నా గడియారం ఎనిమిదో గంట దగ్గరే ఆగిపోతుంది
అదేంటో
ఎవరో ఆజ్ఞాపించినట్టు
ఇంటి గుమ్మం ఎత్తు పెరిగిపోతుంది
అదిగో, మూలనున్న గ్రాండ్ ఫాదర్ క్లాక్
టిక్ టిక్ టిక్మని హెచ్చరిస్తుంది

నేను జీవితాన్ని ఎప్పుడూ సగమే ఆస్వాదిస్తాను
ఆ తర్వాత నా అన్వేషణని చీకటి కమ్మేస్తుంది
నా స్వాతంత్రానికి పరదాలు కప్పి
మా ముసలి ముత్తాత ముసుగు తన్ని పడుకుంటాడు

ఒకనాడు ధైర్యాన్ని కాగడా చేసుకుని గుమ్మం దాటాను
అప్పుడే తెలిసింది
నన్ను బంధించింది పంజరంలో కాదు నా దేహంలోనని
నేనొక దేహాన్నని, నాకు దేహం ఉందని

నీడ చాటున తీతువు కూతలు, ఎర్రబడే గుడ్లగూబ కళ్ళూ
వీటి మధ్య నేనొక విప్లవంలా కదిలాను
గడియారం ముళ్ళని విరగ్గొట్టి ఆయుధంలా మలిచాను
అడుగడుక్కీ ఆశయంలా నినదించాను

మిణుగురు పూవులతో నిశీధి నన్ను ఆహ్వానించింది
సమయం నా స్వంతమయ్యింది
తెరల్ని ఛేదించి నేను విజేతనయ్యాను
అంతలో మెలకువ శత్రువులా వెంటపడింది
పరుగాపి ఆయాసపడుతూ కళ్ళు తెరిచి చూశాను
గట్టిగా మూసుకున్న నా పిడికిట్లో
విరిగిన గడియారం ముళ్ళు, నా స్వేచ్ఛ.

Leave a Reply