చరిత్ర అధ్యయనం, చరిత్ర పరిశోధన వీటి మీద మనకు మార్గదర్శక సూత్రం ఏమిటంటే గతానికన్నా వర్తమానాన్నే ఎక్కువ పట్టించుకోవాలి. చైనా చరిత్రను ముఖ్యంగా 1840 నల్లమందు యుద్ధం నాటి నుంచి బాగా అధ్యయనం చేయమని మావో చెప్పారు.

అలాగే ప్రపంచ చరిత్ర చదివేప్పుడు కూడా మనం ఈనాటి చరిత్రనే ఎక్కువగా చదవాలి. నేటి వర్గపోరాటాలు, ప్రధాన వైరుధ్యాలు ప్రపంచంలో ఎలా పరిణమిస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఇవాళ అంతర్జాతీయ సమస్యలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ ఒక క్రమపద్ధ‌తిలో పరిశీలించాలి. ఆనాటి వర్గ పోరాటాల నుంచి అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకుంటే ఈనాటి వర్గపోరాటాలను అర్థం చేసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడతాయి.

మూడు దశలు:

ఇంగ్లీషు బూర్జువా విప్లవం (1640) నాటి నుంచి ఆధునిక ప్రపంచ చరిత్రకు సుమారు 300 ఏళ్లు గడిచింది. దీనిని మూడు దశలుగా విభజించవచ్చు.

1. 1640 నుంచి 1871 పారిస్ కమ్యూన్ వరకు.  ఈ దశలో పెట్టుబడిదారీ విధానం ఉదారంగా వుంది. దీర్ఘకాలిక పోరాటాల ద్వారా ఐరోపా, అమెరికాల్లో అనేక దేశాల్లో భూస్వామ్య విధానాన్ని తోసిరాజంది.

 2. 1871 నుంచి 1917 రష్యా విప్లవం వరకు. ఈ దశలో ఉదారంగా వున్న పెట్టుబడిదారీ విధానం గుత్తపెట్టుబడి విధానంగా మారింది. ఇదే దశలో సోషలిస్టు, జాతీయ ప్రజాస్వామ్య విప్లవోద్యమాలు పెట్టుబడిదారీ, వలస, సామ్రాజ్యవాదాలపై ఎదురుదెబ్బ తీశాయి. 1917 తర్వాతి దశ, లెనిన్ నాయకత్వాన జరిగిన రష్యా అక్టోబరు విప్లవం ప్రపంచ చరిత్రలో కొత్త యుగాన్ని స్థాపించింది. ఆనాటి నుంచి ప్రపంచ చరిత్ర మూడవ దశలో అడుగుపెట్టింది.

3. అదే నేటి చ‌రిత్ర అని మావో అన్నారు. ఈ చారిత్ర‌క ద‌శ‌లో పెట్టుబ‌డిదారీ, సామ్రాజ్య‌వాదాలు కూలిపోతోంటే ప్ర‌పంచ సామ్య‌వాదం, జ‌న‌తా ప్ర‌జాతంత్రం ముందుకు పోతున్నాయి.

ఒక‌వైపు పెట్టుబ‌డిదారీ పుట్టుక‌ పెరుగుద‌ల‌ ప‌త‌నం, ఇంకో ప‌క్క సామ్య‌వాదం పుట్టుక‌, పెరుగుద‌ల పురోగ‌మ‌నం  మ‌నం చూస్తున్నాం. పెట్టుబ‌డిదారుల‌కు వ్య‌తిరేకంగా పీడితుల‌ తాడితుల పోరాటాలు, వ‌ల‌స‌,  సామ్రాజ్య‌వాదాల‌కు వ్య‌తిరేకంగా వ‌ల‌స దేశాల ప్ర‌జ‌ల‌ పోరాటాలు , అగ్ర దేశాల జోక్యానికీ దోపిడీకి వ్య‌తిరేకంగా బ‌డుగు దేశాల తిరుగుబాట్లు మ‌నం నేటి ప్ర‌పంచంలో క‌ళ్లారా చూస్తున్నాం. ఒక్క‌మాటలో చెప్పాలంటే నిన్న‌టి ప్ర‌పంచంలోని వైరుధ్యాలే నేటి ప్ర‌పంచంలో కొత్త ప‌రిస్థితుల్లో కొన‌సాగుతున్నాయి. 

మౌలిక వైరుధ్యాలుః

నేటి ప్రపంచంలోని మౌలిక వైరుధ్యాలు, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదాల మధ్య వైరుధ్యాలు, సోషలిస్టు విప్లవం, వలస దేశాల్లో తిరుగుబాట్లూ-  వీటన్నింటినీ చక్కగా విడమర్చి పరిశీలించి మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. వీటిని గురించిన అంచనాలు, నిర్ణయాలు మనకి ముఖ్యంగా మూడు రచనల్లో కనిపిస్తాయి.  1. కమ్యూనిస్టు ప్రణాళిక (మార్క్స్, ఎంగెల్స్) 2. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అంత్యదశ (లెనిన్). 3.  నూతన ప్రజాస్వామ్యం (మావో).  ఈనాటి ప్రపంచ చరిత్రను పరిశీలించేందుకు ఈ మూడు రచనలూ మార్గదర్శకాలు. మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతం ఆసరాతోనే మనం బూర్జువా చరిత్రకారుల వక్ర భాష్యాలను వమ్ముచేసి, వర్గపోరాటాల నుంచి అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోగలం.

పెట్టుబడిదారీ సమాజంలో ప్రధాన వైరుధ్యం శ్రామికవర్గానికీ బూర్జువా వర్గానికీ మధ్య వుండేది. బూర్జువాలకు, సామ్రాజ్యవాదులకు అమ్ముడుపోయిన బుద్ధిజీవులందరూ కూడా పెట్టుబడిదారీ విధానాన్ని పొగుడుతారు. కాని కల్లలు నిజాలను కప్పిపెట్టలేవు. నిజానికి గ‌త వందేళ్లుగా బూర్జువా వ‌ర్గం ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగనంత‌గా ఉత్ప‌త్తి శక్తుల‌ను అభివృద్ధి చేసింది(క‌మ్యూనిస్టు ప్ర‌ణాళిక‌). కానీ చెమ‌ట బిందువుల్లోంచి , నెత్తురు బొట్ల లోంచి పుట్టేదే పెట్టుబ‌డి(పెట్టుబ‌డి). ఇంటా బ‌య‌టా కూడ అదేప‌నిగా దోపిడీ కొన‌సాగించ‌డం వ‌ల్లనే పెట్టుబ‌డిదారీ విధానం పుట్టింది.  ఇంగ్లీషు బూర్జువా వర్గం శతాబ్దాల పాటు రైతులను పొలాల్లోంచి బలవంతంగా వెళ్లగొట్టింది. పంటపొలాలను పచ్చిక బీళ్లుగా మార్చింది. చివరికి శాసనాలు చేసి కర్షకులను మిల్లు కూలీలుగా మార్చింది.

అమెరికావాళ్లు రెడ్ ఇండియన్లపై హత్యాకాండ జరిపారు. అందుకే మార్క్స్ అమెరికాలో వెండి, బంగారాలు కనుగొనడం, గనులు కబళించడం, ప్రాచ్య దేశాలను జయించి దోచుకోవడం, ఆఫ్రికా నుంచి మనుషులను వేటాడి తీసుకురావడం వంటి చర్యలన్నీ పెట్టుబడిదారీ యుగోదయానికి ఉపకరించాయని (పెట్టుబ‌డి) చెప్పారు. 

భూస్వామ్య విధానం స్థానంలో పెట్టుబడిదారీ విధానం రావడం అనేది చారిత్రక అభివృద్ధి. కానీ ఈ మార్పువల్ల దోపిడీ అంతం కాలేదు. ఒక దోపిడీ వర్గం స్థానంలో మరో దోపిడీ వర్గం వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, దాని రాజ్యాంగ యంత్రాంగం కూడా శ్రామికవర్గంపై ఎన్నో నిర్బంధాలు విధించాయి. సామ్రాజ్యవాదం ప్రపంచమంతటా కూడా బలహీనపడుతోంది. అందుకే శ్రామిక, బూర్జువా వర్గాలు సంఘర్షణకు దిగాయి. నేటి ప్రపంచ చరిత్ర చదివి, మనం సంగతి సందర్భాలు తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా తెలిసేదేమిటంటే పెట్టుబడిదారీ విధానం పతనం చెంది తీరుతుంది. అందుకే లెనిన్ “శ్రామిక సామాజిక విప్లవానికి సామ్రాజ్యవాదం నాంది” అన్నాడు. దోపిడీ విధానం అంతమై, మానవజాతి విముక్తి చెందే నవ్యజగత్తు కోసం వీరోచితంగా పోరాడేందుకు మనం ఉరకలు వేయాలి.

సామ్రాజ్యవాద దేశాల మధ్య పెత్తనం కోసం పెనుగులాట:

సామ్రాజ్యవాద దేశాల మధ్య సంఘర్షణ నేటి ప్రధాన వైరుధ్యాల్లో ఒకటి. 19వ శతాబ్దం చివరను, 20వ శతాబ్దం మొదట్లో పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా మారింది. పెట్టుబడిదారీ విధానంలో అంతర్గతంగా వుండే వైరుధ్యాలు ఈ దశలో మరింత తీవ్రరూపం ధరించాయి. ఒకమాటలో చెప్పాలంటే వలస దేశాల్లో పలుకుబడి కోసం, పెత్తనం కోసం వాళ్ల కీచులాటలే ఈ వైరుధ్యాలు. లెనిన్ ప్రకారం “పెత్తనం కోసం అగ్రరాజ్యాల మధ్య పోటీయే సామ్రాజ్యవాద లక్షణం.”

వలస సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ నేటి ప్రపంచంలో అంతంకాలేదు.  17వ శతాబ్దంలో ఇంగ్లండుకు, నెదర్లాండుకు మధ్య సముద్రాధిపత్యం కోసం పోటీ ఉండేది. 18వ శతాబ్దంలో ఇంగ్లండుకు, ఫ్రాన్స్‌కు మధ్య సముద్రాధిపత్యం కోసం, యూరప్‌లో పెత్తనం కోసం పోటీ వుండేది. 19వ శతాబ్దంలో యూరప్‌లో వింత పరిస్థితి తలెత్తింది. ఇంగ్లండ్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా ఆధిపత్యం కోసం కీచులాడుకునేవి. సామ్రాజ్యవాద దశకు చేరుకోగానే ఈ పోటీ మరింత తీవ్రతరమైంది. 20వ శతాబ్దం మొదట్లో ఇంగ్లండు, జర్మనీలు పెత్తందారీ రాజ్యాలు. ఆ రెండు దేశాల మధ్య ప్రధాన వైరుధ్యం పొడిచింది. జర్మనీ దోపిడీ రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మధ్యప్రాచ్యంలోకి, ఇతర చోట్లకీ త్వరగా విస్తరించింది. మధ్యప్రాచ్యాన్ని ఆక్రమించడం ద్వారా ప్రపంచ పెత్తనాన్ని సాధించాలని జర్మనీ ప్రయత్నించింది. మధ్యప్రాచ్యం అటు యూరప్, ఇటు ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య ఇరుసులాంటిది. బ్రిటిష్, ఫ్రెంచి వలసలను కాజేయడానికి చాలా కీలకమైన స్థానంలో ఉంది.

మధ్యప్రాచ్యం కోసం మొదటి నుంచీ సామ్రాజ్యవాదులు పోటీపడుతూనే వున్నారు. ఇంగ్లాండు యుద్ధంలో తన బలమైన వైరి జర్మనీని ఓడించి, టర్కీ చేతుల్లో నుంచి మెసపటోమియా, పాలస్తీనాలను గుంజుకొని అరబ్బు ప్రజలను పాదాక్రాంతులను చేసుకుని, ఆఫ్రికా ఖండంలో తన వలసాధిపత్యాన్ని బలపర్చుకుంది.

ఇతర సామ్రాజ్యవాద దేశాలు కూడా ప్రపంచాన్ని పంచుకోవాలని ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. వైరుధ్యాలు ఇలా పెరగడం వల్లనే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది.  మాన‌వాళిని క‌ష్టాల‌పాలు చేసింది. కానీ యుద్ధంలో జ‌ర్మ‌నీ, హంగ‌రీ, ట‌ర్కీల‌లో విప్ల‌వాలు లేచాయి. ర‌ష్యాలో జారు ప్ర‌భుత్వం తుడిచిపెట్టుక‌పోయింది. జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, హంగ‌రీ రాజ్యాలు అంత‌రించాయి.

చరిత్రను పరిశీలిస్తే ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు అగ్రరాజ్యాల పెనుగులాట మనకు బాగా అర్థం అవుతుంది. సామ్రాజ్యవాద దేశం, సోషల్ సామ్రాజ్యవాద దేశం కూడా ఆర్థిక సూత్రాల మీదే ఆధారపడి ఉంటాయి.  అసలు సామ్రాజ్యవాద స్వభావమే అంత.  దాని పతనం తథ్యం.

అమెరికా సామ్రాజ్యవాద రంగం మీదకు చాలా ఆలస్యంగా వచ్చింది. మొదట్లో పెత్తనం కోసం అంతగా పెనుగులాడేది కాదు.  ఎందుకంటే అమెరికాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయిన తీరే వేరు. లాటిన్ అమెరికా మీద దురాక్రమణతో ఆరంభం చేసింది. 1898 స్పానిష్- అమెరికా యుద్ధం మొదలెట్టి జయించింది. వలసల పంపకం కోసం జరిగిన మొట్టమొదటి యుద్ధం అది. పాశ్చాత్య ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం ఉన్నట్టుండి పైకి వచ్చేసింది. సామ్రాజ్యవాద దశలోని అడుగెట్టిన‌ మొదటి 30 ఏళ్లలోని అమెరికా 33 చోట్ల జోక్యం చేసుకొని దురాక్రమణ చేసింది.ఇతర సామ్రాజ్యవాద దేశాలతో పసిఫిక్, ఆసియా ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం పోటీపడటం మొదలెట్టింది. వాటితో అప్పుడప్పుడు కుమ్మక్కయ్యేది కూడా. కానీ వాటి మధ్య తీవ్ర వైరుధ్యాల వల్ల 1941లో జపాన్ సామ్రాజ్యవాదం పెర‌ల్‌ హార్బర్‌పై దండెత్తింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ అమెరికా బాగా డబ్బు గడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరింత బలపడి ప్రపంచమంతటా తన పశుపు నాలుకలు చాచింది. ఇతర దేశాల ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తూ పెత్తందారీ పోకడలు పోయి, వారి ఆంతరంగిక వ్యవహారాల్లో సాయుధ జోక్యం మొదలెట్టింది. కానీ కాలం మారింది. యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజా వెల్లువలు వచ్చాయి. పెట్టుబడిదారీ విధానం పతనం మొదలైంది. అమెరికా ఇంటా బయటా కూడా వైరుధ్యాలు తీవ్రమైనాయి. వీట‌న్నిటి వ‌ల్ల అమెరికా గ‌ద్దె మీద వ‌ణుకుతూకూచుంది.

     ఆధునిక చరిత్ర చూస్తే ప్రపంచాధిపత్యం కోసం రష్యా తన పెనుగులాట ఎన్నడూ విడనాడలేదని తెలుస్తుంది (ఎంగెల్స్‌). హంగరీ, పోలెండులలో విప్లవాలు అణచి, చైనా భూభాగాన్ని ఎద్దెత్తున ఆక్రమించి, జారిస్టు రష్యా యూరప్, ఆసియాల్లో వలసరాజ్యమై కూచుంది.  మధ్యప్రాచ్యంలో, బాల్కన్ ప్రాంతాల్లో ఆధిపత్యం చాలా కీలకమయిందని రష్యా అనుకుంది. తన నౌకాబలాన్ని పెంచుకుని బాల్టిక్ సముద్రం గుండా మెడిటరేనియన్ సముద్రాన్ని కూడా అదుపు చేయాలని ప్రయత్నించింది.   దురాక్రమాలను విస్తరణను కొనసాగించడం కోసం విదేశాలు యుద్ధాలు మొదలు పెట్టింది. ఆధిప‌త్యం కోసం జపాన్ తో పోటీబడ్డ ఫలితం గా 1904-05 రష్యా -జపాన్ యుద్ధానికి దారితీసింది. ఓడిపోయిన జపాన్తో క‌లిసి ప్రపంచాన్ని విభజించి వాటాలు పంచుకుంది. పాశ్చాత్య రంగంలో  ఇంగ్లాండ్ తో చేతులు కలిపింది. ఇరాన్ , ఆఫ్ఘనిస్తాన్,  టిబెట్లలో పలుకుబడి కోసం ఇంగ్లాండు-రష్యాలు రహస్య సంధి చేసుకున్నాయి.  చివరికి ఇరాన్లో విప్లవం అణ‌చివేయ‌డానికి ఇద్దరు కలిసే సైన్యాలు కూడా పంపారు. కానీ ఈ సామ్రాజ్యవాదులు  విప్లవ వెల్లువ‌ల‌ను  ఆపలేక పోయారు.  మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విప్లవ పరిస్థితులు రష్యాలో త్వర త్వరగా అభివృద్ధి చెందాయి. సోషలిస్ట్ విప్లవ కేంద్రంగా రష్యా మారింది. ఇది సామ్రాజ్యవాదులకు చావు దెబ్బ.  జారిస్టు  రష్యా కల‌లు  అంతమయ్యాయని చరిత్ర చాటి చెప్పింది.  కానీ అక్టోబర్ సోషలిస్టు విప్లవ పంథాను విడనాడి జార్ సామ్రాజ్యవాదుల అడుగుజాడల్లో నడిచి క్రెమ్లిన్‌ అధినేతలు సోషల్ సామ్రాజ్యవాదులుగా తయారయ్యారు.  సామ్రాజ్యవాదం మొత్తంగా కూలిపోతున్న ఈ ద‌శ‌లో వ‌ల‌సాధిపత్యం కోసం తిరిగి ప్రయత్నించడం కేవలం పగటి కల. 

గత చరిత్రను పరిశీలిస్తే మనకు ఈ  సంగతులు తెలుస్తాయి.  సామ్రాజ్యవాద దేశాలు పైకి కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా ఆంతరంగిక వైరుధ్యాలు  తప్పవు. వాళ్ళు కుమ్మక్కైతే ప్రజలను మరింత దోచుకు తింటారు.  వాళ్ళ మధ్య వైరుధ్యాలు ప్రజలకు తోడ్పడతాయి.  వాళ్ళమధ్య వైరుధ్యాల‌ను  విప్లవ ప్రజానీకం జాగ్రత్తగా పరిశీలించి వాటిని విడమరిచి సరి అయిన వర్గ దృక్పథం నుంచి వాటిని మదింపు వేయాలి.  సామ్రాజ్యవాదులు ఉమ్మడిగా కొనసాగించే  దోపిడీ, దురాక్రమణా,  వాళ్ళ మధ్య వైరుధ్యాలు  ప్రజలలో తుఫాను రేకెత్తిస్తాయి. సామ్రాజ్యవాదాన్ని, వలసవిధానాన్ని, నయా వలస విధానాన్ని కూల‌దోయ‌డం ద్వారా మాత్రమే ప్రజలు భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోగలుగుతారు.

 పీడన ఉన్నచోట ప్రతిఘటన తప్పదు. శ్రామిక వర్గాలు, పీడిత దేశాలు, పెట్టుబడి వలస సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటాలు జరుపుతున్నాయి. నేటి ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల మయం. కేవలం ప్రజలే చరిత్ర నిర్మాతలు, చరిత్ర చోద‌క  శక్తులు అనేది ముమ్మాటికీ సత్యం.  ఈ మాట ఎన్నోసార్లు రుజువయింది. శ్రామిక వర్గం 1848లో బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టి 1871లో పారిస్ కమ్యూన్ లో ఎర్రజెండా ఎగరేయడం,  రష్యాలో  అక్టోబర్ సోషలిస్టు విప్లవ విజయం, చైనాలో విప్లవ పురోగమనం.. ఇవి అన్నీ కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగాలే.  దేశ దేశాల శ్రామికులు, ప్రపంచ ప్రజలు రచించిన ఈ మహత్తర ఇతిహాసం నేటి రివిజనిజం దివాలా కోరుతనాన్ని చాటి చెబుతోంది.

శ్రామిక విప్లవోద్యమాలకు సైదోడుగా పీడిత జాతుల విమోచన ఉద్యమాలు కూడా చారిత్రక శక్తిగా అభివృద్ధి చెందాయి.  ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు  నేరుగా సామ్రాజ్యవాదం మీద చావు  దెబ్బ తీస్తున్నాయి . వలస, అర్ధ వలస దేశాలకు,  సామ్రాజ్యవాదానికి మధ్య తీవ్ర వైరుధ్యాల ఫలితమే ఇది.   ఎన్నో చారిత్రక దశలు గ‌డిచాయి.  ఈ సూత్రం ప్రకారమే విప్లవం పురోగమిస్తుంది. పీడన ఎంత ఎక్కువగా ఉంటే ప్రతిఘటన అంత ఎక్కువగా ఉంటుంది.  చిరకాలం అణ‌గారి ఉంటే ప్రతిఘటన పెల్లుబుకుతుంది.  15వ శతాబ్దం తర్వాత కొద్ది కాలంలోని ఆసియా, ఆఫ్రికా లాటిన్  అమెరికా దేశాల్లో పెద్ద పెట్టున వలస సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి.

18వ శతాబ్దం చివర్లోనూ, 19 శతాబ్దం మొదట్లోనూ లాటిన్ అమెరికా దేశాల్లో పెద్ద ఎత్తున జాతీయ విమోచన ఉద్యమాలు చెల‌రేగాయి.   నీగ్రో  బానిసలు ముందుకు వచ్చి గొప్పగా పోరాడి 60 వేల సైనికులను పదేళ్లలోనే హ‌త‌మార్చారు. దుర‌హంకార‌ నెపోలియన్ దురాక్రమణ సైన్యాలను లొంగదీశారు. 1804 లాటిన్ అమెరికాలో  మొదటి స్వతంత్ర రాజ్యం నెలకొల్పారు.  నీగ్రోలు వ‌ల‌స పాల‌న నుంచి, బానిస‌త్వం నుంచి విముక్తి పొందారు.   దీని తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో చాలాచోట్ల స్పెయిన్, పోర్చుగ‌ల్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేచాయి.  19 శతాబ్దం మధ్యలో ఆసియాలో  ప్రజలు మేల్కొన్నారు. వలస భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఆ చివరి నుంచి ఈ చివరిదాకా అంటే పర్షియన్ గల్ఫ్ , ఇండియా, చైనా అన్నిచోట్ల తిరుగుబాట్లు లేచాయి. ఎంతో విప్ల‌వ ఉత్పాహంతో   మార్క్స్ ఎంగెల్స్‌ ఇద్దరూ ఈ తిరుగుబాట్ల‌ను  కొనియాడారు.  ఎంగెల్స్ చెప్పాడు కూడా -ఆసియాలో సామ్రాజ్యవాదుల వినాశ‌నానికి ఇది నాంది.  ఇండియా, వియత్నాం, కొరియా, ఫిలిప్పీన్స్, చైనా మున్న‌గు చోట్ల తుఫాను గాలులు వీచాయి.   రష్యా అక్టోబర్ సోషలిస్టు విప్లవం తరువాత ఇవి మరింతగా లేచాయి.  దీనితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొత్తం ఆసియా ఖండం ఒక పెద్ద యుద్ధరంగంగా మారిపోయింది. ఆఫ్రికా నీగ్రోలు మామూలు బాణాలు విల్లంబులతో తిరగబడి మార‌ణాయుధాల‌తో మ‌దించి  ఉన్న సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నారు.  రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు ప్రధాన కేంద్రాలు గా రూపొందాయి. ఈనాటి ప్రపంచ వైరుధ్యాలు, వలస, నయా వలస సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు కూడా మనకు అక్కడే  ఎక్కువగా పొడ‌గ‌డుతున్నాయి. ఒక రకంగా చూస్తే ఉత్తర ఐర్లాండ్ , ఆఫ్రో అమెరికా దేశాలు పెట్టుబడిదారీ విధానాలకు పుట్టినిండ్లు. అలాంటి చోటే జాతీయ ప్రజాస్వామ్య విప్లవోద్యమాలు వ్యాపించడానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. తరతరాల నుంచి కూడా ఆఫ్రో అమెరికా నీగ్రో జనానికి అమెరికా బూర్జువా వ‌ర్గం ఆగ‌ర్భ శ‌తృవు. రెండు కోట్ల ఆఫ్రో అమెరికా ప్ర‌జానీకం అమెరికా సామ్రాజ్య‌వాదుల దోపిడీకి, పీడ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. వాళ్ల పోరాటాల‌ను వెన‌కేసుకొని మావో ఏమ‌న్నాడో చూడండి.  *వ‌ల‌స సామ్రాజ్య‌వాదాలు నీగ్రోల‌ను బానికసలుగా చేయ‌డంతోనే మొద‌ల‌య్యాయి. వాళ్లు విముక్తి కాగానే సామ్రాజ్య‌వాదం అంత‌రించిపోతుంది.

 విప్లవం జయిస్తుంది :

ఆధునిక ప్రపంచ గతి పరిశీలిస్తే ఓ సంగతి బోధపడుతుంది . దేశాలు స్వాతంత్రంకోరుతున్నాయి-జాతులు విముక్తి కోరుతున్నాయి- ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు.  ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్ర‌జ‌లు  వలస సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడడం వల్లనే మూడవ ప్రపంచం ఉద్భవించింది. మావో అందుకే అన్నాడు.  సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే చారిత్రక యుగంలోకి ప్రజలను సామ్రాజ్యవాదమే నెట్టింది.

 ప్రజలు విప్లవాన్ని కోరుతారు. విప్లవం విజయం పొంది తీరుతుంది. కానీ విప్లవానిది మాత్రం తిన్న‌ని తోవ కాదు.  ముళ్ళు , రాళ్లు , అవాంతరాలు ఎన్నో ఉంటాయి . ఇది చారిత్రక గమనంలో ఇమిడి ఉన్న గ‌తితార్కిక సూత్రం.    1640 మొదలైన బ్రిటిష్  బూర్జువా విప్ల‌వం ఆధునిక చరిత్రలో  అర్థ శతాబ్దం పాటు వంకర టింకరగా న‌డిచింది.   అలాగే అమెరికా, ఫ్రాన్స్ ల బూర్జువా విప్లవాలు కూడా కొనసాగాయి . ఇలాంటి సుదీర్ఘ పోరాటాల తర్వాతే ఆయా దేశాలలో బుర్జువా వర్గాలు తమ పెత్తనాన్ని ప‌దిల‌ పరుచుకున్నాయి. ఇవాళ వలస దేశ ప్రజలు కూడా తమ స్వతంత్రం కోసం అలాగే పోరాడుతున్నారు . వలస సామ్రాజ్యవాదులు తమంతట తాము ఎన్నడూ గద్దె దిగరు. ప్రజల విప్లవాలకు రకరకాలుగా ఆటంకాలు కల్పించడమే సామ్రాజ్యవాదుల పని. 19వ శతాబ్దంలో 20 ఏళ్ల పాటు పోరాడినాకే  అమెరికా ప్రజలు స్పానిష్ , పోర్చుగల్ వలస పాలన నుంచి బయటపడ్డారు . కానీ చాలా వ‌ల‌స దేశాలు   రాజకీయ స్వాతంత్రం పొందినాక కూడా  బ్రిటిష్ వారి ఆర్థిక జోక్యం మూలాన  వ‌ర్త‌క వ‌ల‌స‌లుగా మారిపోయాయి. పాన్ అమెరికా చాటుబ‌ల్ల మాటున   అమెరికా సామ్రాజ్యవాదం అదిరింపులతో బెదిరింపులతో అనేక లాటిన్ అమెరికా దేశాల‌ను న‌యా వ‌ల‌సలుగా చేసింది.

ఈ చారిత్రిక అనుభవాలను మనకు తెలియజేసేది ఏమిటి అంటే నిజమైన విప్లవం ఎప్పుడు భీకర పోరాటాలతో నిండి ఉంటుంది. ఒకవేళ అలాంటి చికాకులు లేకుండానే విప్లవం విజయవంతం అయితే ఆ తర్వాత అయినా కూడా అలాంటి పోరాటాలు తప్పవు. బూర్జువా విప్లవాల పట్టే ఈ మాట నిజమైనప్పుడు శ్రామిక విప్లవ‌ విజయాలను గురించి చెప్పనక్కరలేదు. మావో అన్నాడు,రాజకీయ సైద్ధాంతిక  తప్పు ఒప్పులను బట్టి ఏ సంగతి అయినా నిర్ణయం అవుతుందని.  సరైన మార్క్సిస్టు లెనినిస్టు పంథా  ఉంటే శ్రామిక వర్గం, విప్లవ ప్రజానీకం ఎన్ని గండాల‌యినా గ‌డ‌వ‌గ‌ల‌దు.   శ్రామిక వర్గ నియంతృత్వం కింద విప్లవాన్ని కొనసాగించడం అనే  మావో సిద్ధాంతం అతని విప్లవాత్మక పంథా, విధానాలు, నిరంతరం వ‌ర్గ చైత‌న్యం పెంపొందించు కోవడం, రెండు పంథాల  మధ్య పోరాటం,  విప్లవం కొనసాగించే  మన చైతన్యము,  సామ్యవాద విప్లవాన్ని చివరి వరకు కొనసాగించడం.. అవ‌న్నీ  కూడా ప్రపంచ చరిత్ర చదివితే మనకు అర్థం అవుతాయి.

 భూస్వామ్య విధానం పోయి పెట్టుబడిదారీ విధానం వచ్చినట్టే , పెట్టుబడిదారీ విధానం కూడా పోయి సోషలిజం వస్తుంది . ఇది అపసవ్యం కాని చారిత్రక సూత్రం. ఈ సూత్రానికి అనుగుణంగానే ప్రపంచ విప్లవ ప్రవాహం ముందుకు దూసుకుని పోతూ ఉన్నది. ప్రపంచ పరిస్థితి అమోఘంగా ఉంది . రెండు అగ్రరాజ్యాలు కొనసాగిస్తున్న దురాక్రమణ,  దోపిడీలు ప్రపంచ  ప్ర‌జ‌ల‌లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. వాళ్లంద‌రూ ఏకం అవుతున్నారు.  ప్రపంచంలో ఏ శక్తి కూడా సామ్రాజ్యవాద ప‌త‌నాన్ని ఆపలేదు.  అలాగే ప్రజా విప్ల‌వ విజయాన్ని అరికట్టలేదు .

లెనిన్ ఎన్న‌డో చెప్పాడు. పీడిత  ప్రజానీకం మేల్కొని చైతన్యంతో సామ్రాజ్యవాదం మీద తిరగబడి విముక్తి పోరాటాలు మొదలెట్టినప్పుడే    ప్రపంచ చరిత్రలో కొత్త రోజు వస్తుంది,  ఆరోజు రానే వచ్చింది. ఈ సంచలనాత్మక యుగంలో ప్రతి విప్లవకారుడు ప్రపంచ చరిత్ర చదివి దేశ దేశాల ప్రజా పోరాట అనుభవాల నుంచి రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక రంగాలలో పాఠాలు నేర్చుకోవాలి.

Leave a Reply