1.	
సాంస్కృతిక దిగ్భ్రాంతి!

నీ తల్లిని దూషించారని
నువ్వు దిగ్భ్రాంతి చెందావు
అది న్యాయమే!

కానీ...
ఒక తల్లి కళ్లముందే
కొడుకును మత మూకలు చంపినప్పుడు
నీ గుండె ఎందుకు కదలలేదు?

ఒక గర్భిణీ పొట్టను
మతం పేరుతో చీల్చినప్పుడు
నీ సంస్కృతి ఎక్కడ దాక్కుంది?

ఒక మైనారిటీ ఇంటి తలుపు
విద్వేషపు మంటల్లో కాలిపోయినప్పుడు
నీ జాలి , దయ ఎక్కడ?
దిగ్భ్రాంతి
అధికారపు అద్దంలో కనిపించే
నీ ముఖం మాత్రమేనా?
లేక
రక్తంతో తడిసిన
ప్రజల ముఖాల్లో కూడా
దాని ప్రతిబింబం కనిపిస్తుందా?

ఒక మనిషిని
అతని మతం అడిగి చంపినప్పుడు
నీ సంస్కృతి
ఎందుకు మౌనంగా నిలబడింది?

ఒక దళిత యువతి
న్యాయం కోసం
చివరి శ్వాస వరకు పోరాడినప్పుడు
నీ గొంతులో
ఎందుకు ఒక్క నినాదం పుట్టలేదు?

ఒక జర్నలిస్టు
ప్రశ్న అడిగినందుకు
ఆమె శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని
అసభ్య పదాల వర్షం కురిపించినప్పుడు
నీ సంస్కృతి
ఎందుకు చెవులు మూసుకుంది?

ఆమెను బెదిరించిన
డిజిటల్ మూకల ముందు
నీ నైతికత
ఎందుకు నిశ్శబ్దమైంది?

ఒక మాట నీ గుండెను గుచ్చితే
అది నీకు దిగ్భ్రాంతి.
ఒక బుల్లెట్
ప్రజల గుండెల్లో దూసుకుపోతే
అది ఏమిటి?

ఒక దూషణ
నీ గౌరవాన్ని గాయపరిస్తే
అది దిగ్భ్రాంతి.
ఒక మూక
మనిషి గౌరవాన్ని
కాలితో తొక్కితే
అది ఏమిటి?

నీకు
నీ తల్లి కనిపిస్తుంది
మాకు
ప్రతి తల్లిలో
మా తల్లి కనిపిస్తుంది!

నీకు
నీ ఇంటి కన్నీరు కనిపిస్తుంది
మాకు
ప్రతి ఇంటి కన్నీరు
ప్రజల కన్నీటిగా కనిపిస్తుంది!

నీకు
నీ గాయం కనిపిస్తుంది
మాకు
ఈ దేశం మొత్తం
గాయపడిన శరీరంలా కనిపిస్తుంది

అందుకే
నీ దిగ్భ్రాంతిని
మేము ప్రశ్నిస్తున్నాం.
నీ ఎంపికను ప్రశ్నిస్తున్నాం
ఇతర తల్లుల గౌరవం ఎక్కడ?
అని అడుగుతున్నాం.

ప్రజల బాధకు నీ స్పందన ఎక్కడ?
అని నిలదీస్తున్నాం.
నీ సంస్కృతిమీద
మా నిరంతర పోరాటం
నీకు దిగ్భ్రాంతిగా మిగుల్తుంది.




2.

నేను సనాతన్ కాదు… అధునాతన్


నేను సనాతన్ కాదు…
కాలం వెనక్కి నడిచే
చీకటి దారిలో
పాదముద్రను వెతికే వాడిని కాదు

నేను అధునాతన్
రేపటి సూర్యుడి కోసం
ఈరోజు చీకటిని ప్రశ్నించే వాడిని!

కులం గోడల మీద
మతం ముళ్లకంచెల మీద
మనిషిని మనిషి నుంచి విడదీసిన
అన్ని సరిహద్దుల మీద
నా ప్రశ్న ఒక సమ్మెట దెబ్బ

మనిషిని బానిస చేసిన
ఏ సంప్రదాయాన్నైనా
నేను ముక్కలుగా విరిచేస్తా.

స్త్రీని గడపకు కట్టిన
సంప్రదాయం వద్దు!
దళితుడిని తలవంచించిన
ధర్మం వద్దు!

ఆదివాసి అడవిని
అభివృద్ధి పేరుతో దోచే
న్యాయం వద్దు!

కూలీ చెమటను పీల్చి
పెట్టుబడిదారుడి భవనానికి
దైవత్వాన్ని అద్దే
వ్యవస్థ వద్దు!

నేను నిన్నటి నీడను కాదు,
రేపటి వెలుగును!

నన్ను గతంలోకి
లాగాలని చూసే
ప్రతి సంకెళ్లు
నా ప్రశ్నల ముందు
తుప్పుపట్టిన ఇనుమే!



నేను దేవాలయాల ఎత్తును
కొలవను
మనిషి మనసు ఎంత ఎత్తుకు
ఎదిగిందో కొలుస్తాను.

నన్ను సనాతన్ అని పిలవకు
నేను కాలం గడ్డకట్టిన
ఒక పాత శిల్పం కాదు.

నేను కదులుతున్న ప్రశ్నను
మారుతున్న చరిత్రను
మండుతున్న చైతన్యాన్ని

నేను
నిన్నటి బూడిదలో
రేపటి విత్తనాన్ని వెతికే వాడిని.
పడిపోయిన పిడికిలిని
మళ్లీ బిగించే వాడిని.

నిశ్శబ్దంగా ఉన్న గొంతుకలకు
నినాదాన్ని నేర్పే వాడిని.



నేను సనాతన్ కాదు…
నేను అధునాతన్!

గతాన్ని గౌరవిస్తాను
కానీ గతానికి బానిసను కాను.

వర్తమానాన్ని ప్రశ్నిస్తాను
ఎందుకంటే
భవిష్యత్తును నిర్మించాలి.

రేపటి ప్రపంచంలో
కులం ఉండకూడదు,
మతం పేరుతో ద్వేషం ఉండకూడదు,
ఆకలి ఉండకూడదు
అసమానత ఉండకూడదు.

మనిషి పుట్టినందుకు
మనిషిగానే గౌరవించబడే
ఒక కొత్త ప్రపంచం కావాలి!

నా స్వరం
నా స్వరం మాత్రమే కాదు
మౌనం బద్దలైన
వేల గొంతుల ప్రతిధ్వని!

నన్ను వెనక్కి పిలవకు…
నేను ముందుకు నడుస్తున్నాను!

చీకటి నుంచి వెలుగువైపు
బానిసత్వం నుంచి స్వేచ్ఛవైపు
అసమానత నుంచి సమానత్వంవైపు
మూఢత్వం నుంచి విజ్ఞానంవైపు
దోపిడీ నుంచి విముక్తివైపు.

నేను సనాతన్ కాదు…
నేను అధునాతన్!

- చంద్రహాస

Leave a Reply