(జల్, జంగల్, జమీన్)
సర్కార్ చుట్టరికం
ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నది
అక్కడ నీళ్ళు ప్రవహించవు
సత్యమని నమ్మించే
పటం మీద గీసిన రేఖలతో ఉన్నది
పర్వతాలు ఔన్నత్యంతో కాదు
ఖనిజాల నిధులుగా మారినవి
ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం
ఏదో ప్రాచీన శోక గీతం వలె
ధ్వనిస్తున్నది.
కాని
ప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు
ఇప్పుడు కూడ ప్రజలు
నదిని అమ్మా అంటారు
వృక్షాలతో సంభాషిస్తారు
మట్టిని తమ నుదుటిమీద
అలంకారంగా దిద్దుకుంటారు
ప్రకృతిపై వాళ్ళ విశ్వాసం
మూఢ విశ్వాసం కాదు
అది ఇతిహాసం
అది ప్రతి ఎండాకాలం తర్వాత
ఒక పత్రహరితమై తిరిగి వస్తుంది
నగరం మనల్ని
నాగరీకుల్ని చేస్తుందని అంటారు
ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో
అడవి మిగిలి ఉంటుందో
అప్పటిదాకానే నగరం
మమ్మల్ని మనం అంటుంది
లేకపోతే
ఈ సిమెంట్ నిర్మిత అరణ్యం
శ్మశానం కన్నా ఎక్కువేమీ కాదు
అభివృద్ధి
నీ శబ్ద కోశం లో
ప్రకాశమానం కావచ్చు
కానీ అది మా కళ్ళల్లో
దుమ్ము వలె నిండిపోతుంది
అభివృద్ధి వస్తుందంటే
వినాశ పదఘట్టన
విధ్వంస ధూళి
విస్థాపనతో అంతులేని
నిర్వాసితత్వం
తన వెంట తెస్తుంది
ప్రతి ప్రాజెక్టు కింద
ఎన్నో మునిగిపోయిన
గ్రామాలుంటాయి
ప్రతి రోడ్డు పక్కన
కొల్లగొట్టబడిన స్వప్నాల కుప్ప
ఉంటుంది.
జ్ఞాపకం పెట్టుకో
నీళ్ళు, అడవి, భూమి,
మామిడి తోపు
అవి సంపన్నుల సంపదలు కావు
అవి మా సంస్కృతి
అవి మా స్మృతులు
అవి మా అస్మితకు మూలాలు
ఎవరి చేతుల్లోని
పనిముట్లలో ఇంకా
మట్టి పరిమళాలు మిగిలి ఉన్నాయో
ఎవరి రక్తనాళాల్లో
ఇంకా నదులు ప్రవహిస్తున్నాయో
ఎవరి కళ్ళల్లో
ఇంకా పర్వతాలు
అచలంగా, విద్రోహంగా
నిలిచి ఉన్నాయో
వాళ్ళే సంరక్షించుకుంటారు
ఎందుకంటే..
ఏ రోజు వాళ్ళు ఊరుకున్నారో
ఆ రోజు కేవలం అడవియే
నరకబడదు
మానవత్వం సంపూర్ణంగా
మూలాల నుంచి పెకిలించబడుతుంది
ఎగిసిపడే నదులు
కళ్ళల్లో ఎండిపోయిన
అశ్రువులవుతాయి
పర్వతాల ఎముకలు
సిమెంటుగా మార్చబడతాయి
నీ ‘స్మార్ట్ సిటీ’
మామిడితోపు శవాలపై లేస్తుంది
అప్పుడు ఏ పార్లమెంటూ మాట్లాడదు
అప్పుడు అడవి ఆక్రోశం
మాట్లాడ్తుంది
ఆ ఆక్రోశం
తరతరాలుగా అణచివేయబడింది
అది ఒక రోజు పెనుకేక అవుతుంది
ఆ ప్రళయగర్జనలో
నీ చట్టాలన్నీ
కాగితాలపడవల వలె మునిగిపోతాయి
ప్రజలు కదులుతారు
పిడికిట్లో విత్తనాలనే
ఆయుధాలుగా వికసింపచేసి
ప్రతి దోచుకోబడిన నేల మీద
ఒక నూతన అరణ్యాన్ని రచిస్తారు
నది కేవలం ప్రవాహం కాదు అది మా భాష
పర్వతం కేవలం రాయి కాదు అది మా వెన్నెముక
అడవి కేవలం కలప కాదు
అది మా సామూహిక స్వప్నం
మరి అప్పుడు...
అప్పుడు నగరం కూడ శ్వాసించడం నేర్చుకుంటుంది
కాలుష్యం లేకుండా
వినాశం లేకుండా
ఎందుకంటే ఈ పోరాటం
కేవలం భూమి కోసం కాదు
ఈ యుధ్ధం
మనిషిని మనిషిగా మార్చడానికి
ఐతే రా,
అభివృద్ధి పరిభాష మార్చేద్దాం
ఈ వినాశ ‘యుగం’లో
ఒక కొత్త అర్ధాన్ని ఆవిష్కరిద్దాం
అక్కడ రోడ్డు చెట్లను అడిగి ఏర్పడుతుంది
అక్కడ కర్మాగారాలు నదుల నుంచి అనుమతి కోరుతాయి
అక్కడ పర్వతాలను
నష్టపరిహారం భాషలో కాదు
గౌరవించే భాషలో చదువుతాం
ఇంకా చివరకు
వచ్చే తరం ‘మా కోసం ఏం మిగిల్చావు’
అని అడిగినపుడు
మనం తల వంచుకొని కాదు
ఛాతీ విప్పార్చి
చెప్పగలగాలి
మేం కేవలం మమ్మల్ని మేమే కాదు
ఈ ధరిత్రి హృదయాన్ని కాపాడామని
- ఫెల్లో ట్రావెలర్
• నక్శా - మాప్
Related