*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం ఏముంటుంది? సాయి కవిత్వం నిండా ఇదే ఉంది*
-పాణి
*వీల్ చైర్ ఫోక్స్…
రెండు చక్రాల బండి మీద /వెయ్యి బాణాల తూణీరం/ఆదివాసీ హృదయాన్ని హత్తుకున్న/మేధో విహంగం /ప్రశ్నలు గురిచూసే విల్లుతోనే/అతని సాహచర్యం/ఆ సంధించిన విల్లంబులది/అలవికాని సాహస వచనం/అతని కలలో ఆయుధాలున్నాయని /అతనింటిని సోదా చేసి/అవి మనసును భద్రపరిచాడంది/మూడు తలల సింహం /అతడి కదిలే కుర్చీ చక్రాలకు/ధిక్కారాన్ని అల్లాడని/అవి కాలదన్నుతున్న రాజ్యం రాస్తాకి/కంటకంగా గుచ్చుకుంటున్నాయని/ఊచల్ని లెక్కించమంది అధికార స్వరం /పోలియో కాళ్లు/పోలీసింగ్ మదిలో అలజడి రేపాయి/కదలికలు లేనితనమైనా/కుర్చీ వదలలేని వాళ్లకు/కంటగింపయ్యింది కాళ్లదేముంది/కీటకాలకీ వుంటయ్యి/హక్కుల బాట నడవడానికి/కాళ్లు లేకున్నా వీల్ చైర్ వుంటుంది/ కాళ్లు లేని వాళ్లనైనా నడపించగల/స్వప్న దూరాలు ఉంటాయి/చలనశీలత నిత్యకృత్యమైన వాడికి/చరిత్ర అడుగులు నేర్పి/గతిశీలతతో కదంతొక్కిస్తుంది/వీల్ చైర్ సైతం/విశ్వాసాలకు/ఉఛ్ఛ్వా నిస్వాసాలందిస్తుంది* -జి.వెంకటకృష్ణ
వొక ఉద్యమనక్షత్రం రాలిపోయింది. బహుశా వేల ఉద్యమనక్షత్రాలకు జీవంపోసిఅస్తమించివుండవచ్చు.మానవ సమాజ పురోగతికోసం అహర్నిశలు కృషిచేసిన ఉద్యమకెరటం అలసిపోయిందన్న విషయం భ్రాంతి అయితే అదొక భ్రమ అయితే ఎంత బాగుండనిపిస్తుంది. ఎన్ని ఈదురు గాలులు, ఎన్ని సుడిగుండాలు, ఎన్ని అలలు, మరెన్నో భీకర తుఫానులు..ఎన్నో గాయాలు మదిని చిధ్రం చేసినా వొరువక, వొరుగక రాజ్యం చేసిన కుట్రల్ని మౌనంగా భరించి ఎదురొడ్డి నిలబడ్డ యోధుడిప్పుడు మౌనంగా కన్నుమూశారు. మనం భౌతికవాదులమైనప్పటికీ కాసిన్ని అక్షరాల్నైనా కన్నీళ్ళతోనే తడిపి జోహార్లర్పిద్దాం. జి.ఎన్.సాయిబాబా అంటే ప్రొఫెసర్‌గా దేశం గర్వించదగ్గ మేధావిగా ఆదివాసీ హక్కులకోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారుడిగా ఇంకా చెప్పాలంటే ఆంగ్ల ప్రొఫెసర్‌గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన గొప్ప కవిత్వం రాశారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అక్రమ నిర్భంధం లో..ఆయనను ఉంచిన జైలు గోడల మధ్య గడిపిన క్షణాల్లో ఆయన రాసిన ఆంగ్లకవిత్వం ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ సాయిబాబా అండాసెల్ కవిత్వం పేరుతో 2019లో పుస్తకం వచ్చింది. దాదాపు పదేళ్ళకు పైగా జైలుశిక్ష అనుభవించాక ఆయన ఏ నేరమూ చేయలేదని ఆయనను విడుదల చేశారు. ఇది రాజ్యం చేసినకుట్రలో భాగం కాదా? అని ప్రతి ప్రగతిశీలవాది ప్రశ్నిస్తున్నారు. ఆయన రాసిన కవిత్వం ఈ నివాళి నేపథ్యంలో రాయాలనిపించింది.. ఈ కవిత్వం లో సాయిబాబా మృత్యవును ఆనేకనేక కోణాల్లో చూస్తాడు..ఎందుకంటే చావును నిరాకరించాడు కాబట్టి..ఎలాగంటే
భూమ్మీద ప్రతిప్రాణి/మరణాన్ని తిరస్కరిస్తుంది/ఎవరెంతగా ప్రాముఖ్యం లేనిదనుకున్నా సరే/ప్రతిఒక్క ప్రాణి/మృత్యువును ప్రతిఘటిస్తుంది.(జీవనగీతం)..ఈ కవిత ప్రారంభంలో మృత్యువు గురించి ఆలోచించడమంటే జీవితాన్ని గూర్చి ఆలోచించడమే అంటారాయన. అవును నిజమే కదా ఎవరూ చావును కోరుకోరు. ప్రతి జీవి చావును ప్రతిఘటిస్తూనే బతకుతుంది. ఇందులో మానవులేమి మినహాయింపుకాదు..ఈ కవిత్వంలోని ప్రతీ కవిత సాయి కంటున్న కలలు, సాయికున్న ఆశయాలు, సాయి కలలు కంటున్న సమాజం, సాయి ఆశయపథం..సాయి గమ్యం ప్రతీపాఠకుడిని తన పోరాటం ఎందుకు చేస్తున్నాడో.. ఎవరికోసం చేస్తున్నాడో తెలియజేస్తుంది. ఉద్యమకారులకు హక్కుల కార్యకర్తలకు పాఠ్యగ్రంథమై నిలిచి ఉద్యమస్ఫూర్తి నింపు తుంది. శీర్షికగా ఉన్న ఈ కవిత..నేను చావును నిరాకరిస్తున్నాను కవితలో..
అత్యంత ప్రియమైన వసంతా/నేను చనిపోవడానికి నిరాకరించినపుడు/ నా సంకెళ్లు వదులు చేసారు/ నేను విశాలమైన మైదానాల్లోకి/గడ్డి పూలవైపు చిరునవ్వులు చిందిస్తూ వచ్చాను/నా దరహాసం వాళ్లకు అసహనం కలిగించింది వాళ్లు నాకు మళ్లీ గొలుసులు వేసారు/మళ్లీ నేను చనిపోవడానికి నిరాకరించినపుడు/ నా జీవితంతో విసుగుచెంది నను బంధించినవాళ్లు నన్ను వదిలేసారు/ నేను బయటికి నడిచాను/ఉదయిస్తున్న సూర్యకాంతి పరుచుకున్న/నవనవలాడే ఆకుపచ్చ లోయల్లోకి/గడ్డికొసల చురకత్తులు చూసి నవ్వుతూ/మరణం లేని నా మందహాసం చూసి/మండిపోయి వాళ్లు నన్ను మళ్లీ బంధించారు/నేనింకా మొండిగా చావడానికి ససేమిరా అన్నాను/ విషాదమేమిటంటే/ నేను చనిపోయేలా ఏం చేయాలో/ వాళ్లకు తెలియడం లేదు/ ఎందుకంటే/నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు చాలా ఇష్టం. ఈ కవిత 7 నవంబర్ 2017లో రాయగా వివి అనువదించారు. ఉద్యమకారులకు మరణమన్నది చాలా చిన్న విషయం. జీవించినన్నాళ్ళు ఆదివాసీలకు అండగా.. దళితుల, గిరిజనుల హక్కులకోసం.. స్థూలంగా చెప్పాలంటే మానవహక్కుల రక్షణ కోసం ఉద్యమించే ఉద్యమకారులకు మరణం అతిసాదారణ విషయం. అయితే వాళ్ళు బతకాలనుకుంటున్నది మాత్రం ముమ్మాటికీ పైన ఉదహరించిన వాళ్ళపక్షాన పోరాటం చేసేందుకేనని మనం అర్థం చేసుకోవాలి. కవి అందుకే చావును నిరాకరించాలనుకున్నాడు.
జైలు గోడల మధ్య జీవిస్తున్న సాయిబాబా అక్కడి నుండే ప్రపంచం నలుమూలలు వీక్షించాడు. ప్రపంచపరిణామలన్నింటిని తన మస్తిష్కంలో భద్రపరచుకుని బలమైన కవిత్వం రాశారు. జస్టిస్ రాజేంద్ర సచార్ స్మృతి కవిత రాస్తూ..మీరు నూరేళ్ళు జీవించి ఉంటే/మాకోసం ఇంకొన్నాళ్ళు ఉండమని అడిగేవాళ్ళం./పీడిత ప్రజల హక్కులకోసం గొంతు విప్పేందుకు/ మీరు యవ్వనంతో ఉండవలసింది. రాజేంద్ర సచార్ మానవహక్కుల పరిరక్షణ కోసం, పీడితహక్కుల కోసం పోరాడిన న్యాయమూర్తి. అనేక కమిటీలలో సభ్యులుగా విలువైన సూచనలు చేసిన న్యాయకోవిదులు. ఆయన మరణాన్ని సాయిబాబా జీర్ణించుకోలేదు. గొప్పగా జ్ఞప్తి కి తెచ్చుకున్నాడు.
తనకొచ్చిన పీడకలను కూడా కవిత్వంగా మలిచాడు. అచేతనంలో దాగిన విషయాలు కలలుగా దృశ్యీకరింపబడతాయంటాడు ఫ్రాయిడ్. బహుశా మస్తిష్కం ఆ నాఢీమండల వ్యవస్థలో దాగిన ఘటనలన్నీ వొక్కొక్కటిగా బయల్పడ్డాయేమో… కలలు మన ఆలోచనలకు వొక రూపాన్ని, భావాన్ని ఇవ్వడమే కాకుండా వాస్తవంలో అసాధ్యమనుకున్నవి కూడా కలల్లో సాధ్యం అవుతాయంటాడు ఫ్రాయిడ్. అలాంటి కవితల్లో..స్థానభ్రంశపు జైలుగదిలో పీడకల అనే శీర్షిక కవితలో..సంగీతం ఆగిపోయింది./సృజనకారులను తరిమేశారు/కవులకు విషపాత్రలిచ్చారు/చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు.శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు/తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు/అపరిచితమైన మనుషులు/బాగా తెలిసిన మనుషులను/ప్రేమికులనూ ఆలోచకులనూ/కాల్చిచంపుతున్నారు.
ఇప్పుడీ పాలకులు చేసిందిదేకదా…అరాచకాలన్నీ ఏళ్ళుగా సాగుతున్నా దశాబ్ధకాలం నుండి మాత్రం సాయిబాబా తన పీడకలలో చెప్పినట్లు అటు ఇటుగా సాగించిన దురాగతాలు మాత్రం అవే. జైలుగోడలు నిజంగా గొప్పకవిత్వం పురుడుబోసుకునేందుకు సహకరించాయనే చెప్పవచ్చు.. పై కవిత 2018 మే మొదటిరెండు వారాల్లో భారత ఉపఖండ వ్యాప్తంగా పదేపదే చెలరేగి వందలాది మందిని బలిగొన్న ఉరుముల మెరుపుల గాలి దుమారాల వర్షాల వార్తలను నా జైలుగదిలో చదువుతూ మే 14 నిద్రలేని రాత్రి అనుభవించిన పీడకలకు అక్షరరూపం అంటూ రాసుకున్నారు. ఈ కవితను ఎన్ వేణుగోపాల్ అనువదించారు. ఈ కవిత్వంలో బైబిల్ మొదటికాండ పాతనింబంధన నుంచి పునరుత్థానం పేరుతో రాశారు. జైలులో ఉన్నప్పుడు ములాఖత్ కోసం వచ్చిన అమ్మతో మాట్లాడినట్లు అద్భుత కవితను రాశారు. నేనీ జైల్లో అండాసెల్‌లో బంధించబడినాక/ విశ్వమంతటా నాకింకెంతో మంది నేస్తాలు లభించారు అని అంటారు. అమ్మా నా స్వేచ్ఛను గురించి భయపడకు/ నేను పోగొట్టుకున్న స్వేచ్ఛ/ ఎంతోమంది పొందిన స్వేచ్ఛ.అభాగ్యజీవులకు అండగా/ నాతోపాటు నిలబడడానికి వస్తున్న/ ప్రతిఒక్కరిలో/ నేను నా స్వేచ్ఛను పొందుతున్నాను అంటారు. తను బంధీ అయినా స్వేచ్ఛగా ఉన్న వాళ్ళలో స్వేచ్ఛను పొందాననడం మాటల్లో చెప్పలేము. ఈ సమాజం పట్ల ఎంత గొప్ప బాధ్యతతో పుట్టాడనిపిస్తుంది. హక్కులు కోల్పోతున్న ఆదివాసీల పట్ల, అభాగ్యులపట్ల తన జీవనపర్యంతం చేసిన పోరాటానికి ఏమని పేరుపెట్టాలి. ఈ కవితలో గొప్ప కవితావాక్యం రాసుకున్నారు. జైలు నుండి ఎప్పటికైనా బయటికొస్తాననే ఆశావాదంతోఉన్నాడు. ఈ కవితలో ఒక చోట..
జైలు నాకు మరణం కాదు/ పునర్ జననమని/నేను అర్థం చేసుకున్నాను/నేను ఇంటికి తిరిగివస్తాను/ నాకు ఆశను ధైర్యాన్ని యిచ్చి పోషించిన నీ ఒడిలోకి..తననుకున్నట్టే నిర్థోషిగా విడుదలయ్యారు కాని..ఈ ప్రపంచంలో విడుదలయ్యాక ఎక్కువకాలం ఉండలేక పోయారాయన..అనారోగ్యసమస్యలన్నీ చుట్టుముట్టాయి. 12.10.2024న తెలుగురాష్ట్రాల్లో ఒక పక్క బతుకమ్మ పండుగ మరొకపక్క దసరా వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. 8.36 నిమిషాలకు ఆయన తుదిశ్వాస వదిలారని నిమ్స్ వైద్యులు ప్రకటించడంతో ప్రగతిశీలవాదులు నివ్వెరపోయారు. దసరా అంటే ఆయన ఈ పుస్తకం లోని ఒక కవిత గుర్తొస్తుంది..దసరా సందర్భంగానూ సాయిబాబా యుద్దరావం అనే శీర్షికతో ఒక కవిత రాశారు. ఉద్యమ సహచరుడు వివికి రాస్తూ..నాగపూర్ నగరచరిత్రలో మొట్టమొదటి సారిగా రావణున్ని ఆరాధించే మహాగాంగో అనే ఆదివాసీ తెగ ప్రదర్శనకు సంబంధించిన వార్తాకథనం చదివాక..వాళ్ళేమని ప్రకటించారంటే దసరానాడు వాళ్ళ తాత్వికతకు మూలమైన రావణుని దిష్టిబొమ్మను ఏ ఒక్కరు తగులబెట్టరాదని. వాళ్ళ పౌరాణికక గాథల ప్రకారం నిషాద దళిత ఆదివాసుల సామ్రాజ్యానికి నాగపూర్ ప్రాచీన రాజధాని.ద్రోణాచార్యుని కుడిబొటన వేలిని కోల్పోయి కూడా విలువిద్యలో ప్రావీణ్యం సాధించినందుకు శ్రీకృష్ణుడు, ద్రోణుడు, పాండవుల చేత వెంటాడబడిన ఏకలవ్యుడు ఆశ్రయం పొందినది ఈ నాగనది ఒడ్డు నగరంలోనే అంటూ రాసుకున్నారు. ఈ కవితను భాసిత్ అనువదించారు. కవితలో ఒకచోట..మా భూముల్ని అడవుల్ని/పర్వతాల్ని గుట్టల్ని నదీనదాల్ని చెట్టూ చేమల్ని/ జంతుజాలాన్ని పురుగుపుట్రాలను సైతం/పురానగరాన్ని దేన్నీ వదలకుండా/వేటినైతే/ మీరు వేలయేండ్లుగా దురాక్రమించారో/వాటన్నింటినీ/మేం వెనక్కితీసుకుంటాం..అంటూ ఆదివాసీల తరుపున సాయిబాబా ప్రకటన చేశారు.
ఈ కవితల్లో సాయిబాబా ఉద్యమసహచరి వసంతతో చాలా సందర్భాల్లో మట్లాడతారు. గుండెను తాకే ఒక కవిత దీన్ని నేరుగా తెలుగులోనే అలసిపోయావా ప్రియతమా అంటూ రాశారు. అందులో వాస్తవపోరాటంలో /ఒంటరితనం కూడా /సమూహంలో భాగమే/ నువ్వూ నేనూ/ ఎంత దూరంలో ఉన్నా/ప్రజారాశుల సమూహంలో అంతర్భాగమే..ఇలా అనేక సందర్భాల్లో మాట్లాడతారు. అనేకమంది ఉద్యమకారులకు ఈ కవిత్వంలో ఉత్తరాలుగా రాస్తారు. ప్రతీ విషయాన్నీ చెబుతారు. బహుశా ఈ ఉద్యమకారుడు కవిత్వాన్ని , ఉద్యమాలను ప్రేమించడం, హక్కుల గూర్చి మాట్లాడటం వల్లే జైలుగోడల మధ్యన కూడా కాలాన్ని అవలీలగా అలవోకగా జయించాడనిపిస్తుంది. సాయిబాబా రాసిన కవితల్ని అనువాదకులు గొప్పగా ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు.
ఈ కవిత్వం గూర్చి ఎక్కడా విశ్లేషణలు, వివరణలను వస్తుశిల్ప, సౌందర్య భావుకతల గూర్చి, ఎత్తుగడల గూర్చి.. నేను మాట్లాడే సాహసం చేయలేదు. అశృవినాళులతో కాసిన్ని సాయిబాబా కవితాక్షరాను ఆలింగనం చేసుకుని ఈ వాక్యాలతో మననం చేసుకున్నాను. ఈ పుస్తకంలో ఉన్న 35 కవితల్లో ప్రతీ కవిత ఉదహరించదగ్గదే..ప్రతీకవితా మాట్లాడదగ్గదే.. సాయిబాబాను పదేళ్ళ పాటు అక్రమంగా నిర్భందించిన పాలకులు జవాబు చెప్పాలి. ఎవరిస్తారు..పదేళ్ళకు పైగా అతను కోల్పోయిన స్వేచ్ఛను..సాయిబాబాతో పాటు ఎంతో మందిని హక్కుల కార్యకర్తల్ని నిర్ధాక్షణ్యంగా అక్రమంగా నిర్భంధించి రాజ్యం హింసిస్తోంది. కోర్టులిచ్చే తీర్పుల అలస్యంతో జీవితకాలమే ముగుస్తోంది. ఇదీ రాజ్యం..ఇదీ దుర్మార్గం..ఉద్యమకారులు ప్రాణాలర్పించి హక్కుల రక్షణకు పోరాడుతున్నారు. అందుకే సాయిబాబా చెప్పినట్లు ఇది ఫాసిజం పెచ్చరిల్లుతున్న రుతువు/సహనంతో నిలబడ్డం కూడా పోరాటమే..
“nenu chavuni niraakaristhunnanu” ane book ekada dhorukuthundhi ?
India needs more SAIBABA s ???? Great poet
—————————————————————————
Buchi reddy gangula