మాటా మాటా పెరిగింది. తూటాదాక వచ్చింది. మనిషన్నాక మాట వుండదా? వుంటుంది. కుండకు కుండే రాపిడి. అలాంటిది మాటకు మాట రాపిడి వుండదా? వుంటుంది. అందుకని చిలికి చిలికి గాలివానవ్వదా? అయ్యింది.
ఎటొచ్చి ఆర్గ్యుమెంటు అన్నాక పెరుగుతుంది. మరి పెరిగిన ఆర్గ్యుమెంటు యెక్కడ ఆగుతుంది? ఎవరిదో వొకరిది పైచేయి అయితే ఆగుతుంది. పై చేయి అన్నిసార్లూ మాటల రూపంలో వుంటుందా? ఉండక్కర్లేదు, చేతల రూపంలోకి మారొచ్చు. అప్పుడు మాటలు ఆగిపోతాయి. సమానంగా సాగితే ఆగవు.
అయితే, మాటలు ఆగాయి. హీరో వేషాలు వేసి వేసి లీనమైపోయి కెమెరా ముందు లేకపోయినా ‘వొకే- రోల్ కెమెరా, యాక్షన్’ అనకపోయినా కాల్చేశాడు కథానాయకుడు. మదుపు పెట్టిన నిర్మాత ‘నా గన్నూ… నా బుల్లెట్టూ’ అనలేదు. ‘నీ బుల్లెట్టు కాబట్టి నీకే దించాను’ అని కథానాయకుడూ అనలేదు. ఎందుకంటే, బుల్లెట్ దిగింది. చచ్చూరుకోలేదు. చావుబతుకుల్లో వూరుకున్నాడు.
మొత్తానికి వాదనలు ఆగిపోయాయి. ఇంకా చెప్పాలంటే, యెందుకు వాదించుకున్నారో పూర్తిగా యిద్దరూ మర్చిపోయారు. కాల్పులకు గురైన నిర్మాతకే కాదు, కాల్చిన హీరోకీ యే డైలాగూ పలకలేదు. గుమ్మంలో సిగరెట్ కాల్చుతున్న డైలాగు రైటరు తుపాకీ శబ్దం విని- తానిక్కడ వుండగా యెవరో యాక్షన్‌తో కథని నెరేట్ చేసేస్తున్నారని అనుకొని- కాల్ చేస్తే వచ్చినట్టు పరిగెత్తుకు వచ్చి డోర్ దగ్గర ఆగి- ‘మే ఐ కమీన్ సర్’ అని ఆ విపత్కర పరిస్థితుల్లోనూ వినయంగా అడిగి-మరీ లోపలిగదిలోకి వచ్చాడు.
ఎప్పుడూ ప్రశ్నలు వెయ్యకుండా కావాల్సిన లేదా కోరుకున్న సమాధానాలు యిచ్చేవరకూ నచ్చి మెచ్చేవరకూ రాయడమే తెలిసిన రైటరు, సీన్ చూశాడు. ‘ఈ సీనుకి మంచి డైలాగు కావాలి’ అన్నట్టు హీరో చూపుల్ని అర్థం చేసుకున్నాడు. తన అనుభవంవల్ల హీరో క్యారక్టరైజేషన్ తెలియడంవల్ల సీన్‌ని బట్టి కథని వూహించాడు. అందుకే ‘హాస్పిటల్‌కు కాల్ చేయనా? పోలీస్టేషన్‌కు కాల్ చేయనా?’ వంటి రొటీన్ డైలాగు వేయలేదు. మూలుగుతున్న నిర్మాత వంక చూశాడు. అర్థం చేసుకున్నాడు. ‘ఇప్పుడు హీరో మీద కేసు పెడితే, లోపలేస్తే, నా సినిమా నేనూ నా కుటుంబమూ ములిగిపోతుంది’ డైలాగు చదివి వినిపించలేదు రైటరు. రైటరుకు అర్థమయిందని నిర్మాతకు అర్థమయి కొన వూపిరి కాస్త నిలకడగా మారింది.
‘నేనే గన్ యెలా కాల్చాలో తెలీక కాల్చా, అది తిరిగి నాకే తగిలింది’ అని పేపరు తీసి డైలాగు రైటరు గబగబా డైలాగు రాసేశాడు. ‘ఇందులో హీరోగారికి యే సంబంధమూ లేదు’ అని రాసి కొట్టేశాడు, కనపడకుండా. కథానాయకుడి ముఖంలోనే కాదు, నిర్మాత ముఖంలోనూ కాసింత చీకటిపోయి వెలుగు వచ్చి చేరింది.
ఆటోగ్రాఫ్ అడిగినట్టు పేడ్కు పేపర్ తగిలించి అందించాడు రైటరు. కాని నిర్మాత చేతులు చలికి వణికినట్టు ఆగకుండా వణుకుతున్నాయి.
హీరో డైలాగు రైటరూ ముఖాముఖాలు చూసుకున్నారు. రైటరు మెదడులో ఫ్లాష్ అయిందేదో కళ్ళలో కొంతే కనిపించింది. పేపర్ పేడ్ వెనక్కి తీసుకొని, ‘పెన్నులో యింకు అయిపోయింది’ అని రాసి అభినందన కోసం చూశాడు రైటర్. తలాడించాడు హీరో, ‘బాగుంది, కాని యింకా పవర్ ఫుల్‌గా రావాలి’ అన్నట్టు చూశాడు.
ఇంకొక్క క్షణం కూడా టైం తీసుకోలేదు రైటరు. సెట్ మీద అప్పటికప్పుడు రాసిన అనుభవం వూరకే పోలేదు.
‘నేను సంతకం పెట్టాలి, కాని నా ప్రాణం పోతోంది. చూస్తే పెన్నులో యింకు కూడా అయిపోయింది, అందుకని వేలిముద్ర వేస్తున్నాను’
హీరోయిన్ని ముద్దుపెట్టుకున్నట్టు డైలాగు రైటర్ని ముద్దుపెట్టుకోవాలని వొక్క క్షణం అనిపించింది హీరోగారికి. ఆ రొమాంటిక్ లుక్ చదివేసి ‘థాంక్యూ… బాబుగారు’ మెల్లగా అని, వినయంగా వంగి, ఆపై అదే స్టేట్మెంటు కింద యెడమ పక్క ‘సాక్షి సంతకం’ అని రాసి తనే సంతకం చేసేశాడు రైటరు.
ఆపై స్టేట్మెంటు కింద రక్తంలో ముంచి వేలిముద్ర వేశాడు నిర్మాత.
కాని అది నిజం కాదు. అలా అని వూహించాడు రైటరు. ఆ వూహని చెప్తే హీరో ఎక్సైట్ అయ్యాడు. అయినా యిది రియలిస్టిక్ సిచ్యువేషన్ అని గ్రహించి స్టాంప్ పాడ్ తెచ్చి నిర్మాతతో వేలిముద్ర వేయించారు. కాని తెల్లకాగితం మీద వేలిముద్ర పడలేదు. సమయానికి స్టాంప్ పాడ్ డ్రైగా అంటే యింక్ ఆరిపోయి వుంది. పెన్నులో యింకు పూర్తిగా పోసి పాడ్ పీల్చుకున్నాక నిర్మాత వేలుపట్టి వేలిముద్ర వేయించాడు రైటరు. తన జీవితంలో యింత అదృష్టం తన్నుకొస్తుందని గాని, యింపార్టెంట్ సిచ్యువేషనల్ ఛాన్స్ కలిసివస్తుందని గాని యెన్నో కథలు వూహించిన అతగాడు యెన్నడూ వూహించలేదు. తను స్టార్ హీరోగారి అంతరంగికుడినైపోయానని వూహించాడు. ఆ ఆనందం యెంతో సేపు నిలవలేదు, ‘యింతకీ నేను యెడమ చేత్తోనా లేక కుడి చేత్తోనా వేలిముద్ర వేయించాను?’ అని అనుమానం వచ్చింది. ‘అసలు కుడి యేది యెడమ యేది?’ అనేది కూడా వచ్చింది.
ఇంతలో సోఫాలో కూర్చున్న నిర్మాత దబ్బుమని కింద నేలమీద పడిపోయాడు.
హీరో లేచి వెళ్ళి నిర్మాతని వున్నాడా పోయాడా అన్నట్టు చూశాడు. ఊపిరి ఆడుతోంది అనుకున్నాడు. తీరా అనుకున్నాక అర్థమయ్యింది అది తన వూపిరి శబ్దమని. అప్పుడు ముక్కుదగ్గర వేలు పెట్టి చూశాడు. చేతికి చల్లగా తగిలింది. గాలి. కాదు, రక్తం. ఆ రక్తపు వేలిని నిర్మాత చొక్కాకే నీటుగా తుడిచేశాడు. ఆపై హీరు రైటరు వంక చూశాడు. రైటరు అర్థం చేసుకున్నాడు. ముక్కుదగ్గర వేలు పెడితే గాలి ఆడుతున్నదీ లేనిదీ తెలుస్తుందని తెలిసీ అతి చిత్తశుద్ధితో ముక్కులో వేలుపెట్టాడు రైటరు. అంతే, వూపిరి ఆడలేదేమో ‘హాచ్’మని తుమ్మాడు నిర్మాత.
ఆపై హీరోని హాస్పిటల్లో చేర్పించారు. అంటే, హీరోగారు నిర్మాతని హాస్పిటల్‌కు తరలించే క్రమంలో కాలుజారి పడ్డారు. మీడియాకు డాక్టర్లు అదే చెప్పారు. హెల్త్ బుల్టెన్లు కూడా వో మూడు నాలుగు రోజులు విడుదల చేశారు, రెండు పూటలా.
రైటరు తానక్కడ లేననుకొని జరిగినదంతా డిమెన్షియా పేషెంటులా మర్చిపోయి కొత్త సినిమా కథా రచనలో పడిపోయాడు.
అయితే, మొత్తానికి నిర్మాతకు ప్రాణాలు దక్కాయి. నెల్లన్నర తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ‘హీరో బాబుగారు కోలుకోవాలని’ కోరుకున్నారు.
కాని హీరోగారు ఆరు నెలల దాక హాస్పిటల్లోనే వుండిపోయారు. ఎందుకంటే, ఆ దెబ్బ అలాంటిదని ఫాన్స్ చాలా బాధపడిపోయి యెంతో కృంగిపోయారు. ఎక్కడికక్కడ గుడుల్లో పొర్లుదండాలు పెట్టారు. పూజలు చేశారు. పాలాభిషేకాలు చేశారు.
‘బెయిల్ రానంత కాలమూ ఆయన డిశ్చార్జ్ కారు, కాలేరు’ అని గిట్టనివాళ్ళూ వేరే హీరో ఫాన్సూ గుసగుసలాడుకున్నారు.
‘మా హీరో అంటే మజాకా? కోర్టుకు కాదుగదా- అరెస్టయి పోలీస్టేషన్ మెట్లు యెక్కకుండా కడిగిన ముత్తెంలా బయటకు వచ్చారు’ అని కాలరేగరేశారు హీరోగారి ఫాన్స్. ‘ఆ వచ్చారు, ఆపోజిట్ పార్టీ సియ్యమ్ము సేవ్ చేస్తే’ అని అవతలి హీరోగారి ఫాన్స్. ‘పై స్థాయిలో పార్టీలు వుండవు, పంతాలూ వుండవు. ఒకరికొకరు సాయం చేసుకోవడమే వుంటుంది’ అని మరికొంత మంది చేతకానివాళ్ళు గొణుక్కున్నారు.
కోర్టు కూడా ‘వావ్, వాటే క్రియేటీవ్ స్టోరీ’ అని మెచ్చుకొని- నిర్మాత, హీరో కోరుకున్న న్యాయానికి న్యాయం చేస్తూ కేసు కొట్టేసింది.
మొత్తానికి హీరోగారు రిలీవ్ అయ్యే సమయానికి ఆయన కొత్త సినిమా కూడా రిలీజ్ అయ్యింది.
హిట్టు చెయ్యాలని అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి.
సినిమా హిట్టయ్యింది!




