అనిల్ అగ్రవాల్

కొత్త “ఆశ్వాసన” vs ఆదివాసుల పురాతన విశ్వాసం


నియమగిరిలోని డోంగ్రియా కొంధ్ ఆదివాసుల చేతిలో వేదాంత ఇప్పటికే ఒక ఎదురుదెబ్బను చవిచూసింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2013లో గ్రామసభలు విజయం సాధించి, తమ కొండపైన బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యమైంది. పదమూడు సంవత్సరాలు గడిచాయి, నియమగిరి ఇంకా అట్టుడుకుతూనే ఉంది. మొదట, ప్రముఖ ఆదివాసీ నాయకుడు లాదా సికాకాను అరెస్టు చేశారు, ఆ తర్వాత వేదాంత యజమానులు ఒడిశా ముఖ్యమంత్రితో సమావేశమై నవంబర్ నాటికి అంతా సర్దుకుంటుందని తమ “విశ్వాసాన్ని” వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రామసభలు తీసుకున్న సామూహిక నిర్ణయం కంటే ఈ సమావేశం పెద్దదేనా? ఇన్నేళ్లలో ఇంతగా ఏం మారింది? – నియమగిరిపై రంజనా పాధి పరిశీలన
2026 సెప్టెంబర్ 27 శనివారం నాడు భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ, వేదాంత యజమాని అనిల్ అగర్వాల్‌ల మధ్య సమావేశం జరిగిందన్న వార్త విస్తృతంగా వ్యాపించింది. అనిల్ అగర్వాల్ దక్షిణ ఒడిశాలోని బాక్సైట్ నిక్షేపాల గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం నియామ్‌గిరి బాక్సైట్ నిల్వలే కావడం ఆశ్చర్యకరమేమీ కాదు, ఎందుకంటే వేదాంత సంస్థ చాలా కాలంగా వీటిపై ఆసక్తిని కనబరుస్తోంది.
సమావేశం తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో, కలహండి, రాయగడలో వేదాంత ప్రతిపాదించిన గనులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు నవంబర్ నాటికి పరిష్కారమవుతాయని సూచిస్తూ, “ఈ రాష్ట్ర ప్రభుత్వంపైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. నవంబర్ నాటికి అంతా సర్దుకుంటుంది. నాకు ఎక్కడా ఎలాంటి అడ్డంకులు కనిపించడం లేదు. నేను నా యవ్వనంలో ఒడిశాలో నివసించాను, ఇక్కడి ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు” అని అగర్వాల్ అన్నాడు.
ఏనుగు దంతాలు కనపడేవి వేరే, తినడానికి వేరే అన్నట్లు ఈ ప్రకటన, ఈనాడు ఒడిశా ఆదివాసీ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి, ఈ ప్రాంతంలోని అపారమైన బాక్సైట్ నిల్వలను చేజిక్కించుకోవడానికి పెద్ద మైనింగ్ కంపెనీలకు పూర్తి మద్దతు ఇస్తున్నారు అనే వాస్తవాన్ని తెలియచేస్తుంది. ముఖ్యమంత్రికి, వేదాంత యజమానికి మధ్య జరిగిన ఈ వ్యూహాత్మక సమావేశానికి ముందు, నియమగిరి సురక్షా సమితి (ఎన్ఎస్ఎస్)తో సంబంధం ఉన్న డోంగ్రియా కోందు ఆదివాసుల గౌరవనీయ, ప్రజాదరణ పొందిన నాయకుడు లాదా సికాకాను సెప్టెంబర్ 10న అరెస్టు చేసారనేది గమనించాల్సిన విషయం. అందుకు నిరసనగా భారీ వర్షంలో వేలాది మంది ఆదివాసులు కళ్యాణ్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. వారు “లాదా సికాకాను విడుదల చేయండి!”, “వేదాంత గో బ్యాక్!” వంటి నినాదాలు చేశారు. కానీ విచారకరమైన విషయం, ప్రధాన మీడియా వారి గొంతులను బయటకు రానివ్వలేదు.


పదమూడు సంవత్సరాలు-ఒక ప్రశ్న


ఈ తరుణంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవడం ముఖ్యం: 2013 ఏప్రిల్ 18న, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, నియమగిరి కొండలలోని బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్‌ గురించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని గ్రామ సభలకు (గ్రామ మండల్ లకు) కల్పిస్తూ సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆ తర్వాత, జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలలో, 112 గ్రామాలకు చెందిన 12 గ్రామ సభలు, వేదాంత, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ప్రతిపాదించిన బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఈ విధంగా, సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు, కొండలలో నివసిస్తున్న డోంగ్రియా కోందు ఆదివాసుల సాంస్కృతిక, ధార్మికపరమైన హక్కులను మాత్రమే కాకుండా, నియమగిరి కొండల కింది ప్రాంతాలలో ఉన్న గ్రామాలలో నివసిస్తున్న కుటియా కోందు, దేశీ కోందు సముదాయాల వారి హక్కులను కూడా పరిరక్షించింది. అయితే, ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసుల ధార్మిక, సాంస్కృతిక హక్కులను ఇప్పుడు ఇంత సులభంగా త్యాగం చేయడానికి, ఈ మధ్యకాలంలో ఏమి మార్పు వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతుంది?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, నియమగిరి ఉద్యమంలో ప్రముఖ నాయకుడైన లాదా సికాకా ఇటీవలి అరెస్టును మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే, 2013 సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ ఆ ప్రాంతం ఎందుకు ఉద్రిక్తంగా, అట్టుడికిపోతూ ఉందో నియమగిరి పూర్తి సందర్భం వెల్లడవుతుంది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ముఖ్యంగా 2014 నుండి కోవిడ్-19 విపత్తు ప్రారంభమయ్యే వరకు, ఆ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దాడులు జరిగాయి, ఏకపక్ష అరెస్టులు జరిగాయి. నివాసితులపైన లెక్కలేనన్ని కేసులు నమోదు అయ్యాయి. విపత్తు సమయంలో, నియమగిరిలో వందలాది చెట్లను నరికివేశారు. కొండ దిగువ నుండి శిఖరం వరకు వెడల్పాటి రోడ్లను నిర్మించారు. అదే ప్రక్రియ మరోసారి మొదలైంది.


లాదా సికాకా అరెస్టు

కొన్నిసార్లు న్యాయ యంత్రాంగం చట్టానికన్నా తానే పై స్థాయిలోకి మారిపోతుంది—అరెస్టులు, అభియోగాలు, సుదీర్ఘ కాల కోర్టు విచారణలు కేవలం అసమ్మతిని అణచివేయడానికే ఉపయోగపడినప్పుడు, అవి న్యాయ సాధనాలుగా పనిచేయడం మానేస్తాయి. డోంగ్రియా కోందు ఆదివాసీ సముదాయ నాయకుడైన లాదా సికాకా అరెస్టు సరిగ్గా అలాంటి సందర్భమే.
నియమగిరి కొండలను కాపాడే పోరాటంలో సికాకాది ఒక ప్రముఖ స్వరం. ఆయన అరెస్టు న్యాయ సాధనాలనే విచారణకు గురిచేసింది. ఆయన కేసు ఏకాంతమైనది కాదు. భూమి, అడవులు, స్వయం పరిపాలనపై తమ హక్కులను ఆదివాసీ సముదాయాలు నిరంతరం నొక్కిచెబుతున్న ఈ ప్రాంతంలో పోలీసుల చర్యలు, క్రిమినల్ కేసులు, ఉపా చట్టం కింద అభియోగాలు, భద్రతా బలగాల సుదీర్ఘ చరిత్రను ఇది ప్రతిబింబిస్తుంది.
సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో, ఒక కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత లంజిగఢ్ కోర్టు నుండి లాదా సికాకా తన న్యాయవాది, ఆరుగురు సహచరులతో కలిసి తన గ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు, కళ్యాణ్‌సింగ్‌పూర్ సమీపంలో ఒక సాయుధ పోలీసు బృందం వారి వాహనాన్ని అడ్డుకొంది.

తొమ్మిదేళ్ల నాటి కేసు (కేసు నెం. 349/2017)కు సంబంధించి, లంజిగఢ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఈ ఏడాది మార్చి 9న సికాకాను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించి, అతని ఆస్తిని జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించాలని రాయగడ జిల్లాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆదేశించాడు. ఈ విషయమై సికాకా ఒడిశా హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారెంట్‌ను, జప్తు ఉత్తర్వును రద్దు చేసి అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సికాకా తప్పనిసరిగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరై లొంగిపోవాలని హైకోర్టు షరతు విధించింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దీనిని పాటించింది.
మొత్తం నియమగిరి కొండల పరిరక్షణ కోసం పోరాడుతున్న డోంగ్రియా కోందు సముదాయ నాయకుడికి ఆస్తి జప్తు నోటీసు జారీ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే, అతడిని కోర్టుకు హాజరుపరిచేందుకే ఈ వ్యవహారం మొత్తం పన్నాగం పన్నారని స్పష్టమవుతుంది. అయితే, సికాకా తన గ్రామానికి తిరిగి రావడం కోసం రాయగడ పోలీసులు అప్పటికే మాటువేసి ఉన్నారు. ఈ పోలీసు బృందానికి కేసింగ ఎస్‌డిపిఓ నాయకత్వం వహించగా, కళ్యాణసింగ్‌పూర్, విశ్వనాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ల ఇన్‌చార్జులు కూడా ఇందులో ఉన్నారు. ఆ పోలీసు బృందం సికాకాను బలవంతంగా తీసుకువెళ్లింది.
ఆ సంఘటనా స్థలంలోనే ఉన్న న్యాయవాది నరేంద్ర మొహంతి వారెంట్ చూపించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన, మరికొందరు పోలీస్ స్టేషన్లలో విచారించి, సికాకా ఆచూకీ కోసం రాయగడకు వెళ్లారు. మొహంతి ప్రకారం, “అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మేము రాయగడ పోలీస్‌ సూపరింటెండెంట్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాము, కానీ మమ్మల్ని వేచి ఉండేలా చేశారు. మేము మరుసటి రోజంతా రాయగడ కోర్టులోనే ఎదురుచూస్తూ గడిపాము. లాదా సికాకాను పలు ప్రాంతాలకు తీసుకెళ్లిన తర్వాత, సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి 10:30 గంటలకు కోర్టులో హాజరుపరిచి, రాయగడ జైలుకు పంపినట్లు వార్తలు వచ్చాయి.”
కోర్టు పత్రాలను పరిశీలిస్తే, సికాకాను కోర్టు వారెంట్, అరెస్టు మెమో ఆధారంగానే నిర్బంధించారని స్పష్టమైంది. ఆ తర్వాత పోలీసులు అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేశారు. అతడిని నిర్బంధించిన రాత్రి, పోలీసులు సికాకా కోసం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక లాంఛనం మాత్రమే. ఆ న్యాయవాది ‘నిందితుడి’ తరఫున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ లాంఛనాలన్నీ చీకటిలోనే పూర్తయ్యాయి. రోజంతా కోర్టులో వేచి ఉండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అనేకసార్లు ఫోన్ కాల్స్ చేసినప్పటికీ, అడ్వకేట్ మొహంతికి, సికాకా కుటుంబానికి, యావత్ సమాజానికి దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాతే అతని ఆచూకీ గురించి తెలియజేశారు.
గత సంవత్సర కాలంలో లాదా సికాకాపై పెరుగుతున్న కేసుల సంఖ్య, నియమగిరి కార్యకర్తల అరెస్టులు, అదృశ్యాల నేపథ్యంలో చూసినప్పుడు, ఈ తాజా సంఘటన మరింత నిర్ణయాత్మకమైన కోణాన్ని సంతరించుకుంటుంది. దీర్ఘకాలిక భద్రతా కార్యకలాపాల నీడలో ఇప్పటికే జీవిస్తున్న సముదాయాలపైన ఉగ్రవాదం, రాజద్రోహం వంటి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన చట్టాలను ప్రయోగించడం వల్ల కలిగే పరిణామాలు న్యాయస్థానాల పరిధిని దాటిపోతాయి. అవి ప్రజల దైనందిన జీవితాలను మార్చివేస్తాయి. అంతేకాకుండా, అది రాజకీయ అసమ్మతిని, సామాజిక ఐక్యతను నేరపూరిత, జాతీయ భద్రతా ప్రశ్నలుగా మార్చేస్తుంది.
ప్రజాదరణ ఉన్న కాలంలో నీరు, అడవి, భూమి కోసం పోరాటాలు
స్పష్టంగా, మన ఆదివాసీ ముఖ్యమంత్రి హయాంలో వేదాంతకు మార్గం సుగమం అవుతుందని అనిల్ అగర్వాల్‌కు నమ్మకం ఉంటుంది అనేది స్పష్టమే కదా? అన్నింటికీ మించి, 2013లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు ముందు, ఆ తర్వాత కూడా ఆయన మన న్యాయవ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. డజన్ల కొద్దీ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి, ఆ తర్వాత అవి అరెస్టులకు దారితీశాయి. తమ భూమిని, అడవులను, పర్వతాలను, దేవుళ్లను, దేవతలను రక్షించుకోవడానికి ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని ఒక నేరంగా పరిగణించే విధానమే ఇది.


కఠినమైన చట్టాల వాడకం


ఉపా చట్టంలోని సెక్షన్లు, ‘రాజ్యంపై యుద్ధం’కు సంబంధించిన 14 ఏళ్ల నాటి కేసు (జి‌ ఆర్ కేసు నెం. 565/2012, కళ్యాణసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ కేసు నెం. 75/12కి అనుసంధానం) ఆధారంగా లాదా సికాకాను కోర్టులో హాజరుపరిచారు. అతను ఒక మావోయిస్టు సంస్థలో సభ్యుడిగా ఉన్నాడనే ఆరోపణలపైన అరెస్టు చేసారు.
ఈ కేసు 2012 నాటిది. ఆ సమయంలో వేదాంతకు వ్యతిరేకంగా ఆదివాసుల నిరసనలు, ఉద్రిక్తతలు పతాకస్థాయిలో ఉండటంతో, 2013లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుండి, నియమగిరిలో మోహరించిన సి ఆర్ పి ఎఫ్ ను ఎన్నడూ తొలగించలేదు. నిరంతర నిఘా క్రమంగా ఆ ప్రాంతాన్ని “సంఘర్షణ ప్రాంతం”గా మార్చింది. తదనంతరం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన వార్షిక నివేదికలో, నియమగిరి సురక్షా సమితికి “మావోయిస్టు” సంస్థలతో సంబంధం ఉందని, ఆ సమితి కార్యకలాపాలను మావోయిస్టులు “నిర్దేశిస్తున్నారని” రాసింది. వాస్తవానికి, ఈ ప్రకటనకు ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదు. ప్రజా ఉద్యమాలను అప్రతిష్టపాలు చేయడానికి, వాటితో సంబంధం ఉన్నవారిపైన అత్యంత కఠినమైన చట్టాలను ఉపయోగించడాన్ని సమర్థించుకోవడానికి మీడియాకు వేసిన ఎర మాత్రమే అది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడినప్పటి నుండి, ఉపా చట్టంలోని సెక్షన్లను తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు, లాదా సికాకా తదితర నాయకుల పేర్లతో ఉన్న ఒక కేసులో (FIR నెం. 26/17), గుర్తు తెలియని వ్యక్తులు ఒక మద్యం దుకాణంపైన దాడి చేసి మావోయిస్టు పోస్టర్లను అంటించారని ఆరోపణ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 121ని ప్రస్తావిస్తుంది. ఈ సెక్షన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, యుద్ధం చేయడానికి ప్రయత్నించడం లేదా ప్రేరేపించడం వంటి నేరాలకు సంబంధించినది; దీనికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. హింస ద్వారా ఏదైనా ప్రజా లక్ష్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని నిర్వహించడం, అందులో చేరడం లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం వంటి ఆరోపణలను కూడా ఇది పరిధిలోకి తెస్తుంది.


https://followupstories.com/
తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply