నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల కాల్పులు
2026 జులై 29
ఏప్రిల్ నెల తీవ్రమైన ఎండలో కిస్సా ఖ్వానీ బజార్ ప్రవేశ ద్వారం వద్ద వరసగా నిలబడి ఉన్న రాయల్ గర్హ్వాల్ రైఫిల్స్ సైనికులు నిలబడి ఉన్నారు. వారి వెనుక ఉన్న 50-హార్స్ పవర్ విక్కర్స్-క్రాస్లీ M25 సాయుధ వాహనాల కు ఉన్న చిన్న గోపురాల నుండి మెషిన్ గన్లు బయటకు వచ్చి ఉన్నాయి. వీధికి ఇరువైపులా ఉన్న వ్యాపారుల ఇళ్ల బాల్కనీల నుండి వస్తున్న తిట్లు, మానవ మలం వర్షాన్ని వారు భరిస్తున్నారు. ఆ సెయింట్ జార్జ్ డే నాటి రోజున, అంటే 1930 ఏప్రిల్ 23న, పష్తూన్ జాతీయవాద నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి స్థానిక పోలీసులు బజార్‌కు చేరుకున్నారు. ఖాన్ కు చెందిన ఎర్ర చొక్కాల ‘ఖుదాయ్ ఖిద్మత్‌గార్’ వాలంటీర్లు పోలీసుల మార్గాన్ని అడ్డుకుని, వారి ట్రక్కుల టైర్లను కోసేశారు. చివరికి, అధికారిక చరిత్ర నమోదు చేసిన దాని ప్రకారం, “ఇన్‌ఛార్జ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆ ఖైదీల సూచనను అంగీకరించాల్సి వచ్చింది, దాని ప్రకారం వారు లారీ దిగి, జనసమూహం తోడుగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.”
అయినప్పటికీ, నిరసనకారులు బజార్‌పై తమ నియంత్రణను కొనసాగించారు, దాంతో సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. ఆ తర్వాత, గొడ్డలితో కొట్టడం వల్ల ప్రైవేట్ హెరాల్డ్ బ్రయంట్ మరణించాడు. సాయుధ వాహనాల్లో ఒకటి మంటల్లో చిక్కుకుని పేలిపోయింది. స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో, కెప్టెన్ ఎస్. జె. కింగ్ తన మెషిన్ గన్నర్లను కాల్పులు జరపాలని ఆదేశించాడు. “ప్రధాన వీధిలోనే దాదాపు 1500 మంది వరకు ఉంటారని అంచనా వేసిన ఆ జనసమూహం, నేలపై అనేక శవాలను వదిలిపెట్టి, మాయమైనట్లు అదృశ్యమైపోయింది” అని కింగ్స్ ఓన్ యార్క్‌షైర్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన ఒక అధికారి రాశారు.
గత వారం, ఢిల్లీలోని విద్యార్థులపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బర్డ్ షాట్ గుళ్లతో నిండిన పంప్-యాక్షన్ షాట్‌గన్లు, ఎలక్ట్రిక్ కేటిల్ ప్రాడ్స్ (పశువులను తోలే విద్యుత్ కర్రలు) ఉపయోగించిన తర్వాత — నిరసనకారులపై చట్ట అమలు సంస్థలు ఎప్పుడు బలప్రయోగాన్ని ఉపయోగించడం సమర్థనీయం, ఏ రకమైన ఆయుధాలను అనుమతించాలి అనే దానిపైన సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక చర్చ చివరకు ప్రారంభమైంది.
భారతీయ పోలీసింగ్ రికార్డు చాలా భయానకంగా ఉంది. ‘ది ప్రింట్’ సంపాదించిన వర్గీకృత (క్లాసిఫైడ్) పోలీసు డేటా ప్రకారం, కశ్మీర్‌లో 2010లో 117 మంది, 2016లో మరొక 85 మంది, 2018లో 59 మంది నిరసనకారులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాశ్మీర్‌లో ప్రాణనష్టాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా, స్కీట్ షూటింగ్ వంటి క్రీడలలో ఉపయోగించే ప్రాణాంతకం కాని బర్డ్ షాట్ షాట్‌గన్లను 2016 నుండి ప్రవేశపెట్టారు. కానీ ఇవి చివరికి వందలాది మంది యువకుల కంటిచూపును బలి తీసుకున్నాయి.
బర్డ్ షాట్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గాయపడిన ఇద్దరు వ్యక్తులతో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి యశోవర్ధన్ ఆజాద్ జతకలిశారు — ఈ డిమాండ్‌ను వైద్య నిపుణులు కూడా చాలా కాలంగా చేస్తున్నారు. ఇతర సాంకేతికతలు ప్రభావవంతంగా లేవని అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించిన తర్వాత, కాశ్మీర్‌లో షాట్‌గన్ల వాడకాన్ని నిషేధించడానికి సుప్రీంకోర్టు 2017లో నిరాకరించింది. నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రభుత్వం “ఒక రహస్య ఆయుధం”పై పనిచేస్తోందని కోర్టుకు అప్పట్లో తెలిపారు.
అయితే, ఈ సమస్య సాంకేతికత కంటే చాలా లోతైనది: షాట్‌గన్ అనేది ఒక లక్షణం మాత్రమే, అసలు వ్యాధి కాదు. భారతదేశం అంతటా ఉన్న పోలీసు బలగాలు ఇప్పటికీ దాదాపు వంద సంవత్సరాల క్రితం కిస్సా ఖ్వానీ బజార్‌లోని సైనికులకు సుపరిచితమైన జనసమూహ నియంత్రణ విధానాలను, భాషనే ఉపయోగిస్తున్నాయి.
రాజ్యము, అల్లర్లు
తుపాకుల మాదిరిగా తమ భుజాలపై లాఠీలను మోస్తూ యువకుల నేతృత్వంలో వచ్చిన హిందువులు, ముస్లిములు లాహోర్‌లోని బాద్షాహీ మసీదు చుట్టూ ఉన్న మైదానం నుండి బయటకు వచ్చారు. బ్రిటన్ చక్రవర్తి జార్జ్ V మరణించాడని వారు సంతోషంగా ప్రకటించారు. తమను తాము ‘దండా ఫౌజ్’ అని పిలుచుకున్న ఈ గుంపు లాహోర్ కోట వైపు ఊరేగింపుగా వెళ్ళింది. అక్కడ కాపలాగా ఉన్న “బ్రిటిష్ సైనికులపై ఉమ్మేసి, వారిని ‘తెల్ల పందులు’ అని పిలిచారు.” ఆ తర్వాత దండా ఫౌజ్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి, అక్కడి కార్మికులను సమ్మె చేయాలని కోరింది. జల్లియన్‌వాలా బాగ్ విషాద ఘట్టానికి కొద్దిగా ముందు, అంటే 1919 ఏప్రిల్ 12 నాటికి లాహోర్ గోడలపై అనేక పోస్టర్లు వెలిశాయి. గాంధీజీ పేరుతో పంజాబ్ ప్రజలు ఈ కొత్త సైన్యంలో చేరాలని, ఆంగ్లేయులను చంపాలని ఆ పోస్టర్లలో పిలుపునిచ్చారు.
చివరకు, వేశ్యావాటిక ప్రాంతమైన హీరా మండిలో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, పోలీసుల బృందం దండా ఫౌజ్‌ను ఎదుర్కొంది. ఈసారి, ఒక ప్రసిద్ధ ఆయుధాన్ని ఉపయోగించారు: అదే బక్ షాట్ (పెద్ద సైజు గుళ్ళు) కాల్చే పంప్-యాక్షన్ షాట్‌గన్.
“అధికారిక మందుగుండు సామగ్రితో ఉన్న సైనికులకు బదులుగా, బక్ షాట్‌లతో సాయుధులైన పోలీసులు జనసమూహంతో ఘర్షణను తట్టుకునేలా చేయడం, పోలీసులు స్వల్ప సంఖ్యలోనే కాల్పులు జరపడం, జనసమూహానికి ఇచ్చిన హెచ్చరికలు చూస్తుంటే — అత్యంత జాగ్రత్త వహించారని, సాధ్యమైనంత తక్కువ పరిమాణంలోనే బలాన్ని ఉపయోగించారని కమిటీ అభిప్రాయపడింది” అని ఈ హింసపై జరిగిన అధికారిక విచారణ నమోదు చేసింది.
వలస(బ్రిటిష్) పాలకులకు, శాంతిభద్రతల నిర్వహణకు ‘భయం’ అనేది ప్రధాన సాధనంగా ఉండేది. ఈజిప్ట్ నగరాల్లో నిరసనకారులపై విచక్షణాధికార కర్రలు, దుడ్డు కర్రలు, లాఠీలను ఉపయోగించారు. గ్రామీణ ప్రాంతాల్లో బెడూయిన్ తెగలపై తరచుగా లూయిస్ మెషిన్ గన్లను, కొన్నిసార్లు వైమానిక దాడులతో కలిపి ఉపయోగించారు.
భారతదేశంలో కూడా ఇలాంటి ఎత్తుగడలనే అమలు చేశారు. భారతదేశంలో సామాన్య పౌరులపైన వైమానిక దాడులను తరచుగా చేసారు. 1923లో, ఉత్తర వజీరిస్థాన్‌లోని గ్రామాలపై జరిగిన బాంబు దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే పెద్ద సంఖ్యలో పశువులు చనిపోయాయి. జల్లియన్‌వాలా బాగ్ సంఘటన తర్వాత, గుజ్రాన్‌వాలా నగరంపై రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా మెషిన్ గన్ కాల్పులు (స్ట్రేఫింగ్) జరిపారు. “ఐదు అశ్వికదళ బెటాలియన్లు, ఇరవై ఒక్క బ్రిటిష్ పదాతిదళ బెటాలియన్లు, పదిహేను క్రియాశీలక, ముప్పై రెండు శిక్షణలో ఉన్న భారతీయ పదాతిదళ బెటాలియన్లు, ఎనిమిది సాయుధ వాహనాల విభాగాలు, అనేక ఫిరంగి దళాలు, ఇంజనీరింగ్, పయనీర్ యూనిట్లు — ఇవన్నీ అంతర్గత భద్రతా విధుల కోసం కేటాయించబడ్డాయి” అని, ఇవి మాత్రమే 1920లో బ్రిటిష్ రాజ్‌ను కాపాడాయని చరిత్రకారుడు సిమియన్ షౌల్ గుర్తుచేస్తున్నారు.
బలప్రయోగ పరిమితులు
కిస్సా ఖ్వానీ సంఘటనలో స్పష్టంగా కనిపించిన ఒక విషయాన్ని నేర్చుకోవడానికి కలోనియల్ (బ్రిటిష్) పాలకులు నిరాకరించారు: ‘భయం’ అనేది పనిచేయలేదు. బజార్‌లోకి తెచ్చిన సాయుధ వాహనాలను జనాలు చుట్టుముట్టారు, అక్కడ నుండి కదిలేందుకు నిరాకరించారు. దారిని సుగమం చేయడానికి మొదటి సాయుధ వాహనం నుండి బయటకు దూకిన బ్రయంట్, ఒక నిరసనకారుడి వైపు తన తుపాకీని ఊపినప్పుడు గాయపడి మరణించాడు. ఆ తర్వాత ఆ వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, దాని వెనుక ఉన్న రెండో వాహనం వచ్చి దాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కారిన ఇంధనం మంటల్లో చిక్కుకుంది. జనసమూహంపై జరిపిన మెషిన్ గన్ కాల్పులు పెద్ద సంఖ్యలో— అధికారిక లెక్కల ప్రకారం ఇరవై మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచారణ ప్రకారం 125 మందికి పైగా ప్రజలను బలితీసుకున్నప్పటికీ — తరువాతి కొన్ని రోజుల పాటు పెషావర్ నగరాన్ని ఖుదాయ్ ఖిద్మత్‌గార్లు తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు. బ్రిటిష్ రాజ్ అంతమయ్యే వరకు నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ద్వారా బ్రిటిష్ రాజ్యం యుద్ధ స్థితిలోనే కొనసాగింది.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో కూడా ఈ పాఠాల నుండి ఏమీ నేర్చుకోలేదు. రాజకీయ శాస్త్రవేత్త డేవిడ్ బేలీ 1971లో రాస్తూ, పోలీసు వ్యవస్థ ఇప్పటికీ “అత్యంత వలసకాలం (బ్రిటిష్ కాలం) నాటి ఆలోచనా విధానం”గానే మిగిలిపోయిందని, ప్రజలతో భాగస్వామ్యం కావడం లేదా ప్రజలకు జవాబుదారీతనంతో ఉండటం పట్ల చాలా తక్కువ ఆసక్తి చూపిస్తోందని పేర్కొన్నారు. చాలా వరకు, పోలీసు వ్యవస్థ అనేది శాంతిభద్రతల అమలు కోసం కేవలం కేవల బలప్రయోగానికి మాత్రమే పరిమితమైన ఒక నిర్బంధ వ్యవస్థగానే మిగిలిపోయింది. ఈ కొత్త సహస్రాబ్ది మొదటి దశాబ్దాలలో, నిరసనకారులపై ఆగ్నేయాస్త్రాలు (తుపాకులు) ఉపయోగించడం మరింత సాధారణంగా మారిపోయింది.
కొత్త సహస్రాబ్దిలో సామాన్య పౌరులపై ప్రాణాంతక బలప్రయోగాన్ని ఉపయోగించడం మరింత సాధారణంగా మారిందని స్కాలర్ సోనాల్ మార్వా అధ్యయనం ద్వారా నిరూపించారు. 2007లో రాజస్థాన్‌ను కుదిపేసిన భారీ కుల హింసలో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు — వీరిలో ఎక్కువ మంది నిరసనకారులే, అంతకుముందు సంవత్సరం మరణించిన 26 మందికి ఇది అదనం. 2017లో రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనే దొంగబాబా మద్దతుదారులు అల్లర్లకు దిగడంతో, పోలీసులు జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు.
ఢిల్లీ నేర్పిన పాఠాలు
పోలీసుల ద్వారా జరుగుతున్న మితిమీరిన బలప్రయోగాన్ని అరికడతామని వరుసగా వచ్చిన ప్రభుత్వాలు వాగ్దానం చేసినప్పటికీ, అందులో తీవ్రమైన నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు, విచారకరంగానూ, అసలు నమ్మదగినవిగానూ లేవు. ఈ వేసవి మొదట్లో ప్రచురించిన 2024 నాటి బ్యూరో డేటా ప్రకారం — మణిపూర్‌ను ఘోరమైన జాతి హింస కుదిపేసిన, వర్గ పోరు తీవ్రస్థాయికి చేరిన, దేశవ్యాప్తంగా రైతు నిరసనలు వెల్లువెత్తిన అదే సంవత్సరంలో — లాఠీఛార్జీలు, పోలీసు కాల్పుల్లో ఒక్కరూ మరణించలేదు, కేవలం ఇద్దరు మాత్రమే గాయపడ్డారని పేర్కొంది. ప్రాణాంతకమైన బలప్రయోగానికి దారితీసిన పరిస్థితులపై డేటా చాలా తక్కువగా ఉంది. ఈ మరణాలు లేదా గాయాలను ఎలా నివారించవచ్చనే దానిపై డేటా అసలు లేనే లేదు.
ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే తీవ్రమైన పరిస్థితులలో మాత్రమే ప్రాణాంతక బలప్రయోగాన్ని ఉపయోగించాలి: ఇది తప్ప మరే ఇతర సందర్భంలోనూ దీనిని ఆమోదించకూడదు. 2011లో లండన్ పోలీసు బలగాలు, అల్లరి మూకలు ఆస్తులను తగలబెడుతున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు కూడా నిగ్రహం పాటించాయి, ఎందుకంటే ఆ నేరస్థులను తర్వాతైనా అరెస్టు చేసి విచారించవచ్చని వారికి తెలుసు.
ఈ విద్యార్థుల నిరసనల నుండి ప్రభుత్వం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలలో ఇది అత్యంత ముఖ్యాతి ముఖ్యమైనది: భారతీయులను పౌరులుగా కాకుండా కేవలం ‘పాలించబడే ప్రజలుగా’ (సబ్జెక్టులుగా) చూడటం ఇకపై సాధ్యపడదు. నిరసన తెలిపే హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన ఒక సిద్ధాంతంగా మాత్రమే కాకుండా, సమాజ రోజువారీ జీవన అనుభవంలో ఒక భాగముగా ఉండాలి.
- అనువాదం : కె. పద్మ




