చీకటిలో చూపు నిశితమవుతుంది. నిశ్శబ్దంలో మాట పదునెక్కుతుంది. దురాక్రమణలో స్వేచ్ఛాకాంక్ష అణువణువునా విస్తరిస్తుంది. మానవత రద్దయ్యే భీకర సన్నివేశంలోకి ఊహించని వైపుల నుంచి లక్షల, కోట్ల గొంతుకల జీవన గీతం పోటెత్తుతుంది. ఇప్పుడు దేశం దేశమంతా దుఃఖాన్ని, ధైర్యాన్ని ఒకే ఒక స్వరంతో పాడుతోంది.

ఫాసిజం ఎట్లా ఉంటుందో, దాని వికటాట్టహాసం ఎంత క్రౌర్యంగా ఉంటుందో మనకు ఎన్నడో అనుభవంలోకి వచ్చింది. ఫాసిజం మనలోని రాజకీయశక్తినీ, నైతికశక్తినీ కుప్పకూల్చాలనుకుంటుంది. మాట్లాడే మనుషులు లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటుంది. కానీ పెట్టుబడిదారీ విధానంలాగే ఫాసిజం కూడా తన ప్రత్యర్థిని వెంటేసుకొని పుడుతుంది. ఇవాళ అదే చూస్తున్నాం. గెలుపు ఓటముల మధ్యనే, అణచివేత ధిక్కారాల మధ్యనే బిలబిలామంటూ దేశాన్నంతా ‘బొద్దెంకలు’ చుట్టుముట్టాయి. ‘మావోయిస్టు రహిత భారత్‍’ అనే సంఘ్‍పరివార్‍ స్వప్నాన్ని చెదరగొడుతూ ఛత్తీస్‍గఢ్‍లో, ఒడిసాలో ఆదివాసీ చీమల పుట్టలు బద్దలవుతున్నాయి.

ఇంకో పక్క ఎన్‍ఆర్‍సి మారురూపమైన ఎస్‍ఐఆర్‍ ఒక్కో రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఇది ఓటరు జాబితాలోంచి పౌరులను గల్లంతు చేయడమే కాదు. దేశం నుంచి మనుషులనే తొలగించడం. పౌరులు లేని దేశాన్ని తయారు చేయడం. కగార్‍ పేరుతో మావోయిస్టు నిర్మూలనలాగే ఎస్‍ఐఆర్‍ పేరుతో ముస్లింలను లేకుండా చేసే ఫాసిస్టు పథకం ఇది. సారాంశంలో ప్రత్యర్థులను, ప్రజలను తుడిచిపెట్టే సామాజిక, రాజకీయ, సాంస్కృతిక నియంతృత్వం.

ఫాసిజం ఏం చేస్తున్నదో మనకు తెలుసు. దాన్ని వ్యతిరేకించే పోరాటాలకూ లోటు లేదు. కానీ ఇప్పటికీ ఫాసిజానిదే పైచేయి అయినా దేశం దాన్ని అంగీకరించడం లేదు. సాంతం దానికి లోబడలేదు. అయితే దాన్ని ఓడించగల సమగ్ర పోరాట వ్యూహమే తయారు కాలేదు. మన దేశాన్ని చుట్టుముట్టిన ఫాసిజం మౌలిక స్వభావాన్ని తెలుసుకోకపోవడమే దీనికి కారణం. మాములుగా మనకు ఫాసిజమనగానే ఇరవయ్యో శతాబ్దపు యూరప్‍ ఫాసిజమే గుర్తుకు వస్తుంది. దాని ప్రకారం ఇంకా ఫాసిజం రాలేదనే వాళ్లుఉన్నారు. రాబోతోందని అనుకుంటున్న వాళ్లు ఉన్నారు. ఫాసిస్టు దుర్మార్గాన్ని రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికే పరిమితం చేసేవాళ్లు ఉన్నారు. ఏదో ఒక ‘ఫాసిస్టేతర’ బూర్జువా పార్టీ అధికారంలోకి వస్తే ఈ బెడద తీరినట్లే అనుకుంటున్నవాళ్లూ ఉన్నారు. ఎన్నికల పొలిటికల్‍ ఫ్రంట్‍తో దీన్ని సాధించాలనుకొనే వాళ్లూ చాలా మందే ఉన్నారు.

ఈ భావనలతో ఫాసిజాన్ని ఓడించలేం. కనీసం దాన్ని అర్థం చేసుకోడానికి కూడా ఇవి సరిపోవు. భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలను తెలుసుకోనంత వరకు పదే పదే ఓడిపోయే పోరాటాలు చేసినట్లే. ఇరవయ్యో శతాబ్దపు ఫాసిజానికీ, భారతదేశ ఫాసిజానికీ పోలికలు కొన్ని ఉన్నాయి. ఎన్నో తేడాలున్నాయి. అందువల్ల ఇది మరింత జటిలమైనది. క్రూరమైనది.

పెట్టుబడిదారీ సంక్షోభంలోంచి పుట్టుకొచ్చే ఫాసిజం బూర్జువా నియంతృత్వానికంటే అత్యంత ప్రమాదకరం. ఈ సాధారణ సూత్రం మీద ఆధారపడి మన దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు పరిశీలించాలి. వాటిని ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవాలంటే, పైకి కనిపిస్తున్నట్లు ఇక్కడ ఫాసిజం మెజారిటీ మతతత్వమే కాదు. భారత రాజకీయార్థిక చరిత్రలో భాగంగా ఏర్పడిన బ్యురాక్రటిక్‍ దళారీ పెట్టుబడిదారీ విధానం నుంచి ఫాసిజం వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆవరణలో హిందుత్వ ఫాసిజం వచ్చింది. ఆ రెండింటి వర్గ దోపిడీకి ఆటంకాలు లేని సామాజిక, రాజకీయ, సాంస్క •తిక పరిస్థితులు కల్పించే లక్ష్యంతో ఫాసిజం వచ్చింది. తనకు ఎదురుగా వస్తున్న ప్రజా పోరాటాలను, భావజాలాలను దెబ్బతీసి, మరింత బలపడటానికి తగినట్లు తనలో తాను అంతర్గత మార్పులు చేసుకుంటున్నది.

భారతదేశంలోని ప్రత్యేక తరహా పెట్టుబడి స్వభావం నుంచి వచ్చిన ఫాసిజానికి ఊతం ఉప ఖండపు నాగరికతలో ఉంది. సనాతన ధర్మం, కులం, మతం, పితృస్వామ్యం దీనికి ఆధారం. మన దేశంలోని వికృతమైన ఆధునికత కూడా దీనికి సహకరిస్తోంది. దళారీ పెట్టుబడిదారీ విధానం దీనికి వెన్నెముకగా పని చేస్తోంది. సనాతన మానసికతతో, ఆధునిక వేషంతో విజృంభిస్తోంది. ఇది ప్రజలను సాంస్క•తికంగా వెనక్కి తీసికెళుతోంది. నిరంకుశ దళారీ పెట్టుబడిదారీ శక్తులను ముందుకు తీసికెళుతోంది. ఆ శక్తులకు సాధారణ బూర్జువా రాజ్యానికంటే ఎక్కువ సేవ చేయడమే ఫాసిస్టుల లక్ష్యం. అందుకే ఉధృతంగా కార్పొరేటీకరణ జరుగుతోంది. భారతదేశంలోని పెట్టుబడిదారీ సంబంధాల ప్రత్యేకతలు ఎంత తెలిస్తే అంతగా ఫాసిజం ప్రత్యేకతలు తెలుస్తాయి. వాటి ప్రమాదాలు అర్థమవుతాయి.

 సామాజిక, సాంస్కృతిక సంబంధాలు, నిరంకుశ దళారీ పెట్టుబడిదారీ విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వంటి వాటి వల్ల భారత   ఫాసిజానికి దీర్ఘకాలిక స్వభావం వచ్చింది. ఒక్కోసారి తీవ్రమైన విధ్వంసపూరిత దాడులు జరుగుతున్నప్పటికీ దీనికి మంద్రస్థాయి స్వభావం కూడా ఉన్నది. ఈ రెండింటి వల్ల ఫాసిజం ఒక సాధారణ రాజకీయ, సాంస్కృతిక ధోరణిగా మారిపోయింది. సహజ విషయంగా అన్నిటిలో ఒకటిగా కలిసిపోయింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే వాహనం మీద దేశాన్నంతా చుట్టేసి తన కాళ్లకిందికి తెచ్చుకున్నప్పటికీ ఇదొక ఎన్నికల క్రీడగా సమ్మతి పొందింది. ఓట్ల రూపంలో దళిత, బహుజన కులాల నుంచి కూడా సమీకరించుకొని బలమైన సాంఘిక శక్తిగా పార్లమెంటరీ రాజకీయాలను మలుచుకుంది. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసినా, ఫెడరల్‍ విధానాన్ని కాలరాచినా ‘చట్టబద్ధ ఫాసిజం’గానే చెలామణిలోకి వచ్చింది.

గత శతాబ్దంలో ఫాసిజం తలెత్తినప్పుడు ఉండిన ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికంటే పూర్తి భిన్నమైన సందర్భం ఇది. దీని వల్ల చాలా దేశాల్లో గతానికంటే భిన్నరూపాల్లో ఫాసిస్టు ధోరణులు ముందుకు వచ్చాయి. అక్కడి మితవాద ప్రభుత్వాలు ఆ సమాజాల్లో తీవ్రమైన ప్రతీఘాతుక మార్పులు తీసుకొస్తున్నాయి. అవి ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి. భారతదేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్‍ ఫాసిజం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూడా దిగమింగే  ప్రమాదకర భూమికగా ఉంది. ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థను సారంలో దెబ్బతీసి, రూపంలో వాడు కుంటున్నది. దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం దానికి లేదు. పార్లమెంటరీ రాజ్య రూపంలో ఫాసిస్టు రాజ్యం చక్కగా అమరిపోతుంది.

అర్ధ భూస్వామ్య-అర్ధ వలస సమాజంలో ఫాసిజం వస్తే ఎట్లా ఉంటుందో హిందుత్వ కార్పొరేట్‍ ఫాసిజంలో చూడవచ్చు. ఇలాంటి మధ్యంతర వ్యవస్థలో వచ్చిన ఈ ఫాసిజం వల్ల గత డెబ్బై ఏళ్లలో ప్రజలు అనుభవించిన బూర్జువా నియంతృత్వానికంటే దారుణమైన బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్‍ నియంతృత్వాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. సకల పీడిత అస్తిత్వ ప్రజలు తీవ్ర ఉద్రిక్త స్థితిలో జీవిస్తున్నారు. అస్తిత్వపు అంచుల్లోకి తోసివేయబడ్డారు. ముఖ్యంగా ముస్లింలు, ఇతర మత మైనారిటీలు, ఆదివాసుల ఉనికిని తుడిచిపెట్టడానికి బుల్డోజర్‍ ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయాలను ఫాసిస్టులు నడుపుతున్నారు. భారతదేశ ఫాసిజం సాంస్కృతిక, భావజాల ఆధిపత్యంతో రాజకీయాలను ఎదుర్కొంటున్నది. సంస్కృతి తన కార్యరంగమని ఆర్‍ఎస్‍ఎస్‍ తొలి రోజుల్లో చెప్పేది. ఆ పేరుతో సంస్కృతిని, మతాన్ని సునాయాసంగా కలిపేసింది. భారత బడా పెట్టుబడికీ, ద్రవ్య పెట్టుబడికీ మధ్య దళారీగా పని చక్కబెట్టుకోడానికి పౌరులను చైతన్యరహితం చేస్తోంది. క్రియారహితంగా మార్చేస్తోంది. హీనమైన అనైతిక సంస్కృతిని సాధనం చేసుకొని రాజకీయార్థిక వ్యవస్థలపై పట్టు బిగిస్తోంది. పౌరులను మత గుర్తింపులోకి తోసి, మనుషులుగా పరాయికరిస్తోంది. సారాంశంలో గత ఫాసిజాల్లోని ‘జాతి’ ఆధిపత్య భావనలాగే ఇక్కడ బ్రాహ్మణీయ హిందుత్వ ఆధిపత్యం ముందుకు వచ్చింది. సామ్రాజ్యవాద అండతో భారత దళారీ పెట్టుబడి అన్ని ఆటంకాలను దాటుకొని ఆధిపత్య శక్తిగా మారింది.

భారతదేశ ఫాసిజానికి దీర్ఘకాలిక స్వభావం ఉన్నట్లే, దాన్ని ఎదుర్కోడానికి దీర్ఘకాలిక కార్యక్రమం కావాలి. అందులో మనుషులందరినీ కలుపుకోగల వైశాల్యం ఉండాలి. సకల సముహాల్లో ప్రతి ఒక్కరినీ ముట్టుకొని కదిలించేంత సున్నితంగా ఉండాలి. వాళ్లను రాటుదేల్చేంత పటిష్టంగా ఉండాలి. కారు చీకటిలో సహితం చూడగల సూక్ష్మ దృష్టిని అందివ్వాలి. ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా తిరిగి గెలవాలనే జీవితాకాంక్షను పురికొల్పాలి. ఫాసిజాన్ని భారత ప్రజల చరిత్రలోంచి తరిమేయాలంటే వందల వేల రంగాల్లో మోహరించాలి. ముందు ఆ అన్ని రంగాలను సిద్ధం చేయాలి. అందులో ఒకటి సాహిత్యం. కానీ ఫాసిజం రచయితలకు కూడా భయంగొలుపుతోంది. నిరాశకు గురిచేస్తోంది. నైతికధృతిని దెబ్బతీస్తోంది. స్వీయ సంరక్షణలోకి తోసేస్తోంది. వాటిని కూడా ఫాసిస్టులు భరించలేక దాడులు చేస్తున్నారు.

ఇంకో పక్క మానవ జీవితంలోని అన్ని వ్యక్తీకరణలకు చోటు ఉండాలనే అనుకూలాంశమే ఫాసిస్టు వ్యతిరేక వైఖరిని పలుచన చేస్తోంది. వీలైనంత వెనక్కి వెళ్లి, సొంత అనుభవాలకు పరిమితం చేస్తోంది. అక్కడి నుంచి మెల్లగా మతవాద, మితవాద, సనాతన ధోరణుల వైపు చూపు మళ్లేలా చేస్తోంది. ప్రయోగాలు, కొత్తదనం, వైవిధ్యం కళా సాహిత్యాలను నిరంతరం విస్తరింపచేస్తాయి. కానీ తెలుగు సాహిత్యంలోని  సమకాలీన ధోరణులు ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి భరోసా ఇవ్వగలవా? పదునైన పరీక్షలో నిగ్గుదేలవలసే ఉన్నది. ఇలాంటి ఆలోచనా సంఘర్షణలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఫాసిజం ఓడిపోయేదాకా ఈ సంఘర్షణ తప్పదు. అందరికీ ఇదే ఆహ్వానం.

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు కరపత్రం)

Leave a Reply