ఐఎమ్‌టి మనేసర్‌లో హర్యానా పోలీసులు అమలుచేసిన క్రూరమైన,  సమన్వయంతో కూడిన ప్రభుత్వ అణచివేతను  తీవ్రంగా ఖండిస్తున్నాం.

2026 ఏప్రిల్ ప్రారంభంలో, భారతదేశం అంతటా, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ,  పారిశ్రామిక కేంద్రమైన ఐఎమ్‌టి మనేసర్ (హర్యానా) లోనూ ఆకస్మిక సమ్మెల వెల్లువ వ్యాపించింది. ఈ అశాంతికి ఐఎమ్‌టి మనేసర్‌లోని పరిస్థితి కేంద్ర బిందువుగా మారింది. హోండా, ముంజల్ షోవా, సత్యం ఆటో, రూప్ పాలిమర్స్, రిచికో గ్లోబల్, మోడలమా ఎక్స్‌పోర్ట్స్, రికో, సుప్రజిత్ ఇంజనీరింగ్, లాల్ సిర్మా ఎస్‌జిఎస్ వంటి అనేక ఫ్యాక్టరీలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 2వ తేదీ నుండి సమన్వయంతో, వరుస సమ్మెలను ప్రారంభించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లలో కనీస వేతనాల పెంపు, 8 గంటల పనిదినం అమలు, రెట్టింపు ఓవర్‌టైమ్ వేతనాలు, మెరుగైన భద్రతా ప్రమాణాలు;  గౌరవప్రదమైన పని పరిస్థితులు ఉన్నాయి.

కార్మిక సంఘాలతో సంబంధం ఉన్న సభ్యులతో సహా, కీలక కార్మిక ప్రతినిధులను,  కార్యకర్తలను నిరసన ప్రదేశం నుండి, వారి నివాసాల నుండి కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి, బలవంతంగా పత్రాలపై సంతకాలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. లాఠీఛార్జ్,  శారీరక దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి, ఈ ఘటనల్లో పలువురు కార్మికులు గాయపడ్డారు. భారీగా పోలీసులను మోహరించడం భయానక, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించింది. కార్మికులు మరియు వారి ప్రతినిధులపై అర్ధరాత్రి అరెస్టులు, దౌర్జన్యం, బలవంతపు ఒప్పందాలు,  శారీరక హింస వంటివి ప్రభుత్వ ప్రతిస్పందన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి—అది కార్మికుల హక్కుల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది.

ఇది ఒక విడి ఘటన కాదు: అణచివేత ధోరణి

మనేసర్‌లో జరుగుతున్నది భారతదేశవ్యాప్తంగా ఉన్న  పెద్ద ధోరణిలో ఒక భాగం. కార్మికులు,  కార్మిక హక్కుల కార్యకర్తలు సంఘటితమైనందుకు పదేపదే వారిని నేరస్థులుగా పరిగణించారు; కఠినమైన చట్టాల కింద అరెస్టు చేసారు; కస్టడీలో హింసకు,  వేధింపులకు గురయ్యారు.

యూనియన్ నాయకుడు బచ్చా ప్రసాద్ సింగ్‌ను యూఎపిఎ కింద ఎన్ఐఎ  అరెస్టు చేసిన తర్వాత ఏడాదికి పైగా జైలులోనే ఉన్నారు. రాంచీ హైకోర్టు గతంలో విధించిన నిషేధాన్ని కొట్టివేసినప్పటికీ, సిఎల్ఎ చట్టం కింద ఆ సంస్థను మళ్లీ నిషేధించారు.

అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్‌లోని ట్రేడ్ యూనియనిస్టులు,  సాంస్కృతిక కార్యకర్తల బృందమైన ‘కళాదాస్ దేహరియా’ ఎన్ఐఎ దాడులను, విచారణలను ఎదుర్కొన్నారు. కార్మిక ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర సంస్థలను ఎలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారో ఇది చూపిస్తుంది.

కార్మిక చట్టాలు: కార్పొరేట్-ప్రభుత్వ సంబంధం

మనేసర్‌లో జరిగిన అణచివేతను కొత్త కార్మిక చట్టాల నేపథ్యంలో కూడా అర్థం చేసుకోవాలి. ఈ చట్టాలు సమ్మె చేసే హక్కును పరిమితం చేస్తాయి, నియామకాలు, తొలగింపులు, పని గంటలపైన యజమానుల నియంత్రణను విస్తరిస్తాయి; కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణలను బలహీనపరుస్తాయి. ఈ చట్టాలు అభద్రతను సంస్థాగతం చేస్తాయి;  అసమ్మతిని అణచివేయడానికి కార్పొరేషన్లకు అధికారం ఇస్తాయి; అయితే ప్రభుత్వం ఒక అమలుదారుగా వ్యవహరిస్తుంది. కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్లను బలప్రయోగంతో ఎదుర్కొంటున్నారని, ప్రజాస్వామిక హక్కులను బలహీనపరుస్తున్నారని, ప్రభుత్వం చురుకుగా కార్పొరేట్ ప్రయోజనాలకు వత్తాసు పలుకుతోందని ఐఎమ్‌టి మనేసర్‌లోని సంఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అయినప్పటికీ, అరెస్టులు, హింస,  బెదిరింపులు ఉన్నప్పటికీ, కార్మికులు ప్రతిఘటిస్తూ, సంఘటితమవుతూనే ఉన్నారు.

మనేసర్ కార్మికులకు సంఘీభావంగా నిలవాలని, పోలీసుల అణచివేతకు జవాబుదారీతనం కోరాలని, కార్మిక ఉద్యమాలను నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకించాలని అన్ని ప్రజాస్వామిక శక్తులకు, ట్రేడ్ యూనియన్లకు,  పౌర సమాజానికి  పిలుపునిస్తున్నాం.

ఐఎమ్‌టి మనేసర్‌లోని పోరాటం ఏకాంతమైనది కాదు—ఇది భారతదేశం అంతటా పెరుగుతున్న కార్మికవర్గ ప్రతిఘటనకు ప్రతీక.

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం

ఆర్గనైజింగ్ కమిటీ

(ఎఐఆర్‌ఎస్‌ఒ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, ఎఎస్‌ఎ, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎం, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎం, సిఇఎం, కలెక్టివ్, సిఆర్‌పిపి, సిఎస్ఎం, సిటిఎఫ్, డిఐఎస్ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరమ్ అగైన్స్ట్ రిప్రెషన్ తెలంగాణ, ఫ్రెటర్నటీ, ఐఎపిఎల్, ఇన్నోసెన్స్ నెట్వర్క్, కర్నాటక జనశక్తి, ఎల్ఎఎ, మజ్దూర్ ఆధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రికా, ఎన్ఎపిఎం, నజరియా మ్యాగజైన్, నిశాంత్ నాట్య్ మంచ్, నౌరుజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయ్ మంచ్, సమాజ్‌వాదీ జన్‌పరిషద్, సమాజ్‌వాదీ లోక్‌మంచ్, బహుజన్ సమాజ్‌వాదీ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ పీస్ అలయన్స్, డబ్ల్యూఎస్‌ఎస్, వైఫర్‌ఎస్)

Leave a Reply