ఆకర్షణలో పుట్టలేదు మన ప్రేమ…
సిద్ధాంతా బోధనలో
రూపుదిద్దుకున్నది మన ప్రేమ…

మన కళ్లల్లో ఒలికేది
కేవలం ప్రేమ కాదు…
మెరిసే
ఒక సమసమాజ స్వప్న మది …

కంటి చూపుతో కాదు—
విప్లవాశయంతో
దగ్గరయ్యాము మనం…

నీ పోరాట ప్రేమని
నాకోసం వినిపించేందుకు
ముళ్లబాటలనే
పూలపానుపులుగా మార్చుకున్నావు

మన ప్రేమ
వెన్నెల వెలుగులా
తేటతెల్లమైనది…

ప్రేమలో
సీతాకోకచిలుకంత స్వేచ్ఛను
అందించావు.

నీ ప్రేమ
పూలవనం సువాసనలా
నిశ్శబ్దంగా వికసించింది నాలో

నా చంద్రబింబ కళ్లను
నీ హృదయానికి హత్తుకుని
గాయాలని మాన్పుకున్న
నిస్వార్థ ప్రేమ నీది…

తాత్వికతలోనే
ప్రేమను పలికించిన
విప్లవ ప్రేమికుడివి నీవు…

కాలం అడ్డు గోడలు కట్టినా
ప్రతి ఋతువులోనూ
గాలిలా… ధూళిలా…
నా చుట్టే పరివ్యాపించిన
ఉన్మత్తమైన ప్రేమ నీది…

మన చుట్టూ
బ్రహ్మజెముళ్ల వనమే ఉన్నా
ఓ ఎర్రరంగు పుస్తకాన్నిచ్చి
మన ఆశయాల బాటన
నన్ను నడిపిస్తావు…

నీ ప్రేమ
మహావృక్షమై
శాఖోపశాఖలై
నా శిరస్సున విస్తరించింది—
ఏ నిర్బంధమూ….
ఏ సనాతనమూ ఎదురు నిలవని తీవ్రమది

ఎన్ని ప్రచ్ఛన్న యుద్ధాల మధ్యనైనా
ఎంత గొప్పగా…
ఎంత నిశ్శబ్దంగా…
ఎంత రహస్యంగా
ప్రేమించావు నన్ను!
గెరిల్లా ఆయుధాన్ని ప్రేమించినట్టు..

గాయాల కొలిమిలోనూ
నీ ఆత్మంతటితో
నన్ను ప్రేమించావు…
నక్సల్బరి నిప్పులా వెలిగించావు

ఎంతటి ఆగ్రహంలోనైనా
తురాయి పువ్వులా
దారిలో తోడయ్యావు
నల్లమల మబ్బులా
ప్రేమను కురిపించావు…

ఎంత చీకటైనా
వెన్నెలలో చిగురించే
మట్టిలా
నీ ప్రేమ నాలో నిలిచింది…

ఎప్పుడు మనం కలిసినా
మన ప్రేమ గుర్తుగా
ఓ ఎర్రటి పుస్తకం.
కరచాలనం
అప్పుడెంత బలమో నాకు

ఏళ్ల తరబడి
నా మౌనాన్ని
మునిలా భరించినావు
నిరీక్షణలోనే
పరిపూర్ణమైంది మన ప్రేమ

నిమిష నిమిషానికి విస్తరించే
ప్రేమ నీవు.
మదిలో ఇంకనూ వెలుగుతూనే ఉంది

ఈ వియోగంలోనూ
మన ప్రేమ
శాశ్వతమే…
అడవిలా ఆలోచనలా
సూర్యుని పొద్దుపొడుపులా…
విస్తరించే నింగిలా…
సుస్థిర నేలలా…
అంతులేనిది మన ప్రేమ…

నీ ప్రేమ ఒక జ్వలనం
నా చివరి ఊపిరికైనా కావాలి…

నీకై పరితపిస్తూ ఉంటాను…
అసంపూర్ణ కావ్యంలా

ఈ జన్మ
మన ఆశయాలకు
అంకితం……

Leave a Reply