నేల మీద రక్తాన్ని చూసి
తోడేల్ని నిందిస్తావు గాని
దర్వాజ గొళ్లాన్ని తీసిందెవరు
నీ పక్కన కూచున్నది
మిత్రుడనుకున్నావు గాని
పొంచి ఉన్న పెను ప్రమాదమనుకోలేదు
పాలకుల పక్కన
ఒక్క సీటు కోసం
భవిష్యత్తును అమ్మేశారు
ఏ సైనికుడి కైనా
రాత్రిపూట విరుచుకుపడే
తన సైన్యంతోనే తలపడడం
అత్యంత ప్రమాదకరం
బయట శత్రువు
తుపాకీతో నిల్చున్నాడు
అత్యంత విశ్వాస పాత్రుడైన మిత్రుడే
దర్వాజ తెరిచి పెట్టాడు
మీరంటారూ
"తెల్లవాడు అన్నీ దోచూకుపోయాడని
కానీ మనోడే... నల్లవాడే
ఏ నాయకుడిని మట్టు పెట్టాలో
ఉప్పందించాడు"
మిత్రమా
అనుకున్న వాళ్లంతా
ఆత్మీయులు కారు
నీ పక్కన అడుగేస్తూనే
నట్టేట్లో ముంచేస్తారు
రంపం పదునైనదే గాని
చేతులు ఇచ్చిందెవరు
చెట్టు వైపు నడిపించిందెవరు
తోడేలు వైపే చూడకు
అందిన "మూట" సంగతి విప్పు
మిత్రమా
నీ వీపులో
పదునైన కత్తి
ఇంకా దిగబడే ఉంది
జాగ్రత్త..




