2026 జూలై 25న కేంద్రమంత్రులకు, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ప్రతినిధులకు మూడవ దఫా చర్చలు సంతృప్తిగా జరగడం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమం తాత్కాలికంగా విరమణ జరిగింది. అయితే తదనంతరం కేంద్ర ప్రభుత్వం అప్పటి ఒప్పందంలోని ఏ అంశం పైన చిత్త శుద్ధితో వ్యవహరించలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంలోను, విద్యార్థులపై నమోదు కాబడిన ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవడంలో గాని ఆ ఒప్పందం అమలు కాలేదు. ఇక పరీక్షల అక్రమాలను అరికట్టే సంరక్షణ చట్టం – 2024 కి పార్లమెంటులో సవరణ చట్టం – 2026, పరీక్షల సంస్కరణలపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వంటివన్నీ కంటితుడుపు చర్యలే. అయినప్పటికీ దేశంలో గల వివిధ ప్రాంతాలలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆందోళనలు గత మూడు వారాలుగా జరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడుగా ఆరు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులు జెన్ – ఆల్ఫా పేరుతో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కోసం ఉద్యమిస్తున్నారు. ఇక సామాజిక బాధ్యతలో భాగంగా ఢిల్లీ జె ఎన్ యు విద్యార్థి సంఘం కి చెందిన విద్యార్థులు ఎన్ ఆర్ సి, సిఏఏ ఉద్యమ నాయకుడు, ఊపా కేసు బాధితుడు ఉమర్ ఖలీద్ రాసిన ” ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్” పుస్తకంపై వందలాదిమంది విద్యార్థులతో ఢిల్లీ జె ఎన్ యు లో ఆగస్టు 10న సభను నిర్వహించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రెంట్ విద్యార్థులు జూలై 28 నుంచి విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల సంస్మరణ వారోత్సవాలను జరుపుకున్నారు. పై విషయాలన్నీ విద్యార్థుల ఉద్యమ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ మనం ఒకసారి పరిశీలిద్దాం.
జులై 10 నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ విశ్వ విద్యాలయ విద్యార్థులు ప్రవేశ ఫీజులు పెంపుదలను, వివిధ కోర్సులలో సీట్ల తగ్గింపుని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. మధ్యప్రదేశ్ లోని సెహుర్ పారిశ్రామిక శిక్షణా సంస్థ విద్యార్థులు 16 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో జేపియస్సీ, జేఎస్ఎస్సి ఉద్యోగ నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై ఆగస్టు 7న రాంచీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఆగస్టు 10న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 7 ర్యాలీలో ఏఐఎస్ఏ విద్యార్థి నాయకురాలు నేహా బోరాపై బిజెపి అనుకూల వ్యక్తి ఇంక్ చల్లడం, ఆగస్టు 10న అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్, భాష వాయు గోళాలు ప్రయోగించడం, వాటర్ కెనాన్ లతో నీళ్లు చల్లడం వంటి చర్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు అధిక మెస్ చార్జీలకు వ్యతిరేకంగాను, హాస్టల్ లో నాణ్యమైన భోజనం కోసం ఆందోళన చేశారు. వీటికి తోడుగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలలో పాఠశాల విద్యార్థులు మౌలిక సదుపాయాలు (తాగు నీరు, మరుగుదొడ్లు మొదలైనవి) కోసం, నాణ్యమైన విద్యా ప్రమాణాల బోధన, సరిపడా సబ్జెక్టు టీచర్ల కోసం పాఠశాలల గేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేశారు. పైవన్నీ ఒక ఎత్తైతే హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయ లా విద్యార్థులు సుమారు 450 మంది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆ విశ్వవిద్యాలయ కాన్వకేషన్ కార్యక్రమంలో డిగ్రీ పట్టాలు తీసుకోమని చెబుతూ ఆ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కి లేఖ రాశారు.
పైన తెలియజేసిన విద్యార్థుల పోరాట కార్యక్రమాలు, నిరసనలు మనకు తెలియజేస్తున్నదేమంటే, “కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్న విద్యారంగంలోనూ, పరీక్షల నిర్వహణలోనూ లోపించిన పారదర్శకతను, అవినీతి అక్రమాలను వారు ప్రశ్నిస్తున్నారు. అందుకోసం వారు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు”. ఇది గొప్ప శుభపరిణామం. మరోవైపు ఢిల్లీ జె ఎన్ యు విద్యార్థి సంఘం లాంటి వారు, పశ్చిమ బెంగాల్లోని రివల్యూషనరీ స్టూడెంట్ ఫ్రంట్ లాంటి విద్యార్థి సంఘం సామాజిక బాధ్యతగా ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో చర్చలు జరుపుతూ సామాజిక మార్పు కి దోహదపడే సభలు, సమావేశాలు, పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మొత్తంగా మనకు తేట తెల్లం చేస్తున్నదేమంటే, ” విద్య ప్రైవేటీకరణతోనూ, మనువాద ఫాసిజాన్ని అమలు జరపడంలోనూ విజయం సాధించామని సంబరపడిపోయిన భారత పాలకవర్గాలకు దిమ్మతిరిగిపోయే ప్రతి చర్యలుగా” మనం భావించాలి.
- పేడాడ కృష్ణారావు,
జిల్లా కన్వీనర్,
ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.
తేదీ 11 – 08 – 2026.




