మోడీ నేతృత్వంలో 2006లో ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబిసి) ముసుగులో దేశంలో ప్రజా సంపదను, సామాన్య పౌరుల కష్టార్జితాన్ని పెద్ద కార్పొరేషన్లకు అప్పగించే పని పెద్ద ఎత్తున మొదలైంది. ఈ భారీ ఆర్థిక దోపిడీ ఇన్సాల్వె న్సీ – బ్యాంక్రప్టసీ కోడ్ పేరుతో జరుగుతోంది. ఎస్సెల్ / జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సుభాష్ చంద్ర కు సంబంధించిన 22,006.57 కోట్ల రూపాయల క్లెయిమ్‌లకు గాను, కేవలం 6.50 కోట్ల రూపాయలు అంటే 0.03 శాతం చెల్లిస్తే చాలని జాతీయ లా కంపెనీ ట్రిబ్యునల్ ఆగష్టు 23న తీర్పునిచ్చింది. దీనివల్ల 22 వేల కోట్ల రూపాయల ప్రజాధ నం ఒక సంప న్నుడి పరమయింది. ఈయన బిజెపి మాజీ ఎంపి. ఆర్ఎస్ఎస్కు సన్నిహితుడు. మోడీ ప్రభుత్వ అండతో కార్పొరేట్ సంస్థలు ప్రజాధనాన్ని ఎలా లూటీ చేస్తున్నాయో చెప్పడానికి గతంలో అనేక ఉదంతాలున్నా, ఇది తాజా ఉదాహరణ. మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ బ్యాంకు రుణాలను మాఫీ చేసింది. ఈ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వం నుంచి తీసుకోవడమే కానీ, ఇచ్చింది ఏమీ లేదు.
ఇన్సాల్వెన్సీ – బ్యాంక్రప్టసీ కోడ్(ఐబిసి) పరిష్కార నిబంధనల ప్రకారం, అంగీకరించిన రికవరీ మొత్తం కేవలం రూ. 6.25 కోట్లు, అదనంగా ఇతర ఖర్చుల కోసం రూ.25 లక్షలు మాత్రమే. అంటే, రుణదాతల మొత్తం బకాయి క్లెయిమ్‌లలో కేవలం 0.028 శాతాన్ని మాత్రమే అంగీకరించి, దాదాపు రూ. 22,000 కోట్లను మాఫీ చేశారు. ఇది ఏకంగా 99.97 శాతం భారీ కోత. ఈ తీర్పు వెలువడిన వెంటనే విపక్షాలు, సామాజిక వేత్తలు, మేధావులు, ప్రజలు ఎన్‌సిఎల్‌టిని లూటీ ట్రిబ్యునల్ అని దుమ్మెత్తి పోశారు. నిరసనలు గమనించిన ట్రిబ్యునల్ ఆ తీర్పు వెలువడిన వారం రోజుల్లోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సెప్టెంబర్ 1న స్టే విధించింది. అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం- తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుభాష్ చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విక్రయించకుండా లేదా బదలాయించకుండా నిషేధం విధించింది.
సుభాష్ చంద్ర కేసును జాకీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆగష్టు 20న జరిపిన విచారణలో ఇరువురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున, అనంతరం నియమితుడైన మూడో సభ్యుడు (నిలేష్ శర్మ) ఆగష్టు 23న రూ. 22 వేల కోట్లకు గాను రూ. 6.50 కోట్లు చెల్లించే విధంగా తీర్పు ఇచ్చాడు. ముగ్గురి న్యాయమూర్తులవి మూడు భిన్న అభిప్రాయాలు కావడంతో ఎలాంటి మెజారిటీ అభిప్రాయం రాలేదు. దీంతో ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ఈ కేసును మొదటి నుంచి పూర్తిగా విచారించేందుకు ఎన్‌సిఎల్‌టి అధ్యక్షుడు జస్టిస్ అనువిందర్ సింగ్ గ్రెవాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల న్యాయమూర్తుల బృందం ఆగష్టు 31న ఐబిసి కోడ్ నిర్ణయాన్ని స్టే చేసింది.

ఒక బక్క రైతు, చిన్న వ్యాపారి కొద్దిపాటి బకాయిపడినా బ్యాంకు అతని వెంట పడుతుంది. కానీ, వేల కోట్ల కార్పొరేట్ రుణాల దగ్గరకు వచ్చేసరికి ఆ కథ మరోలా ఉంటుంది. అప్పు తీసుకున్నవాడు ఎంత పెద్దవాడైతే అప్పు భారం అంత చిన్నదై పోతుంది. జీ, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రూ.22 వేల కోట్ల క్లెయిమ్‌లకు ఐదారు కోట్లతో ఎన్‌సిఎల్‌టి పరిష్కార ప్రణాళిక ఆమోదించడం దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వంటి బ్యాంకులు నేషనల్ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌కి వెళ్లాయి. ఎన్‌సిఎల్‌టి ఇచ్చిన తీర్పుపై తాజాగా (ఎన్‌సిఎల్‌ఏటి) స్టే విధించింది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఎస్సెల్ గ్రూప్‌నకు చెందిన కంపెనీలు తీసుకున్న రుణాలకు సుభాష్‌చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. ఆ కంపెనీ లు రుణాలు చెల్లించలేకపోవడంతో హామీదారుగా ఉన్న అతనిపై చర్యలు మొదలయ్యాయి. అలా ఆయనపై పూచీపడిన రుణదాతల క్లైయిమ్లు రూ.22.006.57 కోట్లకు చేరాయి. ఇక్కడే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) వ్యవహారం ముందుకొస్తుంది. ఇది కంపెనీల దివాలా, రుణ పరిష్కారం వంటి అంశాలను చట్ట ప్రకారం పరిశీలించే ప్రత్యేక న్యాయ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. తన గ్రూప్ కంపెనీ తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును పరిష్కరించు కునేందుకు సుభాష్ చంద్ర చేసిన విజ్ఞప్తిని ఆ ఏకసభ్య బెంచ్ అంగీకరించింది.
ఈ కేసులో ఎల్ఐసి హౌసింగ్ పైనాన్స్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆ సంస్థకు రూ.1,322.39 కోట్ల క్లెయిమ్ ఉండగా, మొదట ఆమోదం పొందిన ప్రణాళికలో కేవలం రూ. 38.09 లక్షలు మాత్రమే ప్రతిపాదించింది. ఎలఐసి హౌసింగ్ ఫైనాన్స్ తో పాటు హెచ్డీఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు దీన్ని వ్యతిరేకించాయి. ఎలఐసికి సంబంధించిన డబ్బు సామాన్యుల పొదుపులతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల డబ్బు కూడా ప్రజల ఆర్థిక వ్యవస్థలో భాగమే కదా.
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం సుభాష్ చంద్ర నికర ఆస్తుల విలువ. రుణం మంజూరు సమయంలో సమర్పిం చిన నికర ఆస్తుల సర్టిఫికెట్లో సుభాష్ చంద్ర ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సిబిఐ ఫిర్యాదులో ఉంది. 2018 మార్చి 28న సమర్పించిన ఆ సర్టిఫికెట్ ప్రకారం, 2017 మార్చి 31 నాటికి ఆయన నికర విలువ సుమారు రూ. 59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు చూపించారు. ఈ వ్యవహారంలో రెండు వేర్వేరు రుణాలు ప్రధానంగా ఉన్నాయి. మొదటిది వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని కో-బారోయర్ పాన్ ఇండియా ఇన్స్ట్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన సుమారు రూ.500 కోట్ల రుణం. వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ రుణాన్ని ‘టేకోవర్ అండ్ టాప్-అప్ ఫెసిలిటీ’గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మంజూరు చేసింది. ఈ రుణానికి సుభాష్ చంద్ర గ్యారంటర్‌గా నిలిచారు. ఇక రెండో రుణం డిజిటిల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించినది. దాని కో-బారోయర్ అయిన స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సుమారు రూ. 480 కోట్ల రుణం మంజూరైంది. ఈ రుణానికి కూడా సుభాష్ చంద్ర గ్యారంటీ ఇచ్చారు. ఈ సందర్భంలో సమర్పించిన మరో నికర విలువ సర్టిఫికెట్లో ఆయన నికర ఆస్తుల విలువ రూ. 40,000 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సిబిఐ తెలిపింది. అంటే… రెండు రుణాలను కలిపితే సుమారు రూ. 980 కోట్లు. రుణాలు తీసుకునే సమయంలో సుభాష్ చంద్ర ఆర్థికంగా వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగిన వ్యక్తిగా పత్రాల్లో చూపించారు.
2014 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు బ్యాంకులు కార్పొరేట్లకు రూ.16.61 లక్షల కోట్ల రుణాలను రైట్ఆఫ్ చేశాయి. అందులో కార్పొరేట్లు తిరిగి చెల్లించింది. రూ. 2.69 లక్షల కోట్లు మాత్రమే. అంటే దాదాపు పదహారు శాతం. కానీ, ఇంత భారీ మొత్తాలు ఎందుకు వసూలు చేయలేక పోయారన్నది మాత్రం పాలకుల చెప్పరు. ఎన్‌సిఎల్‌టి ద్వారా ప్రక్రియ సాగినా ప్రభుత్వానికి బాధ్యత లేదని అనుకోలేం. జూన్ 1, 2016లో దివాలా చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విధానాలు, భారీ కార్పొరేట్ రుణాల మంజూరు, మొండి బకాయిల వసూళ్లపై కేంద్రానికి విధానపరమైన బాధ్యత ఉంది. భారీ రుణాలు ఎలా మంజూరయ్యాయి? సరైన హామీలు ఉన్నాయా? ఉద్దేశపూర్వక ఎగవేత జరిగిందా? ఆస్తులు ఎక్కడున్నాయన్నది ప్రభుత్వమే తేల్చాలి.
మోడీ అధికారం చేపట్టిన 2015-16 నుండి 2025-26 వరకు వాణిజ్య బ్యాంకులు పార్లమెంటుకు నివేదించిన దాని ప్రకారం, అధికారికంగా రూ. 18,76,593 కోట్లను మాఫీ చేశాయి. 2016లో ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (ఐబిసి) కింద కార్పొరేట్ రుణాల కోతలు (హెయిర్‌కట్స్) ఈ మొత్తానికి అదనం. ఐబిసి కింద హెయిర్‌కట్ నష్టాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ అధికారిక రుణ మాఫీలుగా పరిగణించవు. అధికారిక ప్రకటనలు తరచుగా వదులుకున్న క్లెయిమ్‌ల పరిమాణాన్ని కాకుండా, వసూలు చేసిన నామమాత్రపు మొత్తాలను మాత్రమే హైలైట్ చేస్తాయి. 2016లో ఐబిసి ప్రారంభమైనప్పటి నుండి, సుమారు రూ.14.14 లక్షల కోట్లు ఉన్న రుణాలలో బ్యాంకులు కేవలం రూ. 4 లక్షల కోట్లను మాత్రమే వసూలు చేశాయి. మిగిలిన బ్యాలెన్స్ రూ. 10 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ డిఫాల్టర్లకు హెయిర్‌కట్స్ రూపంలో రద్దు చేయబడింది.
మోడీ ప్రభుత్వం తన ఆశ్రితులైన బడా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఇవ్వడమే కాకుండా, బ్యాంకులు కూడా వారు తీసుకున్న అప్పులను నామమాత్రపు చెల్లింపులతో సరిపెడుతున్నాయి. అందులో భాగమే జీ-మీడియా సంస్థ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్రకు బ్యాంకులు ఇచ్చిన రైట్ ఆఫ్ (రైట్ ఆఫ్ అంటే ఒక కంపెనీ లేదా బ్యాంకు రాబట్టుకోలేని బాకీలు, నష్టపోయిన ఆస్తులు లేదా వసూలు కాని రుణాలను తమ లెక్కల పుస్తకం నుంచి తొలగించడం) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన హెయిర్‌కట్ తీర్పు ఇచ్చింది. ఈ కంపెనీలు 22,006 కోట్ల రుణాలు తీసుకున్నాయి. తాము దివాళా తీశామనే పేరుతో, బ్యాంకుల రుణాలు తీర్చలేమని ఆ కంపెనీలు చెప్పడంతో, బ్యాంకులకు హామీదారుగా ఉన్న సుభాష్‌చంద్రను 22 వేల కోట్లు చెల్లించ అక్కరలేదని చెప్పాయి.
ఆ తర్వాత బ్యాంకులు కూడా అందులో భాగస్వామ్యమయ్యాయి. నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ విచారణలో సుభాష్‌చంద్ర వ్యక్తిగత నికర ఆస్తి విలువ 31.79 కోట్లుగా నమోదయ్యింది. ఆయన సమర్పించిన రీపేమెంట్ ప్లాన్ ప్రకారం ఆయన దగ్గర మిగిలిన నికర ఆస్తుల విలువ 6.5 కోట్లే అన్నదాన్ని ఎన్‌సిఎల్‌టి అంగీకరించి ఆ మొత్తాన్ని రుణదాతల సెటిల్మెంట్ కోసం కేటాయించినట్లు ప్రకటించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సామాన్యుడు చిన్న లోను కట్టకపోతే ఆస్తులు జప్తు చేసే బ్యాంకులు, కార్పొరేట్ పెద్దలకు వేల కోట్లు ఎలా వదిలివేస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారీగా అప్పులు తీసుకొని చేతులెత్తేసిన జీ ఎంటర్టెయిన్మెంట్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్రకు సంబంధించిన మరో అక్రమ వ్యవహారం బయటపడింది. తనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా ఎలఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు పత్రాలు సమర్పించి, వాటి ఆధారంగా అప్పులు తీసుకొని ఆ సంస్థకు ఎగనామం పెట్టాడని వెల్లడైంది. ఈ మేరకు సుభాష్‌చంద్రపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఇక్కడే సిబిఐ దర్యాప్తు ప్రధానంగా కేంద్రీకృతమవుతోంది. ఒకవైపు రుణాలు తీసుకునే విషయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ రూ.40,000 కోట్ల నుంచి రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే క్రిమినల్ కాన్స్పిరసీ, ఫ్రాడ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంటి ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మరోవైపు… ఇన్సాల్వేన్సీ ప్రక్రియలో ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నట్లు సిబిఐ చెబుతోంది. కాబట్టి… రుణం పొందేందుకు నికర ఆస్తుల విలువను కావాలనే ఎక్కువగా చూపించారా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.
సుభాష్ చంద్ర పైన, ఈయన కుమారుని పైన ఆర్థిక మోసాలు, నిధులు మళ్లింపునకు సంబంధించిన దానిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబి దర్యాప్తు జరుపుతోంది. జీ-ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రమోటర్లకు చెందిన ఇతర ప్రైవేట్ కంపెనీలకు నిధులు మళ్లించారని సెబీ దర్యాప్తులో తేలింది. ఇందుకోసం కొన్ని నకిలీ నిధుల రికవరీ పత్రాలను సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. మోసపూరిత వ్యవహారాల కారణంగా ఆయనకు, ఆయన కుమారుడు పుతిన్ గోయెంకాలను లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి పదవులు చేపట్టకుండా సెబీ నిషేధించింది. కంపెనీకి చెందిన విలువైన స్థిరాస్తులను బోర్డు అనుమతి లేకుండా ప్రమోటర్ల సొంత అప్పుల కోసం అక్రమంగా తాకట్టు పెట్టారనే ఆరోపణలు కూడా రుజువయ్యాయి.
ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే దొడ్డిదారిన ‘డబ్బులెగ్గొట్టే పరిష్కారం’ ప్రభుత్వ, కార్పొరేట్ మైత్రిని బలోపేతం చేస్తోంది. అందుకు సుభాష్‌చంద్ర రాజకీయ నేపథ్యం కూడాతోడ్పడింది. ఆయన హర్యానా నుంచి బిజెపి మద్దతుతో ఎన్నికైన రాజ్యసభ మాజీ సభ్యుడు. 2022లోనూ రాజస్థాన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తమను నమ్ముకున్న వారు ఎంత అవినీతిపరులైనా ‘వాషింగ్ మిషన్’లో శుద్ధి చేసే బిజెపి ఈ కేసును కూడా ఎన్‌సిఎల్‌టి ద్వారా శుద్ధి చేసిందన్న ఆరోపణల్ని కొట్టిపారేయలేని పరిస్థితి! ఎందుకంటే, నోటీసులు అందుతున్న క్రమంలోనే అప్పటికే లాభాల్లో ఉన్న కంపెనీలు సడన్‌గా ఎలా నష్టాల్లోకి వెళ్లాయన్న రుణదాతల ప్రశ్నలకు సమాధానం లేదు. ఇప్పటికైనా ఎస్సెల్ గ్రూపునకు చెందిన మిగిలిన ఆస్తులు, వాటి నికర విలువ, అప్పుల పరిస్థితిపై పారదర్శక విచారణ జరగాలి. ప్రభుత్వం ఈ కేసును దివాలాగా చూడకుండా, ఆర్థిక నేరానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి. బడా కార్పొరేట్ల పాత్రను వెలికితీయాలి. లాభం ప్రైవేటు వ్యక్తికి, నష్టం ప్రజలకు అనే పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం.
సుభాష్ చంద్ర ఉదంతకం దివాలా చట్టాన్ని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తోంది. బకాయిల్లో 99.9 శాతం తగ్గింపు వంటి అన్యాయమైన, అనూహ్యమైన కోతలకు తావు ఇవ్వకూడదు. ఇలాంటి కోతలను తిరస్కరించే స్పష్టమైన అధికారాన్ని ఎన్‌సిఎల్‌టికి ఇవ్వాలి. వ్యక్తిగత లేదా ఇతర గ్యారంటీలు మోసపూరితమైనవిగా తేలితే, కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సుభాష్ చంద్ర వంటి కేసులు దివాలా చట్టంలో ఇంకా మిగిలి ఉన్న లోపాలను, ముఖ్యంగా వ్యక్తిగత గ్యారంటర్ వ్యవస్థలో ఉన్న లొసుగులను స్పష్టంగా బయట పెడుతున్నాయి. ఈ లోపాలను తక్షణం తొలగించాలి. అంబానీ, అదానీ లాంటి దేశ బడా కార్పొరేట్ కంపెనీలు భారతీయ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నిధులు రుణాలు రూపంలోకి తీసుకునే స్థాపిస్తున్నాయి. ఆ తర్వాత లక్షల కోట్లు రద్దు చేయించుకుంటున్నారు. ఇది మోడీ ప్రభుత్వ అండతో ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమే. సుభాష్ చంద్ర కేసు ఒక్కటే కాదు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి భారీ రుణ, ఆర్థిక అవకతవకల కేసుల్లో నిందితులు దేశం విడిచి వెళ్లిన ఉదాహరణలనేకం




