ఆగస్టు 15 ఉపన్యాసంలో మోదీ దేశ ప్రజలనుద్దేశించి తమ ప్రభుత్వం, సాయుధ నక్సల్స్/మావోయిస్టుల ప్రమాదాన్ని నిర్మూలించాం కానీ దిమాగీ నక్సల్స్ (మేధావి నక్సల్స్)మిగిలే ఉన్నారని, భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతి కృషి నుండి దేశ యువతను పక్కదారి మళ్ళించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అసమ్మతి గళాలపై, సమూహాలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమైన వారు ఏళ్ళుగా దేశంలోని గత ప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా పనిచేశారు. ఈ సంక్షోభం నుంచి దేశానికి విముక్తి కల్పించాం. అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లను తుదముట్టించడంలో విజయం సాధించాం. అయితే మేధో నక్సల్స్ ఇంకా మిగిలే ఉన్నారు. వారిని గుర్తించి ఏకాకులను చేయాలని దేశ పౌరులకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా దిమాగీ నక్సల్స్ జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన వారని, దీన్ని కట్టడి చేయడానికి ఓ అతి పెద్ద ‘శక్తివంతమైన స్వచ్ఛంద పౌర రక్షణా దళాన్ని’ నిర్మిస్తామని ప్రకటించాడు.

సివిల్ డిఫెన్స్ ఆక్ట్ 1968 అనుసరించి నాన్ కంబాట్ అవసరాల కోసం పౌరులను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండగా మోదీ ఏలాంటి విధులు నిర్వహించడానికని ఈ స్వచ్ఛంద పౌర రక్షణా దళాన్ని నిర్మిస్తామని ప్రకటించాడో పరిశీలించాలి. ప్రధానంగా ఈ దేశ ప్రధాని హోదాలో మోదీ బహిరంగ ఉపన్యాసంలో, ఆలోచనలు కూడా నేరంగా పరిగణించబడతాయని (thoughts to be crime) వీటిని సహించమని ప్రకటించడం దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, అభివృద్ధి కాముకులెవ్వరూ సహించరానిది. వాస్తవానికి దిమాగీ పదం కేవలం మావోయిస్టులకు మాత్రమే వర్తించేది కాదు. అది ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ పై ఆధిపత్యం చెలాయిస్తూ, దోపిడీ చేస్తున్న వారిని విమర్శించే వారందరికీ వర్తిస్తుంది. ఈ రకంగా ఆలోచించడాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే విమర్శలు 2016 లో జెఎన్ యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుష్ప్రచారం, హింసాత్మక దాడులతో ప్రారంభమైంది. అనేక మంది విద్యార్ధి నాయకులు టెర్రరిస్టులుగా ముద్ర వేయబడి, అరెస్టు చేయబడి విచారణ లేకుండా నిర్బంధించగా వారు ఇప్పటికీ జైళ్ళలోనే మగ్గుతున్నారు.

ఆ సందర్భంగా విద్యార్థులు, మేధావులను టుక్డే టుక్డే గ్యాంగ్, ఆందోళన జీవి, దేశ ద్రోహి, యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్స్ వంటి పదాలు వాడి దూషించగా ఈ వరుసలో నేడు దిమాగీ నక్సల్స్ అనే పదబంధం వాడారు. వీరిని గుర్తించి ఐసోలేట్ చేయాలన్న పిలుపు ఫాసిస్టు రాజ్యానికి, సంఘ్ పరివార్ అరాచక గుండా మూకలకు దేశ భక్తులను, ప్రజాస్వామిక వాదులను, అసమ్మతిదారులను, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని ఇచ్చిన ప్రమాదకరమైన సంకేతం ఇందులో ఉంది. భిన్నాభిప్రాయాలను నేరంగా ప్రకటించి, ఆలోచనను నేరంగా భావించి నిషేధిస్తామని ముఖ్యంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చెల్లాచెదురుగానున్న విద్యార్థుల, నిరుద్యోగుల ప్రజాస్వామిక పోరాటం నేడు గుణాత్మక మార్పు తీసుకుని కేంద్రీకృతంగా భారత సామాజికార్ధిక వ్యవస్థ మార్పు కోసం సాగే పోరాటాలకు కొత్త శక్తిని, బలాన్నందిచే దిశగా పయనించే అవకాశం ఉన్న నేపథ్యంలో …

దేశ యువతను, ప్రజలను బెదిరిస్తూ ముఖ్యంగా జెన్ జీ పోరాటాన్ని రక్తపాతంలో ముంచడానికి మోదీ స్వయం రక్షణ దళాల ప్రకటన ” రాజకీయాలను హైందవీకరించడం – హిందూయిజాన్ని మిలిటరీకరించడం ” అనే బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఆర్ ఎస్ ఎస్ ప్రణాళికకు, భావజాలానికి అనుగుణంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన అనేక వందల మారణకాండలతో పాటు ఇటీవలే నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం ఎం కల్బుర్గి, గౌరీ లంకేష్ మొదలగు వారి హంతకులందరూ ఈ భావజాల ప్రేరేపితులే.

విద్యా వ్యవస్థ కేంద్రీకృతమై –  కార్పొరేటీకరణ – కాషాయీకీరణ చెందుతున్న ఫలితంగా ఉత్పన్నమైన ప్రశ్నాపత్రాల లీకుల వ్యాపారానికి వ్యతిరేకంగా జెన్ జీ ఢిల్లీ కేంద్రంగా 37 రోజుల పాటు పోరాడి, హిందూమత విశ్వాసాలతో సంబంధం లేని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఆర్ ఎస్ ఎస్ పరిచాలిత బిజెపి మోదీ ప్రభుత్వ మెడలు వంచి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఇతర డిమాండ్లను  సాధించుకున్నారు.

దశాబ్ధంన్నర కాలంగా భయం, అబద్ధాలు, భ్రాంతి పునాదుల పై భారత సమాజాన్ని టెర్రరైజ్ చేస్తూ, కార్పొరేట్ హిందూ మత రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం సృష్టిస్తున్న హింసా విధ్వంస పథకాలకు జెన్ జీ ఆగ్రహంతో ఉప్పెనలా కదలడంతో మొదటి సారి బ్రేక్ పడింది. ఈ అవమాన భారంతో ఊగిపోతూ యువత పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిజెపి 52 సార్లు యువత పదాన్ని ఉచ్చరిస్తూనే పంద్రాగస్టు సందర్భంగా దేశాన్ని హెచ్చరిస్తూ అత్యంత బాధ్యతా రహితంగా తమ అమ్ములపొదిలోని పాత విధ్వంస పూరిత పథకమైన ఈ స్వచ్ఛంద పౌర రక్షణా దళాల నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. తమ అవగాహనలో ఉన్నట్లు, తమ గురువులు ప్రకటించి చాప కింద నీరులా అమలు జరుపుతున్నట్లుగా హిందూ సమాజాన్ని మిలిటరైజ్ చేస్తామని రాజ్యాంగం, చట్టానికి విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. దీనితో హిందూత్వ ఫాసిస్టులు రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు జరుపాలని, భారత సైన్యం స్థానంలో తమ హిందూ మతోన్మాద ఫాసిస్టు ప్రైవేటు మూక సైన్యాన్ని పటిష్ఠం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మరోసారి బట్టబయలైంది.

ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్త వినాయక దామోదర్ సావర్కర్ ప్రబోధించిన హిందూ మతంతో సంబంధం లేని హిందూత్వ వాదపు స్వార్థ పూరిత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం మన వైవిధ్యపూరిత, సహన, సహజీవన సమాజాన్ని హింసా విధ్వంసాల వైపు నెడుతున్నారు. ఈ ప్రైవేటు సైన్యం నిర్మాణ పథకానికి ఆద్యుడు హెడ్గెవార్ కు గురువైన డా.బి. ఎస్. మూంజే అనే హిందూ మహాసభ మరియు ఆర్ ఎస్ ఎస్ నాయకుడు. ఇతను 1931 ఫిబ్రవరి-మార్చ్ లలో ఇటలీ వెళ్లి ఆనాటి ఫాసిస్టు నాయకుడు బెనిటో ముస్సోలినీని కలిసి, అక్కడే మూడు నెలలు ఉండి ఫాసిస్టు పార్టీ భావజాలం,సైనిక నిర్మాణం, విద్యా సంస్థలు, శిక్షణ గురించి తెలుసుకొని వచ్చాడు. ముస్సోలినీ బ్లాక్ షర్ట్స్ గా పిలువబడే వాలంటరీ మిలీషియా పర్ నేషనల్ సెక్యూరిటీ అనే పౌర మిలీషీయాను నిర్మించాడు. ఈ అరాచక హంతక ప్రైవేటు సైన్యం ద్వారా భిన్నాభిప్రాయాలు గల రాజకీయ ప్రత్యర్ధులు, యూనియన్ నాయకులు, రచయితలు, జర్నలిస్టుల పై దాడులు,హత్యలు చేసి భయానక వాతావరణం సృష్టించాడు. హిట్లర్ ఎస్ ఎస్ అనే పేరుతో అరాచక మూకను తయారు చేసి యూదులను కమ్యూనిస్టులను ఊచకోత కోశాడు. ఈ ఫాసిస్టుల అనుభవాల అధ్యయనంతో మూంజే హిందూ సమాజాన్ని సాయుధీకరించి (మిలిటరైజ్) సామాజిక జీవితంలోని ఏ విధమైన అభిప్రాయాలు లేదా వ్యక్తీకరణలైనా అణచివేయాలని భావించాడు. మూంజే ఇతర ఆర్ ఎస్ ఎస్ నాయకులు కలిసి ముస్సోలినీ, హిట్లర్ లాగే ఆర్ ఎస్ ఎస్ ను ఒక హిందువు నియంతగా ఉండాలనే ఆదర్శం(ఐడిల్ ఆఫ్ హిందూ ఆస్ ఏ డిక్టేటర్) గా మలచడానికి హిందూ ఆధిపత్య వాద సాయుధ దళం (హిందూ సూప్రమాసిస్టు మిలీషియా) ను తయారు చేయాలని భావించారు. హింసాత్మక కార్యకలాపాల ద్వారా టెర్రర్ ను సృష్టించి సమాజం పై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భావించారు. అందుకోసం వారు యూనిఫామ్ లో ఉన్న సైనికుడికి సాధారణ పౌరుడికి తేడా లేని సైన్యాన్ని ఆశించారు. ఆ తరువాత ఆర్ ఎస్ ఎస్ ద్వారా ఎనబై వేలకు పైగా రాజకీయ, సాంస్కృతిక, విద్యార్థి, కార్మిక విభాగాల సంఘ్ పరివార్ సంస్థలతో పాటు బహిరంగంగా మారణాయుధాలు ధరించి భౌతిక దాడులు, హత్యలు చేయగల భజరంగ్ దళ్ వంటి వివిధ సేనలు సంస్థలతో పాటు ఆర్ ఎస్ ఎస్ ను ఐడియలాజికల్ ఇంకా మిలటరీ శక్తిగా మార్చుకున్నారు. వాస్తవానికి ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాల క్రితం మహారాష్ట్ర కేంద్రంగా బ్రాహ్మణీయ ఫాసిస్టు భావజాలంతో కుల వ్యవస్థను ఆధారం చేసుకుని దేశ ప్రజల పై ఆధిపత్యం చేయడానికి, వారిని దోపిడీ చేయడానికి దేశ జనాభాలో నాలుగు శాతం కూడా లేని బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకున్న కపట, కుట్రపూరిత సంస్థ. దాని నాయకత్వం స్వచ్ఛంద సేవా సంస్థ అని సాంస్కృతిక సంస్థ అని ప్రకటిస్తారు కానీ వాస్తవ కార్యాచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు.

రాజకీయాలకు సంబంధం లేదంటూనే సాంస్కృతిక సంస్థ పేరుతో వీరిచ్చే వివరణ విచిత్రంగా ఇలా ఉంటుంది. ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఎం ఎస్ గోల్వాల్కర్ మాటల్లో ” సంస్కృతి అంటే రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మతం, నిత్య జీవన వ్యవహారాలు అన్నీ కలిసినది, మొత్తం జీవితం అన్నాడు”. ఈ వివరణను బట్టి దిమాగ్ ఉన్న వారెవరైనా ఆర్ ఎస్ ఎస్ పక్కా ఆర్ధిక వ్యవస్థ పై ఆధిపత్యం కోసం కృషి చేసే రాజకీయ సంస్థ, ఐడియలాజికల్ కేంద్రం అని, పని చేయకుండా కూర్చోని తినే అధికారం కోసం నానా రకాల జిత్తులమారి ఎత్తులు వేస్తుందని అర్థం చేసుకుంటారు. దేశ ప్రజలపై వీరి ఆర్య బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం కొనసాగాలనేదే సంఘ్ పరివార్ కోరిక. వీరు చెప్పే హిందూ/భారతీయ/బ్రాహ్మణ సంస్కృతి అంటే ఈ దేశ ప్రజల పై బలవంతంగా రుద్దుతున్నటువంటిది, ఒకప్పుడు అది ఆర్య బ్రాహ్మణ సంస్కృతి, నేడది ఆర్య త్రైవర్ణ ఆధిపత్య ఫ్యూడల్, కార్పొరేట్ సంస్కృతి మాత్రమే.

వాస్తవానికి దేశ ప్రజల సంస్కృతితో సంబంధం లేనిది. ఇక్కడ ప్రతి జాతికి, ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉంది అనేది గమనించినప్పుడు కేవలం బ్రాహ్మణుల సంస్కృతి దేశ ప్రజలందరి సంస్కృతి ఎంత మాత్రం కాదు. ఆర్ ఎస్ ఎస్ ఆధిపత్య బ్రాహ్మణవాద  భావజాలంతో దాని ప్రత్యక్ష పర్యవేక్షణలో కులవ్యవస్థ ఆధారంతో నడిచే మోదీ, దేశంలోని అన్ని రంగాలలో సామ్రాజ్యవాదుల ద్రవ్య పెట్టుబడికి సేవ చేసే కులాధారిత దళారీ బడా భూస్వాముల, బడా పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని నెలకొల్పే వ్యూహాన్ని అందుకనుగుణమైన ఎత్తుగడలను అమలు జరుపుతున్నాడు.

ఇవి సహజంగానే దేశంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలను సంక్షోభంలో ముంచాయి. గతంలో కాంగ్రేసు ప్రభుత్వం ప్రారంభించి చేయలేనిది బిజెపి హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని దూకుడుగా అమలు జరపడం వల్ల దేశంలోని దోపిడీ దారులంతా బిజెపిలో చేరి మూకుమ్మడిగా ప్రజల పై విరుచుకుపడుతున్నారు. అందువల్ల దారిద్ర్యం, పేదరికం, అధిక ధరలు, నిరుద్యోగం భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ప్రతి వర్గం, కులం, తెగ, జాతి, మతం, సెక్షన్ రహదారులపై పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నారు. రాజధాని ఢిల్లీని చుట్టు ముట్టి దిగ్భందిస్తున్నారు. ఇందువల్ల గత్యంతరం లేని పాలకుల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగు తొలగించుకొని  నియంతృత్వంగా, ఇండియా తరహా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజంగా బట్టబయలైంది. బహిరంగంగా ప్రజలపై దాడులకు పధక రచనలు చేస్తున్నరు. ఇందులో భాగమే మోదీ ఆలోచించడం,  ఆందోళనలు చేయడం నేరమని డిక్లేర్ చేశాడు. వీటిని అదుపు చేయడానికి ప్రైవేటు సైన్యం నిర్మాణం చేసి హంతక దాడులకు తెగపడుతామని బహిరంగంగా ప్రకటించాడు. నిఖార్సైన దేశ ద్రోహమంటే ఇదే.

              ఆగస్టు,2026.

Leave a Reply