(A Memory fallen on the path standing up!
A Rare Lyrical Poem of Revolutionary Ernest Cheguvera)

ఇంగ్లీష్ మూలం ఎర్నెస్టో చేగువేరా!
తెలుగు అనువాదం గీతాంజలి!

~~
రోడ్డు మీద పడిన ఆ జ్ఞాపకం అక్కడే అలా నిలబడి పోయింది!
కథలేమీ మిగల లేదేమో,
నన్ను వెంబడిస్తూ, వెంబడిస్తూ అలసిపోయి,
దారి పక్కన ఉన్న చెట్టు నీడలో తనని తాను
మరచిపోయినట్టుంది!
~~
నీ నుంచి నేను ఎంత దూరం వెళ్లి పోతానంటే
నా జ్ఞాపకం దారి మీదున్న రాళ్లపై చితికి చెల్లాచెదురై
చివరికి మృత్యువంత దూరమైపోతుంది
చూడు అంత దూరమన్నమాట!
~~
ఇక్కడ నేనేమో
బాధను గుండెల్లో దాచుకుని,
బయట చిరునవ్వును పెదాలకు అద్దుకుని,
అదే యాత్రికుడిగా మిగిలిపోతానంతే!
~
గుండ్రని, దృఢమైన, లోతైన చూపు ఒకటి,
మంత్ర ముగ్ధని చేసే ఆ మాయా వస్త్రాన్ని విప్పిన ఆ క్షణం,
నా ఆకాంక్షల, ప్రతి లక్ష్యాన్నీ, కోరికని దాటుతూ వెళ్ళిపోయింది!
ఎలా అంటావా?
నా స్పర్శకే అందని సన్నని
స్పర్శరేఖలా మారిపోయి,
చివరకి నా నుంచే తప్పించుకుపోయినట్లుగా!
~~
నిన్ను చూడకూడదని, చూడకుండా ఉండాలని
అతి ప్రయత్నం మీద నేను చూపును తిప్పుకున్నాను.
~~
నా ఆనందాన్నీ రెట్టింపు చేసే నా గులాబీ
స్పానిష్ యోధుడా,
నన్ను నీ నిర్లక్ష్యపు చిరునవ్వుతో కవ్విస్తూ
ఆహ్వానించడానికి మాత్రమే నువ్వు మళ్ళీ నా జ్ఞాపకాల్లోకి వచ్చావు కదూ?

2.


అంధకారమయ స్వీయ చిత్తరువు!
ఎర్నెస్టో చే గువేరా
అనువాదం గీతాంజలి
~
గడ్డి వేర్లతో నిలబడ్డ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఒక యువ దేశం
అమెరికా ఆగ్రహాన్ని తిరస్కరించే మూలాలున్న దేశం నుంచే
ఉత్తర దిక్కు సోదరులారా నేను మీ దగ్గరికి వచ్చాను!
~
నిరాశ చెందినప్పటికీ నమ్మకం, విశ్వాసంతో వెలిగిపోయే కాంతి తో స్వేచ్ఛ కోసం నీరసపు నినాదాలు చేస్తూ
ఉత్తర సోదరులారా నేను మీ వద్దకు వచ్చాను! ~~
హోమోసేపియన్స్ అనే మానవ జాతి జన్మించిన నేల నుంచే నేనూ బయలుదేరి వచ్చాను! ~~
అనేక వలస సంచార ఆచారాలతో నిండిన పాత సంప్రదాయ దారుల్లో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి వచ్చాను!
నా ఆస్తమా రోగాన్ని శిలువంత భారంగా మోస్తూ వచ్చాను!
ఇంకా ఏ మాత్రమూ సంబంధంలేని, అసంబద్ధమైన నాటకాలలోని వింతగా తెగిపోతున్నట్లుగా అనిపించే ఆంతరికమైన భాగాల్లోంచి నడుస్తూ వచ్చాను!
~~
మార్గం సుదీర్ఘంగా మాత్రమే కాదు,
చాలా భారంగా కూడా ఉంది!
అలజడిగా నిత్యం సంచరించే అలసట తెలియని పాదాల వాసన ఇంకా ఇప్పటికీ అలా నాలో నిలిచిపోయే ఉంది!
~~
అంతెందుకు?
నా ఆంతరంగిక శిథిల నౌకలో కూడా,
సముద్ర తీరాలు క్షేమంగా ఉన్నాయని ప్రకటించబడ్డాక కూడా నేను నా భూమి అస్తిత్వాన్ని,
నా నేల మీది మనుషుల జీవితాలను కాపాడతానని ప్రకటిస్తాను!
~~.
అనంతమైన ఈత వల్ల కమ్మిన అలసటను, మైకాన్ని పట్టించుకోకుండా ధిక్కారంతో ఎదురీదుతాను!
ఇక్కడ ఒంటరిగా వదిలి వేయబడిన నావికుడి లాంటి నా స్థితిని అలాగే చెక్కుచెదరకుండా కాపాడుకుంటూనే సుమా?
~~
తప్పించుకోలేని రాత్రిని నేనొక్కడినే ఒంటరిగా ఎదుర్కొంటున్నాను!
ఎక్కడినుంచో ఆ రూపాయిల నోట్ల నుండి ఒక రకమైన తీపి వాసన వ్యాపిస్తోంది!
పాత మాగిపోయిన వైను పరిమళంతో యూరోపు నన్ను పిలుస్తోంది!
లేత మాంసపు సువాసన నిండిన శ్వాసతో కూడా!
ఇవేనా? మ్యూజియంలోని ప్రాచీన వస్తువులు అన్నీ నన్ను రమ్మని నిశబ్దంగా ఆహ్వానిస్తూ ఉన్నాయి!
~~
అంతేనా?
జరిగేది ఏంటంటే పోరాటాల తరువాత ఏర్పడబోయే కొత్త దేశాల ఉల్లాసకరమైన ఉత్సవాల్లో నేను దేశాలు విస్తరించిన ప్రభావాన్ని నేరుగా ఢీ కొంటాను!
~~
చివరాఖరికి వాళ్లేం చేస్తారనుకున్నావు?
నన్నిక వాళ్ళు నా పాటల నుంచి తప్పిస్తారు!
మార్క్స్, ఎంగెల్స్ ఆలోచనలను అందుకుంటారు!
లెనిన్ ఆచరించి చూపిన ఆ స్వప్నాన్ని
ప్రజలే పాటలుగా పాడతారు!

Leave a Reply