న్యాయమే
అన్యాయాన్ని న్యాయమని చెప్తుందా?
అయితే అది అన్యాయమే
చావును నిషేధిద్దామనే న్యాయం చెప్పేది
చావు ఎవరికైనా నిషేధమే కదా
చంపితే తప్పనే కదా
వేటగాళ్ళని నిషేధిస్తం
చంపితే తప్పనికదా
పోలీసోళ్ళకు పాఠం చెప్తాం
కొట్టడం తప్పే కదా
బతకనివ్వడం న్యాయం
బతకనియ్యకపోతే ఎదిరించడం న్యాయం
బతుకు బతుకులెక్క లేకపోతే అన్యాయం
బతుకనివ్వకపోతే పానాలు పోయేదాక
జంతువులు కూడా పోరాడుతాయి
మరి మనుషులు !
నిషేధించిన గాలి పీల్వకు
నిషేధించిన నీడలో నిలబడకు
నిషేధించిన నినాదం నీకెందుకు?
నిషేధించింది నీకు నువ్వే
కడమదంతా ప్రజలే
పదికంఠాలకు ఉరి
ఇది ఎవరికి వేసిన ఎర
నిజమేదో తెలిసినా మాట్లాడేది రాజ్యం గొంతుకతో
నిజమేదో తెలిసినా తీర్పిచ్చేది రాజ్యం వంతుతోనేకదా
సత్యం చెర, ధర్మం వధ
మాట్లాడితే నేరం
ఎదురాడితే నిషేధం
నిలదీస్తే ఉరిదీసుడు
శభాష్ దేశమా నీ పేరే రాజకీయం




