కొండల అంచున విచ్చుకునే తెల్లవారుజాము తెల్లని మంచు బిందువును అడుగు, లోయల్లో ప్రవహించే స్వచ్ఛమైన సెలయేటి అలలను అడుగు దశాబ్దాలుగా నిటారుగా నిలబడి ఆకాశాన్ని ముద్దాడుతున్న మహావృక్షాల వేళ్లను అడుగు స్వాతంత్ర్యం అంటే ఏమిటో అవి చెబుతాయి. రాత్రివేళ నిశ్శబ్దంగా రాలే ఆకుపచ్చని చిగురు శబ్దాన్ని అడుగు, కొండకోనల గుండెల్లో ప్రతిధ్వనించే కోయిల పాటను అడుగు గాఢాంధకారంలో అడవికి దారి చూపే మిణుగురుల నకిషీల వెలుగును అడుగు నిజమైన స్వేచ్ఛకు ఉన్న పరిమళం ఏమిటో అవి చూపిస్తాయి. స్వేచ్ఛ అంటే ఎర్రకోట బురుజుల మీద ఏటా ఆగస్టు 15న మారే 3రంగుల జెండాలు కావు, కెమెరాల ముందు యాభై ఆరు ఇంచుల ఛాతి విరుచుకుంటూ ఢిల్లీ దొరలు కురిపించే బూటకపు ప్రసంగాల ఆడంబరాలు అసలే కావు. నిజమైన స్వాతంత్ర్యం అంటే ప్రకృతితో మమేకమై, భూమిని తల్లిగా భావించి, శ్వాసను అడవికి అంకితం చేసిన నా ఆదివాసి బిడ్డల ఆత్మగౌరవ జీవనం. తరతరాలుగా ఈ పచ్చటి సామ్రాజ్యాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ, అవసరమైనంత మాత్రమే తీసుకుంటూ, పర్యావరణ సమతుల్యతను కాపాడే నా మూలవాసుల జీవన వేదం ముందు ఈ ఆధునిక కాంక్రీట్ ప్రపంచపు నాగరికత ఎంత చిన్నది? కానీ శతాబ్దాల క్రితం తెల్లదొరలు నా గుండెల్లోకి దింపిన వలసపాలన తుపాకీ గుండ్లు, నేడు నల్లదొరల రూపంలో మరింత క్రూరంగా, నయా సామ్రాజ్యవాద మైనింగ్ యంత్రాలుగా మారి నా శరీరాన్ని ముక్కలు చేస్తుంటే దీనిని స్వేచ్ఛా భారతం అనాలా లేక నగ్న ఫాసిజపు ఇనుప బూట్ల రాజ్యం అనాలా?

               ఆకుపచ్చని చీర కట్టుకున్న నా శరీరానికి బొగ్గు గనులు, బాక్సైట్ క్వారీలు తవ్వుతూ గాయాలు చేస్తుంటే, ఆ గాయాల నుండి కారుతున్న నెత్తుటిధారలే నా బిడ్డలు తాగే సెలయేళ్లుగా మారుతున్నాయి. ‘మంచి రోజులు’ వచ్చాయంటూ కార్పొరేట్ మిత్రులైన అదానీ, అంబానీల జేబులు నింపడానికి దేశ ప్రధాని మోడీ ,హోంమంత్రి అమిత్ షా అధికార బలంతో నా పచ్చటి హృదయమైన అడవులను నరికివేస్తుంటే ఆ వృక్షాల కూతలతో పాటు మూగబోయిన పక్షుల కిలకిలరాగాలు పాలకుల బహుళ అంతస్తుల చెవులకు వినిపించవు. కేవలం మైనింగ్ కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ అనే కపట ముసుగులో పులుల సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి అభయారణ్యాలు అంటూ చట్టాలు తెచ్చి, తరతరాలుగా అడవిని కాపాడుతున్న నా మూలవాసులనే అపరిచిత వ్యక్తులుగా మార్చడం ఎంతవరకు న్యాయం? వారి సొంత గూడు నుండి వెళ్లగొట్టే కుతంత్రం స్వాతంత్ర్యమా? కార్పొరేట్ పర్యాటక కేంద్రాల కోసం, విలాసవంతమైన హోటళ్ల కోసం ఆదివాసి సంస్కృతిని ఒక ప్రదర్శన వస్తువుగా మార్చి మార్కెట్లో తెగనమ్మడం పాలకుల నయా-వలసవాద సంస్కృతి కాదా? అభివృద్ధి అనే ఒక అపహాస్యపు నినాదంతో కొండలను పిండి చేస్తూ, నదులను విషతుల్యం చేస్తూ సాగే ఈ నయా-ఉదారవాద లూటీ నమూనాను చూసి ప్రకృతి మాతగా నేను నిశ్శబ్దంగా రోదిస్తున్నాను. ఒకవైపు కాంగ్రెస్ నాటి సల్వాజుడుం హింసతో, అడవిని కార్పొరేట్లకు రాసివ్వడానికి నాడు ప్రారంభించిన హరిత వేట (Operation Green Hunt) సైనిక ఆపరేషన్ల ద్వారా నా సంపదను తాకట్టు పెట్టడానికి గట్టి పునాది వేస్తే, నేటి బీజేపీ పాలకులు హిందుత్వ ఫాసిస్ట్ ముసుగులో ఆ దాడులను పతాక స్థాయికి తీసుకెళ్లి ఏకంగా నా మూలాలనే పెకలించి వేయడానికి సిద్ధపడటం చరిత్రలోనే కనివినీ ఎరుగని ఘోరకలి కాదా?

నా ఒడిలో ప్రశాంతంగా, ఏ రసాయన రంగులూ హంగులూ లేని పోడు వ్యవసాయం చేస్తూ బతికే ఆదివాసి బిడ్డలు, తమ అడవి తల్లిని కాపాడుకోవడానికి చేతులు ముడిచి నిలబడితే, వారిపై నాడు కాంగ్రెస్ పాలకులు ఎగదోసిన తుపాకులను నేడు బీజేపీ సర్కార్ మరింత ఆధునికీకరించి ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అనే అంతిమ సైనిక దండయాత్రగా మార్చి ప్రయోగించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? గోండీ భాషలో ‘కగార్’ అంటే కాగితం అని అర్థమట, గత కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన అణచివేత పరంపరను నేడు కొనసాగిస్తూ, నా బిడ్డల జీవితాలను, వారి అస్తిత్వాన్ని ఒక కాగితం ముక్కలా నలిపేసి, మైనింగ్ కంపెనీల ఒప్పంద పత్రాలకు (MoUs) పూర్తిగా బలి ఇవ్వాలనే పాలకుల కుట్రకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగం ఇచ్చిన ఐదో షెడ్యూల్ నిబంధనలను, గిరిజన గ్రామసభలకు సర్వాధికారాలు కల్పించే చట్టాన్ని (PESA) తుంగలో తొక్కి, బడా పెట్టుబడిదారుల లాభాల కోసం అటవీ చట్టాలను నిస్సిగ్గుగా సవరించడం పాలకుల రాజ్యాంగ ఉల్లంఘనకు నిదర్శనం కాదా? నాడు కాంగ్రెస్ అడవుల్లో పోలీస్ క్యాంపులు పెడితే, నేడు బీజేపీ బస్తర్, అబూజ్‌మడ్ (మధ్యభారత) అడవులలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేసి నా పచ్చదనాన్ని సంపూర్ణ సైనిక జోన్‌గా మార్చడం వెనుక ఉన్న అసలు రహస్యం ఎవరి కోసం?

ఆ క్యాంపులు నా బిడ్డల రక్షణ కోసమా లేక కార్పొరేట్ లారీలకు, మైనింగ్ యంత్రాలకు కాపలా కాయడానికి ఏర్పడినవా? అర్ధరాత్రి వేళల్లో నిఘా డ్రోన్ల ద్వారా నా బిడ్డల కదలికలను గమనిస్తూ, వారి నివాసాలపై బాంబులు కురిపించే ఈ ‘విశ్వగురు’ తోటిపాలకుల క్రూరత్వానికి సరిహద్దులు లేవా? అడవిలోకి కట్టెల కోసం వెళ్లిన గిరిజన మహిళలను, యువకులను విచక్షణారహితంగా కాల్చిచంపి, వాటిని ‘ఎదురుకాల్పులు’ అంటూ ప్రతిరోజూ అబద్ధాల కథలు రాసి ప్రజలను నమ్మించాలనుకోవడం పాలకుల అవివేకం కాదా?

 నా వేదనను, నా బిడ్డల రోదనను ప్రపంచానికి చాటిచెప్పిన మేధావులను ఈ పాలక వ్యవస్థ జైలు గోడల వెనుక ఎందుకు బలి తీసుకుంది? ఆదివాసీల భూ హక్కుల కోసం, అడవి రక్షణ కోసం నిలబడిన ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామిని, వీల్ చైర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా వంటి శారీరక వికలాంగులను దేశద్రోహులుగా ముద్రవేసి, జైళ్లలో పెట్టి కనీస వైద్యం అందించకుండా చంపేయడం వ్యవస్థాగత హత్యలు కావా? ప్రకృతిని ప్రేమించడం, అడవి తల్లి రక్షణ కోసం గొంతుక ఎత్తడమే ఈ దేశంలో ఉరిశిక్షకు కారణమైతే ఇక స్వేచ్ఛ ఎక్కడుంది? దేశవ్యాప్తంగా సామాజిక సమగ్రతను ముక్కలు చేస్తూ, గిరిజన తెగల మధ్య మైనింగ్ ప్రయోజనాల కోసం మణిపూర్ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో జాతి చిచ్చు పెట్టడం ఏ రకమైన దేశభక్తి? ఒకవైపు దళితులపై, గిరిజనులపై అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యంగా మారుతుంటే, మరోవైపు ప్రశ్నించే గొంతుకలపై నల్లచట్టాలను (UAPA) ప్రయోగించి నోరు నొక్కేయడం నయా-ఫాసిజం కాక మరేమిటి? ప్రజలు తమ నిజమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై తిరగబడకుండా ఉండటానికి మతాన్ని, కులాన్ని ఆయుధాలుగా వాడుకుంటూ విభజించు-పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్న ఈ దళారీ పాలకుల నాటకాలను ప్రకృతి ఎప్పటికీ క్షమించదు.

అయినా ఐదేళ్లకోసారి వచ్చే ఈ నకిలీ ఓట్ల జాతరలో, ఈ మోసపూరిత ఎన్నికల రంగస్థలంలో నా అమాయక అడవి బిడ్డలు ఇంకా ఎంతకాలం బలి కావాలి? ప్రజాస్వామ్యం పేరిట ఈ పాలకులు నడుపుతున్నదంతా ఒక నకిలీ ప్రభుత్వం, ఒక అబద్ధాల కోట కాదా? సామ్రాజ్యవాద శక్తులకు, దళారీ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే ఈ నకిలీ బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అట్టడుగున ఉన్న పీడిత ప్రజలు, అడవిని నమ్ముకున్న ఆదివాసులు అసలు ఎందుకు నమ్మాలి? ఓట్లు దండుకోవడానికి పాలకులు వేసే కపట నాటకాలు, బూటకపు వేషాలు ,మోసపూరిత ప్రగతి హామీలతో నా బిడ్డలను వాడుకుని, ఆ తర్వాత వారి హక్కులను నలిపేసే ఈ కుళ్లిన వ్యవస్థను చూసి నా కడుపు మండుతోంది. ఎన్నికలు ముగియగానే అధికార పీఠం ఎక్కి, అడవి బిడ్డలను చీకట్లోకి నెట్టేసి, నా పచ్చటి భూములను మైనింగ్ మాఫియాకు రాసిచ్చే ఈ నకిలీ పాలకులు నా బిడ్డలను ఎప్పటికీ అభివృద్ధి చేయరనే సత్యం వారి రక్తం ఏరులై పారుతుంటే స్పష్టంగా కనిపిస్తోంది.

  ఈ నకిలీ వ్యవస్థ ఇలాగే నా సర్వస్వాన్ని తెగనమ్ముకుంటూ పోతే.. రేపు నన్నూ, నా అడవి బిడ్డలను కాపాడేది ఎవరు? గొడ్డలి వేట్లకు గురవుతున్న నా వృక్షాలను, తుపాకీ గుండ్లకు బలవుతున్న నా పసిబిడ్డలను గుండెలకు హత్తుకునే దిక్కెవరు? నా నీడన బతికే నా అమాయక గిరిజన బిడ్డల తలరాతలు ఎప్పుడు మారుతాయి? చమురు వాసనలు, ఇనుప యంత్రాల శబ్దాల మధ్య నా ఆకుపచ్చని అస్తిత్వమే కరిగిపోతుంటే.. ఇక నా ఒడిలో స్వేచ్ఛా గీతాలు పాడే గొంతుకలు మిగులుతాయా? సంకెళ్లు మార్చుకున్న ఈ బూటకపు స్వతంత్ర భారతంలో.. నిలువునా నరికివేయబడుతున్న నన్ను, నా మూలవాసులను ఆదుకునే నాథుడే లేడా? కన్నీరు కూడా ఇంకిపోయిన కళ్లతో, శ్మశానంగా మారుతున్న నా గుండె లోతుల్లోంచి అడుగుతున్నాను.. ఈ నరమేధానికి ముగింపు ఎప్పుడు? నా బిడ్డలకు నిజమైన విముక్తి ఎప్పుడు?

  • కర్తార్

Leave a Reply