బెంగాల్ రాష్ట్రంలోని రాణిగంజ్ లో ఉన్న రాహుల్ సాంకృత్యయన్ విగ్రహాన్ని ఎవరో రాత్రికి రాత్రే కూల్చి, ఆనవాలు లేకుండా చేసారు. అంత ద్వేషం దేనికి రాహుల్జీ మీద? ఎవరీ అకృత్యానికి పాల్పడ్డారు!  

మహాపండితుడు రాహుల్ సాంకృత్యయన్ విగ్రహాన్ని కూల్చిన దుండగులు… ఒక అభ్యుదయవాది, హేతువాది, ప్రజాస్వామిక వాది, స్వేచ్ఛాపిపాసి, స్వాతంత్య్రపోరాట యోధుడు, మార్క్సిస్టు ఆలోచనాపరుడు, చరిత్రకారుడు, బహుగ్రంథ రచయిత, భారతీయ మేధావులలో అగ్రగణ్యుడైన రాహుల్ తన జీవితకాలమంతా చేసిన సాహిత్య, చారిత్రక, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని చెరపలేరు.

త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చినదెవరో, వారి అనుయాయులే రాహుల్ విగ్రహాన్ని కూల్చారు. విగ్రహాలను కూల్చేసి కమ్యూనిస్టు సైద్ధాంతికతను నిర్మూలించగలరా? తిరిగి అదేచోట రాహుల్ విగ్రహాన్ని పెట్టాలి. ఈ దుర్మార్గాన్ని చేసినవారిని శిక్షించాలి.

రాహుల్ సాంకృత్యయన్ ఎవరో, అతని జీవితచరిత్ర తెలిసినవారు తనని అర్థం చేసుకుంటారు, గౌరవిస్తారు. కేవలం కమ్యూనిస్టు అని దాడిచేసిన వారికెప్పటికీ సత్యం తెలియదు. అతని జీవితమే ఒక సాహసకృత్యం. నిరంతరం సత్యాన్వేషణలో జీవితాన్ని గడిపినవాని గురించి తెలుసుకోవడం అవసరమిప్పుడు.

*  * *

రాహుల్ చిన్నప్పుడు చిన్నబడిలో చదువుకుంటున్నప్పుడు చదివిన ‘ఖుద్రాయ్ కా నతీజా’(నవజిందా బజిందా రచన) కథలోని గీతికను తన ఆత్మకథలో ఎన్నోసార్లు మననం చేసుకున్నాడు.

‘సాయిర్ కర్ దునియాకి గఫిల్ ఫిర్ కహాఁ

జిందగి గర్ కుఛ్ రాహితో నౌ జవాని ఫిర్ కహాఁ’

(ప్రపంచ పర్యటన చెయ్ సోమరీ, మరొక జీవితం దీనికొరకు దొరకదు. ఎంతకాలం బతికినా తిరిగిరాదు యవ్వన మధుహాసం)

ఈ కవితాగీతం తన జీవితాన్ని మార్చివేసింది. నిరంతర యాత్రికునిగా చేసింది. ఒకేచోట ఎపుడూ నిలవొద్దు, నిరంతరం పయనిస్తుండాలన్నది తన ఆదర్శం. రాహుల్ సాంకృత్యయన్ బుద్ధుని సూక్తుల్ని మననం చేసుకుంటు, జీవితమంతా ఎక్కడా నిలకడలేని ప్రయాణం చేస్తూ, విశ్వాసాలపట్ల వైముఖ్యం ప్రకటిస్తూ, పేరుని కూడా మార్చుకునేవాడు పదే, పదే.

రాహుల్ సాంకృత్యయన్ గురించి రాయడమొక సవాలే. బహుముఖ ప్రజ్ఞాపారీణుడు కావడంవల్ల తన సమగ్ర రచనల్ని, చేసినయాత్రల్ని, తాత్విక దృక్పథాన్ని గుదికుచ్చి ఒకటే చోట రాయడం అసాధ్యమనిపిస్తుంది. తాను రాసుకున్న ఆత్మకథ తన జీవిత సంఘటనలను 1947వరకే తెలియజేస్తున్నది. ఆయన రాసుకున్న లెక్కలేనన్ని డైరీలలోని విషయాలింకా అచ్చుకాలేదు. తన రచనలు 125 గ్రంథాలుగా పేర్కొన్నారు. అవి కూడా హిందీ, సంస్కృతం, పాళి, టిబెటన్, భోజ్ పురి భాషల్లో ఉన్నాయి. తత్వశాస్త్రం, చరిత్ర, సైన్సు, సామాజిక శాస్త్రం, జీవితగాథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు, పరిశోధనలు, టిబెట్టు దేశాధ్యయనం, బౌద్ధమతం, బౌద్ధమత తర్కశాస్త్రం, వ్యాఖ్యానాలు, జానపదం, రాజకీయ పరిశీలనలు, కరపత్ర రచనలు, అనువాదాలు, పర్యటన వ్యాసాలు తన రచనా విస్తృతిని తెలియజేస్తాయి.

ఈ ప్రపంచ యాత్రికుడు బహుభాషా వేత్త. దుర్గమ మార్గాల్లో ప్రయాణించాడు. కష్టాలను ఓర్చుకోవడంలో సమర్థుడు, ధైర్యశాలి, సాహసికుడు. మానవతావాది, స్వేచ్ఛాకాంక్ష కలవాడు. అనన్యమైన భావనాశక్తితో అద్భుత రచనలు చేసినవాడు.

రాహుల్జీని గురించి కాశీప్రసాద్ జైస్వాల్ ‘బుద్ధుని వర్ఛస్సు’ కలవాడన్నాడు. ప్రాక్విజ్ఞానవేత్త సెల్విన్ కూడా అట్లే అన్నాడు. ఆయననొక మహాస్తంభమని భగవత్ శరణ్ ఉపాధ్యాయ, వటవృక్షమని ఠాకూర్ ప్రసాద్ సింగ్, హిమాలయపర్వతారాధకుడని విద్యానివాస్ మిశ్రా కీర్తించారు.

రాహుల్ ఉత్తరప్రదేశ్ లోని ఆజమ్ ఘర్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామం ‘పందహ’లో సరయుపారీణ అనే సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1893 ఏప్రిల్ 3న జన్మించాడు. తండ్రి గోవర్ధనపాండే, తల్లి కుల్వంతి. ఇంట్లోవాళ్ళు పెట్టిన పేరు కేదార్ నాథ్ పాండే. కాశీలో సంస్కృతం, అరబ్బీ, పారసీ భాషల్ని నేర్చుకున్నాడు. మిగతా 30 భాషల్ని స్వయంగా నేర్చుకున్నాడు.

చిన్ననాటనే పెండ్లి చేయబోయారు తల్లిదండ్రులు. పురోహితుడు ‘సావధాన’ అనడం వినడం ఎందుకు సావధానమంటున్నావని వాదనపెట్టుకొని, ఆ మంత్రార్థాలు నచ్చక పెళ్ళిపీటల మీద నుంచే లేచి, వెళ్ళిపోయాడంటారు. కానది నిజం కాదు. పెళ్ళయితే అయింది కాని, భార్యను సరిగా చూడనేలేదు. 9దో యేట కాశీకి, పద్నాలుగో యేట కలకత్తాకి పోయాడు.  పొగాకు కంపెనీలో ఉద్యోగం చేసాడు. 1910 నుంచి పర్యాటకుడిగా మారిపోయాడు. భారతదేశమంతా తిరిగాడు. ‘బాబా రామ్ ఉదార్ దాస్’ గా పేరు మార్చుకుని సంచారం చేసాడు. భిక్షాటన చేసాడు.

కొంతకాలం ఆర్యసమాజ సభ్యుడిగా ఉన్నాడు. అక్కడ వైదిక సిద్ధాంతాలు నచ్చక సమాజాన్ని వదిలి వెళ్ళిపోయాడు. 1926లో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి టిబెట్, బుషాహర్, సుమ్నామ్, కానమ్, స్పేటీ వంటి ప్రాంతాలను సందర్శించాడు. నేపాల్, శ్రీలంక దేశాల పర్యటన చేసాడు. తనపేరు రామ్ ఉదార్ దాస్ నుంచి ‘రాహుల్ సాంకృత్యయన్’గా మార్చుకున్నాడు.

బౌద్ధభిక్షువుగా మారాడు. పాళి, సింహళ, టిబెటన్ భాషల్లోని బౌద్ధమత గ్రంథాల్ని చదివాడు. బౌద్ధ సమాజం ‘మహాపండిత’ బిరుదుతో సత్కరించింది. థేరవాద త్రిపిటక బౌద్ధధర్మసూత్రాలలో నిష్ణాతులు పొందే ‘త్రిపిటకాచార్య’ గౌరవాన్ని కూడా అందుకున్నాడు. లామాలుండే టిబెటన్ ప్రాంతాల్లో తిరిగి టిబెటన్ భాష నేర్చుకున్నాడు. కొంత కాలం మూగసాధువుగా గడిపాడు. బౌద్ధమత ప్రచారకునిగా యూరప్ లో పర్యటించాడు. అమెరికాలో బౌద్ధమత ప్రచారానికి వచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించలేదు. పాశ్చాత్య సమాజం తనని అంతగా ఆకట్టుకోలేదు.

ప్రపంచాన్ని నిరసించేవాడు. నిస్సంగత్వం నచ్చింది. సనాతన ఆచారాల మీద, మూఢ విశ్వాసాల మీద విమర్శలు చేసేవాడు. భౌతికవాదిగా, నాస్తికుడుగా మారాడు. తన వేదాంత ప్రస్థానం చాలా దీర్ఘమైనది.

జాతీయ రాజకీయాల్లో కిసాన్ సభ, జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1923,24 సం.రాలలో హజారీబాగ్ జైల్లో ఉన్నప్పుడు ‘బైసవా సదీ’(22వ శతాబ్దం) అనే పుస్తకం రాసాడు. అదంతా తాను ఊహించిన రాజకీయ ఆదర్శ స్వప్నం. భరతేందు రచించిన ‘అంధేర్ నగరి’ నాటకప్రదర్శన చేసాడు. ఖురాన్ ను సంస్కృతంలోనికి అనువదించాడు. జైల్లోకి రహస్యంగా ట్రాట్స్కీ ‘బోల్షివిజమ్ ప్రపంచ విప్లవం’ తెప్పించుకుని చదివాడు. జైల్లో ఉన్న రెండేండ్లలో సింహళ లిపిలో ఉన్న పాళీగ్రంథం ‘మజ్ఝమ నికాయ’ నిత్యం పఠించేవాడు. ఆ కాలంలోనే ఫ్రెంచి, అవెస్టా భాషల్ని నేర్చుకున్నాడు.

1918లో రష్యా విప్లవాన్ని గురించి చదివి తెలుసుకుని తాను ‘న్యూ అట్లాంటిస్, ‘ఉటోపియా’ వంటి భూతల స్వర్గాల గురించి స్వప్నించసాగాడు. 1922లో ఆ వ్యవస్థకు సంబంధించి చిత్తుప్రతిని సంస్కృత శ్లోకాలలో రాసాడు. 1937, 1944, 1962లో మూడుసార్లు రష్యాలో పర్యటించాడు. 1939లో మోన్ఘీర్ లో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా చేరాడు. తొమ్మిదేండ్లు కమ్యూనిస్టుగా పనిచేసాడు.

1935లో సోవియట్ రష్యాలో పర్యటించినప్పుడు మార్క్సిజమ్ తనని ఆకర్షించింది. సోషలిస్టు అభిమానిగా మారాడు. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం బోధించాడు. రష్యాలోని మధ్యాసియా ప్రజల గురించి అధ్యయనం చేసి ‘మధ్యాసియా చరిత్ర’ అనే పెద్దగ్రంథాన్ని 2సంపుటాలుగా రాసాడు.

లెనిన్ గ్రాడ్ లో లోలా(ఎలెన్ స్మెర్టోల్నా) అనే మంగోలియన్ పండితురాల్ని పెండ్లాడాడు. వారికో కొడుకు, పేరు ఇగోర్. భార్యతో అతనిని ఇండియాకు పోనివ్వలేదు స్టాలిన్ ప్రభుత్వం. తర్వాత కొంతకాలానికి నేపాల్ లోని భారతీయ స్త్రీ  కమల పెరియార్(డా. కమల సాంకృత్యయన్)ను పెండ్లి చేసుకుని మసూరిలో కొంతకాలం ఉన్నాడు. జయ అనే కూతురు, విజేత అనే కొడుకు కలిగారు. ఆ తర్వాత శ్రీలంక విశ్వవిద్యాలయం ఆహ్వానంతో బౌద్ధమతాచార్యుడిగా అక్కడికి వెళ్ళాడు.

ఆరోగ్యం క్షీణించింది. షుగర్, రక్తపోటు, గుండెనొప్పి వేధించాయి. జ్ఞాపకశక్తి క్షీణించింది. 1963లో డార్జిలింగులో ఆయన కనుమూసాడు. అక్కడొక స్మారక చిహ్నం పెట్టబడ్డది. 1907 నుంచి 1963 వరకు ఆయన జీవితమంతా నిరంతర పర్యాటకమే. తన యాత్రికజీవితానికి తత్వశాస్త్రం సమకూర్చి ‘ఘూమక్కడ్ శాస్త్ర’(సంచారశాస్త్రం) అనే పుస్తకం రాసాడు. ఆయన ఎక్కడా కట్టుబడి వున్నవాడు కాదు. స్వేచ్ఛ తన కాంక్ష. నిరంతర యాత్రికుడు.

సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ గ్రంథాలలో ‘రాహుల్ సాంకృత్యయన్’ అనే పుస్తకం రాసాడు ప్రభాకర్ మాచ్వే. రాహుల్ తో సాన్నిహిత్యమున్న మనిషి. 1948లో అలహాబాద్ (నేటి ప్రయాగ) లోని హిందీ సాహిత్య సమ్మేళనంలో పరిపాలనాశాస్త్రానికి హిందీ, ఇంగ్లీష్ భాషలలో పారిభాషిక పదకోశాన్ని తయారుచేయటంలో రాహుల్ తో కలిసి పనిచేసాడు ప్రభాకర్.

ఆ సందర్భంగా పదకోశం తయారీ తొందరపాటుతో, అసమగ్రంగా చేసారని ఒకతను విమర్శించాడట. అంతావిని చిరునవ్వుతో ‘ ‘ఏదీ శాశ్వతంకాదు’ అని బుద్ధుడన్నాడు, ‘క్షణికమ్ శబ్దమ్’, ‘అంతా అనంతం’ అని లెనిన్ అన్నాడు, ఏ వ్యక్తీ సంపూర్ణుడు కాడు. సత్యం మీద సర్వాధికారాలు ఎవరికీ లేవు. నేను నాకు చేతనైనది చేసాను. వచ్చే తరం వారు ఈ పనిని ఉన్నత శిఖరాలకు తీసుకపోతారని ఆశిస్తానన్నా’డట రాహుల్. తనను తాను తగ్గించుకున్నవాడు, ‘స్వీయ లోపాలనెరుగుటయె పెద్ద చదువం’టాడు గాలిబ్. రాహుల్ వ్యక్తిత్వం చాలా గొప్పది.

ఒకసారి రాహుల్ వైశాలి సమీపంలోని చాప్రా ప్రాంతంలోని ఒక మిత్రుని ఇంట అతిథిగా ఉన్నాడు. తనకు రోజు వ్యాయామం చేయడం అలవాటు. మిత్రుని పొలంలో ఒకచోట వ్యాయామం కోసం తవ్వడం మొదలుపెట్టాడు. రెండు మూరలు తవ్వేసరికి కుండపెంకులు దొరికాయి. తాను (ఒకప్పటి మహీనది) గండకి నది ప్రవాహానికి కొంచెం దూరంలోనున్నానని గ్రహించాడు. ఆ ప్రదేశం నదీపరీవాహకమే. తవ్వుకుంటు లభిస్తున్న వస్తువులను, మట్టిపొరలను రికార్డు చేసాడు. కుండపెంకులు, టెర్రకోట మట్టిబొమ్మలు, గాజుపళ్ళాల ముక్కలు దొరికాయి. ఇంకా లోతుకు తవ్వాలని కొందరు కూలివాండ్రను ఏర్పాటు చేసాడు మిత్రుడు… లోతుకుపోతున్నప్పుడు పెద్ద ఇటికెలు దొరికాయి. వాటి మీద బ్రాహ్మీలిపిలో ఒక్కొక్క ఇటికెమీద 16పంక్తులలో ప్రతి పంక్తిలో 27 అక్షరాలలెక్కన పదిహేను శ్లోకాలున్నాయి. తాను అశోకుని శాసనాలను సులువుగా చదువ గలిగినవాడు. వాటిని చూసి సంబరపడ్డాడు. ఇటికెలను బయటకు తీసి, ఆరబెట్టి భద్రపరిచాడు. అవి మొత్తం 1600ల ఇటికెలు. పాట్నా మ్యూజియంలో భద్రపరచారు. వాటిని చదివి రాహుల్  రాసిందే ‘సింహసేనాపతి’ అనే నాగరిలిపి నవల. బుద్ధునికాలంనాటి కథాంశం. ఇఠ్ఠకా ఘర్, సింహ్ ఈ పదాలను సమన్వయం చేసుకుని ఒక చారిత్రాత్మక నవలను రాసాడు.

రాహుల్ సాంకృత్యయన్ కు గొప్ప పేరు తెచ్చిన మరో రచన ‘ఓల్గా నుంచి గంగా వరకు’ తన మాటల్లో ‘‘మానవ సమాజారంభ దశ నుంచి నేటివరకు జరిగిన వికాసాన్ని గూర్చి 20కథల సమాహారం’’. అందులో బౌద్ధయుగానికి సంబంధించి ఒక్క కథలో చెప్పడం సాధ్యం కాదని ‘సింహ సేనాపతి’ నవలా రూపంలో రాసానన్నాడు రాహుల్ సాంకృత్యయన్. ఈ పుస్తకం రాయడానికి పాలీ, టిబెట్, సంస్కృత సాహిత్యాల్లో, జైన సాహిత్యంలో ఆనాటి ప్రజల జీవనవిధానాలను బోధపరచుకున్నాడు. అప్పటి సమాజాన్ని చిత్రించాడు.

చరిత్ర విద్యార్థిగా, ద్రిమ్మరిగా తన రచన ‘విస్మృత యాత్రికుడు’ పేరన వర్ణించాడు. ఇందులోని నరేంద్రుడు ఇప్పటి పాకిస్తాన్లో క్రీ.శ.518లో జన్మించాడు. భారతదేశం, శ్రీలంక, చైనా, మధ్యాసియా దేశాలలో పర్యటించాడు. సియాక్ లోని పురాతన భాడ్ ఆన్ నగరంలో మరణించాడు. అతని గురించి చైనా సాహిత్యంలో రాయబడివుంది. నరేంద్రుడు 50కి పైగా దేశాలను, 50వేల మైళ్ళ దూరాల్ని, 40సం.ల పాటు పర్యటించాడు. బౌద్ధ గ్రంథాల అనువాదకుడు నరేంద్రుడు. ఈ గ్రంథాన్ని రాహుల్ 1953లలో పూర్తిచేసాడు. ఈ నరేంద్రునికి మన రాహుల్ కు దగ్గరి పోలికలున్నాయి.

రాహుల్ శతాధిక గ్రంథ రచయిత. నిరంతర యాత్రికుడు. బతికినంతకాలం స్వేచ్ఛకోసం పోరాడినవాడు. మానవీయమైన వ్యక్తిత్వంతో పరిమళించాడు. తన గురించి నాకు తెలిసింది కొంచెమే, ఇంకా తెలియాల్సిందే ఘనం.

                                                                                                              -శ్రీరామోజు హరగోపాల్

Leave a Reply