దాదాపు ఆరు నెలలుగా రేల్లి రామకృష్ణ జీడిమామిడి, మామిడి, ఆయా కాలాల్లో పండే  కూరగాయలను సాగు చేస్తూ తన జీవితంలో అత్యధిక భాగాన్ని గడిపిన తనకి ఉన్న చిన్న పొలానికి రోజూ వెళ్లడం లేదు. ఇప్పుడు ఆమె ఉదయాలు నిశ్శబ్దమైన, విసుగుపుట్టించే దినచర్యతో గడిచిపోతున్నాయి. ఆమె ఇంట్లోనే ఉంటూ, రోజు ముగియడానికి చాలా ముందే పూర్తయ్యే ఇంటి పనులను చేసుకుంటోంది. “నాకు చేయడానికి ఏమీ మిగలలేదు,” అని అంటోంది. “ఆ పొలమే నా పని. అక్కడే నేను నా సమయాన్ని గడిపేదాన్ని.”

దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివార్లలో ఉన్న తర్లువాడ గ్రామంలోని ఈ భూమిని, మూడు ప్రాంతాలలో భారీ డేటా సెంటర్‌ను నిర్మించే గూగుల్ ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా సేకరించారు. ఈ ప్రాజెక్ట్‌ ను భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆశయాలకు మూలస్తంభంగా ప్రభుత్వం బలంగా సమర్థిస్తోంది.

ఈ డేటా సెంటర్‌ను నిర్మించడానికి గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్, రాబోయే ఐదేళ్లలో సుమారు 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రచిస్తోంది. అమెరికా వెలుపల ఆ సంస్థకు ఇది అతిపెద్ద ప్రాజెక్ట్. ఇది సముద్ర గర్భం, భూమి గుండా వెళ్లే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ నెట్‌వర్క్ ద్వారా సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాతో అనుసంధానిస్తారు.

అయితే, రేల్లి కుటుంబం వంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక అనేది వారి కాళ్ల కింద ఉన్న భూమి కోల్పోవడంతోనే ప్రారంభమైంది.

ఏఐ భూ ఆక్రమణ   

అరవై ఏళ్ల వయస్సు పైబడిన రేల్లి, దళిత సామాజిక వర్గానికి చెందింది — భారతదేశ కుల వ్యవస్థలో చారిత్రాత్మకంగా తీవ్ర వివక్షకు గురైన వర్గం ఇది. దాదాపు అన్ని ప్రామాణికాల ప్రకారం, నేటికీ భారతదేశంలో భూమి లేని పేద వర్గాలలో ఇదొకటి. గ్రామీణ దళిత కుటుంబాలలో 58 నుండి 71 శాతం మంది భూమి లేనివారే. 1970ల కాలంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్లువాడలోని రేల్లి కుటుంబంతో పాటు మరో యాభై మందికి చిన్న భూభాగాలను కేటాయించింది — సాగు కోసం ఒక్కొక్కరికి రెండెకరాల భూమితో పాటు, నివాసం కోసం మరికొన్ని స్థలాలను ఇచ్చింది.

“ఈ భూమి రాకముందు, మేము పనిచేసే ఆధిపత్య కులాల భూస్వాముల దయ మీదనే బతికేవాళ్లం,” అని రేల్లి చెప్తోంది. “కొన్ని రోజులు మాకు అసలు కూలీ కూడా ఇచ్చేవారు కాదు — ఒక్క రోజు కష్టానికి కేవలం అంబలి మాత్రమే పోసేవారు.”

కేటాయించిన ఆ భూమి రాళ్లతో, హెచ్చుతగ్గులుగా ఉండి, సాగుకు అసలు అనుకూలంగా ఉండేది కాదని; ఏళ్ల తరబడి, ఆమె కుటుంబం నేలను సమం చేసి, మట్టిని సారవంతం చేసి, జీడిమామిడి, మామిడి చెట్లను నాటి, దానిని ఒక స్థిరమైన రాబడి వనరుగా మార్చుకుంది. “మేము మా రక్తం, చెమట చిందించి ఈ భూమిని సారవంతం చేశాము,” అని రేల్లి అంటోంది.

ఈ ప్రాజెక్ట్‌ కు భూములిచ్చి సహకరిస్తున్నది దళితులు; చిన్న కమతాలు ఉన్న కుటుంబాలే. అయితే, వారికి ఆ భూమి అసలు విలువలో చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే పరిహారంగా చెల్లిస్తున్నారు.

ఆ పొలం ద్వారా ఆమె కుటుంబానికి సంవత్సరానికి దాదాపు ఒక లక్ష రూపాయలు రాబడి వచ్చేది — ఇది అందరి ప్రామాణికాల ప్రకారం స్వల్ప మొత్తమే కావచ్చు, కానీ వారి జీవితాలను మార్చడానికి ఇది సరిపోయింది. “ఈ భూమి మమ్మల్ని స్వయం సమృద్ధిగా, గౌరవంగా నిలబెట్టింది,” అని ఆమె అంటోంది.

తర్లువాడ స్థలం ఇప్పుడు గూగుల్ (Google) డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమిలో భాగమైంది. అక్కడి యాభై ఒక్క కుటుంబాలకు ఎకరాకు 4 మిలియన్ల (40 లక్షల) రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) రూపాయలను ($83,848) నష్టపరిహారంగా ఆఫర్ చేశారు. దీనితో పాటు, వేరే చోట వారు కోల్పోయిన భూమిలో ఐదవ వంతుకు సమానమైన భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు, అయితే అది ఎక్కడ ఇస్తారనేది ఇంకా స్పష్టత లేదు.

పరిహారాన్ని దాదాపుగా పంపిణీ చేసారు, కానీ ఏం జరుగుతోందో తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు చెబుతున్నారు. “మమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఉందో లేదో అని ఎవరూ అడగలేదు” అని రైతు, మాజీ సర్పంచ్ పైలా కొండమ్మ అన్నారు. “భూమిని అప్పగించమని మాత్రమే చెప్పారు. ఇది మా జీవన విధానం — దానిని వదులుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఎందుకు ఉండకూడదు?”

ప్రభుత్వం ఇస్తున్న పరిహారం చాలా ఉదారంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది, కానీ ఈ ప్రాజెక్ట్‌ ను వ్యతిరేకిస్తున్న భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇ. ఎ. ఎస్. శర్మ గారు మాత్రం భిన్నంగా స్పందించారు. మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకే భూమిని సేకరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ పెట్టుబడికి సబ్సిడీ ఇచ్చినట్లయిందని ఆయన వాదిస్తున్నారు. “ఈ ప్రాజెక్ట్‌ కు సబ్సిడీ ఇస్తున్నది దళితులు, చిన్న కమతాలు ఉన్న పేద రైతు కుటుంబాలే,” అని ఆయన అన్నారు. “భూమికి ఉన్న అసలు విలువలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే వారికి చెల్లిస్తున్నారు.”

పరిహారం సమ్మతిని కొనుగోలు చేయదు

చాలా కుటుంబాలకు, ఈ పరిహారం ఏళ్ళ తరబడి ఉన్న పేదరికం, కొరతల నుండి ఉపశమనం పొందే అవకాశాన్ని ఇచ్చింది. కొందరు తమ ఒంటిమిద్దె (సింగిల్ స్టోరీ) ఇళ్లను రెండు, మూడంతస్తుల కాంక్రీట్ భవనాలుగా విస్తరిస్తున్నారు. మరికొందరు పాతబడిపోయిన ఇటుక ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

“భూమి ఎలాగూ పోయింది. దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. కనీసం ఈ డబ్బుతో మిగిలి ఉన్న స్థలంలోనైనా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం మాకు దక్కింది,” అని అరవై ఏళ్ల స్థానిక నివాసి పి. బంగారమ్మ అన్నారు.

పరిహారం చెల్లిస్తే అంగీకరించినట్లు కాదు

అయితే, ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల సందడిని చూసి ప్రజలు ఈ భూసేకరణను మనస్ఫూర్తిగా అంగీకరించారని అనుకోకూడదని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైంటిస్ట్ సుస్మితా పతి అంటున్నారు. పరిహారం ఇవ్వడం అనేది తరచుగా రెండు విభిన్నమైన నిజాలను ఒకేసారి బయటకు తెస్తుందని ఆమె అంటున్నారు: ఒకటి “జీవనాధారం, గుర్తింపు; భావోద్వేగ అనుబంధాన్ని” పెనవేసుకున్న భూమిని కోల్పోయామనే బాధ, మరొకటి ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కోరికలను ఒకేసారి వచ్చిన పెద్ద మొత్తంతో నెరవేర్చుకునే అవకాశం. “ప్రజలు సంతోషంతో తమ భూమిని వదులుకోరు. ఈ రెండు విభిన్న పరిస్థితులు ఒకే సమయంలో ఉండవచ్చు,” అని ఆమె అన్నారు.

ముఖ్యంగా దళిత కుటుంబాలకు, తరతరాలుగా అందుబాటులో లేని పెట్టుబడులు పెట్టడానికి ఈ పరిహారం ఉపయోగపడవచ్చు, కానీ అది వ్యవసాయ భూమిని కోల్పోయిన లోటును భర్తీ చేయలేదని సుస్మితా పతి అభిప్రాయపడ్డారు. భూమిని కోల్పోయిన ప్రజలు తమ వద్ద మిగిలి ఉన్న వనరులతో ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే, కోల్పోయిన దాని గురించి ఎలా ఆవేదన చెందుతారో ఇది తెలియజేస్తుందని ఆమె తెలిపారు.

అయితే అందరూ ఇళ్లు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు. డేటా సెంటర్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి మధ్య, శంకర్ చండాల (29) కొత్త ఇల్లు నిర్మించుకోవాలా వద్దా అనే విషయంలో ఇంకా ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.

“ఈ డేటా సెంటర్లు చివరికి మనకు ఏమి మిగులుస్తాయి?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు. “వాటికి అత్యధిక పరిమాణంలో నీరు, విద్యుత్ అవసరమవుతాయి. ఒకవేళ భవిష్యత్తులో సరిపడా నీరు లేకపోతే పరిస్థితి ఏంటి? కొన్నేళ్ల తర్వాత వారు మరింత విస్తరించాలనుకుని, పొలాలు వదులుకున్నట్లే మా ఇళ్లను కూడా వదులుకోమని అడిగితే ఏం చేయాలి?”

ఇలాంటి “హైపర్ స్కేల్” (భారీ స్థాయి) డేటా సెంటర్ల గురించి, అలాగే నీరు, విద్యుత్, పర్యావరణంపై అవి చూపే తీవ్ర ప్రభావం గురించి గత కొన్ని నెలలుగా తాను చదువుతున్నానని చండాల చెప్పారు.

“ఇక్కడ నా సొంత ఇల్లు కట్టుకోవాలని నేను ఎప్పుడూ కలలు కనేవాడిని,” అని ఆయన అన్నారు. “కానీ సరైన కలల ఇల్లు అంటే నీరు, కాలుష్యం లేదా మళ్లీ ఇంటిని కోల్పోతామేమోననే భయాలు లేనిది. ఇక్కడ అలాంటి ఇల్లు కట్టుకోగలననే నమ్మకం నాకు ఇకపై కలగడం లేదు.”

పరిశ్రమకు సంబంధించి ప్రజలకు తెలిసిన వివరాలతో ఆయన ఆందోళన సరిపోలుతోంది: ఒక పెద్ద డేటా సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు 5 మిలియన్ (50 లక్షల) గాలన్ల వరకు నీటిని వినియోగిస్తుంది — ఇది దాదాపు 10,000 నుండి 50,000 మంది జనాభా ఉన్న పట్టణానికి ఒక రోజుకు అవసరమయ్యే నీటితో సమానం.

బహిరంగ సమీక్షను తప్పించుకోవడం

డేటా సెంటర్‌కు అయ్యే నీటి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ‘జాకోబిన్’ అడిగిన ప్రశ్నలకు గూగుల్ స్పందించలేదు, అలాగే ఈ వివరాలను బహిరంగంగా కూడా వెల్లడించలేదు.

విశాఖపట్నంలోని చాలామంది నివాసితులకు నీటి సరఫరా ఇప్పటికే పరిమితంగానే అందుతోంది. ఇళ్లకు పైపుల ద్వారా రోజుకు కొన్ని గంటలు మాత్రమే నీరు అందుతుండగా, అనేక అనాధికారిక నివాస ప్రాంతాలు (కొలనీలు) ఎక్కువగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతితక్కువ భూగర్భ జల వనరులు ఉన్న ప్రాంతంగా విశాఖపట్నం నిలిచింది.

భారతదేశ ఏఐ ఆశయాలకు విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 220 బిలియన్ల (22,000 కోట్ల) రూపాయల విలువైన ప్రోత్సాహక ప్యాకేజీని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గూగుల్ ప్రాజెక్ట్‌ కు రాయితీ ధరకు భూమి, పన్ను మినహాయింపులు, సబ్సిడీ విద్యుత్, వేగవంతమైన ముందస్తు అనుమతులను ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చూపిస్తున్న ఆరాటం, చట్టపరమైన నిబంధనలు, పర్యావరణ పరిశీలనలను పక్కనబెట్టేలా ఉందని పర్యావరణ వేత్తలు, సంఘాలు ఆరోపిస్తున్నాయి.

భూమి, నీరు, విద్యుత్‌లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, భారతదేశ పర్యావరణ అనుమతుల విధానంలో (Environmental Clearance Regime) డేటా సెంటర్లను సాధారణ నిర్మాణ ప్రాజెక్టులుగానే పరిగణిస్తున్నారు. దీనివల్ల ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కఠినమైన సమీక్షకు — ప్రజలతో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణకు — వెళ్లకుండా, రాష్ట్ర స్థాయి పరిశీలన ప్రక్రియ పరిధిలోకి వస్తున్నాయి.

ఈ నిబంధనలలోని వ్యత్యాసం వల్ల స్పష్టమైన పరిణామాలు కనిపించాయి. గూగుల్ ప్రతిపాదించిన మూడు స్థలాలలో సుమారు 440 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు స్థలాలు కేవలం పది రోజుల్లోనే రాష్ట్ర పర్యావరణ అనుమతులను పొందాయి. ఇందులో ఒక స్థలం, భారతీయ చిరుతపులులు సహా ఇతర వన్యప్రాణులకు నిలయమైన, పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన కంభాలకొండ వన్యప్రాణి అభయారణ్యానికి ఒక మైలు కంటే తక్కువ దూరంలోనే ఉంది.

హ్యూమన్ రైట్స్ ఫోరమ్ కార్యకర్త వి.ఎస్. కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న కొండల తవ్వకాలు, అటవీ విస్తీర్ణాన్ని తొలగించడం వల్ల స్థానిక ముడసర్లోవ జలాశయానికి నీరు చేరే సహజ నీటి పారుదల వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు. ఇది అభయారణ్యాన్ని, దాని పక్కనే ఉన్న కైలాసగిరి అటవీ ప్రాంతాన్ని అనుసంధానించే వన్యప్రాణుల కారిడార్‌కే కాకుండా, విశాఖపట్నం నగరంలోని మెజారిటీ ప్రాంతాల నీటి సరఫరాకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలో ఉన్న మూడవ స్థలంలో, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించక ముందే అటవీ భూమిని తొలగించారని, కొండల తవ్వకం పనులు కూడా ప్రారంభమయ్యాయని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఆరోపిస్తోంది. “అనుమతి ప్రక్రియ అనేది కేవలం నామమాత్రంగా, జరగాల్సింది జరిగిపోయిన తర్వాత పూర్తి చేసినట్లుగా మారింది” అని కృష్ణ అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (SEIAA) ఆ తర్వాత ఈ స్థలానికి అనుమతి మంజూరు చేసింది.

విద్యుత్ దాహం

విద్యుత్ వినియోగం మరొక వివాదాస్పద అంశంగా మారింది. ఈ స్థాయి డేటా సెంటర్‌కు ఒక మోస్తరు నగరం వినియోగించేంత విద్యుత్ అవసరమవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థ (పవర్ గ్రిడ్) పై తీవ్ర ఒత్తిడి తెస్తుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ కేంద్రానికి పునరుత్పాదక ఇంధనాన్ని (రైనూవబుల్ ఎనర్జీ) ఉపయోగిస్తామని గూగుల్ హామీ ఇచ్చినప్పటికీ, దీనికి అవసరమైన విరామం లేని విద్యుత్ సరఫరాను కేవలం పునరుత్పాదక ఇంధనంతో మాత్రమే నిరంతరం అందించడం సాధ్యం కాదని రాష్ట్ర అధికారులు అంగీకరించారు. అందువల్ల, ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు బొగ్గు ఆధారిత (థర్మల్) విద్యుత్ ఉత్పాదన అవసరమవుతుంది.

“పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేసినంత మాత్రాన డేటా సెంటర్లు కాలుష్యాన్ని అరికట్టలేవు,” అని కృష్ణ అంటున్నారు. “అంతరాయం లేని విద్యుత్ కోసం గ్రిడ్ ఇప్పటికీ బొగ్గుపైనే ఆధారపడితే, పర్యావరణ, ఆరోగ్య సమస్యల భారం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల చుట్టుపక్కల నివసించే ప్రజలపైన పడుతుంది. చివరికి ఎవరో ఒకరు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.”

పనులు వేగంగా ముందుకు సాగుతుండటం, పొక్లెయిన్లు/యంత్రాలతో భూమి ఆకృతి మారిపోతుండటంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ ను నిలిపివేయడం సాధ్యం కాకపోవచ్చని చాలామంది గ్రామస్థులు అంగీకరిస్తున్నారు. అందుకే, వారి పోరాటం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాల గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని (పారదర్శకత), బలమైన రక్షణ చర్యలు చేపట్టాలని; వారు హామీ ఇచ్చిన ప్రయోజనాల్లో తమకు తగిన వాటా దక్కాలని డిమాండ్ చేసే దిశగా మారింది. గ్రామస్థులతో కలిసి హ్యూమన్ రైట్స్ ఫోరమ్ తమ అభ్యంతరాలను దాఖలు చేసింది, బహిరంగ సభలను నిర్వహించింది, నిర్మాణ కార్యకలాపాలను రికార్డు చేసింది, అలాగే ఈ ప్రాజెక్ట్‌ కు కావలసిన నీరు, విద్యుత్ వివరాలను బహిర్గతం చేయాలని కోరుతూ ఒక పిటిషన్‌ను కూడా ప్రారంభించింది.

ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడంతో, తమ నిరసన తెలియజేసే అవకాశం కూడా సన్నగిల్లిందని తర్లువాడ నివాసితులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించిన సమయంలో గ్రామం చుట్టూ పోలీసుల కాపలాను తీవ్రతరం చేశారని, ఇది ప్రజల బహిరంగ నిరసనలను నిరుత్సాహపరిచిందని పలువురు పేర్కొన్నారు.

ఈ ఒత్తిడి ఆన్‌లైన్ మాధ్యమాలకూ పాకింది. ఇటీవలి నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ ను డాక్యుమెంట్ చేస్తూ తాము పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై నిబంధనలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ తెలిపింది. అలాగే దళిత భూములపైన ఈ డేటా సెంటర్ చూపించే ప్రభావం గురించి పరిశోధనాత్మకంగా రూపొందించిన ఒక వీడియోను ఇండియాలో బ్లాక్ చేశారని పత్రికా రచయితల నెట్‌వర్క్ అయిన ‘ఎన్విరాన్‌మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్’ వెల్లడించింది.

మరోవైపు, గూగుల్ సర్వర్లు 2028 నాటికి అందుబాటులోకి (ఆన్‌లైన్‌లోకి) వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించుకోవడానికి తాను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని శంకర్ చండాల అన్నారు. “సాగు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిన భూమి మాకు దక్కుతుందా?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు. “లేదా మేము మళ్లీ భూమి లేని దళితులుగా మిగిలిపోతామా?”

https://jacobin.com/2026/08/google-ai-data-centers-india

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply