మారుతి పౌరోహితం స్వస్థలం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే గువ్వలదొడ్డి అనే చిన్నగ్రామం. పౌరోహిత్యం, వ్యవసాయం చేసుకునే కుటుంబం నుండి వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణా కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. “పునరపి ” తొలి కథ(2016). “ఊరిమర్లు” “ఇల్లిడిసిన తొమ్మిది కథలు” కథా సంపుటాలు, “ప్రణయ హంపీ” చారిత్రక కాల్పనిక నవల ప్రచురించారు.
మారుతి పౌరోహితం రాయలసీమ మట్టివాసనను, అక్కడి మనుషుల జీవితాలను, వారి భాషను, వారి బాధలను, బతుకు పోరాటాలను తన రచనల్లో ఆవిష్కరించే కథారచయిత, నవలాకారుడు. పుస్తక పఠనాన్ని తన సాహిత్య ప్రయాణానికి పునాదిగా చేసుకున్న ఆయన, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ సాధారణ మనుషుల జీవితాల్లోని అసాధారణ కథలను తనదైన శైలిలో చెబుతున్నారు. ప్రత్యేకమైన రాయలసీమ నుడికారం, వాస్తవిక జీవితాల చిత్రణ వీరి రచనల్లో కనిపిస్తాయి. మారుతి పురోహితం మాట్లాడే పుస్తకాల గురించి ఇలా అంటున్నారు..
- మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?
మా స్వంత ఊరు ఎమ్మిగనూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండే గువ్వలదొడ్డి అనే ఓ చిన్న గ్రామం. మా ఊర్లో ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో రాముడు, రావణుడు, సీత వంటి మొనోగ్రాఫ్స్ ఉండేవి. నేను వాటిని ఇంటికి తీసుకువెళ్లి చదివేవాడిని. అయితే అవి చాలా పరిమితంగా ఉండడం వలన చదివిన వాటినే మరలా మరలా చదివేవాడిని. హైస్కూలు చదువుకు గోనెగండ్ల అనే గ్రామానికి వచ్చిన తరువాత జానపద కథలతో కూడిన పాకెట్ సైజ్ పుస్తకాలు దొరికేవి. స్నేహితులదగ్గర వాటిని తీసుకొని చదివేవాడిని. ఇంటర్మీడియట్ కు ఎమ్మిగనూరు వచ్చిన తరువాత యండమూరి, కొమ్మనాపల్లి , యర్రంశెట్టి లాంటి వారి నవలలను రోజుకు పావలా చొప్పున అద్దెకు తీసుకొని చదివేవాడిని. ఒక్కరోజులో ఒక్కరోజులో ముగించకపోతే అద్దె పెరుగుతుందనే భయంతో ఒక్కరోజులోనే చదవాల్సి వచ్చేది. ఎమ్మిగనూరులో డిగ్రీ చదువుతున్న రోజుల్లో సీరియస్ సాహిత్యం పరిచయం అయ్యింది. ప్రస్తుతం మానవహక్కుల వేదికలో పనిచేస్తున్న యు.జి. శ్రీనివాసులు మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. ఆయన ద్వారా పౌరహక్కుల ఉద్యమం , విప్లవ ఉద్యమాల గురించి తెలిసింది. ఆ పరిచయంతో సీరియస్ సాహిత్యం చదవడం ప్రారంభించాను. ఎమ్మిగనూరులో తెలుగు ఉపాధ్యాయుడు ఈశ్వరప్పగారని ఉన్నారు. ఆయన మంచి మంచి పుస్తకాలను తెప్పించి అమ్మేవారు. నా ఆర్ధిక పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి వాయిదా పద్ధతుల్లో ఆయనకు కొన్న పుస్తకాలకు డబ్బులు చెల్లించేవాడిని. అలా ఆయన వలన మా ఇంట్లో చిన్న లైబ్రరీ మొదలు అయ్యింది.
- మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.
పుస్తకాల ఎంపికలో ఎక్కువగా నేను అనుసరించే పద్ధతి ఏమంటే ఎవరైనా గొప్ప సాహితీవేత్తలు తమ వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో మంచివిగా సూచించిన పుస్తకాలను ఎంపిక చేసుకుంటాను. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనేకమంది వివిధ పుస్తకాల సమీక్షలు, పరిచయ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. అటువంటి పరిచయ, సమీక్షా వ్యాసాలను ఆధారం చేసుకొని కూడా కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకొని కొంటూ ఉంటాను. మా ఇంటిపైన లైబ్రరీ కోసమే రెండు గదులు కేటాయించుకున్నాను. పుస్తకాలను అరలవారీగా నంబరింగ్ ఇచ్చి ఆ వివరాలను ఒక పుస్తకంలో నమోదు చేసుకుంటాను. ఆ వివరాలన్నీ ఎక్సెల్ షీట్ లో నమోదు చేసుకొంటాను. ఏదైనా పుస్తకం అవసరం అయినపుడు ఆ ఎక్సెల్ షీట్ లో వెతికి పుస్తక సంఖ్య తెలుసుకొని ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకొంటాను. ఈ ఏర్పాటు ఎందుకు చేసుకున్నానంటే నా దగ్గర లేదు అనుకొని మరలా మరలా కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇందులో ఉన్న మరో వెసులుబాటు ఏమంటే వెతకడానికి సమయం ఆదా అవుతుంది.
- మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి
ఒకప్పుడు పేదరికం కారణంగా అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. చదవాలని అనుకున్న పుస్తకాన్ని కొని చదువగలుగుతున్నాను. మార్కెట్లో దొరకకపోతే ఆర్కైవ్స్‌లో డౌన్లోడ్ చేసుకొని చదువు తున్నాను.
- ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.
నేను పుస్తకాలు ఎవరికీ ఇవ్వను. నా దగ్గర ఏఏ పుస్తకాలు ఉన్నాయో ఎవరికీ చెప్పను. ముఖ్యంగా నా లైబ్రరీకు తీసుకువెళ్ళి ఇన్ని పుస్తకాలు సేకరించానని ప్రదర్శన చేయను. నా అనుభవం ఏమంటే ఎవరిని తీసుకువెళ్లి పరిచయం చేసినా ఏదో ఒక పుస్తకం చేతిలోకి తీసుకొని చదివి ఇస్తామని మొహమాట పెట్టి తీసుకు వెళతారు. ఆ పుస్తకం మరలా మనకు తిరిగి రాదు. అలా నేను పోగొట్టుకున్న నాకు ఇష్టమైన పుస్తకం“ కాగడాగా వెలిగిన క్షణం”. మరలా కొందామంటే ఎక్కడా దొరకలేదు. అయితే ఒకరోజు విజయవాడలో అరణ్యకృష్ణ గారి బుక్ షాప్ లో పాత పుస్తకం కనబడింది. ఆ పుస్తకాన్ని నా చేతుల్లో తీసుకున్నప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అమరుడు ఎం.ఎస్.ఆర్‌ను చూసినంత ఉద్వేగానికి గురయ్యాను.
- మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి.
నిజంగా పుస్తకం నాకు ప్రాణ సమానమే. నాలో కాస్తోకూస్తో మంచితనం ఎక్కడైనా ఉంది అంటే అది పుస్తకం చదవడం వల్ల వచ్చిందే. పుస్తకం నాకు ఒక మనిషిగా ఎలా జీవించాలో నేర్పుతూ ఉంది. నాకు ఒక గురువుగా నిరంతరం నా ప్రవర్తనకు మార్గదర్శనం చేస్తోంది. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తిని పుస్తకాలు ఇస్తున్నాయి.
- ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి.
ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఏర్పాటు చేసుకోను. ఖాళీ సమయాలన్నీ పుస్తకం చదవడానికే. అయితే పుస్తక పఠనం అనేది జైవిక సంబంధమైన (Biological) అంశమేమో అని నా అనుమానం. ఒక ఇంట్లో అందరికీ ఒకే రకమైన వాతావరణం ఉన్నా వారిలో కొందరికి మాత్రమే పుస్తకం చదవడం పట్ల ఆసక్తి ఉంటుండడాన్ని నేను గమనించాను. గతంలో నేను పనిచేసిన పాఠశాలల్లో కొంతమంది పిల్లలు మాత్రమే పుస్తకాలు లైబ్రరీలో తీసుకొని చదివేవారు. నాకు స్వభావరీత్యా పుస్తక పఠనం అలవాటు ఉండడం వలన వీలు ఉన్నప్పుడంతా చదువుతూ ఉంటాను.
- మీలో, మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.
పుస్తకాలు చదవడం అనే అలవాటు నన్నొక రచయితను, నవలాకారుడిని చేసింది. నేను నాల్గవ తరగతి చదువుతున్నప్పటి (1978) నుండి పుస్తకాలు చదువుతున్నప్పటికీ రాయాలి అనే ఆలోచన వచ్చింది మాత్రం 2016లో. విపరీతంగా పుస్తకాలు చదువుతున్నా రాయాలి అనే ఆలోచన ఉండేది కాదు. శివరామ కారంత్ రాసిన “మరల సేద్యానికి” నవల చదివిన తరువాత “అరే నా జీవితంలో ఇంతకుమించిన సంఘర్షణ ఉందికదా? నేనెందుకు రాయకూడదు?” అనిపించింది. అలా అనుకొని నేను రాసిన మొదటి కథ “పునరపి”. ఆ కథకు మంచి పేరు రావడంతో కథలు రాయడం కొనసాగించాను. అయితే నేను సంవత్సరానికి రెండు కథలు మాత్రమే రాస్తున్నాను. ఈ అంశాన్ని కథగా రాయాలి అనిపించినప్పుడే రాస్తాను. ఇలా పుస్తక పఠనం నన్ను రచయితను చేసింది




