రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువుల అమ్మకం యదేచ్ఛగా సాగిస్తున్నారు. వీటితో పాటు పాఠశాలల అనుమతులకు సంబంధించిన(ఎన్వోసి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ, బస్సుల పిట్నేష్ సర్టిఫికెట్, పైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లు పొందుటకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయ నాయకులు, విద్యా శాఖ, పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, రవాణాశాఖ తదితర వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ అక్రమంగా అనుమతులు పొందుతున్నారు.
విద్యా శాఖ – ప్రైవేటు యాజమాన్యాల కుమ్మక్కు : పాఠశాలల స్కూల్ కౌంటర్ లో నుండి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ప్రైవేటు యాజమాన్యాలు చెప్పినంత రేటు పెట్టి పుస్తకాలు, వస్తువులు కొనాలని ఆర్డర్ జారీ చేస్తూ లేని యెడల అడ్మీషన్ ఇవ్వమని తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. దీంతో పేద,దిగువ మద్య తరగతి, మద్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పుస్తకాల వ్యాపారంతో ప్రైవేటు , కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.91 నిబంధనలను తుంగలో తొక్కుతున్నప్పటికీ విద్య శాఖ అధికారులు కనీసం స్పందించడం లేదు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో ఫీజులు అసంబద్ధంగా పెంచడం, పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు అమ్మడం అంశాలపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక యంఈవో, డిఈవో, డిఐఈవొ లకు పిర్యాదు చేసినప్పటికీ కనీసం తనిఖీ చేయడం లేదు. దీంతో యదేచ్చగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క పాఠశాల కూడా ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడం లేదు. అనుమతులు లేకుండా వసతిగృహాలు నడపడం, పాఠశాలల్లో దుకాణాలు తెరిచి విద్యా సంబంధిత వస్తువులను అధిక రేట్లకు విక్రయిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు ఈ దోపిడీ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు కనీసం జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించడం లేదు. విద్యాశాఖ ఉన్నతాధికారులే మౌనం వహించడంతో జిల్లాలో అధికారులు ఏమి పట్టనట్టు ఉంటున్నారు. ఇదంతా ప్రైవేటు విద్యాసంస్థలతో జరిగిన ఒప్పందంలో భాగంగానే తమ బాధ్యత కానట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారు. తమ ఆర్థిక ప్రయోజనాల కోసం విద్యార్థులను నిండా ముంచుతున్నారు.
పాఠశాల యాజమాన్యాలు-పోలీసుశాఖ కుమ్మక్కు: ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న విద్యా వ్యాపారం, అన్యాయం ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ప్రజాస్వామికంగా నిరసన తెలిపితే, ధర్నా నిర్వహిస్తే వెంటనే విద్యార్థి సంఘాల నాయకులపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. యాజమాన్యాలు పిర్యాదు చేయగానే వారితో పోలీసులు కుమ్మక్కై విద్యార్ధి సంఘాలను బెదిరించడం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎలాంటి దర్యాప్తు లేకుండా విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం, కొన్ని సందర్భాలలో జైలుకు పంపడం జరుగుతోంది. తేది:25-06-2026, నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్రివేణి ప్రైవేటు హైస్కూల్ లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఎస్ఎఫ్ఐ, పి.ఎస్.యు, జనసేవా సమితి, పి డి ఎస్ యు, బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు ప్రైవేటు పాఠశాలకు నిజనిర్ధారణ కొరకు వెళ్ళగా పాఠశాల యాజమాన్యం బహిరంగంగానే పుస్తకాలు, నోట్ బుక్స్,యూనిఫాం అమ్ముతూ పట్టుబడ్డారు. జీవో ఎంఎస్ నెం. 91 మరియు జివో నెంబర్ ఎంఎస్ 1 లను ఉల్లంఘించి పుస్తకాలు అధిక ధరలకు విక్రయించడంపై పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జనసేవ సమితి అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్, పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పోలోజు మహేష్ లు యాజమాన్యంను నిలదీశారు. స్పందించిన యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నట్లు మీడియా సమక్షంలో ఒప్పుకున్నారు. డిఈవో కార్యాలయంలో పుస్తకాలు, నోట్ బుక్స్ సరెండర్ చేస్తామని విద్యార్థి నాయకులు హామీ ఇచ్చిన యజమాన్యం అంతలోనే బుకాయించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను, మిగతా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను పిలుపించుకొని వారి అండదండలతో ఆ పాఠశాల సిబ్బందిని విద్యార్థి నాయకులపై భౌతికదాడులకు ఉసిగొలిపారు. పాఠశాల స్కూల్ కౌంటర్ లో అక్రమంగా పుస్తకాలు, నోట్ బుక్స్,యూనిఫాం అమ్మకం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పీ.ఎస్.యు, జనసేవా సమితి, పి.డి.ఎస్.యు, బీసీ విద్యార్థి సంఘాలు పాఠశాల గేటు వద్ద దర్నా నిర్వహించారు. శాంతియుతంగా దర్నా చేస్తున్న విద్యార్థి నాయకులపై పాఠశాల యాజమాన్యం అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. అనంతరం పోలీసులు నాయకులను మేజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే త్రివేణి హైస్కూల్ యాజమాన్యం అక్రమంగా పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్నప్పటికీ స్థానిక పోలీసులు యాజమాన్యంపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులపై బిఎన్ఎస్ 341,448,427,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా యాజమాన్యంతో రాజీ కుదుర్చుకోవాలని బేరమాడారు. ఆ మర్నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాఠశాలల యాజమాన్యాలు జిల్లా ఎస్పీని కలిసి మళ్ళీ పిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు అధికారి ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు చిన్న వస్తువును ముట్టిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డివిజనల్ పోలీసు అధికారికి ఆదేశాలు జారీ చేశారు. తేది 26-06-2026 నాడు రాష్ట్రంలో పలు విద్యార్థి, కుల సంఘాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ గుర్తింపు పాఠశాల యాజ మాన్య సంఘం(ట్రస్మా) ప్రతినిధులు డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసి విన్నవించారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు, జాక్ పేరిట నేతలు, విద్యార్థి సంఘాలు, ఆర్టీఐ కార్యకర్తలు పాఠశాలల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, పాఠశాల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బ్యాంకులు, ఆసుపత్రులపై దాడి చేస్తే తీసుకునే చర్యలే పాఠశాలలపై దాడి చేసే వారిపై కూడా తీసుకోవాలని కోరారు. నిజానికి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తీరు దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైనదిగా ఉన్న పోలీసు శాఖ పాఠశాలల్లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై చర్యలు చేపట్టాల్సింది పోయి యాజమాన్యాలకు కొమ్ముగాయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిక్కు తోచని స్థితి ఏర్పడింది.
ప్రమాణాలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు: జిల్లాలోని ప్రైవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యాసంవత్సరం ప్రారంభం నాటి నుండి ప్రభుత్వ నిబంధనలను, గవర్నమెంట్ ఆర్డర్స్ ను తుంగలో తొక్కు తున్నారు. పలు పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుంది. పలు పాఠశాలలు అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, టాయిలెట్స్, ల్యాబ్స్, లైబ్రరీ, ఆట స్థలాలు లేవు. పలు పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులలో పాఠశాలకు తరలిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాఠశాలల్లో ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,496 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) పొందలేదు. ప్రతి స్కూల్ బస్సు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ (FC), పర్మిట్, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆర్టిఏ అధికారులు ఇవన్నీ తూతూ మంత్రంగా పూర్తిచేసి అనుమతి పత్రాలు ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి చోట కనీస వెంటిలేషన్ కూడా ఉండదు. అగ్ని ప్రమాద చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉండదు. అయినా ఇలాంటి పాఠశాలలకు ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్ జారీ చేయడంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. విద్యాశాఖ-ప్రైవేటు యాజమాన్యం-వివిధ శాఖల అధికారుల సహకారంతో విజయవంతంగా విద్యా వ్యాపారం కొనసాగుతోంది.
తెలంగాణలో ప్రైవేటు విద్యా మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతూ ధనార్జనే ధ్యేయంగా ప్రజలను ఆర్థికంగా అణిచివేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని అదుపు చేయాలి. ఫీజుల నియంత్రణకు పటిష్ట చట్టం చేసి విద్యా వ్యాపారం అరికట్టాలి. అందరికీ విద్య అందించాలనే విద్యాహక్కు చట్టం నేడు నీరుగారిపోయింది. నూతన విద్య పేరుతో కేంద్ర పాలకులు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటు పరం చేశారు. విద్య వ్యాపారాన్ని అరికట్టాల్సిన భాద్యత పాలకులతో పాటు ప్రజలపై కూడా ఉంది. ప్రభుత్వ విద్యలో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడంతోనే విద్యా వ్యాపారాన్ని అరికట్టవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల నియామకం అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు క్రీడా మైదానం, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. నేడు ప్రభుత్వ అనుబంధ శాఖలు అత్యంత అవినీతిమయంగా మారి విద్య వ్యాపారంలో భాగమైన సందర్భంగా ఆ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దౌర్జన్యాలను ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు ఐక్యంగా చర్చించి భవిష్యత్ ఉద్యమకార్యాచరణ రూపొందించుకోవాలి. విద్యార్థుల కుటుంబాలను భాగస్వాములు చేస్తూ సుదీర్ఘ పోరాటాలు కొనసాగించాలి. దేశంలో వైద్యం వలెనే విద్య కూడా సేవారంగానికి సంబంధించిన, భవిష్యత్ తరాలను
రూపొందించే కీలకమైన అంశం. మన దేశం,రాష్ట్రం 1992 నుండి సామ్రాజ్యవాద ప్రేరేపిత ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ పధకాలను ఆమోదించి అమలుకు పూనుకున్నప్పటి నుండి విద్య వ్యాపార సరుకుగా, విద్యార్థిని కొనుగోలుదారుడిగా మార్చివేయబడ్డాడు. విద్యా వ్యాపారం చేసే ధనస్వాములు, భూస్వాములు ప్రభుత్వ విధానాలు రూపొందించి అమలు జరిపే పాలకులు కావడం వల్ల విద్యా వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా లాభాలు తెచ్చి పెడుతుంది. విద్య, విజ్ఞానాల చారిత్రక నేపథ్యం, సామాజిక పాత్రను ఎరుగని ఈ మూర్ఖ విద్యా వ్యాపారులు మాఫియా డాన్ ల వలె విజృంభించి విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నరు. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలను అమలు చేయాలని ఏ విద్యార్థి లేదా ప్రజాసంఘం గుర్తు చేసినా భరించలేకపోతుండడం అందుకు సూర్యాపేట విద్యా వ్యాపారుల ప్రవర్తనే నిదర్శనం. ఈ మాఫియా అకృత్యాలను కనీసంగా అరికట్టాలంటే సూర్యాపేట మరియు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పెట్రేగి పోతూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్న
వ్యాపార సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలి. అందులో భాగంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాల పట్ల దురుసుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న సంస్థలను తక్షణమే మూసివేయాలి లేదా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. వీటి యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
28-06-2026
-కోట ఆనంద్, ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్.




