబండరాజు, తారకం, నేను, తాను) చంచల్ గూడా జైలు మసీదు బ్లాక్‌లో మనసు విప్పిన రామిరెడ్డిగారు ఎల్‌ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసే విద్యావంతుడు, సిపి రాజకీయాలతో ఉన్నాడన్నంత సమాచారం. పైగా ఆ రాజకీయాల గురించి విరసం నుంచి ఆయనొక్కడే అరెస్టు కావడం మాకు ఆశ్చర్యంగానే ఉండేది. ఆయన వేదికలెక్కి ఉపన్యాసాలు చేసేవాడు, ప్రాచుర్యం పొందిన రచనలు చేసినవాడు కాదు. విజయభారతిగారితో పాటు నిజామాబాదుకు మారి అక్కడ సిపిఐ ఎంఎల్ (విమోచన) పార్టీ అన్ని ప్రజాసంఘాల స్థాపనకు కారణమై, ఎన్నిటికో అధ్యక్షుడై, న్యాయవాది, రచయిత, వక్త, గాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడ అయి 77 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన బొజ్జా తారకంగారు అరెస్టు కాకపోతే ఆశ్చర్యపడేవాళ్ళం కానీ రామిరెడ్డి గారి అరెస్టు మాకు అంతుపట్టేది కాదు. అంత మనసు విప్పుకున్నప్పుడు కూడా నేను పెళ్లయి నాలుగు సంవత్సరాలు నిరుద్యోగంలో ఉన్నప్పటి నుంచి సిపి పార్టీ రాజకీయాల కోసం పనిచేస్తున్నానని పోలీసు నిఘా వర్గాలు అనుకున్నట్లున్నాయి అని మాత్రమే చెప్పేవాడు.

మేము “మా పెద్ద పాప కడుపులోకి వచ్చాక ముందు వద్దనుకున్నాము. కానీ డాక్టర్ మళ్ళీ పుట్టడం కష్టమైతదని, బలానికి మందులు ఇచ్చింది” అని చెప్పింది వేదమ్మ. అంటే రామిరెడ్డిగారు ఉద్యోగ ప్రయత్నాలు చేయడమైనా బయటపడకుండా ఉండడం కోసమేకాని ఆయనే పూర్తికాలపు రాజకీయ కార్యకర్తగా చేయగల సులువులున్న ఉద్యోగం కోసం పనిచేస్తున్నాడని, మధ్యతరగతి ఉద్యోగుల్లో, విద్యావంతుల్లో విప్లవ రాజకీయ ప్రచారం గుట్టుగా చేయడానికి, ఒక్కొక్కరికీ సాహిత్యం అందిస్తూ విశ్వాసం చూరగొంటూ చేయడానికి ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్ కావడం తన స్వభావానికి సరిపోతుందనుకున్నాడు.

పైడిమర్రి గిరిజ (చైతన్య మహిళా సంఘం) భూమిక కోసం చేసిన ఇంటర్వ్యూలో, వేదమ్మ చాలా సహజ ధోరణిలో ఆయనవి చండ్ర పుల్లారెడ్డి రాజకీయాలు అని చెప్పింది.  ఆయన విడుదలయి ఇంటికి చేరే నాటికి సుగుణ ద్వారా ఆ ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి రాడికల్ గాలులు వీస్తున్నాయి.

కనుక ఆమె పేరు మాత్రమే మారలేదు. ఆమె వేదమ్మ అయ్యే రాజకీయ తూర్పు పవన వీచికలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. బహుశా ఈ వివాహం కాకుండా, రాజకీయాలు లేని కుటుంబంలోకి కోడలుగా పోయి ఉంటే అన్నపూర్ణమ్మ అయినా కాగలిగేదా? తెలంగాణలో మరీ ముఖ్యంగా కుటుంబాలకు కుటుంబాలే విప్లవోద్యమ కుటుంబాలు అయిన డెబ్భైల మరీ ముఖ్యంగా ఎనభై నుంచి అది ఊహాగానం మాత్రం కాజాలదు.

ఇంక ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత గద్వాలలో వాళ్ళ ఇంట్లో సుగుణ కారణంగా పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయి హైదరాబాదులో లా చదివే రాడికల్ విద్యార్థి ఒక ఆర్గనైజర్ అయి, ఆ ఇల్లు కేంద్రంగానే ఆర్ఎస్‌యు క్లాసులు ఏర్పాటు చేసాడు. అప్పటిదాకా తల్లికి తెలియకుండా గద్వాల కాలేజీ ఆర్ఎస్‌యు నాయకుడు సుదర్శన్ కాలేజీలోనూ, బయట నిర్వహించే పోరాటాలకు, ప్రచారాలకు వెళ్లి వచ్చేవాళ్ళు, ఇంట్లోకే రాడికల్ రాజకీయాలు తెచ్చారు. తండ్రి ఆమోదం ఉండేది. చాల రాత్రి వరకు ఆడపిల్లలు బయటికి పోతే మందలించే తల్లికి రాడికల్ మొగపిల్లలు, ఆడపిల్లలు కలిసి ఇంటికి వచ్చినప్పుడు సందడిగాను, ఒక కొత్త బంగారు లోకాన్ని చూసుకున్నట్లుగా ఉండేది. ఒకరోజు తండ్రి దగ్గర తాను సుదర్శన్ ను ప్రేమిస్తున్నానని సుగుణ ప్రకటించింది. మర్నాడు ఇద్దరూ ఇంటికి కలిసి వచ్చి ‘పార్టీ పెద్దల’ సమక్షంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. సాయంత్రానికి ఇద్దరూ ఆ ఇంటి నుంచే కాదు ఊరి నుంచి బయటకు వెళ్ళపోయారు. ఆమె అరుణ అయితే అతను కిరణ్. సుదర్శన్ రెడ్డి నిర్మాణం చేసింది ఒక ఉన్నతమైన త్యాగసంపన్నమైన విప్లవ పార్టీ నిర్మాణం. జిల్లాలో ఇద్దరూ మొదట్లో ఆదివాసుల మధ్య పని చేశారు. కాని ఇద్దరికిద్దరూ 1985 వరకు దోపిడీకి గురవుతున్న అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా మధ్యతరగతి బుద్ధి జీవులతో సజీవ సంబంధాలు పెట్టుకున్నారు. ఒకరోజు చెరువులో ఒక ఆదివాసీ సహచరుడు ఈదుతూ సుడిలో మునిగిపోతుంటే ఆయనను కాపాడడానికి పోయి కిరణ్ కూడ ఆ సుడిలో పడి అమరుడయ్యాడు. తన కళ్ళముందే తన సహచర్యం ఇలా మునిగిపోయింది. అరుణ కుప్పకూలింది. అప్పుడు మాత్రం తల్లికి ఉత్తరం రాసింది. ‘అమ్మా నీ ఒడిలో తల పెట్టుకుని ఏడవాలని ఉంది’ అని. ‘అప్పుడు నా తల్లి పేగు తెగిపోయినంతగా బాధపడ్డాను’ అని ప్రపంచానికి తాను చనిపోయే ముందుగానీ చెప్పుకోలేక పోయింది వేదమ్మ. అదొక్కరి దు:ఖమే. సుగుణ అరుణగా, రాధగా, లతగా మూడు జీవితాల్లో పొందిన సాహచర్యాలు, దీర్ఘ వియోగాలు, వియోగాలను మరిపించే విహ్వల ప్రేమాహ్వానాలు. చివరకు కలిసి ఎన్కౌంటర్ అమరత్వం – ఇవన్నీ ఇంతకాలం ప్రపంచం సుగుణ వైపు నుంచి చూసింది విన్నవి. ఆమె అట్లా ఒక విప్లవ లతలా ప్రజాజీవితంలోకి పాకిపోయింది.

1996 మే 22న రామిరెడ్డి గారు మరణించినప్పుడు  వేదమ్మ అప్పటికే ఆదర్శ వివాహం చేసుకున్న జ్యోతి పురుషోత్తంల దగ్గర చేరింది. ఆ డిప్రెషన్ కాలం నుంచి పురుషోత్తం ఆమెను కాపాడాడు. “జ్యోతి పురుషోత్తంను చేసుకున్నప్పుడు ఆమె ఇష్టం అనుకున్నాను. కాని పురుషోత్తం చాల గొప్పవాడు అప్పటికే రామిరెడ్డి మరణించడం వలన నేను వాళ్ళింట్లోనే ఉండేదాన్ని. అప్పట్లో నేను మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి, పేరు స్వేచ్ఛ, న్యాయవాది” అని ఆమె ఎంత ప్రేమతో, గౌరవంతో చెప్పింది.

తెలంగాణ గానకోకిల బెల్లి లలితను తన దగ్గరికి పిలిపించుకొని, ఆమె నలగొండలో జెఎన్‌ఎమ్ దివాకర్ (కిరణ్) నాయకత్వంలోని విప్లవోద్యమానికి ఆకర్షితురాలవుతున్నదన్న ఈర్ష్యాసూయలకు గురైన నయీమ్ పదిహేను ఖండాలుగా హత్య చేయించి బావిలో వెదజల్లేందుకు చేసిన కుట్రను పురుషోత్తం బయట పెట్టాడు గనుకనే దిల్‌సుఖ్ నగర్‌లో ఇంటికి దగ్గరలోనే ఆయనను గొడ్డలితో నరికి చంపాడు నయీం. ఇంక అక్కడి నుంచి ఒకరి దు:ఖాన్ని ఒకరు పంచుకునే తల్లి కూతుళ్లయ్యారు వేదమ్మ, జ్యోతి.

అయితే కొలిమిలో కాలిన ఇనుము ఉక్కుగా మారినట్లుగా 2004 చర్చల కాలానికి ఆ కుటుంబమంతా చైతన్య మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కార్యకలాపాల్లో తలమునకలయ్యారు.

రామిరెడ్డి గారు కమ్యూనిస్టు అయినా ఆయన తనకేమీ చెప్పలేదు కానీ తన పిల్లలు, పురుషోత్తంల ఆచరణలు తనను కమ్యూనిస్టుగా మార్చాయనీ, తనకు శ్రీ శ్రీ కవిత్వం అంటే ఇష్టమని చెప్పింది వేదమ్మ.

ఆమె గద్వాలలో ఉన్నంతకాలం ఆమె అండవల్లననే అక్కడ రామిరెడ్డి గారి స్మారక గ్రంథాలయాన్ని, ఆయన వర్థంతి రోజు సమకాలీన అంశాలపై స్మారకోపన్యాసాలను నిర్వహించగలిగారు. అట్లే సుగుణ స్మారకంగా ఇంటి మీదనే ఒక సమావేశ స్థలాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి సంవత్సరం సుగుణ స్మారకోపన్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు.

2013 డిసెంబర్ 24న అమరుడవడానికి కొన్ని రోజుల ముందే భూమయ్యగారు, నేను గద్వాలకు బహుశా చివరిసారి రామిరెడ్డిగారి స్మారకోపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళాం.

అప్పటికి వేదమ్మగారు ఇంటిముందు ఉన్న స్థలంలో ఒక షెడ్ వేసి దాని కింద కొన్ని బెంచీలు, బల్లలు వాటిపై పత్రికలు, ఊరి వాళ్ళు వచ్చి చదువుకోవడానికి ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాట్లన్నీ ఆమె కూతుళ్ళు, కొడుకు చేసారు కావచ్చు కానీ ఆ నిర్వహణ మాత్రం ఆమె అజమాయిషీలోనే.

వానలో తడవని వారు లేనట్టే, కన్నీళ్ళతో తడవనివారు లేనట్లే గద్వాలకు వెళ్ళి, లేదా అవసాన కాలంలో స్వేచ్ఛ అపార్ట్‌మెంట్‌కు, జ్యోతి దగ్గరికి వెళ్ళి వేదమ్మ చేతి రుచి చూడకుండా వెళ్ళే మనుషులుండరనేది ఇపుడందరూ తలచుకుంటున్నారు.

విప్లవం అతి సాధారణమైన మనుషులను ‘ఒక తల్లి’గా ఎలా మలచుకోగలదో వేదమ్మ జీవితం మనముందు పారదర్శకంగా ఉన్నది.

వి.వి.

09-08-2025

Leave a Reply