కొంచెం మతిస్థిమితం లేని చనన్ దిన్, ఒక చిన్న సైనికుల బృందాన్ని సమీకరించి, వారికి కర్రలు, బొమ్మ తుపాకులు ఇచ్చి ఆయుధాలుగా ఇచ్చాడు. లాహోర్ వాసులు దీనికి ‘దండా ఫౌజ్’ అని పేరు పెట్టారు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన ప్రజల తిరుగుబాటుకు చెందిన ఒక నకిలీ పోరాట విభాగం.

రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఉధృతంగా ఉన్న సమయంలో, 1920 ఏప్రిల్ 11, 12 తేదీలలో దండా ఫౌజ్ లాహోర్ వీధుల్లో కవాతు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజా అశాంతిని నియంత్రించడానికి, కుట్రలను నిర్మూలించడానికి అమలు చేసిన “అత్యవసర చర్యలను” నిరవధికంగా పొడిగిస్తూ, ఈ చట్టాన్ని 1919లో బ్రిటిష్ రాజ్ చట్టబద్ధం చేసింది. రౌలట్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆమోదించబడిన ఈ చట్టం, ఉగ్రవాదానికి పాల్పడినట్లు అనుమానించబడిన ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా జైలులో పెట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది.

కఠినమైన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అఖిల భారత తిరుగుబాటులో చనన్ దిన్ కు చెందిన దండా ఫౌజ్ ఒక అంశం. ప్రత్యేకంగా ముస్లిం చేతివృత్తి కళాకారులు, రియు కార్మికులతో ఏర్పడడం అనేది ఈ ఫౌజ్ ప్రాముఖ్యత. వీరు పాన్-ఇస్లామిజం నినాదంతో కార్యాచరణకు ప్రేరేపించబడినట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి వారు ద్రవ్యోల్బణానికి బాధితులు (1919 లో పంజాబ్ లో మొదటి ప్రపంచ యుద్ధం వల్ల  గోధుమ, బియ్యం, సజ్జలు ధరలు రెండింతలు పెరిగాయి, ఉప్పు ధర మూడింతలు పెరిగింది). సహజంగానే, దండా ఫౌజ్‌ను తీవ్రంగా పరిగణించలేదు. కానీ తరువాత ఒక బ్రిటిష్ అధికారి దండా ఫౌజ్ అనేది “చాలా ప్రమాదకరమైన విషయం” అని ఒప్పుకున్నాడు.

చనన్  దిన్ సిద్ధాంతం ఒక మిశ్రమ స్వభావం కలది. ఒకవైపు, దండా ఫౌజ్ ప్రాధాన్యతా క్రమంలో టర్కీ ఒట్టోమన్ ఖలీఫాకు, కాబూల్ రాజుకు విధేయత చూపుతుందని ప్రకటిస్తూ ప్రసంగాలు చేశాడు. మరోవైపు, హిందువులు, సిక్కులు, ముస్లింల మధ్య ఐక్యతను ప్రబోధిస్తూ లాహోర్ గోడల నిండా పోస్టర్లను అంటించాడు. చనన్  దిన్ ‘దండా అఖ్బార్’ అనే వార్తాపత్రికను కూడా ముద్రించాడు. అది లాహోర్ పౌరులను ఉద్దేశించి, “యుద్ధానికి సిద్ధమవ్వండి, దేవుడు అతి త్వరలో భారతదేశానికి విజయాన్ని ప్రసాదిస్తాడు. ఉత్సాహంతో పోరాడండి; దండా ఫౌజ్‌లో చేరండి” అని ఉద్బోధించింది.

మహాత్మా గాంధీ సత్యాగ్రహ (శాంతియుత ప్రతిఘటన) పిలుపు మేరకు రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా తలెత్తిన గొప్ప తిరుగుబాటులో చనన్  దిన్ దండా ఫౌజ్ ఒక వినోదాత్మక భాగం. ఈ విప్లవోద్యమ బలమైన రూపాలు బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో వ్యక్తమయ్యాయి. గాంధీ పిలుపు భారతదేశం నలుమూలలా ప్రజలను మేల్కొల్పింది, కానీ లాహోర్‌లో తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ నగరం బ్రిటిష్ వారి నియంత్రణ నుండి జారిపోతున్నట్లు అనిపించింది. యూరోపియన్ల ఇళ్లను రక్షించడానికి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన భారీ సైనిక దళాలను మోహరించారు.

నిజానికి, గాంధీ ఈ “సైతాను చట్టం” అని పిలిచిన దానికి వ్యతిరేకంగా తన నిరసన ఉద్యమాన్ని ప్రకటించడానికి ముందే లాహోర్ నాయకులు ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించారు. లాహోర్ ఇండియన్ అసోసియేషన్ 1920 ఫిబ్రవరి 4న రౌలట్ చట్టాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇండియన్ అసోసియేషన్ తీర్మానం లాహోర్‌లోని మధ్యతరగతి వర్గాల భావాలను వ్యక్తం చేసింది. ఇండియన్ అసోసియేషన్ నాయకులలో ఫైనాన్షియర్, పారిశ్రామికవేత్త అయిన హర్కిషన్ లాల్, ప్రముఖ న్యాయవాది, ఆర్య సమాజ్ సభ్యుడు ధునీ చంద్, ఎదుగుతున్న యువ బ్రాహ్మణ న్యాయవాది రాంభుజ్ దత్ చౌదరి, బార్ అసోసియేషన్‌లో ప్రముఖ సభ్యుడు గోకుల్ చంద్ నారంగ్, నగరంలోని ఉదారవాద ముస్లింలకు నాయకత్వం వహించిన ఫజల్-ఇ-హుస్సేన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. లాహోర్ ఇండియన్ అసోసియేషన్ మార్చి 9న మరో తీర్మానాన్ని ఆమోదించింది, కానీ మార్చి 26న గాంధీ రాసిన బహిరంగ లేఖ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. ఆ లేఖలో ఆయన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ తిరగబడాలని పిలుపునిచ్చారు.

ఫజల్-ఇ-హుస్సేన్ మార్చి 9వ తేదీ సమావేశానికి అధ్యక్షత వహించి, కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, సత్యాగ్రహం చేయాలన్న గాంధీ పిలుపు పట్ల ఆయన ఉత్సాహం చూపలేదు. గాంధీ నిప్పుతో ఆడుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలన్న ప్రజాకర్షణను ఆయన అడ్డుకోలేకపోయినా, తీర్మానాన్ని నీరుగార్చడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ, ఏప్రిల్ 6న జరిగిన నగరవ్యాప్త హర్తాల్ (బందు) తర్వాత జరిగిన పరిణామాలు, ఫజల్-ఇ-హుస్సేన్ ఆశించిన లేదా ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉన్నాయి.

ఏప్రిల్ 6న, లాహోర్ అంతటా జరిగిన సమ్మెలో, విద్యార్థులు తమ ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ప్రముఖంగా కనిపించారు. కానీ, కోటగోడల నగరంలోని లాహోరీ గేట్ చుట్టూ గుమిగూడిన జనసమూహంలో గుమాస్తాలు, చిన్న దుకాణదారులు, వివిధ వృత్తులకు చెందిన వారు ఉన్నారు. ఆ జనసమూహం సంఖ్యలోనూ, స్ఫూర్తిలోనూ చాలా ఆకట్టుకుంది. అయితే, ఆ జనసమూహం అనార్కలీ బజార్‌లోని నీలా గుంబద్‌కు చేరుకున్నప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితి తలెత్తింది. ఆ జనసమూహం ‘ది మాల్’ వైపు ముందుకు సాగాలని కోరుకుంది, కానీ అప్పటి లాహోర్ డిప్యూటీ కమిషనర్ అయిన మిస్టర్ హెచ్. ఫైసన్ దీనికి అనుమతించడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే యూరోపియన్ల నివాస ప్రాంతాలు ‘ది మాల్’కు ఆనుకొని ఉన్నాయి. గోకల్ చంద్ నారంగ్ ఆ జనసమూహాన్ని బ్రాడ్‌లా హాల్ వైపు మళ్లించి రక్తపాతాన్ని నివారించారు, అక్కడ ఫజల్-ఇ-హుస్సేన్, మోసిన్ షా వంటి ప్రముఖ నాయకులు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్  ఓ’డ్వైర్, బ్రిటిష్ వ్యతిరేక భావనను తక్కువ అంచనా వేసి, నగరాన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ లొంగిపోవడానికి బదులుగా, లాహోరీయులు ఏప్రిల్ 9న శ్రీరాముని జన్మదినమైన రామ్ నవమిని హిందూ పండుగగా జరుపుకొని తిరగబడ్డారు. 20,000 మందితో కూడిన రామ్ నవమి ఊరేగింపు నగరం చుట్టూ తిరిగింది. మొట్టమొదటిసారిగా, ఇటువంటి హిందూ ఊరేగింపులో గణనీయ సంఖ్యలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. రామ్భుజ్ దత్ చౌదరి వంటి నాయకులు హిందూ-ముస్లిం ఐక్యత ప్రస్తుత అత్యవసరం అని సుదీర్ఘంగా ప్రసంగించారు. “మనం ఐక్యమైతే, మనకు భయపడటానికి ఏమీ లేదు” అనేది వారి సందేశ సారాంశం. ఏప్రిల్ 9 ఎటువంటి సంఘటనలు లేకుండా గడిచిపోయింది. అయితే, ఏప్రిల్ 10వ తేదీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ఆ రోజు, పంజాబ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పాలివాల్ వద్ద గాంధీని అరెస్టు చేసారనే వార్త లాహోర్‌కు చేరింది. అంతేకాకుండా, కిచ్లూ, సత్యపాల్ వంటి నాయకులను కూడా అరెస్టు చేశారని, అమృత్‌సర్‌లో కొంతమంది బ్రిటిష్ అధికారులను దారుణంగా హత్య చేశారని వదంతులు వ్యాపించాయి. లాహోర్‌లో ప్రతిస్పందన తక్షణమే వచ్చింది. కోట నగరంలోని అనార్కలీ బజార్ వ్యాపారులు, బజారీలు అందరూ తక్షణమే హర్తాల్ ప్రకటించారు. నగరం నలుమూలల నుండి మొహల్లాలు ప్రజలు బజార్లలోకి పోటెత్తారు, నాయకుడు లేని ఆ జనసమూహం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి నిశ్చయించుకుంది. చిన్న చిన్న సమూహాలు ఇందులో చేరగా, ఒక పెద్ద జనసమూహం అనార్కలీ వైపు కదిలింది. గుంపులోని ఒక వర్గం అప్పర్ మాల్ వైపు కదలగా, పోలీసులు వారిపై అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. అరడజనుకు పైగా నిరసనకారులు అక్కడికక్కడే మరణించారు. ఆ గుంపు కోట నగరం వైపు చెల్లాచెదురైంది.

అనార్కలి వద్ద ఉన్న జనసమూహాన్ని ఫైసన్ లాహోరీ గేట్ వైపు వెనక్కి నెట్టాడు. గతంలో నీలా గుంబద్ వద్ద చేసినట్లే, రామ్భుజ్ దత్ ఆ జనసమూహాన్ని వారి ఇళ్లకు తిరిగి వెళ్ళమని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ, ఏప్రిల్ 6న దత్ ఎదుర్కొన్న జనసమూహం అంత సౌమ్యంగా ఈ గుంపు లేదు. లాహోరీ గేట్ వద్ద ఉన్న ఈ జనసమూహంలో మధ్యతరగతి హిందువుల వలె నియంత్రించడం సులభం కాని ముస్లిం చేతివృత్తులవారు, కార్మికులు బలమైన బృందాలుగా ఉన్నారు. దత్ ఆ గుంపును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుండగా, ఫైసన్ వారిపై కాల్పులు జరిపాడు, దాంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముస్లిం చేతివృత్తులవారు, కార్మికులు ఈ ఉద్యమానికి ఒక తీవ్రవాద కోణాన్ని ఇచ్చారు; ఆ రోజు లాహోరీ గేట్ వద్ద మరణించిన వారిలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఉన్నారు.

ఈ వార్త దావానలంలా వ్యాపించింది, దానితో పాటు ఆందోళన కూడా పెరిగింది. నగరం మొత్తం స్తంభించిపోయింది. ఏప్రిల్ 11, శుక్రవారం నాడు హిందువులు, ముస్లింలు, సిక్కులు అనే తేడా లేకుండా పౌరులందరూ బాద్షాహీ మసీదు వద్ద సమావేశం కావాలని లాహోర్ నలుమూలల నుండి నినాదాలు మారుమోగాయి. ఫైసన్, తదితర బ్రిటిష్ అధికారులు, సమావేశం తర్వాత ఊరేగింపులు తీయవద్దని నాయకులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. బాద్షాహీ మసీదు సమావేశానికి సుమారు 35,000 మంది హాజరయ్యారు. వీరిలో దాదాపు మూడో వంతు మంది హిందూ వ్యాపారులు, వృత్తి నిపుణులు కాగా, మిగిలిన వారు ముస్లిం చేతివృత్తి కళాకారులు, కార్మికులు. ఎప్పటిలాగే, ఈ సమావేశానికి విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఆ రోజు, బాద్షాహీ మసీదులో హిందూ-ముస్లిం ఐక్యత పరాకాష్టకు చేరుకుంది. మసీదుకు హాజరైన నాయకులలో రాంభుజ్ దత్, నిహాల్ చంద్, గోపీ చంద్ భార్గవ, హర్కిషన్ లాల్, ధునీ చంద్, ధరం దాస్, మోహిన్ షా, పీర్ తాజుద్దీన్, ఖలీఫా షుజావుద్దీన్ ఉన్నారు. వీరిలో చివరి వ్యక్తి తన ప్రారంభ ప్రసంగాన్ని సయోధ్య ధోరణితో మొదలుపెట్టగా, రాంభుజ్ దత్ తన విప్లవాత్మక ప్రసంగాలతో ఆ ధోరణికి స్వస్తి పలికి, ప్రజా కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దత్ ప్రతిపాదనను ఆమోదించారు.

బ్రిటిష్ అధికారులు మియాన్ మహమ్మద్ షఫీ, ఫతే అలీ ఖాన్ ఖాజిల్‌బాష్, యు రాజా నరేంద్ర నాథ్ వంటి లాహోర్‌లోని కులీనులను సమీకరించారు. ఈ వ్యక్తులు స్థానిక నాయకులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ప్రజా కమిటీ కూడా సమ్మెను విరమించుకోవాలని తిరుగుబాటుదారులను ఒప్పించడానికి ప్రయత్నించింది, కానీ లాహోర్ ప్రజలు వినే స్థితిలో లేరు: వారు మార్పును, బ్రిటిష్ పాలనకు ముగింపును కోరుకున్నారు. ముస్లిం చేతివృత్తి కళాకారులు, కార్మికులు ఈ ఉద్యమంలో అత్యంత ముందు వరుసలో నిలిచారు. లాహోర్‌లోని అణగారిన ముస్లిం వర్గాల ప్రతిఘటనకు చిహ్నంగా చనన్  దిన్ దండా ఫౌజ్ జనసమూహంలో కలిసిపోయింది.

లాహోర్‌లో తిరుగుబాటును అణచివేయడానికి దౌత్యం విఫలమైనప్పుడు, జనరల్ ఓ’డ్వైర్ సైన్యాన్ని పిలిపించారు, అది ఆ తిరుగుబాటును విజయవంతంగా అణచివేసింది. ఈ ప్రక్రియలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా చాలా మంది మరణించారు. 1920 నాటి సంఘటనలు బ్రిటిష్ వారిని కలవరపెట్టాయి. హిందూ-ముస్లిం ఐక్యత అనే ‘భయాన్ని’ రేకెత్తించాయి. రాబోయే దశాబ్దాలలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్వీర్యం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఉపఖండానికి విషాదకరంగా, వారు ఆ పనిని గొప్ప విజయంతో సాధించారు.

డాక్టర్ మంజూర్ ఎజాజ్ చాలా సంవత్సరాలు లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో బోధించారు మరియు ఇప్పుడు వర్జీనియాలో నివసిస్తున్నారు.

ఈ కథనం మొదట పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ‘ది ఫ్రైడే టైమ్స్’ పత్రికలో ప్రచురించబడింది.

అనువాదం : కె. పద్మ

Leave a Reply